మామయ్య ఆనందం చూసి అపార్థం చేసుకున్న ఫ్రెడిరిక్సెన్ చిన్నబుచ్చుకున్నారు.
"ఏంటండీ మీరు అంటున్నది?" కొంచెం కోపంగా అడిగారు.
"ఇప్పుడు అర్థమయ్యింది. మొత్తం అర్థమయ్యింది. తన ఆవిష్కరణలని బాహాటంగా ప్రకటించకూడదన్న నిషేదం ఉండడం వల్ల, ఆ రహస్యన్ని గూఢసందేశంలో గుప్తంగా దాచి ఉంచాడన్నమాట." మామయ్య వివరించాడు.
"ఏ రహస్యం గురించి మీరు మాట్లాడుతున్నది?"
"ఓ రహస్యమా? అదీ... అదీ..." మామయ్య నసిగాడు.
"మీ వద్ద ప్రస్తుతం ఏమైనా రహస్య పత్రం ఉందా?" అడిగారు ఫ్రెడిరిక్సెన్.
"అబ్బే. అలాంటిదేం లేదు. ఊరికే అంటున్నానంతే." మామయ్య బుకాయించడానికి ప్రయత్నించాడు.
"ఓహ్! అంతేనా? సరే అయితే," మామయ్య ఇబ్బంది గమనించి మాట మార్చారు ఫ్రెడిరిక్సెన్. "ఏదేమైనా మా ద్వీపం మీద దొరికే ఖనిజ సంపద చూడకుండా మాత్రం మీరు తిరిగి వెళ్లకూడదు."
"తప్పకుండా!" మామయ్య ఉత్సాహంగా అన్నాడు. "కాని నేను కొంచెం ఆఖరుగా వచ్చిన వాణ్ణి అయ్యుంటాను. నా ముందు ఎంతో మంది వచ్చి వుంటారేమో?"
"అవును ప్రొఫెసర్ లీడెన్బ్రాక్! రాజాజ్ఞ మీదట ఒలాఫ్సన్, పొవెల్సెన్ మొదలైన వాళ్లు చేసిన కృషి, ట్రాయిల్ యొక్క పరిశోధనలు, జీమార్డ్ మరియు రాబర్ట్ ల వైజ్ఞానిక అధ్యయనం మొదలైన ప్రయత్నాలన్నీ ఐస్లాండ్ గురించిన పరిజ్ఞానాన్ని అమితంగా పోషించాయి. అయితే ఎంత తెలుసుకున్నా, తెలీనిది ఇంకా ఎంతో తప్పకుండా ఉంటుందని నా నమ్మకం."
"నిజంగా ఉంటుందంటారా?" ఉత్సాహాన్ని దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ అన్నాడు మామయ్య.
"ఓ, లేకేం? ఇంకా పూర్తిగా అర్థం కాని పర్వతాలు, హిమానీనదాలు, అగ్నిపర్వతాలు ఎన్నెన్ని లేవని? అసలవన్నీ ఎందుకు. అల్లంత దూరంలో నింగి నేల కలిసే చోట కనిపిస్తోందే? అదే స్నేఫెల్ పర్వతం." (చిత్రం)
"ఓ అవునా? అది స్నేఫెల్ పర్వతమా?" మామయ్య తనకి సాధ్యమైనంత అమాయకత్వాన్ని తన మాటల్లో దట్టించాడు.
"అదో విచిత్రమైన అగ్నిపర్వతం. దాని పైన ఉండే అగ్నిబిలాన్ని పెద్దగా ఎవరూ సందర్శించనే లేదు."
"అది మృత పర్వతమా?"
"అవునవును. ఓ ఐదొందల ఏళ్లుగా అది నిప్పులు కక్కలేదు."
"అవునా? అయితే సరే. నా భౌగోళిక అధ్యయనాలని ఆ పర్వతం దగ్గర్నుండి మొదలుపెడితే బావుంటుందేమో ననిపిస్తోంది. ఇంతకీ పర్వతం పేరు ఏంటన్నారు. సెఫెల్... ఫెసెల్...?"
