శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.




బ్లాగర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ సందర్భంలో ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకోదగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త గురించి ధారావాహిక శీర్షికని మొదలుపెడుతున్నాం. ఆధునిక భారత విజ్ఞానం చాలా మటుకు పాశ్చాత్యులు వేసిన బటలలోనే నడవడం కనిపిస్తుంది. ఎక్కడైనా గొప్ప సామర్థ్యం, ప్రతిభ కనిపించినా అది పాశ్చాత్య ప్రమాణాలలోనే ఇమిడి ఉంటోంది. భారతీయ విజ్ఞానానికి దానికంటూ ఒక ప్రత్యేక పంథా లేదా? పాశ్చాత్య మేధావులు నేర్పిన పాఠాలని బుద్ధిగా వల్లెవేయడంతోనే మన ప్రతిభ ఆగిపోతుందా?

ఈ ప్రశ్నకి “లేదు” అని ధైర్యంగా సమాధానం చెప్పిన ఓ ధీరుడు, ధీమంతుడు ఆధునిక భారత ప్రథమ శాస్త్రవేత్త కావడం కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. అతడే జగదీశ్ చంద్ర బోస్. ఇంచుమించు శతాబ్ద కాలం క్రితం, పరాయి పాలనలో దేశం నలిగిపోతున్న కాలంలో, పెద్దగా వసతులు కూడా లేని పరిస్థితిలో, మార్కోనీ కన్నా ముందే తంతిరహిత (wireless) విద్యుదయస్కాంత ప్రసారాన్ని కనిపెట్టిన ఘనుడు. అయితే ఆ ఘనత అతడికే చెందుతుని పాశ్చాత్య లోకం ఒప్పుకోడానికి మరో శతాబ్దకాలం పట్టింది. అది వేరే విషయం.

బోస్ ఆవిష్కరణల గురించి మామూలుగా చెప్పుకునేటప్పుడు, మొక్కల్లోజీవం ఉందని కనుక్కున్నాడని చెప్తుంటారు. ఇది పూర్తిగా సరి కాదు. మొక్కల్లో జీవం ఉందంటే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండరు. బోస్ కనుక్కున్నది అది కాదు. మొక్కల్లో కూడా జంతువులలో ఉండే నాడీ మండలం లాంటిది ఉందని, దానికీ ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం ఉందని, జంతు నాడీమండల ప్రతిస్పందనలకి, మొక్కల్లో ఈ కొత్త “నాడీమండల” ప్రతిస్పందనలకి ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయని, వందలాది, అత్యంత నిశితమైన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. భారతీయ శాస్త్రవేత్తల ప్రయోగాలలో సునిశితత్వం కొరవడుతుంది అని ఒక అపవాదు ఉండేది ఆ రోజుల్లో. దాన్ని వమ్ము చేస్తున్నట్టుగా ఆ రోజుల్లో లభ్యమైన సాంకేతిక నైపుణ్యాన్ని అంచుల వరకు తీసుకువెళ్లి ప్రయోగాత్మక పద్ధతికి పరాకాష్టని చేరుకున్నాడు. అసలు ఆ మహానుభావుడు ఆ కాలంలో తప్పబుట్టాడు అనిపిస్తుంది.

మామూలుగా శాస్త్ర, సాహిత్య, కళా రంగాల్లో ఎవరైనా ఏదైనా సృష్టించినప్పుడు ముందే ఉన్న ఒక సాంప్రదాయాన్ని ఆసరాగా చేసుకుని సృజన జరుపుతారు. అంతేకాని ఏ ఆధరమూ లేకుండా గాల్లోంచి వాళ్ల సృజన ఊడిపడదు. ’మహామహుల భుజస్కంధాల మీద నించుని ఇంకా దూరం చూడగలిగాను’ అన్నాడు న్యూటన్ అంతడివాడు. కాని బోస్ విషయంలో, తను చేపట్టిన రంగంలో తనకి పూర్వులైన అలాంటి మహామహులు ఎవరూ పెద్దగా ఉన్నట్టు లేరు. పైగా పాశ్చాత్యలోకంలో ఉంటూ, ఆ వైజ్ఞానిక సాంప్రదాయంలో భాగంగా ఉంటూ అవన్నీ చేసినా అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని అప్పటి ఇండియాలో ఉంటూ ఇవన్నీ చెయ్యడం ఒక మనిషికి ఎలా సాధ్యం.... ఆలోచిస్తుంటే నమ్మబుద్ధి కాదు.

