http://www.andhrabhoomi.net/intelligent/darwin-katha-2-100
తక్కిన దేశాల ప్రాచీన సాంప్రదాయాలతో పోల్చితే ప్రాచీన భారత సాంప్రదాయంలో కాలమానం చాలా భిన్నంగా ఉంటుంది. అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం బృహత్తరంగా విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు (1 మైక్రోసెకను = సెకనులో వెయ్యోవంతులో వెయ్యోవంతు). ఇక వ్యవధుల్లో కెల్లా అతి దీర్ఘమైనది మహాకల్పం. దీని విలువ 311.04 ట్రిలియన్ సంవత్సరాలు (1 ట్రిలియన్= 1 పక్కన పన్నెండు సున్నాలు)! ఇది బ్రహ్మ దేవుడి నూరేళ్ల ఆయుర్దాయమట. ఈ బ్రహ్మ ప్రతీ రోజు ఒక సారి కొత్తగా సృష్టి చేస్తుంటాడు. రోజుకి అంతంలో (బ్రహ్మ దేవుడి రాత్రిలో) ప్రళయం వచ్చి విశ్వం లయమైపోతుంది. బ్రహ్మ యొక్క ఒక రోజు విలువ (ఒక పగలు, ఒక రాత్రి కలుపుకుంటే) రెండు ‘కల్పాలు’. ప్రస్తుతం మనం ఉంటున కల్పం పేరు శ్వేత వరాహ కల్పం. ఇందులో ఇంత వరకు గడచిన కాలం విలువ 8.64 బిలియన్ సంవత్సరాలు (1 బిలియన్ = 1 పక్కన తొమ్మిది సున్నాలు). ఇక్కడ విశేషం ఏంటంటే ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాల ప్రకారం మన విశ్వం యొక్క వయసు 13.75 బిలియన్ సంవత్సరాలు. మన సాంప్రదాయక అంచనా ఆధునిక అంచనాలతో చూచాయగా సరిపోతోంది. భారతీయ కాలమానం యొక్క ఈ లక్షణం గురించి ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత కార్ల్ సాగన్ కూడా మెచ్చుకుంటాడు. ప్రాచీన సాంప్రదాయాలలో అంత సుదీర్ఘమైన కాలవ్యవధులతో వ్యవహరించిన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం కాక మరొకటి లేదంటాడు.
పరిణామ సిద్ధాంతానికి మొదటి పునాది సుదీర్ఘమైన గతం. జీవజాతులు క్రమంగా వికాసం చెందడానికి, సరళ జాతుల నుండి సంక్లిష్ట జాతులు పరిణామం చెందడానికి సుదీర్ఘమైన కాలం పడుతుంది. సృష్టి వయసు కొన్ని వేల ఏళ్లు మాత్రమే ననుకుంటే ఇక పరిణామం అసంభవం. కనుక పైన చెప్పుకున్నట్టు సుదీర్ఘమైన కాలవ్యవధులని సమ్మతించే సాంప్రదాయం పరిణామ సిద్ధాంతానికి కావలసిన మొదటి అవసరాన్ని తీర్చుతోంది.
భారతీయ సాంప్రదాయం అక్కడితో ఆగిపోలేదు. జీవపరిణామాన్ని గురించిన మరిన్ని విలువైన భావనలు మన ప్రాచీన రచనలలో దొరుకుతాయి. ఉదాహరణకి దశావతారాల గాథలో పరిణామానికి సంబంధించిన సూచనలు ఉన్నాయని కొందరు తలపోశారు. ఈ దశావతారాల కథ భాగవత పురాణంలో వస్తుంది. గరుణ పురాణంలో కూడా శౌనకుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా రోమహర్షణుడు పది అవతారాల గురించి చెప్పుకొస్తాడు. వీటిలో మొదటిదైన ‘మత్స్య’ అవతారం జలచరానికి చిహ్నం. ఆధునిక పరిభాషలో దీన్ని జలచరాలు ఆవిర్భవించిన ‘కాంబ్రియన్’ యుగంతో పోల్చవచ్చు. రెండవ అవతారమైన ‘కూర్మం’ ఉభయచరానికి చిహ్నం. తరువాత వచ్చిన వరాహం, పరిణామ క్రమంలో తరువాత వచ్చిన నేల జంతువుకి, స్తన్య ప్రాణికి సంకేతం. ఆ తరువాత వచ్చిన నరసింహావతారం మనిషికి, మృగానికి వచ్చిన మధ్యస్థ ప్రాణికి సంకేతం. తదుపరి అవతారం అయిన వామనుడు మరుగుజ్జు మానవుడు. ఈ అవతారాన్ని ఆదిమానవ జాతులలో కాస్త పొట్టివారైన నియాండర్తల్ మానవ జాతికి చిహ్నంగా ఊహించినవారు ఉన్నారు. ఇక పరశురామ, రామ, కృష్ణ మొదలైన అవతారాలన్నీ మరింత అర్వాచీన మానవ దశలకి చిహ్నాలుగా ఊచించుకోవచ్చు. ఆ విధంగా అవతార కథలని జీవపరిణామ గాధకి ఓ ఉపమానంగా ఊహించుకోవచ్చని బ్రిటిష్ జీవశాస్త్రవేత్త జే.బి.యస్. హల్డేన్ సూచించాడు.