"స్నెఫెల్!" ఠక్కున అందించారు ఫ్రెడిరిక్సెన్.
ఈ సంభాషణ అంతా లాటిన్ లో జరిగింది. అందులో నాకు ప్రతీ పదం అర్థమయ్యింది. మామయ్య ఇబ్బంది చూస్తే నాకు నవ్వు ఆగటం లేదు. అమాయకంగా కనిపిస్తున్నానని తను అనుకుంటున్నాడేమో గాని నాకైతే ఆ ముఖంలో ఓ కుటిల, కపట దరహాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది!
"నిజమే. మీ మాటలు వింటుంటే నా నిర్ణయం ఇంకా బలపడుతోంది. స్నెఫెల్ పర్వతాన్ని ఎక్కుతాం. దాని అగ్నిబిలంలోకి దిగి అక్కడ అధ్యయనం చేస్తాం."
"కాని పని వత్తిడి వల్ల మీతో రాలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు అర్థం చేసుకుని క్షమించాలి," ఫ్రెడిరిక్సెన్ అన్నారు.
"అయ్యో! దాందేవుంది. మేం ఎవర్నీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అసలు మీకా ఆలోచన రావడమే మా అదృష్టం. అయినా మీ బాధ్యతలకి అంతరాయం కలగడం మాకు సుతరామూ ఇష్టం లేదు..."
పాపం అమాయకుడైన ఈ ఐస్లాండ్ వాసి మా మామయ్య వేసే నాటకాలు గుర్తించినట్టు లేదు.
"మీరా అగ్నిపర్వతంతో మీ పర్యటనలు మొదలుపెట్టటం నాకు పూర్తిగా సమ్మతమే ప్రొ. లీడెన్బ్రాక్! అక్కడ మీరు చెయ్యబోయే పరిశీలనలు మీకు పండుగలా ఉంటుంది. కాని ఇంతకీ స్నెఫెల్ ద్వీపకల్పాన్ని ఎలా చేరుకుందామని?"
"సముద్రం మీదుగా. ఖాతాన్ని దాటి అక్కడికి చేరుదామని ఉద్దేశం. అదే అన్నిటికన్నా దగ్గరి దారి కదా?" మామయ్య అడిగాడు.
"నిజమే కాది అది అయ్యే పని కాదు."
"ఏం?"
"ఇక్కడ రెయిక్ జావిక్ లో మా వద్ద ఒక్క పడవ కూడా లేదు కాబట్టి."
"అలాగా?"
"నేల మీదుగా తీరం వెంబడి ప్రయాణించాలి. దారి కొంచెం పొడవైనది కాని చాలా ఆసక్తికరంగా ఉంటుంది."
"సరే అయితే. కాని ఓ గైడ్ ని వెదుక్కోవాలి."
"ఆ ఏర్పాటు నేను ముందే చేసి ఉంచాను."
"సమర్ధుడేనా?"
"ఆహా! ఆ ద్వీపకల్పంలో ఉండే స్థానికుడు. తెలివైనవాడు. డేనిష్ అనర్గళంగా మాట్లాడతాడు."
"అతన్ని ఓ సారి కలవాలి."
"రేపు పంపిస్తాను."
"ఇవాళ వీలు కాదా?"
"లేదు. రేపటి దాకా రాడు."
"సరే అయితే. రేపే రమ్మనండి," మామయ్య నిట్టూరుస్తూ అన్నాడు.
చివర్లో మా జర్మన్ ప్రొఫెసర్ ఆ ఐస్లాండ్ ప్రొఫెసర్ కి పదే పదే కొద్ది నిముషాల పాటు కృతజ్ఞతలు చెప్పడంతో ఆ సంభాషణకి తెరపడింది.
(పదవ అధ్యాయం సమాప్తం)
0 comments