జంతువులలో అయినా, మనిషిలో అయినా అసలు నాడీమండలంలో వ్యవహారాలన్నీ విద్యుత్ సంబంధమైన చర్యలు అన్న విషయం పాశ్చాత్య లోకంలో కేవలం రెండు శతాబ్దాల క్రితమే (లూయుగీ గాల్వానీ కప్ప కండరం మీద చేసిన ప్రయోగాల ద్వారా) తెలిసింది. కాని మొక్కలలోనూ అలాంటి నాడీమండలం ఉంటుందని ఎందుకో పాశ్చాత్య మానసం అంత సులభంగా ఒప్పుకోలేకపోయింది. కాని మనుషుల్లోను, జంతువుల్లోను మాత్రమే కాక, మొక్కల్లోను, రాళ్లు రప్పల్లోను, ఏదో అనిర్వచనీయమైన దివ్యతత్వం సమానంగా ఆవరించి ఉంటుందని చాటి చెప్పే భారతీయ తత్వచింతనా సాంప్రదాయంలో పుట్టి పెరిగినవారికి అలాంటి సమైక్య దృష్టి పెద్ద కష్టం కాదు. ఒక జంతు కండరంలోను, మొక్కలోను, లోహంలోను ఒకే విధమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తను కనుక్కున్న ఫలితాలని ఒక పాశ్చాత్య సదస్సులో బోస్ ప్రదర్శిస్తే, అక్కడి వారు అవాక్కయ్యారు. ప్రకృతిలో అన్ని విభిన్న స్థాయిలలో అలాంటి ఏకత్వం ఎలా సాధ్యం?

బోస్ చేసిన అసమాన కృషిని మన దేశంలో కొనసాగించిన వారు పెద్దగా ఎవరూ లేరనే చెప్పాలి. పాశ్చాత్య లోకంలో కూడా అడపదపా ఆ దిశలో ప్రయోగాలు జరిగినా మొత్తం మీద గత ఒకటి రెండు దశాబ్దాల వరకు కూడా ఆ రంగం పెద్దగా పుంజుకోలేదు. జీవక్రియలలో విద్యుత్ చలనాల గురించిన రంగాన్ని electrophysiology అంటారు. దాన్ని జంతువులకి వర్తింపజేస్తే animal electrophysiology అంటారు. కాని plant electrophysiology కి బోస్ శతాబ్దకాలం క్రితమే పునాదులు వేసినా, ఆ మాట ఇప్పుడిప్పుడే పాశ్చాత్య వైజ్ఞానిక సాహిత్యంలో కనిపిస్తోంది. కాని అక్కడ ఎక్కడా బోస్ మాట వినిపించదు. అంతా కొత్తగా వాళ్లే కనుక్కున్నట్టు నేచర్, సైన్స్ మొదలైన ప్రఖ్యాత పత్రికల్లో పేపర్లు ప్రచురిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రంగంలో మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి కృషీ జరగడంలేదు. పాశ్చాత్య వైజ్ఞానిక లోకంలో ఏదైతే ఫ్యాషనో, దాని మీదే ఇక్కడ పనిచెయ్యడం మన వైజ్ఞానిక వ్యవస్థలో ఒక రివాజు! బోస్ కృషి ఒక విధంగా నభూతో నభవిష్యతి గా మిగిలపోవడం ఒక విధంగా గర్వకారణమే అయినా, మరోలా చూస్తే విచారం కలిగిస్తుంది.

ఈ పరిచయంతో బోస్ విజయాల గురించి వరుసగా కొన్ని పోస్ట్ లలో చర్చించుకుందాం...

“తేలే అద్దం” ని ఎలా కనుక్కున్నారు?


పరోపకారం చేస్తే దేవుడు మేలు చేస్తాడంటారు. బ్రిటిష్ ఇంజినీరు అలిస్టేర్ పిల్కింగ్టన్ విషయంలో అదే జరిగింది.

