11. భూగర్భ యాత్రలో మార్గదర్శకుడు
ఆ రోజు సాయంత్రం సముద్ర తీరంలో చాలా సేపు షికారు కెళ్లి వచ్చి నా చెక్క మంచం మీద బుద్ధిగా పడుకున్నాను.
నాకు తిరిగి తెలివి వచ్చే సరికి మా మామయ్య పక్క గదిలో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. వెంటనే లేచి తయారై ఆ గదిలోకి వెళ్లాను.
మామయ్య మాట్లాడుతున్న మనిషెవరో చెట్టంత ఎత్తున ధృఢంగా ఉన్నాడు. చూస్తే మహా మహాబలశాలి అని అర్థమవుతుంది. ఆ నీలి కళ్లలో ఏదో చమక్కు ఉంది. తెలివైనవాడేమో కూడా! పొడవైన కేశాలు కెరటాల్లా భుజాల మీద పడుతున్నాయి. కదలికలు చురుగ్గా ఉన్నాయి. కాని మాట్లాడుతున్నప్పుడు చేతులు కదిలించటం లేదు. హావభావాలు అనేవి అసలు ఉంటాయని కూడా ఈ స్థానికుడికి తెలిసినట్టు లేదు పాపం. చూడ్డానికి నిశ్చలంగా, నిబ్బరంగా ఉన్నాడు. అది సోమరితనం వల్ల వచ్చే జడత్వం కాదు. క్రమశిక్షణ వల్ల వచ్చే నైశ్చల్యం. ఎవరి మాటా వినని, ఏ శక్తికీ లొంగని ఉక్కుపిండం లా ఉన్నాడు.
మామయ్య చేతులు తెగ ఊపుతూ దంచుతోన్న ఉపన్యాసాన్ని నిశ్చలంగా, చేతులు కట్టుకుని వింటున్నాడీ మహాకాయుడు. ఏదైనా నచ్చకపోతే చేతిని నెమ్మదిగా ఎడమ నుండి కుడి పక్కకి కదిలిస్తాడు. ఒప్పుకుంటే చేతిని దీవిస్తున్నట్టుగా ఓ సారి ఊపుతాడు. తల మీద ఒక్క వెంట్రుక కూడా ఆడకుండా జాగ్రత్తగా చేతులు కదిలిస్తున్నాడు. అతడి ప్రతీ కదలికలోను వల్లమాలిన పొదుపు కనిపిస్తోంది.
కాని ఈ మనిషిని చూసినవాడెవడూ ఇతడు వేటగాడంటే కలలోకూడా నమ్మడు. జంతువులని బెదరగొట్టి, వేటాడి చంపే రకం లానే లేడసలు. ఇంతకీ ఇతగాడు ఏం వేటాడతాడో ఆ తరువాత ఫ్రెడిరిక్సన్ గారు విన్నవించారు. ఐస్లాండ్ కి ప్రత్యేకమైన ఒకరకం బాతులని వేటాడతాట్ట! ఇంకా నయం... అయితే అవి ఆషామాషీ బాతులు కావట లెండి. ఆ బాతుల తల మీద ఉండే తురాయికి ఇక్కడ చాలా గిరాకి అట. పైగా వాటిని పట్టుకోవడానికి ఆట్టే ఒడుపు అక్కర్లేదట కూడా.
వేసవిలో ఆడ బాతులు - ఇవి మహా సొగసుగా ఉంటాయి లేండి - రేవులో రాళ్ల మధ్య గూడు కట్టడానికి బయల్దేరుతాయి. గూడు కట్టాక ఆ బాతు తన ఒంటి మీద నుంచి ఈకలు పీకి వాటితో ఆ గూటిని ఓ మెత్తని పానుపులా చేస్తుంది. అదే అదను అని అల్లంత దూరంలో పొంచి వున్న వేటగాడు అమాంతం మీద పడి ఆ గూటిని వశం చేసుకుంటాడు. పాపం అప్పుడా బాతు మరో చోట గూడు కట్టుకోవడానికి బయల్దేరుతుంది. అలా తన ఒంటి మీద ఇక ఈక లేకుండా ఉన్నంత వరకు ఆ ఆడ బాతు అలా గూళ్లు నిర్మిస్తూనే ఉంటుంది. అప్పుడిక మగ బాతు వంతు వస్తుంది. కాని మగ బాతుల ఈకలు అంత మెత్తగా ఉండవు కనుక, ఆ గూళ్లు వేటగాళ్లకి అక్కర్లేదు. అవి భద్రంగా ఉంటాయని తెలిసిన ఆడ బాతు వాటిలో గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి పెట్టలు పెల్లుబికాక తదుపరి తరం మొదలౌతుంది.
