నాకున్న వ్యవధిలో వినాశకరమైన ఆ పత్రాన్ని తిరిగి బల్ల మీద పెట్టడానికి మాత్రమే వీలయ్యింది.
ప్రొఫెసర్ లీడెంబ్రాక్ ఏదో పరధ్యానంగా ఉన్నట్టు ఉన్నారు.
రహస్యాన్ని భేదించాలన్న ఆలోచన అతడి మనసుకి స్థిమితం లేకుండా చేస్తోంది. ఆ విషయం గురించి చాలా లోతుగా, తర్కబద్ధంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. షికారుకి వెళ్లినప్పుడు ఏవేవో ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు పరీక్షించి చూడడానికి సిద్ధం అవుతున్నారు.
కుర్చీలో చతికిలబడి ఓ కాగితం మీద బీజగణిత సూత్రం లాంటిది ఏదో రాశారు. ఆయన చేసే ప్రతీ చర్యని నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ కొత్త ప్రయోగం వల్ల ఇంకే ఉపద్రవం ముంచుకు వస్తుందో? అసలు రహస్యం నాకు తెలిసినప్పుడు మరి ఈయన కనుక్కోబోయే రహస్యం వల్ల ఏం జరగనుందో?
మూడు గంటల పాటు మామయ్య పదం పదం మీదా పదే పదే తలెత్తకుండా పనిచేస్తూ పోయారు. రాసింది తుడపడం, మళ్లీ రాయడం ఇలా కొన్ని వందల సార్లు జరిగి ఉంటుంది.
ఈ అక్షరాలని సాధ్యమైనన్నీ విన్యాసాలలోనూ పేరిస్తే అసలు రహస్యం బయటికి వస్తుందని నాకు తెలుసు. కాని కేవలం ఇరవైనాలుగు అక్షరాలతో 24,432,902,008,176,640,000 వివిధ రకాల ప్రస్తారాలని నిర్మించవచ్చని తెలుసు. ఇక ఈ వాక్యంలోని నూట ముప్పై రెండు అక్షరాలతో ఎన్ని వాక్యాలు నిర్మించవచ్చు అంటే మానవ ఊహాశక్తికి అందనంత పెద్ద సంఖ్య వస్తుంది.
కనుక ఆయన ఎంత విరోచితంగా ఆ వాక్యంతో కుస్తీ పట్టినా ఈ పద్ధతిలో ఆ రహస్యాన్ని కనుక్కోలేరు అని అర్థమయ్యి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.
కాని కాలం నిశ్శబ్దంగా గడచిపోతోంది. పొద్దుపోయింది. వీధిలో రొద కూడా నెమ్మదించింది. పనిలో నిమగ్నమై ఉన్న మా మామయ్యకి బాహ్య ప్రపంచంలో వస్తున్న ఈ పరిణామాలేవీ పట్టలేదు. మార్తా తలుపు కాస్తంత తెరిచి, తల కాస్తంత లోపలికి పెట్టి, సున్నితంగా
"అయ్యగారూ, ఈ వేళ భోజనానికి వస్తున్నారా?" అని అడగడం కూడా ఆయనకి వినిపించలేదు.
ఆయన సమాధానం వినకుండా వెళ్లిఫోయింది మార్తా. నేను కూడా ఎంతో సేపు నిద్ర ఆపుకు కూర్చున్నాను గాని ఇక సాధ్యం కాక అక్కడే సోఫాలో నిద్ర ఒడిలో ఒరిగిపోయాను.
ఇన్ని జరుగుతున్నా మా లీడెంబ్రాక్ మామయ్య మాత్రం పట్టు విడవకుండా తుడుపుతూ, రాస్తూ పోయాడు.
మర్నాడు ఉదయం నేను మేలుకుని చూసే సరికి ఆ నిర్విరామ శ్రామికుడు ఉన్న చోటిని నుండి కదలకుండా పని చేస్తూనే ఉన్నాడు. కళ్ళు ఎర్రబారాయి. వేళ్లతో పదే పదే పీక్కుంటూ ఉండడం వల్ల కాబోలు, జుట్టంతా చెరిగిపోయింది. ఆ రాత్రి తెల్లవార్లూ ఆయన అసాధ్యపు పోరాటానికి, అలవిగాని అలసటకి, మనసు పల్లటీలకి గురుతులే ఆ ఎరుపెక్కిన చెంపలు.
0 comments