కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 12
వృత్తి రీత్యా వాతావరణ శాస్త్రవేత్త అయినా లారెంజ్ ప్రాథమికంగా ఓ గణిత శాస్త్రవేత్త. తన వాతావరణ నమూనాలో తనకి కనిపించింది కేవలం అలవిగాని యదృచ్ఛ (Chance) మాత్రమే కాదు. బయటికి కనిపించే ఆ యదృచ్ఛకి అడుగున అద్భుతమైన సౌష్టవం గల ఓ విస్తృత జ్యామితీయ నిర్మాణాన్ని అతడు పొడచూడగలిగాడు. ఆ నిర్మాణాన్ని గణిత పరంగా వర్ణించడంలో, విశ్లేషించడంలో మునిగిపోయాడు. వాటి మీద ఎన్నో పరిశోధనా పత్రాలు రాశాడు.
లారెంజ్ తన పరిశోధనల్ని - వాతావరణంలా - అస్థిరమైన పరిణామం గల వ్యవస్థల మీద లగ్నం చేశాడు. కొన్ని గతులు ముందు ఏం జరుగుతుందో ఊహించగలిగేట్టు ఖచ్చితంగా ఉంటాయి. సామాన్య లోలకం గతి అటువంటిది. వాటి గతిని ఆవర్తిక గతి (periodic motion) అంటారు. కాని కొన్ని లయలు ఇంకా సంక్లిష్టంగా, అనావర్తకంగా (aperiodic) ఉంటాయి. అనావర్తక గతి గల రాశులు ప్రకృతిలో ఎన్నో కనిపిస్తాయి. జీవరాశుల వృద్ధి క్షయాలు ఎన్నో సార్లు ఇంచుమించు ఖచ్చితంగా ఆవర్తమవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక జలాశయంలో ఉండే ఓ ప్రత్యేకమైన జాతి చేపలు, లేదా ఓ అడవిలో ఉండే ఓ ప్రత్యేకమైన జాతి పక్షులు - వీటి సంఖ్యలు కాలానుగుణంగా ఇంచుమించు ఖచ్చితమైన ఆవృత్తితో మారే అవకాశం ఉంది. కాని అది "ఇంచుమించు" గా మాత్రమే. మరీ ఖచ్చితంగా ఉంటే అసలు సమస్యే ఉండదు. భవిష్యత్తు మన గుప్పిట్లోకి వచ్చేస్తుంది. కాని వాతావరణం అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. రాగం ఒక్కటే అయినా అనంత కోటి గమకాలతో నిత్యనూతనమై విలసిల్లే ప్రకృతి ఆలాపన అది.
ఒకసారి వచ్చిన మార్పుల క్రమం మళ్ళీ రాకుండా సాగే వాతావరణ గతికి, దాన్ని నిర్ణయించడంలో శాస్త్రవేత్తలు పడే తిప్పలకి మధ్య సంబంధం ఉండొచ్చని గుర్తించాడు లారెంజ్. అంటే వాతావరణం యొక్క అనావర్తతకి (aperiodicity), అనిర్ణయాత్మకతకి (unpredictability) మధ్య సంబంధం అన్నమాట. అయితే సామాన్య, సరళ సమీకరణాల్లో అనావర్తకత అంత సులభంగా కనిపించదు. ఎప్పుడూ ఖచ్చితంగా చక్ర గతిలో మారే రేఖలే చూపించేది కంప్యూటర్. కాని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి చూశాడు. ఉదాహరణకి తూర్పు పడమరలకి మధ్య ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాన్ని చొప్పించాడు. అంతే! సారంలేని ఆవృత్తి మాయమైపోయింది. అనంత వైవిధ్యంతో కూడిన రేఖా లాస్యం కంప్యూటర్ స్క్రీన్ మీద తారాడసాగింది.
తూనీగ న్యాయంలోని మర్మం అంతా ఇదే. చిన్న చిన్న కారణాల ప్రభావం వృద్ధి చెంది పెద్ద ఫలితాలకి దారి తీస్తాయి. ఆలోచించి చూస్తే ఇలాంటి ధర్మం ఏదో ప్రకృతిని తప్పకుండా శాసిస్తూనే ఉండాలి. లేదంటే చిన్న చిన్న మార్పుల ఫలితాలు క్రమంగా క్షీణించి వాతావరణం ఆవర్తక గతిలో పడే ప్రమాదం ఉంది. ఈ తూనీగ న్యాయం లేకుండా అనంత వైవిధ్యం అసంభవం.
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.
0 comments