"ఓ సారి జాగ్రత్తగా పరిశీలిద్దాం," నేను రాసిన కాగితాన్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఇక్కడ వరుసగా సరైన క్రమంలో లేని నూట ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి.
కేవలం హల్లులు మాత్రమే ఉన్న పదాలు ఉన్నాయి. అలాగే అచ్చులు ఎక్కువగా ఉన్న పదాలు కూడా ఉన్నాయి. ఇదేదో కావాలని చేసింది కాదు. మనకి తెలీని ఏదో సూత్రానికి అనుసారం తర్కబద్ధంగా, గణితబద్ధంగా ఈ క్రమం వచ్చింది. మూల వాక్యాన్ని సరిగ్గానే రాసి ఉంటారు. ఆ వాక్యం మీద ఈ సూత్రం వర్తింపజేస్తే ఇలా క్రమం తప్పిన అక్షరాల వరుస వచ్చి ఉంటుంది. ఆ సూత్రం ఏంటో తెలిస్తే ఈ సందేశాన్ని సునాయాసంగా చదవొచ్చు. ఇంతకీ పరిష్కారం ఏమయ్యుంటుందబ్బా? ఏయ్, ఏక్సెల్, ఏమైనా తెలిసిందా?"
నేను కిమ్మనకుండా ఉండిపోయాను. దానికొక కారణం ఉంది. అప్పుడే నా కళ్ళు గోడకి తగిలించి ఉన్న నా ముద్దుల గ్రౌబెన్ చిత్తరువు మీద పడ్డాయి. గ్రౌబెన్ మా మామయ్య పెంపుడు కూతురు. ప్రస్తుతం ఆల్టోనియాలో బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆమే ఇల్లు వదిలి వెళ్లిన దగ్గర్నుండి నా మనసు మనసులో లేదంటే నమ్మండి. మా ఇద్దరి మనసులు ఒకరికరు ఇచ్చి పుచ్చుకోవడం ఎప్పుడో అయిపోయింది. మేం ఒకరి కొకరం మనస్పూర్తిగా అంకితం కావడం కూడా ఎప్పుడో అయిపోయింది. అంతే కాదు. మా మామయ్యకి తెలీకుండా ఇద్దరం ఎంగేజ్ మెంట్ చేసుకొవడం కూడా ఎప్పుడో అయిపోయింది. మరేం చెయ్యడం? భూగోళం ఆకర్షించినంతగా మా మామయ్య దౄష్టిని మా భాగోతం ఆకర్షించదే? గ్రౌబెన్ నీలి కళ్ల నీలాలే నాకున్న ఏకైక పెన్నిధి. ఆమె పట్ల నాకున్న ఆరాధనని వ్యక్తం చెయ్యడానికి జర్మన్ భాషలోని పదజాలం సరిపోదేమో. అలా ఆ చిత్రంలో ఆమె ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఏవో తీయని గత స్మృతులలో తేలిపోయాను.
వట్టి ప్రేమలోనే కాదు, నా శ్రమలోను, సృజనలోను కూడా గ్రౌబెన్ పాలు పంచుకుంటుంది.
రోజూ నేను మామయ్యకి చెందిన అమూల్యమైన ఖనిజ నమూనాలని సర్దుతూ ఉంటే వచ్చి సాయం చేసేది. అవును చెప్పలేదు కదూ? గ్రౌబెన్ కూడా తండ్రిలాగే ఆరితేరిన ఖనిజవేత్త. పండితులకే నాలుగు ముక్కలు నేర్పించగల ప్రతిభ ఆమెది. లోతైన వైజ్ఞానిక సమస్యలని శోధించడం ఆమెకి సరదా. ఇద్దరం కలిసి చదువుకుంటూ, పనిచేస్తూ ఎన్నో అందమైన, ఆనందమైన ఘడియలు గడిపాం. ఆమే వేళ్లు తాకిన (జవ)రాళ్లు అన్నా నాకు కొన్ని సార్లు అసూయగా ఉంటుంది.
ఇక తీరిక సమయాలలో ఇద్దరం కలిసి షికారుకి వెళ్ళేవాళ్లం. ఆల్స్టర్ లో చెట్ల నీడలో సేద తీరే చలువ దారుల వెంట నడుస్తూ పోయేవాళ్లం. చెరువు గట్టున నిటారుగా నిలిచిన ఇంతేసి రెక్కలున్న పాత గాలిమర దాకా వెళ్లి వచ్చేవాళ్ళం. చేయి చేయి, మాట మాట, మనసు మనసు కలిసే తేనె ఘడియలవి. నేనేవో కల్లబొల్లి కథలల్లి ఆమెకి చెప్పేవాణ్ణి. ఆమె నవ్వేది. అలా మెల్లగా ఎల్బే నదీ తీరాన్ని చేరేవాళ్లం. కలువల మధ్య కొలువున్న చెలువ రాయంచకి వీడ్కోలు చెప్పి ముందుకి సాగేవాళ్లం.
నా కమ్మటి కల కూడా కాసేపు అలాగే సాగేదేమో. కాని మా మామయ్య బల్ల మీద చరిచిన దెబ్బకి కల చెదిరి వాస్తవంలోకి ఊడిపడ్డాను.
"ఇదుగో చూడు.వాక్యంలో అక్షరాలని తారుమారు చెయ్యడానికి ఎవరికైనా మొట్టమొదట తట్టే ఉపాయం ఒకటుంది. అది అక్షరాలని అడ్డుగా రాయటానికి బదులు నిలువుగా రాయటం," అన్నాడు మామయ్య.
"అవును కదా మరి," ఒప్పుకుంటూ అన్నాను.
"అలా పేర్చితే ఏమవుతుందో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇదుగో ఏక్సెల్, నీకు నచ్చిన ఏదో ఒక వాక్యాన్ని కాగితం మీద రాయి. అయితే మామూలుగా రాయకుండా, ఐదు ఆరు నిలువు గళ్లలో పట్టేట్టుగా ఏర్పాటు చేసి రాయి."
ఆయన చెప్పినట్టే చేసి ఈ కింది విచిత్ర సాహితీ ప్రక్రియని సాధించాను:
I y l o a u l o l w r b o u , n G e v w m d r n e e y e a !
"బావుంది," చదవుకుండానే అన్నారు ప్రొఫెసర్."ఇప్పుడా పదాలని మళ్లే అడ్డుగా రాయి."
రచన: చక్రవర్తి
0 comments