"ఈ రెండు చేతి వ్రాతలూ ఒకటి కావు,"అన్నాడు. "కాగితం మీది రాత పుస్తకంలో రాత కన్నా చాలా కాలం తరువాత రాసింది. ఈ విషయాన్ని ఒక్క క్షణంలో నిరూపించొచ్చు.
వాక్యం ఆరంభంలోనే రెండు "m" లు ఉన్నాయి. ఇలాంటి అక్షరం టరెల్సన్ పుస్తకంలో లేదు. అలాంటి అక్షరం పద్నాల్గవ శతాబ్దంలో వచ్చింది.
అంటే పుస్తకానికి, కాగితానికి మధ్య రెండు వందల ఏళ్ల వారడి ఉందన్నమాట."
ఏ తర్కం ఏదో నాకు బానే ఉన్నట్టు అనిపించింది.
"కనుక నాకు ఏమనిపిస్తోంది అంటే," మామయ్య ఇంకా చెప్పుకుపోయాడు,"ఈ పుస్తకం గల వాళ్లు ఎవరో ఈ విచిత్రమైన అక్షరాలు రాసి ఉంటారు. ఈ పుస్తకం ఇంతకీ ఎవరిదై ఉంటుంది?"
మామయ్య తన కళ్లజోడుని పక్కన బెట్టి, ఓ పెద్ద భూతద్దాన్ని తీసుకుని, పుస్తకంలోని ఖాళీ పేజీలని శ్రద్ధగా పరిశీలించ సాగాడు.
రెండవ పేజీ మీద, అంటే టైటిల్ పేజీకి ముందు, ఏదో మరకలా ఉంది. ఇంకు పడి ఏర్పడ్డ మరకలా ఉంది. ఆ మరకని శ్రద్ధగా పరీక్షించి అందులో సగం చెరిగిపోయిన అక్షరాలేవో కనిపెట్టగలిగాడు మామయ్య. తన భూతద్దంతో మరి కాసేపు పరిశీలించి, ఆ మరకలో ఉన్న రూనిక్ అక్షరాలని సునాయాసంగా చదవగలిగాడు -
"ఆర్నే సాక్నుసెం" అంటూ ఉత్సాహంగా అరిచాడు. "ఇతగాడు కూడా ఐస్లాండ్ కి చెందినవాడే. పదహారవ శతాబ్దానికి చెందిన పండితుడు. గొప్ప పేరున్న పరుసవేది కూడా."
విస్మయంతో మా మామయ్య కేసి చూశాను.
"అవిసీనియా, బేకన్, లల్లీ, పారాసెల్సస్ - పరుసవేదంలో ఆ రోజుల్లో వీళ్లని మించిన ఘనులు లేరు. వాళ్లు కనుక్కున్న సత్యాలకి లోకం ముక్కున వేలేసుకునేది. ఈ సాక్నుస్సేం కూడా ఈ గూఢ లిపిలో ఏదో ఆవిష్కరణ రహస్యాన్ని దాచాడేమో? అంతే అయ్యుంటుంది, నిశ్చయంగా అంతే అయ్యుంటుంది."
ఇక ప్రొఫెసర్ ఊహలకి పట్టపగ్గాల్లేవు.
"నిజమే గాని, అంత ముఖ్యమైన ఆవిష్కరణని అలా ఎందుకు దాచి ఉంటాడు అంటారు?" అమాయకంగా అడిగాను.
"ఎందుకా? ఎందుకో నాకు మాత్రం ఏం తెలుసు? సాటర్న్ గ్రహం విషయం లో గెలీలియో చేసింది కూడా అంతే కదా? ఎలాగైనా ఈ కాగితంలోని రహస్యం ఏంటో తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకునేంత వరకు నేను నిద్రపోను."
అంత కఠోరమైన ప్రతిజ్ఞకి పర్యవసానాలు ఏంటో బాగా తెలిసినవాణ్ణి కనుక "ఓహ్!" అని ఊరుకున్నాను.
"ఆ నియమం నీకూ వర్తిస్తుంది, ఏక్సెల్!" అని తీర్మానించాడు. భయపడినంతా అయ్యింది.
"ఇవాళ రెండు సార్లు భోజనం చెయ్యడం మంచిది అయ్యింది," నా అదృష్టానికి నాలో నేనే సంతోషించాను.
"ముందుగా ఈ గూడలిపికి పరిష్కారం ఏంటో కనుక్కోవాలి. అదంత కష్టం కాకూడదు."
నేను ఉలిక్కిపడి తలెత్తి చూశాను. మామయ్య ఏకపాత్రాభినయం నిరాఘాటంగా కొనసాగుతోంది.
"ఏం లేదు చాలా సులభం. ఈ కాగితంలో నూట ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి. అంటే డెబ్బై ఏడు హల్లులు, యాభై ఐదు అచ్చులు. సాధారణంగా దక్షిణాదికి చెందిన భాషల్లో అచ్చు, హల్లుల నిష్పత్తి ఇలాగే ఉంటుంది. ఉత్తరాది భాషల్లో హల్లులు మరి కాస్త ఎక్కువ ఉంటాయి. కనుక ఇది కచ్చితంగా దక్షిణాది భాషే."
ఇదేదో బాగానే ఉందని అనిపించింది.
"కాని ఇంతకీ ఇది ఏం భాష?"
సమాధానం సిద్ధంగా ఊడిపడుతుందని అనుకున్నాను. కాని భారమైన విశ్లేషణే నాకు దక్కింది.
"ఈ సాక్నుస్సేం బాగా చదువుకున్న వాడు. తన మాతృభాషలో రాయటం లేదు కనుక పదహారవ శతాబ్దంలో మహామహులు అంతా వాడే భాషనే వాడి ఉంటాడు. నా ఉద్దేశంలో అది లాటిన్ భాష. నేను పొరబడి ఉండొచ్చు. స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, గ్రీక్, హీబ్రూ భాషలు కూడా కావచ్చు. కాని పదహారవ శతాబ్దంలో పండితులు సామాన్యంగా లాటిన్లో రాసేవారు. కనుక ఇది లాటినే అని నా నమ్మకం. ఇది కచ్చితంగా లాటినే."
నేను కుర్చీ లోంచి రెండు అంగుళాలు ఎగిరి పడ్డాను. వర్జిల్ కవి వాడిన తీయని భాషకి, ఈ వికృతమైన గూఢ సందేశానికి మధ్య సంబంధం ఉందని ఆలోచిస్తేనే కంపరంగా ఉంది.
"అవును ఇది లాటినే," వివరిస్తూ వచ్చాడు మామయ్య. "కాని క్రమం తప్పిన లాటిన్. యూక్లిడ్ చెప్పినట్టు, పెర్ట్యుబాటా స్యూ ఇనోర్డినాటా, అన్నమాట."
"సంతోషం. కాని ఆ తప్పిన క్రమాన్ని సరిచేయ గలిగిన నాడు నువ్వు తెలివైన వాడివని ఒప్పుకుంటాను మావయ్యా," మనసులోనే అనుకున్నాను.
మీరు వీతికి లబెల్స్ ఇచ్చినట్లయితే పాఠకులు సులభంగా చదువుకోగలరు.
sorry first I couldnt find labels
సుబ్రహ్మణ్య ఛైతన్య గారు, మీ కామెంటు చదివిన తర్వాతనే, నేను మర్చిపోయిన టపాలకు లేబుల్స్ జత పరిచాను. ధన్యవాదములు.