1952 లో ఓ రోజు పిల్కింగ్టన్ కి ఎందుకో పాపం భార్యకి వంటగదిలో పనిలో సాయం చెయ్యాలని అనిపించింది. చొక్కా చేతులు పైకి లాక్కుని సింకు వద్ద పాత్రలు తోమడానికి సిద్ధపడ్డాడు. సింకులో సబ్బు నీళ్లలో గిన్నెలు మునిగి ఉన్నాయి. నీటి మీద నురగ బుడగలు తేలుతూ, పేలుతూ ఆటలాడుతున్నాయి. పనిలో చిన్న బ్రేక్ తిసుకుని ఆ నురగ లాస్యం కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు పిల్కింగ్టన్. మెరుపులా తన మనసులో ఓ ఆలోచన మెరిసింది.

పిల్కింగ్టన్ బ్రదర్స్ అనే గాజు తయారు చేసే ఓ కంపెనీలో పని చేసేవాడు పిల్కింగ్టన్. (పేరు ఒక్కటే గాని కంపెనీ యాజమాన్యం వాళ్లు ఇతడికి చుట్టాలు కారు!) ఆ రోజు తనకి వచ్చిన ఉపాయం గాజు తయారీలో చిన్న విప్లవాన్నే సృష్టించింది. (అయితే ఆ విప్లవం వర్ధిల్లే లోపు వాళ్ల కంపెనీ దివాలా తీసినంత పనయ్యింది. అది వేరే సంగతి!)

ఆ రోజుల్లో గాజు తయారీలో రెండు పద్ధతులు ఉండేవి. ఒక పద్ధతిలో కరిగించిన గాజు ముద్దని సాగదీసి పలకల్లాగా చేసేవారు. ఇది చాలా చవకైన పద్ధతి. పని కూడా వేగంగా జరుగుతుంది. కిటికీల్లో వాడే అద్దాల్లో చాలా మటుకు ఈ పద్ధతిలోనే చేస్తారు. కాని అలా సాగదీసి చేసిన అద్దాల మందం సమంగా ఉండదు. మందంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే అద్దం వెనుక ఉన్న దృశ్యం అక్కడక్కడ వికారంగా కనిపిస్తుంది. పాతకాలపు ఇళ్లలో కిటికీల్లో వాడే అద్దాలు ఇలాగే ఉంటాయి.

ఇక రెండో పద్ధతిలో ముందే పలకలా ఉన్న అద్దాన్ని సన్నని ఇసుకతో రుద్ది రుద్ది కచ్చితంగా సమతలంలో ఉండేట్టు చేస్తారు. అయితే ఇది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఇలాంటి అద్దంలో నాణ్యత ఉన్నా, పెద్ద పెద్ద షాపుల ముందు ఉండే అద్దంగా వాడడానికి తప్ప సామాన్యుల ఇళ్లలో వాడడానికి పనికిరావు.

పూర్తిగా సమమైన ఉపరితలం గల అద్దాలని తయారుచేసే విషయంలో పిల్కింగ్టన్ కి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. నిశ్చలంగా ఉన్న ద్రవం యొక్క ఉపరితలం ఎప్పుడూ సమంగా ఉంటుంది. సింకులో నీటిని చూస్తున్నప్పుడు తనకి స్ఫురించిన విషయం అదే. పిల్కింగ్టన్ ఊహించిన పద్ధతిలో కరిగించిన తగరపు ద్రవం మీద కరిగించిన గాజు ద్రవాన్ని పోస్తారు. అందుకే దీన్ని “తేలే అద్దం” పద్ధతి అంటారు. కరిగించిన తగరపు ఉపరితలం మీద గాజు ద్రవం నెమ్మదిగా కదులుతూ 1800 F నుంచి 1100 F వరకు చల్లారుతుంది. ఇప్పటికే గాజు గట్టిపడటంతో, దాని ఉపరితలం దెబ్బ తినకుండా దాన్ని బయటికి తిసేయొచ్చు. దీని వల్ల పూర్తిగా చదునుగా, కాస్త కూడా సొట్టలు లేని అద్దం తయారవుతుంది. ఇప్పుడిక ఖరీదైన రుద్దుడు కార్యక్రమాలు అవసరం లేదు,
(చిత్రంలో పైన ఎడమ మూలకి ఉన్న అద్దం తేలే అద్దం పద్ధతిలో చెయ్యబడింది. అంచులో చెట్టు ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. తక్కినవన్నీ సాంప్రదాయక పద్ధతిలో చెయ్యబడినవి. వాటిలో చెట్టు ప్రతిబింబం విరూపం అవుతోంది.)

