(ఈ కథ అసిమోవ్ రాసిన "హౌ డిడ్ వి ఫైండ్ అవుట్ అబౌట్ జీన్స్" అన్న పుస్తకం నుండి తీసుకోబడింది.)
1. మెండెల్ - బఠాణీ మొక్కలు
పిల్లలు తల్లిదండ్రుల పోలికలతో పుడతారని అందరికీ తెలుసు. సాధారణంగా కొన్ని పోలికలు తల్లి నుండి, కొన్ని తండ్రి నుండి వస్తాయి. అలాగే తోబుట్టువుల మధ్య కూడా పోలికలు కనిపిస్తాయి.
తల్లి దండ్రులు పొడుగ్గా ఉంటే పిల్లలు కూడా తరచు పొడుగ్గా ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లి కళ్ళు ఉంటే పిల్లలకీ పిల్లి కళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు నల్లనివారైతే పిల్లలూ నల్లగానే పుడతారు.
ఈ లక్షణాలన్నీ అనువంశికంగా సంక్రమిస్తాయి.
మనుషుల్లోనే కాదు, జంతువులలోను మొక్కల లోను కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. పసి జీవాలు, అవి ఏ జాతికి చెందినవి అయినా సరే, వాటి తల్లిదండ్రులని పోలి ఉంటాయి. తాటి చెట్టుకి తాబేలు పుట్టదు. ఆలుచిప్ప నుండి అరవిందం మొలవదు. ఇక పులి కడుపున పిల్లి పుట్టదన్న నానుడి ఉండనే ఉంది.
మరి తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఈ భౌతిక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి?
మనుషులలో ఈ అనువంశిక లక్షణాలు ఎలా సంక్రిమిస్తాయో చెప్పటం కష్టం. మొదటి సమస్య ఏంటంటే శారీరక లక్షణాలు కోకొల్లలు. అసలు వాటిని లెక్కించటమే కష్టం. అంతే కాక పిల్లలు ఎదిగే వరకు ఆగాలంటే చాలా కాలం పడుతుంది. ఎదిగితే గాని ఏ పోలిక ఎవరి నుండి వచ్చిందో చెప్పటం కష్టం. అలాగే ఒకే దంపతులకి గంపెడు సంతానం ఉంటే పిల్లల్లో వైవిధ్యం ఉంటుంది కనుక మన పరిశోధనకి సదుపాయంగా ఉంటుంది. కాని గంపెడు సంతానం గల తల్లిదండ్రులు అరుదే. ఇవన్నీ కాక పూనుకుని ప్రయోగాలు తలపెట్టవచ్చు. పొడవాటి ముక్కున్న పెద్ద మనిషికి, చప్పిడి ముక్కున్న చుక్కతో పెళ్లి చేసి, వాళ్లకి పుట్టిన పిల్లల ముక్కుల్ని పరీక్షించాలి. అలాగే చప్పిడి ముక్కు చిన్నోడికి, సూది ముక్కు సుదతిని ఇచ్చి పెళ్లి చేసి, మళ్లీ పిల్లల ముక్కులని పరీక్షించాలి. లేదా ప్రత్యేకమైన శారీరక లక్షణాలు గల దంపతుల కోసం గాలించాలి. ఇవన్నీ చేయొచ్చు గాని ఈ వ్యవహారం అంతా తేలాలంటే చాలా కాలం పడుతుంది.
ఈ సమస్య గురించే ఒక శతాబ్దం క్రితం ఆస్ట్రియాకి చెందిన ఓ సాధువుకి ఓ చక్కని ఉపాయం తట్టింది. అతని పేరే గ్రెగర్ యోహాన్క్ మెండెల్ (1822-1884).
ఈ మెండెల్ కి బడిపంతులు కావాలని చాలా కోరికగా ఉండేది. కాని ఆ ఉద్యోగం రావాలంటే ఓ ప్రవేశపరీక్ష పాసు కవాలి. కాని పాపం అతగాడు అందులో మూడు సార్లు తప్పాడు. ఉద్యోగం రాకపోయినా తనకి ప్రియాతిప్రియమైన వృక్షశాస్త్రానికే జీవితమంతా అంకితం చెయ్యాలని సంకల్పించాడు.
సరిగ్గా అదే సమయంలో తనకో బ్రహ్మాండమైన ఉపాయం వచ్చింది. అనువంశిక భౌతిక లక్షణాలని పరిశోధించటానికి సులభమైన మార్గం మొక్కల్ని పెంచటమేనన్న ఆలోచన అతనికి 1857 లో వచ్చింది. మొక్కలతో ఓ సౌకర్యం ఏంటంటే అవి ఉన్నచోటి నుండి కదలవు. కనుక వాటిని సులభంగా నియంత్రించవచ్చు. కనుక మొక్కల పెంపకాన్ని కూడా సులభంగా నియంత్రించవచ్చు. మొక్కల్లో పరాగ సంపర్కానికి కావలసిన కణాలు పుప్పొడిలో ఉంటాయి. పువ్వుల కేంద్రంలో పిస్టిల్క్ అని ఓ అంగం ఉంటుంది. అందులో ఉండే అండాశయంలో (ఓవ్యూల్) అండకణం ఉంటుంది. ఒక మొక్క నుండి పుప్పొడిని (ఇందులో శుక్ర కణం ఉంటుంది) తీసుకుని మరో మొక్క యొక్క పిస్టిల్క్ మీద అద్దాలి. దాన్నే పరపరాగ సంపర్కం (క్రాస్ పోలినేషన్) అంటారు. పిస్టిల్ మీద రాలిన పుప్పొడిలోనుండి ఓ సన్నని నాళం కిందికి దిగుతుంది. ఆ నాళంలోంచి శుక్ర కణం కిందికి ప్రయాణించి అండాశయంలో ఉండే అండకణంలో ఐక్యం అవుతుంది. దాన్నే ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్ ) అంటారు. ఫలదీకరణం తరువాత అండాలు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ విత్తనాలని పాతితే వేగంగా ఎదిగి మొక్కలు అవుతాయి. అలా పుట్టిన మొక్కల లక్షణాలని, పరాగాన్ని పిస్టిల్క్‌ని ప్రసాదించిన మొక్కల లక్షణాలతో పోల్చాలి.
అసలు నిజానికి ఒక మొక్క నుండి తీసుకున్న పుప్పొడిని అదే మొక్కకి చెందిన పిస్టిల్క్ మీద వేయొచ్చు. అలా పుట్టిన విత్తనాలకి తల్లిదండ్రి ఒకరే నన్నమాట. ఇందువల్ల మన పని కొంచెం సులభం అవుతుంది.
ఓ ఎనిమిదేళ్ల పాటు మెండెల్క్ బఠాణీ మొక్కల్లో పరాగ సంపర్కం చేస్తూ, ఫలితాలు పరీక్షిస్తూ పోయాడు.
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.
0 comments