ఈ వేటలో మరో సౌకర్యం ఏంటంటే ఈ బాతు తన గూళ్లు ఏ చిటారు కొమ్మ మీదో, కరకు రాతి అంచుల మీదో కట్టదు. సముద్రపు ఒడ్డున ఉండే నునుపైన విశాలమైన బండల మీద నిర్మిస్తుంది. కనుక వేట గాళ్లకి శ్రమ తగ్గుతుంది. కనుక ఈ సాగులో నాట్లు పెట్టి పాట్లు పడాల్సిన పని లేదు. హాయిగా వెళ్లి సిద్ధంగా ఉన్న సరకుని మూటగట్టుకుని రావడమే!
మాకు గైడ్ గా అవతరించిన ఈ ఆజానుబాహుడు, అస్మిత వదనుడి పేరు హన్స్ బెల్కె. ఫ్రెడిరిక్సెన్ సిఫారసు మీద వచ్చాడితను. ఇతడి వాలకం మా మామయ్య తత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
కాని మెల్లగా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. పారితోషకం విషయంలో కూడా పేచీ పడేట్టు లేరు. అవతలి వారు ఎంతిస్తే అంత పుచ్చుకుందామని ఒకరు; అవతలివారు ఎంతడిగితే అంత ఇద్దామని మరొకరు సిద్ధంగా ఉన్నారు. బొత్తిగా పేచీలేని బేరం!
ఒప్పందం ప్రకారం హన్స్ మమ్మల్ని స్నెఫెల్ ద్వీపకల్పానికి దక్షిణ తీరం వద్ద ఉన్న స్టాపీ అనే గ్రామం వరకు తీసుకెళ్తాడు. స్నెఫెల్ అగ్నిపర్వతపు పాదాల వద్ద ఉందీ గ్రామం. నేల మీద అయితే ఆ గ్రామం 22 మైళ్ల దూరం.
"రెండు రోజుల్లో అక్కడికి చేరాలి," ఖండితంగా అన్నాడు మామయ్య.
కాని మామయ్యకి డేనిష్ ల కొలమానాల ప్రకారం 1 మైలు = 24,000 అడుగులు అని తరువాతే తెలిసింది. వెంటనే తన లెక్కలన్నీ మళ్లీ వేసుకుని యాత్రకి ఏడెనిమిది రోజులు పడుతుందని తీర్మానించాడు.
నాలుగు గుర్రాలు కుదిరాయి. నన్ను, మామయ్యని మొయ్యడానికి రెండు. సామానుకి మరి రెండు. హన్స్ కి కాలినడక అలవాటట. ఆ ప్రాంతం తనకి సుపరిచితమని, అతి దగ్గరి దారిలో మమ్మల్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు.
అయితే స్టాపీ చేరుకోవడంతోనే మా గైడు పని పూర్తి కాలేదు. మామయ్య తన పరిశోధనలు చేసినన్నాళ్లూ మాతో అతను కూడా ఉండాలి. వారానికి మూడు రిక్స్ డేళ్ల (అంటే సుమారు డజను షిల్లింగులు అన్నమాట) పారితోషకం. ప్రతీ శనివారం సాయంత్రం ఆరు కొట్టేసరికి ఠంచనుగా తన జీతం తనకి ముట్టజెప్పాలని కూడా ఒప్పందంలో ఉంది.
మా ప్రయాణం జూన్ 16 కి నిశ్చయమయ్యింది. అడ్వాన్సుగా మామయ్య ఆ వేటగాడికి కొంచెం రుసుం చెల్లించాలని చూశాడు. కాని ససేమిరా వద్దంటూ,
"తర్వాత" అన్నాడు.
"తర్వాత తీసుకుంటాట్ట," మామయ్య నా వైపు తిరిగి అన్నాడు, నాకేదో పాఠం బోధపరుస్తున్నట్టుగా.
"కొంచెం విడ్డూరం మనిషి," మామయ్య సాలోచనగా అన్నాడు. "జరగబోయే మాహాయాత్రలో అతడు పోషించబోయే ముఖ్య పాత్ర గురించి ఇంకా తెలిసినట్టు లేదు పాపం."
"అంటే మనతో పాటు అతణ్ణి కూడా..." అర్థోక్తిలో ఆపాను.
"ఆహా! భూమి కేంద్రం దాకా తీసుకుపోబోతున్నాం" మామయ్య వాక్యాన్ని పూర్తిచేశాడు.
0 comments