పిల్కింగ్టన్ పద్ధతిలో ప్రథమ పరీక్షలు 1952 లోనే జరిగినా, పారిశ్రామిక స్థాయిలో అలాంటి అద్దాన్ని ఉత్పత్తి చెయ్యడానికి మరో ఏడేళ్ల నిర్విరామ కృషి అవసరం అయ్యింది. అప్పటికే ఆ కంపెనీ దాని మీద 7 మిలియన్ పౌన్లు ఖర్చుపెట్టింది. అదృష్టవశాత్తు పడ్డ శ్రమకి పుర్తి ఫలితం దక్కింది. ఈ రోజుల్లో పలక రూపంలో ఉండే గాజుకి సంబంధించి గ్లోబల్ మర్కెట్ లో ఈ తేలే అద్దం వంతు 90 % ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పద్ధతిని ఉపయోగించి వందలాది పరిశ్రమలలో ఏటా ఒక మిలియన్ ఎకరాల అద్దం నిర్మితమవుతోంది.

References:
1. Alex Hutchinson, Big Ideas: 100 modern inventions that have transformed our world, Hearst Books.
2. http://en.wikipedia.org/wiki/File:Windowfloatnofloat.jpg

మంద ప్రవృత్తి – చివరి భాగం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 29, 2009 0 comments



సింహాలు, హైనాలు, వేటకుక్కలు మొదలైన జంతువులు గుంపులుగా వేటాడతాయి. ఒక రకం వేటకుక్కలు (Cape hunting dogs) వంతులవారీగా, వ్యూహాత్మకంగా జింకలని వెంటాడి, ఆ జింకలు అలసిపోయి ఇక కదలలేని పరిస్థితికి చేరుకున్న దాకా తీసుకువెళ్తాయి. హైనాల దండులు వేటాడబోయే జంతువుని బట్టి వాటి దండు యొక్క పరిమాణాన్ని మార్చుకుంటూ ఉంటాయి. క్రూక్ అనే శాస్త్రవేత్త బృందం చేసిన అధ్యయనాల బట్టి జీబ్రాలని వేటాడే హైనాల గుంపుల్లో సగటున 10.8 హైనాలు, దున్నలని వెంటాడే గుంపుల్లో సగటున 2.5 హైనాలు, లేళ్లని వెంటాడే గుంపుల్లో సగటున 1.2 హైనాలు మాత్రమే ఉంటాయని తేలింది. అందుకే ఎక్కడైనా ఒంటరి హైనా కనిపిస్తే జీబ్రాలు లక్ష్యపెట్టవు గాని దండు కనిపించగానే దౌడు అందుకుంటాయి.

అయితే జంతువులు కలిసి వేటాడుతున్నంత మాత్రాన, పరస్పర సహకారంతో పనిచేస్తున్నట్టు కాదు. సింహాల విషయంలో అదే జరుగుతుంది అంటాడు పాకర్ అనే శాస్త్రవేత్త. వేటాడుతున్న ప్రయత్నంలో సింహాలు పెద్దగా ఒకరితో ఒకరు సహకరిస్తున్నట్టు కనిపించదు. కాని వేట ముగిశాక హత జంతువు కళేబరాన్ని సంరక్షించడానికి పలు సింహాలు కావాలి. చంపిన సింహం ఒక్కటే అయినా, విందులో పాల్గొంటున్న సింహాలెన్నో. అయితే ఆ కాస్త ఆతిథ్యం ఇచ్చిన పుణ్యానికి, రాబందులు, హైనాలు మొదలైన ’బయటి వాళ్ల’తో సింహాలు తమ కష్టఫలాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదన్న సంతృప్తి చంపిన సింహానికి మిగులుతుంది.

