శత్రువుని పస్తులుంచి లొంగ దీసుకోవాల్సిందే
"ఆయన వెళ్లిపోయారా?" తలుపులు దభాల్న మూసుకోవడం విని వంటగది లోంచి పరుగెత్తుకు వచ్చింది మార్తా.
"అవును. వెళ్లిపోయారు," అన్నాను.
"మరి ఆయన డిన్నర్ మాటేమిటి?" బెంగగా అంది ఆ ముసలి ఆయా.
"తినరు అనుకుంటా."
"పోనీ రేపటి లంచ్ మాటేమిటి?"
"అది కూడా తినరు అనుకుంటా."
"అయ్యో, అదేంటి?" బాధగా అంది మార్తా.
"అయ్యో నా పిచ్చి మార్తా! ఆయన ఇక జన్మలో భోజనం చెయ్యరట. అంతే కాదు, ఈ ఇంట్లో మరెవరూ భోజనం చెయ్యకూడదట. ఆ దిక్కుమాలిన గూఢ లిపిని పరిష్కరించిన దాకా ఇంట్లో అంతా పస్తులు ఉండాలని షపించాడు మా లీడెంబ్రాక్ మామయ్య.
"ఓరి దేముడో! అంటే ఇంట్లో అందరం ఆకలితో పోవాలసిందేనా?"
ఆ విషయం నేను ప్రత్యేకంగా విన్నవించు కోవాల్సిన అవసరం లేదని అనిపించింది. మా మామయ్య ఎలాంటి చండశాసనుడో తెలిసు గనుక అలాంటి విధి మాకు తప్పదని కూడా తెలుసు.
దిగులుతో పాపం ఆ ముసలి ఆయా ఏడుస్తూ తిరిగి వంటగదిలోకి వెళ్లిపోయింది.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ గ్రౌబెన్ తో చెప్పాలని అనిపించింది. కాని ఈ ఇంటి నుండీ తప్పించుకునేది ఎలా? ప్రొఫెసర్ ఇంటీకి తిరిగి ఏ క్షణాన అయినా తిరిగి రావచ్చు. మళ్లీ నన్ను పిలిస్తే? ఎప్పుడో ఒడిపస్ కాలానికి పూర్వం రాయబడ్డ ఈ పనికిమాలిన ప్రాచీన పత్రాన్ని పరిష్కరించమని మళ్లీ నా నెత్తిన కూర్చుంటే?
రాను పొమ్మంటే ఏం చేస్తాడో ఏమో?
కనుక ఉన్నచోట సురక్షితంగా ఉండటమే మేలు. బెసాన్సన్ కి చెందిన ఒక ఖనిజవేత్త ఈ మధ్యనే కొన్ని సిలికా శకలాలని పంపించాడు. అవన్నీ క్రోడీకరించాలి. అన్నిటినీ వేరు చేసి, వాటి మీద పేర్లు అతికించి, గాజు అలమరలో అమర్చాను. డొల్లగా ఉండే ఈ రాళ్ల గూడులో చిన్న చిన్న స్ఫటికాలు ఉన్నాయి.
కాని ఈ పని మీద ఎందుకో మనసు లగ్నం కాలేదు. మనసంతా ఆ ప్రాచీన పత్రం మీదే ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉద్వేగం పట్టలేకున్నాను. మనసు ఏదో కీడు శంకిస్తోంది.
ఒక గంటలో సిలికా శకలాలు అన్నిటీనీ అరలలో సర్దేశాను. పని పూర్తయ్యాక విశ్రాంతి తీసుకుందామని మా పాత మడత కుర్చీలో కూర్చున్నాను. నా పొడవాటి సిగరెట్ పైప్ ని వెలిగించాను. దాని మీద నాలాగే తీరుబడిగా కూర్చుని ఉన్న ఓ జలకన్య చిత్రం ఉంది. పైప్ లో పొగాకు కాలి క్రమంగా కార్బన్ గా మారుతుంటే, పైనున్న జలకన్య క్రమంగా మసికన్యగా మారడం చూసి నాలోనేనే నవ్వుకున్నాను. మధ్య మధ్యలో మెట్ల మీద ఏదైనా అలికిడి వినిపిస్తుందేమో ఓసారి వింటూ జాగ్రత్త పడ్డాను. అయినా మా మామయ్య ఈ క్షణం ఎక్కడుంటాడో? బహుశ ఆల్టోనియాకి పోయే దారి వెంట చెట్ల నీడలో పరుగులు పెడుతుంటాడు! చేతి కర్రని గాల్లో అటూ ఇటూ పిచ్చిగా ఊపుతూ, పచ్చని పచ్చికని ఆ కర్రతోనే చితగ్గొడుతూ, ముళ్ళ పొదల తలలని తెగనరుకుతూ, మౌన జపంలో మునిగి ఉన్న కొంగల ధ్యానాన్ని భంగం చేస్తూ, ఝంఝానిలంలా ముందుకు తోసుకుపోతుంటాడు.
ఆయన ఇంటికి తిరిగి వచ్చేది రహస్యం కనుక్కున్న సంతోషంతోనా, అంతుచిక్కని విచారంతోనా? ఆయన రహస్యాన్ని జయిస్తాడా, రహస్యం ఆయన్ని జయిస్తుందా? అలా నా మనసులో ఎన్నో ప్రష్నలు మెదులుతూ ఉండగా యాంత్రికంగా ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆ కాగితం మీద నేను రాసిన అర్థం పర్థం లేని అక్షర మాల కేసి ఓ సారి విసుగ్గా చూసి "దీని భావమేమి?" అంటూ నిట్టూర్చాను.
0 comments