"చిత్రంగా ఉందే." ఆలోచించసాగాను. "ఈ పదాల బట్టి చుస్తే ఈ పత్రం యొక్క భాష గురించి మా మామయ్య చెప్పింది సబబే అనిపిస్తోంది. అలాగే నాలుగో వాక్యంలో
luco అని ఉంది. అంటే పవిత్రమైన అడవి అని అర్థం. ఇక మూడవ వాక్యంలో tabiled అని వస్తోంది. ఇది హీబ్రూలా ఉంది. అలాగే చివరి వాక్యంలో కనిపించే mer, arc, mere వంటి పదాలు బొత్తిగా ఫ్రెంచ్ పదాలు.
ఒక్క పనికిమాలిన వాక్యంలో నాలుగు భాషలా? ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతోంది! మంచు గడ్డ, గురువు, కోపం, క్రౌర్యం, పవిత్రమైన అడవి, నశ్వరమైన, తల్లి, విల్లు, సముద్రం - ఈ పదాల మధ్య ఏంటి సంబంధం? వీటిలో మొదటి పదానికి చివరి పదానికి ఏదైన సంబంధం ఉందంటే నమ్మొచ్చు. ఈ పత్రం రాసింది ఐస్లాండ్ లో కనుక మంచు సముద్రం గురించిన ప్రస్తావన సమంజసంగానే ఉంది. కాని అంత చిన్న ఆనవాలు పట్టుకుని ఈ రహస్య పత్రాన్ని పరిష్కరించడం సామాన్యం కాదు. నాకేమో తల వేడెక్కిపోతొండి. ఆ కాగితం కేసి తదేకంగా చూసి చూసి కళ్ల వెంబడి నీరు కారుతోంది.
తటాలున తలలోకి నెత్తురు ఎగజిమ్మినప్పుడు, కళ్లు బైర్లు కమ్మి తల చుట్టూ నాట్యం చేసే నలుపు, తెలుపు నలకల్లా ఈ నూట ముప్పై రెండు అక్షరాలు నా తల చుట్టూ సయ్యాటలు ఆడుతున్నాయి. మనసుని ఏదో భ్రాంతి క్రమ్ముకుంటున్నట్టు అనిపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతోంది. ఉఫ్! కొంచెం గాలి కావాలి. అందుబాటులో ఉందని ఆ కాగితాన్నే విసనకర్ర అనుకుని ఓసారి ముఖం మీద విసురుకున్నాను. అప్పుడు ఆ కాగితం యొక్క ముందు, వెనుక భాగాలు మారి మారి నా కళ్ల ముందు కదిలాయి. అలా కాగితం వేగంగా ముందు వెనక్కి మారుతుండగా నాకు <లంగ్=ఎంగ్> craterem, terrestre మొదలైన లాటిన్ పదాలు కనిపించాయి.
ఒక్కసారిగా తలలో ఏదో కాంతి విస్ఫోటం జరిగినట్టు అనిపించింది. ఈ ప్రప్రథమ ఆనవాళ్ల తెరని కొద్దిగా పక్కకి తీసి క్షణకాలం సత్యాన్ని సందర్శించాను. ఈ రహస్య పత్రానికి పరిష్కారం దొరికిపోయింది. ఈ పత్రాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని సాంతం చదవాల్సిన పని కూడా లేదు. రహస్యం తెలిస్తే, వరుసగా ఒక్కొక్క పదం సునాయాసంగా చదువుతూ పోవచ్చు.ప్రొఫెసర్ గారు చెప్పిన చిట్కాలు సరైనవే. పదాల కూర్పు గురించి ఆయన చెప్పింది నిజమే. భాష కూడా ఆయన చెప్పిందే. ఈ లాటిన్ పత్రాన్ని మొదలు నుండి తుది దాకా చదవే రహస్యం వెంట్రుక వాసిలో ఆయన చేజారిపోయింది. అదృష్టం నన్ను వరించింది కనుక వెంట్రుక వాసిలో అది నా చేజిక్కింది.
ఇక ఉద్వేగం పట్టలేకపోయాను. కళ్ళు చెమర్చి దృశ్యం మసకబారింది. ఎదుట బల్ల మీద ఆ కాగితం పరిచి ఉంది. భళ్లున తెల్లవారినట్టు రహస్యం నా ఎదుటే సాక్షాత్కరించింది.
కాసేపయ్యాక మనసు కుదుటపడింది. ఉద్వేగం తగ్గించుకోడానికి ఓ సారి గదిలో అటు ఇటు పచార్లు చేసి, తిరిగొచ్చి మడత కుర్చీ లోతుల్లో ఒదిగిపోయాను.
గుండెల నిండా ఓ సారి ఊపిరి తీసుకుని "ఇప్పుడు చదువుతున్నానొహో!" అంటూ నాకు నేనే ఓసారి చాటుకున్నాను.
బల్ల మీదకి వంగి, ఒక్కొక్క అక్షరం మీద వేలు పోనిస్తూ ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా వాక్యం మొత్తం చదివేశాను.
అద్భుతం! అనూహ్యం! అమానుషం! గొడ్డలి దెబ్బ తగిలినట్టు కుప్పకూలిపోయాను. నేను చదివింది నిజంగా సంభవించిందా? ఒక మానవ మాత్రుడు అలాంటి ప్రయత్నానికి పూనుకుని, అంత లోతుగా...?
'అమ్మో!" దిగ్గున లేచాను. "ఇంకేవైనా ఉందా? ఇది మా మామయ్యకి ససేమిరా తెలియ కూడదు.
తెలిస్తే తనూ చేస్తానంటాడు. దాని గురించి అంతా తెలుసుకోవాలని అనుకుంటాడు. అసలే భౌగోళిక శాస్త్రవేత్త. ఇది తెలిస్తే ఇక పట్టపగ్గాలు ఉండవు. ఉన్న పళాన బయలుదేరి తనతో అంతటినీ, అందరినీ తీసుకుపోతాను అంటాడు. లేదు, వీల్లేదు. ససేమిరా వీల్లేదు!"
నాలో భావావేశం కట్టలు తెంచుకుంది.
"లేదు, ఇది అసంభవం. ఇలాగైనా ఈ రహస్యం ఆ ఛండశాసనుడి చేతిలో పడకుండా అడ్డుపడాలి. లేకపోతే తను కూడా ఈ కాగితాన్ని అటు, ఇటు తిప్పి రహస్యాన్ని తెలుసుకోగలడు. ముందు ఈ కాగితాన్ని నాశనం చేసేయాలి."
కొలిమిలో ఇంకా కొంచెం మంట ఉంది. కాగితాన్నే కాక, సాక్నుస్సేం పుస్తకాన్ని కూడా అందుకున్నాను. క్షుద్రమైన, ప్రమాదకరమైన ఆ రహస్యాన్ని నిప్పులోకి విసరబోతుంటే, తటాలున ముందు తలుపు తెరుచుకుంది. దేవుళ్ళా మా మామయ్య గదిలో సాక్షత్కరించాడు.
(అధ్యాయం 4 సమాప్తం)
0 comments