ఇంతవరకు చూసిన ఉదాహరణలని బట్టి బృంద జీవనం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని స్పష్టం అవుతుంది. కాని మందలో బతకడం వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేవు. మందలో ఉంటే ఆహారం కోసం పోటీ ఉంటుంది. ఒంటరి జీవం కన్నా మంద అయితే శత్రు జంతువుకి స్ఫుటంగా కనిపిస్తుంది. మందల్లో వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. స్త్రీ పురుష జీవాల మధ్య సంగమ సంబంధాలు మరింత సంక్లిష్టం అవుతాయి, సంకీర్ణం అవుతాయి. ఎదిగిన జీవాలు పసి కూనలని పొట్టన పెట్టుకునే అవాంఛనీయ ధోరణులు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే మరి మందలో జీవించడం తెలివైన పనేనా అన్న ప్రశ్న పుట్టక మానదు. మందలో జీవించడం వల్ల క్షేమం, సంక్షేమం వంటి ప్రాథమిక అవసరాలు మాత్రం తప్పక తీరుతాయి. జంతు జీవన ప్రాధాన్యతల దృష్ట్యా ఆ లాభాల ముందు నష్టాలు అంత ప్రధానంగా కనిపించకపోవచ్చు.

జీవ రాశుల అస్తిత్వానికి అతి ముఖ్యమైన లక్ష్యం ప్రాణాలు నిలుపుకోవడం. తమ జాతి, ఆ జాతికి చెందిన జన్యువులు, చిరకాలం నిలిచేట్టుగా ఆ జాతికి చెందిన జంతువులు నిరంతరం తమ ప్రవర్తనని సరిదిద్దుకుంటూ ఉంటాయి. ఎలాంటి ప్రవర్తన అయితే ప్రకృతిబద్ధమైన ఎంపిక (natural selection) కి తట్టుకుని, తమ ప్రాణాలు నిలుపుకోవడానికి దొహదం చేస్తుందో అలాంటి ప్రవర్తననే జీవాలు అలవరచుకుంటాయి. మందలుగా జీవించడం, ఒక ప్రాంతాన్ని ఆక్రమించి ఆ ప్రాంతంపై తమ గుంపు యొక్క హక్కుని స్థాపించడానికి తాపత్రయపడడం, - మొదలైనవన్నీ ఆ లక్ష్యం దిక్కుగా జంతుజాతులని తీసుకుపోయే కొన్ని వ్యూహాలు మాత్రమే. ఇవే సమస్యలు, ఇవే పరిష్కారాలు, ఇవే పర్యవసానాలు, ఇవే ధోరణులు మరి మానవ జాతిలో కూడా కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. మన చరిత్ర నుంచే కాక, జంతు లోకపు కథల నుండి కూడా మనం తగినన్ని పాఠాలు నేర్చుకుంటే, భూమి మీద అస్తిత్వం కోసం ఈ నిరంతర పోటీ, వీలైనంత తక్కువ సంఘర్షణతో, సాఫీగా, సామరస్యంగా సాగిపోయే అవకాశం ఉంటుంది.

Reference:
Manning, M.S. Dawkins, “An introduction to Animal Behavior,” Cambridge university press, fifth edition. 1998.
Images courtesy:
http://www.inficad.com/~vmoore
https://www.msu.edu/~holekamp/images/crocuta/HyenaFeedingFrenzy_Engh_smaller.jpg

కలసి ఉంటే కలదు బలము

Posted by V Srinivasa Chakravarthy Monday, December 28, 2009 1 comments






కేవలం హెచ్చరికతో ఆగిపోకుండా కొన్నిసార్లు కొన్ని జంతువుల మందలు వ్యూహాత్మకంగా ఆత్మరక్షణ చేసుకోగలవు.