ఆధునిక విజ్ఞానం ప్రకారం జీవపరిణామ దశలతో సరిపోయే మరో ఆసక్తికరమైన కథ కూడా మహాభారతంలో కనిపిస్తుంది. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు. కద్రువ నాగులకి తల్లి. వినత పక్షులకి తల్లి. కద్రువ పెట్టిన వేయి గుడ్ల (!) నుండి వేయి పాములు పుడతాయి. అందులోంచి ఆదిశేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు వెలువడతాయి. వినత కాస్త ఆలస్యంగా రెండు గుడ్లు పెడుతుంది. అందులోంచి పక్షిరాజైన గరుత్మంతుడు, అనురుడు పుడతారు. ఆధునిక జీవపరిణామ వృత్తాంతం ప్రకారం ‘సౌరాప్సిడ్’ లు అనబడే జీవజాతిలో పాములు (సరీసృపాలు), పక్షులు రెండు ఉపశాఖలు. పైన చెప్పుకున్న కథలో పాములు, పక్షులు ఒకే తండ్రి బిడ్డలు కావడం ఈ పరిణామాత్మక సాన్నిహిత్యానికి చిహ్నంగా ఊహించుకోవచ్చు. పైగా ఆ కథలో పాములు కాస్త ముందు పుట్టడం కూడా విశేషమే. ఎందుకంటే పరిణామ చరిత్రలో కూడా సరీసృపాలు ముందుగాను, పక్షులు వెనుకగాను పుట్టాయి.
లోతుగా అధ్యయనం చేస్తే మన ప్రాచీన గ్రంధాలలో జీవ పరిణామానికి సంబంధించిన ఇలాంటి విశేషాలు మరిన్ని దొరికే అవకాశం ఉంది. అయితే ప్రాచీనులు వ్యక్తం చేసిన ఇలాంటి భావనలకి ఆధారాలేమిటో ప్రస్తుతం మనకు తెలీదు. ప్రాచీనులు ఎన్ని విలువైన విషయాలు చెప్పినా, ఆ ఆవిష్కరణ వెనుక ఉన్న విధానం మనకి తెలియకపోతే ఆ ఆవిష్కరణలని మళ్లీ నిర్ధారణ చెయ్యడానికి గాని, పూర్తిగా వినియోగించడానికి కాని వీలుపడదు. అలా నిర్ద్వంద్వమైన బాహ్య సాక్ష్యాధారాల మీద ఆధరపడుతుంది కనుక ఆధునిక విజ్ఞానం, ఆవిష్కరణలు ఏమిటో చెప్పడమే కాకుండా, ఆ ఆవిష్కరణలు ఎలా చెయ్యాలో కూడా నేర్పిస్తుంది.
కనుక ఆధునిక విజ్ఞానం దృష్ట్యా, జీవపరిణామ సిద్ధాంతానికి పునాదులుగా పనిచేసిన మొట్టమొదటి సాక్ష్యాధారాలని వరుసగా పరిశీలిద్దాం.
(ఇంకా వుంది)
"ఈ బ్రహ్మ ప్రతీ రోజు ఒక సారి కొత్తగా సృష్టి చేస్తుంటాడు", "దేవుడు ఆరు రోజులలో సృష్టి కార్యాన్ని పూర్తిచేశాడని" - ఈ రెంటినీ కలిపితే, ఆరు రోజులు అనేది మన లెక్కలో కాదు బ్రహ్మ కాలమానం ప్రకారం అని నా ఆలోచన. ఇది పరిణామ సిద్ధాంతానికి కావలసిన వ్యవధికి సరిపోతుంది.
మరి ఏడోరోజు ఏవి(టో?
మన పురాణాలలో రాసినవన్నీ కొట్టిపారెయ్యనక్కర లేదు.యథాతథంగా స్వీకరించనక్కరలేదు.బైబిల్ ,గ్రీకు పురాణాల్లొ వర్ణించిన వాటి అవశేషాలు కొన్ని బయటపడ్డాయి.(ట్రాయ్ ,నినెవె ,బాబిలన్ ) అలాగే సముద్రంలో మునిగిపోయిన ద్వారక ,రామసేతు, సేటిలైట్ చిత్రాల ద్వారా బయటపడ్డాయి.బిగ్‌బ్యాంగ్ bigbang theory వంటి వర్ణన పురాణాల్లో ఉన్నది.బలరాముణ్ణీ కంసుడినుంచి రక్షించ్డానికి దేవకి గర్భంలోంచి రోహిణి గర్భంలొకి దేవతలు ప్రవేశపెట్టారట.ఇంకా ,విమానాలు,దివ్యదృష్టి ,దివ్యాస్త్రాలు ,కుంభసంభవులు ( ta est tube babies )జలస్తంభన ,మయసభ ,ఇలా ఎన్నో .ఐతె వీటిని కేవలం కల్పనలగా కొట్టేయకుండా,ఆధునిక విజ్ఞాన పరిశోధనల ద్వారా నిగ్గు తేల్చాలి.