కొలంబస్ యాత్రల పట్ల స్పెయిన్ రాచదంపతులలో సందేహం కలగడం వల్ల అతడి యాత్ర ఆలస్యం కాసాగింది. కాని రాణి ఇసబెల్లా కి మొదటి నుండి కొలంబస్ పథకాల పట్ల నమ్మకం ఉండేది. కనుక మంచి మాటలు చెప్పి విముఖంగా ఉన్న రాజు ఫెర్డినాండ్ ని కొలంబస్ పట్ల సుముఖంగా అయ్యేట్టు చేసింది. దాంతో కొలంబస్ యాత్రకి కావలసిన నిధులు మంజూరు అయ్యాయి. ఆరు ఓడలతో, తగినంత మంది సిబ్బందితో, సంభారాలతో మే 12, 1498 నాడు కొలంబస్ తన మూడవ యాత్ర మీద పయనమయ్యాడు.
కొలంబస్ యాత్రల పట్ల రాచదంపతులే కాక, గతంలో నావికులు కూడా సందేహించడంతో, పైకి ధీమాగానే కనిపించినా కొలంబస్ మనసులో మాత్రం ఓ మూల సందేహం దొలిచేయసాగింది. తను కనుక్కున్నది ఆసియా కాదని ఒప్పుకోకపోయినా అవి కేవలం ఆసియా ఖండానికి అంచుల వద్ద ఉన్న దీవులే కావచ్చని ఒప్పుకున్నాడు. ఈ మూడవ యాత్రలో ఎలాగైనా ఆ దీవులకి ఆవల ఉన్న విశాల ఆసియా ఖండాన్ని కనుక్కుంటానని ప్రతిజ్ఞ చేశాడు.
ఆ లక్ష్యంతో తన వద్ద ఉన్న ఆరు ఓడల్లో మూడింటిని, క్రిందటి యాత్రలో నిర్మించిన ఇసబెల్లా నగరానికి పొమ్మని పంపించాడు. తక్కిన మూడు ఓడలతో కొలంబస్ దక్షిణ-పశ్చిమ దిశగా పయనమయ్యాడు. ఆగస్టు ఒకటవ తేదీ నాడు ఆ కొలంబస్ బృందానికి మూడు మహోన్నత శిఖరాలు గల ఓ విశాలమైన ద్వీపం కనిపించింది. ఆ మూడు పర్వతాలు ఉన్న దీవికి, క్రైస్తవ సాంప్రదాయంలో త్రిమూర్తులు (ట్రినిటీ) అన్న భావనని తలపించేలా, ట్రినిడాడ్ అని పేరు పెట్టాడు. (ట్రినిడాడ్ దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర తీరం వద్ద ఉంది.) కొలంబస్ ట్రినిడాడ్ చుట్టూ కొంత సమయం సంచరించి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మరో విశాలమైన దీవి కనిపించింది. అది దీవి అనుకుని పొరబడ్డాడు గాని అది నిజానికి దక్షిణ అమెరికా ఖండమే. తనకి తెలీకుండానే ఓ మహా ఖండాన్ని కనుక్కున్నాడు కొలంబస్. కొలంబస్ నావిక జీవనం అంతా ఇలాంటి ఎన్నో పొరబాట్లతో నిండి వుంది. అయితే ఆయన చేసిన పొరబాట్ల వల్ల భూమి యొక్క రూపు రేఖల గురించిన ఎన్నో మహత్తర వాస్తవాలు బయటపడ్డాయి.
దక్షిణ అమెరికా తీరంలో కొలంబస్ బృందానికి ఓ విశాలమైన నదీముఖం కనిపించింది. ఆ నది పేరు ఓరినోకో. ఆ నది వెంట ఓడలని ముందుకి పోనిచ్చాడు. లోపలి పోతున్న కొద్ది మొదట్లో ఉప్పగా ఉన్న నదీ జలం స్వచ్ఛంగా మారడం కనిపించింది. ఆ నది చుట్టూ పరిసరాలు కూడా చెప్పలేనంత సహజ సౌందర్యంతో మురిపిస్తున్నాయి. పచ్చని, దట్టమైన అడవులు, చుట్టూ ఎత్తైన, బృహత్తరమైన పర్వతాలు, గొప్ప వైవిధ్యంతో కూడిన జంతువులు, సొగసైన పక్షులు. భూమి మీద ఇంత అందమైన ప్రదేశం మరేదీ లేననిపించింది. ఆ ప్రాంతపు సొగసులు తిలకిస్తున్న కొలంబస్ కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. బైబిల్ లో ఒక చోట ఈడెన్ అనే అందమైన అడవి ప్రసక్తి వస్తుంది. బహుశ ఇదే ఆ ఈడెన్ అడవి కావచ్చన్న ఆలోచనతో అతడి ఉత్సాహం మరింత పెరిగింది. ఆ అడవిని, సమీప ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించాలని అనుకున్నాడు.
