ఫిజో కాలం నాటికే
కాంతి వేగం గురించి కొంత అవగాహన వుంది. ఐదు మైళ్ళ ఎడంలో ఉన్న కొండల మధ్య ఓ చుట్టు చుట్టి
రావడానికి కాంతికి రమారమి 1/18,000 సెకను కాలం
పడుతుందని ఫిజోకి తెలుసు. గెలీలియో కాలంతో పోల్చితే ఫిజో కాలానికి గడియారాలు ఎన్నో
మెరుగులు దిద్దుకున్నాయి. మరింత చిన్న వ్యవధులని కొలవడానికి వీలయ్యింది. అయితే మరీ
అంత సూక్ష్మమైన వ్యవధులని కొలవడం సామాన్యమైన విషయం కాదు. నేరుగా గడియారంతో కొలవగలిగే
వ్యవధి కాదిది. దీన్ని కొలవడానికి కాస్త ‘సమయ’స్ఫూర్తి తో కూడిన ఏర్పాట్లు చేసుకోవాలి.
ఫిజో రూపొందించిన
పరికరంలో పళ్ళున్న చక్రం ఒకటి వుంటుంది (చిత్రం). ఆ చక్రం యొక్క అంచు మీదుగా ఓ కాంతి
కిరణం ప్రసరిస్తుంది. చక్రం కిరణానికి అడ్డు వస్తుందా, ముందుకి పోనిస్తుందా అన్నది
చక్రం యొక్క స్థానం మీద ఆధారపడుతుంది. గేర్ చక్రం లాంటి ఈ చక్రం చుట్టూ “పళ్లు” ఉంటాయి.
కిరణ రేఖ రెండు “పళ్ళ” మధ్యన సందులో పడితే ఆ సందు లోంచి కిరణం ముందుకు పోగలదు. కాని
కిరణ రేఖ ఓ “పన్ను” లోంచి పోతే, అది కిరణానికి అడ్డుపడుతుంది.
ఫిజో ఈ చక్రాన్ని
నెమ్మదిగా తిరగనిచ్చాడు. చక్రం యొక్క పళ్ళ సందులోంచి వెలువడ్డ కిరణం అవతలి కొండని చేరుకుని,
అక్కడ ఉన్న అద్దం మీద ప్రతిబింబితమై, వెనక్కి వస్తుంది. ఆ కిరణం ఎంత త్వరగా వెనక్కి
వస్తుందంటే అప్పటికి ఇంకా కాంతి రేఖ రెండు పళ్ల సందులోంచే పోతుంటుంది. కిరణానికి అడ్డుపడుతూ
ఆ స్థానం లోకి ఇంకా పన్ను రాలేదు. కనుక ఇవతల వెనక్కు వచ్చిన కిరణం కోసం కాచుకు కూర్చున్న
ఫిజోకి తిరిగొచ్చిన కిరణం కనిపిస్తుంది.
ఫిజో క్రమంగా
చక్రం తిరిగే వేగాన్ని పెంచుతూ పోయాడు. చక్రం వేగం ఒక స్థాయిని చేరుకునే సరికి పరిస్థితి
మారిపోయింది. పళ్ల సందుల లోంచి ముందుకి పోయిన కిరణం తిరిగి వెనక్కు వచ్చేసరికి పన్ను
కిరణానికి అడ్డుపడింది. కనుక ఇవతల వెనక్కి వచ్చిన కిరణం కోసం చూస్తున్న ఫిజోకి అవతలి
కొండ మీద అద్దంలో ప్రతిబింబం కనిపించలేదు.
ఫిజో చక్రం యొక్క
వేగాన్ని మరింత పెంచాడు. వేగం మరో స్థాయిని చేరుకున్నప్పుడు మరో విచిత్రం జరిగింది.
ఈ సారి కిరణం వెనక్కి తిరిగి వచ్చేసరికి, ఏ పళ్ళ సందు లోంచి దూరి కిరణం తన యాత్ర మీద
బయల్దేరిందో, ఆ పళ్ల సందుకి తరువాత పళ్ల సందు కాంతి రేఖకి అడ్డువచ్చింది. తిరిగొచ్చిన
కిరణం ఆ పళ్ళ సందు లోంచి ముందుకు పోతూ ఆ వెనుక
ఉన్న ఫిజో కళ్లలో పడింది. ఈ సారి మళ్లీ ఫిజోకి కాంతి యొక్క ప్రతిబింబం కనిపించింది.
చక్రం ఎంత వేగంతో
తిరుగుతోందో ఫిజోకి తెలుసు. కనుక చక్రం యొక్క పలుసందు స్థానంలో పన్ను రావడానికి ఎంత
సేపు పడుతుందో తెలుసు. అలాగే ఒక పలు సందు స్థానంలోకి తదుపరి పలుసందు రావడానికి ఎంత
సేపు పడుతుందో కూడా తెలుసు. ఈ వ్యవధులని వాడి కాంతికి రెండు కొండల మధ్య యాత్ర చెయ్యడానికి
ఎంత సేపు పడుతుందో లెక్కించాడు ఫిజో. దాంతో కాంతి వేగాన్ని అంచనా వెయ్యడానికి వీలయ్యింది.
ఆ విధంగా 1849 లో ఫిజో చేసిన అంచనా బట్టి కాంతి వేగం 196,000 మైళ్ళు/సెకను అని తేలింది. అసలు కాంతి వేగం కన్నా ఈ విలువ కాస్త
ఎక్కువ. ఒక విధంగా చూస్తే బ్రాడ్లీ విలువతో పోల్చితే ఫిజో చేసిన అంచనా అంత గొప్పదేమీ
కాదు. అసలు విలువ కన్నా బ్రాడ్లీ అంచనా 10,000
మైళ్ళు/సెకను తక్కువ అయితే, ఫిజో అంచనా 10,000 మైళ్ళు/సెకను ఎక్కువ.
అయితే ఫిజో సాధించిన
ప్రత్యేక ఫలితం ఏంటంటే, తనకు పూర్వం కాంతి వేగాన్ని సాధించిన వారి లాగా అంతరిక్షపు
ఘటనల మీద ఆధారపడకుండా పూర్తిగా భూమి మీదే జరిగే ఘటనల ఆధారంగా కాంతి వేగాన్ని కొలవగలిగాడు.
కనుక ఫిజో వాడిని పద్ధతినే అవలంబించినా, మరింత కచ్చితంగా కాంతి వేగాన్ని కొలవాలంటే
మరింత సునిశితమైన పరికరం కావాలి.
(ఇంకా వుంది)
మీరు చేస్తున్న ఈ అద్భుతమైన సేవని కొనియడకుండా ఉండలేకపోతున్నాను..
తెలుగులో ఈ స్థాయి ప్రమాణాలు కల సైన్స్ బ్లాగ్స్ ఉంటాయని ఊహించలెకపొయాను..
భానుకిరణ్.
భానుకిరణ్ గారు, ధన్యవాదాలు.
కాని ఈ బ్లాగ్ ని తల దన్నే ప్రమాణాలు గన సైన్స్ బ్లాగులు - ఒక్కటి కాదు, కోకొల్లలు - పుట్టుకొచ్చే భవిష్యత్తుని నేను ఊహించుకుంటున్నాను :-)