అలా కాకుండా ఓ పొడవాటి మొక్కని ( Ts లేక sT జాతి దాన్ని) తీసుకుని దాని నుండి కొత్త మొక్కలు పుట్టించాం అనుకోండి. ఈ కొత్త మొక్కల్లోంచి వచ్చే శుక్ర కణాలలో ఏదో ఒక ఫాక్టర్ మాత్రమే ఉంటుంది. అంటే సగం శుక్ర కణాలు T జాతివి మిగతా సగం s జాతివి అయ్యుంటాయి. అండ కణాల విషయంలో కూడా అదే జరిగుతుంది. సగం T జాతికి, సగం s జాతికి చెంది ఉంటాయి.
శుక్ర కణాలని అండకణాలతో కలియనిస్తే, ప్రతీ T జాతి శుక్ర కణం ఒక T జాతి అండకణంతో గాని, s జాతి అండకణంతో గాని సంపర్కిస్తుంది. ఆ కలయిక వల్ల పుట్టిన విత్తు TT జాతిది గాని, Ts జాతిది గాని అవుతుంది. అలాగే ప్రతీ s జాతి శుక్రకణం ఒక T జాతి అండకణంతో గాని, s జాతి అండకణంతో గాని కలిసి, sT లేదా ss జాతుల విత్తులు ఉత్పన్నం అవుతాయి.
ఆ విధంగా TT, Ts, sT, ss అని నాలుగు రకాల విత్తనాలు ఉత్పన్నం అవుతాయి. ఆ నాలుగు జాతులూ సమపాళ్లలో ఉంటాయి. TT, Ts, sT రకం విత్తుల నుండి పొడవాటి బఠాణీ మొక్కలు పుడతాయి. ss విత్తుల నుండి పొట్టివి వస్తాయి. అంటే మూడు వంతులు పొడవాటి మొక్కలు, ఒక వంతు మాత్రమే పొట్టివి అవుతాయన్నమాట. TT, ss జాతి మొక్కలు శుద్ధ అనువంశికతను ప్రదర్శిస్తాయి. అంటే వాటి సంతతికి కచ్చితంగా వాటి లక్షణాలే (పోడగరితనం గాని, పొట్టిదనం గాని) వస్తాయి. కాని Ts, sT మొక్కలు శుద్ధ అనువంశికతను ప్రదర్శించవు. వాటి సంతతిలో రెండు రకాల మొక్కలూ ఉంటాయి.
బఠాణీ మొక్కల్లో ఇతర లక్షణాలు కూడా పరిగణిస్తూ మెండెల్ తన ప్రయోగాలు కొనసాగించాడు. అన్ని లక్షణాల విషయంలోను తన వివరణలు చక్కగా వర్తిస్తున్నాయి. తరువాత లక్షణాల మిశ్రమాలని కూడా పరీక్షించాడు. ఆకుపచ్చని విత్తనాలు కలిగి, పొడుగ్గా ఎదిగే మొక్కలని తీసుకున్నాడు. అలగే ఆకుపచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొడవు మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని తిసుకుని ప్రయోగాలు చేసి చూశాడు. రెండు లక్షణాల దృష్ట్యా శుద్ధ అనువంశికతను ప్రదర్శించే మొక్కలు ఏవి అవుతాయో ముందే నిర్ణయించగలిగాడు. తదుపరి తరంలో పుట్టిన మొక్కలు ఏఏ నిష్పత్తిలో వస్తాయో కూడా అంచనా వెయ్యగలిగాడు.
ఇన్ని పరిశోధనలు చేసి, తన సిద్ధాంతాలని క్షుణ్ణంగా పరీక్షించి తీర్చిదిద్దుకున్నాక కూడా మెండెల్ కి వైజ్ఞానిక సంఘం తన భావాలని గౌరవిస్తుందన్న నమ్మకం లేకపోయింది. మరి తనేమో ఓ మామూలు సాధువు. వృక్షషాస్త్రంలో ఓనమాలు కూడా సరిగ్గా రాని ఔత్సాహికుడేగాని, జగమెరిగిన పండితుడు కాడు. బడిపంతులు ఉద్యోగానికి ప్రవేషపరీక్షలో కూడా నెగ్గలేని పామరుడు.
కనుక తను రాసిన పరిశోధనా పత్రాన్ని నిపుడైన ఓ వృక్షషాస్త్రవేత్తకి పంపించాలని అనుకున్నాడు. అలాంటి ప్రముఖుల ఆమోదముద్ర ఉంటే ఇతర శాస్త్రవేత్తలు ఆ భావాలని సమ్మతిస్తారేమోనని ఓ ఆశ.
0 comments