కాని అనుకోకుండా ఆ సమయంలోనే అతడికి ‘గౌట్’ వ్యాధి సోకి మంచాన పడ్డాడు. కళ్లు మంటలు పుట్టి ఇంచుమించు గుడ్డివాడు అయినంత పనయ్యింది. ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని వెంటనే ఓడలని తిరిగి ఇసబెల్లా నగరానికి పోనివ్వమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఇసబెల్లా నగరాన్ని కొలంబస్ సోదరులైన బార్తొలోమ్యూ, మరియి డీగోలు చూసుకునేవారు. కొలంబస్ ఆ నగరానికి తిరిగి రాగానే పెద్ద తమ్ముడైన బార్తొలోమ్యూ జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.
కొలంబస్ లేని సమయంలో నగరంలో తిరుగుబాటు మొదలయ్యింది. ఆ తిరుగుబాటుకి నాయకుడి పేరు రోల్డాన్. ఇతగాడు కొలంబస్ తో సంబంధం లేదని స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ కొంతమంది నావికులని తీసుకుని అదే దీవిలో మరో చోట బస ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో కొలంబస్ దళం బాగా బలహీనం అయిపోయింది. ఇక ఆ సమయంలో కొలంబస్ కి రోల్డాన్ తో రాజీ పడక తప్పలేదు. అలా రాజీ పడి కొంత మనశ్శాంతిని కొని తెచ్చుకున్నా, జరిగిన ద్రోహం గురించి కబురు పెడుతూ స్పెయిన్ కి మూడు ఓడలని పంపాడు.
మూడు ఓడల నిండా పసిడికి బదులు బోలెడన్ని ఫిర్యాదులు స్పెయిన్ చేరాయి. తన కింద పని చేస్తున్న వారిని అదుపుచెయ్యలేని కొలంబస్ అసమర్థత ఫెర్డినాండ్, ఇసబెల్లా దంపతులకి నచ్చలేదు. తను పంపిన ఓడలలో ఫిర్యాదులతో పాటు కొంత మంది “ఇండియన్లని” బానిసలుగా పంపాడు. వారిలో అక్కడి గూడెం నాయకుల కూతుళ్ళు కూడా ఉన్నారు. ఈ దౌర్జన్యం రాణి ఇసబెల్లాకి ససేమిరా నచ్చలేదు. ఆ బానిసలని తిరిగి వారి ఇంటికి పంపేయమని రాణి ఆజ్ఞాపించింది. పంపుతానన్న బంగారం యొక్క ఆనవాళ్ళు కూడా లేకపోవడం చూసి మరోపక్క రాజు ఫెర్డినాండ్ రుసరుసలాడుతున్నాడు. ఏదో ఒకటి వెంటనే చెయ్యకపోతే వ్యవహారం చేయిదాటిపోతుందని గ్రహించాడు.
రాజు ఫెర్డినాండ్ తన వద్ద పని చేసే బోబడియా అని అధికారిని హైటీ లో కొలంబస్ సమస్యని చక్కబెట్టి రమ్మని పంపాడు. బోబడియా చెప్పినట్టే బుద్ధిగా నడచుకొమ్మని కొలంబస్ కి సూచనలిస్తూ ఉత్తర్వులు పంపాడు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు, ఈ బోబడియా హైటీకి వెళ్ళి సున్నితంగా వ్యవహారం చక్కబెట్టుకురాలేదు. అందరి మీదా పెత్తనం చేసి ఓ నియంతలా ప్రవర్తించాడు. అతడి రాక వల్ల కొలంబస్ జీవితంలో ఓ విషాద అధ్యాయం మొదలయ్యింది.
(ఇంకా వుంది)
chalaa informativegaa undi
లోకం చుట్టిన వీరుడు భాగాలు అన్నీ చదివాను. కథనం ఆసక్తికరంగా వుంది. మిగతా భాగాల కోసం ఎదురుచూస్తున్నాను.
ఈ సీరియల్ మరో రెండు ఎపిసోడ్లలో అయిపోతుంది. ఆ తరువాత మరేదైనా ప్రారంభించాలి.
ఎక్స్ ప్లోరర్ల కథలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. నాకు తెలిసి తెలుగులో పెద్దగా లేవు. ఇంగ్లీష్ లో బాలసాహిత్యంలో ఎక్స్ ప్లోరర్ల సాహిత్యం పెద్ద విభాగం.