కస్తూరి ఎద్దు (?) (musk ox) ఉత్తర అమెరికాలో అలాస్కా, కెనడా మొదలైన అతిశీతల ప్రాంతాలకి చెందిన టండ్రా బయళ్లలో జీవిస్తుంది. వత్తయిన బొచ్చు గలది కనుక తీవ్రమైన చలికి తట్టుకోగలదు. దీని కళ్ల కింద ఉండే గ్రంధుల నుండి ఒక విధమైన పరిమళం వెలువడుతుంటుంది. అందుకే వాటికా పేరు... అవి ధృఢమైన శరీరం కలిగి, దట్టమైన కొమ్ములు గల బలిష్టమైన జీవాలు. శత్రువు వీటిని అటకాయించినప్పుడు ఇవి తమ సంతతిని కాపాడుకోడానికి వృత్తాకారంలో తలలు బయటికి వచ్చేలా నించుంటాయి (చిత్రం). అలా తలలు కిందికి వంచి, కొమ్ములు బయటికి
పొడుచుకు వచ్చేలా నించుంటే ఇక వాటిని సమీపించగల జంతువే ఉండదు. కాని దురదృష్టవశాత్తు ఏ విధానం అయితే తోటి జంతువుల నుండి ఆత్మరక్షణ నిస్తుందో, తుపాకీలతో దాడులు చేసే వేటగాళ్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోయేలా చేస్తుంది. అలా దగ్గర దగ్గరగా గుంపుగా ఏర్పడ్డ జంతు సమూహం మీద తూటాలు కురిపిస్తే ఆ జంతువులు మట్టి కరవడం ఖాయం. అయినా మనిషి కన్నా క్రూర మృగం లేదని జంతు లోకానికి బాగా తెలిసిన విషయమే!

కొన్ని పక్షి జాతుల్లో కూడా ఇలాంటి సామూహిక ఆత్మరక్షణా వ్యూహాలు కనిపిస్తాయి. స్టార్లింగ్ అనబడే పక్షులకి నల్లని శరీరం మీద మెరిసే తెల్లని చుక్కలు ఉంటాయి. పళ్లు, పురుగులు తిని బతుకుతాయి. ఎక్కువగా విశాల బహిరంగంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటికి బలమైన కాళ్లు ఉంటాయి. గాల్లో సూటిగా శరంలా దూసుకుపోయే గమనం ఉంటుంది. ఏ నక్కలాంటి శత్రు జంతువో అటకాయిస్తే, పక్షులన్నీ ఒక్కసారిగా ఊకుమ్మడిగా దాని మీద పడతాయి. వాడి గోళ్లతో శత్రువుని రక్కేస్తాయి. ఒంటరి పక్షి నక్క బారిన పడితే అంతే! కాని అవి గుంపుగా ఏర్పడినప్పుడు శత్రువు నిర్వీర్యం అవుతుంది. అందుకే క్రూర మృగాలు మందలని అటకాయించేటప్పుడు నేరుగా మందలోకి దూసుకుపోవు. మందని రాసుకుపోతున్నట్టుగా పక్కల వెంట దాడి చేసి మందని చెల్లాచెదురు చెయ్యడానికి ప్రయత్నిస్తాయి. మంద విచ్ఛిన్నం అయితే, బలం తగ్గిపోతుంది. శత్రువు విజయావకాశాలు పెరుగుతాయి.




మంద వల్ల ఆహార వినియోగంలో, సేకరణలో లాభాలు

వేరు వేరు వ్యక్తుల్లా కాక ఒక బృందంలా, వ్యూహాత్మకంగా ఆహారం కోసం అన్వేషిస్తే ఆహార వనరుల వినియోగం కూడా మరింత మెరుగ్గా ఉంటుంది. తెరిపి లేకుండా కిచకిచలాడుతూ, తుళ్లుతూ, గెంతుతూ పిడికెడు బంగారంలా ముద్దొచ్చే ’టిట్’ అనబడే పక్షి జాతిలో ఆహార వినియోగంలో చక్కని వ్యూహాత్మకత కనిపిస్తుంది. ఒక పక్షి ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆహారాన్ని కనుక్కున్నదంటే, వెంటనే మరిన్ని పక్షులు ఆ ప్రాంతానికి వచ్చి, వాటి అన్వేషణని ఆ ప్రాంతం మీదే కేంద్రీకరిస్తాయి. అందువల్ల ఆహారం మొదట కనుక్కున్న పక్షికి నష్టం జరిగినట్టు కనిపిస్తుంది గాని, మందలో భాగంగా ఉన్న పక్షికి, భవిష్యత్తులో ఇతర పక్షులు కనుక్కున్న ఆహార వనరులలో వంతు పొందే అవకాశం ఉంటుంది.
కొన్ని సార్లు కనుక్కున్న ఆహార వనరులు పుష్కలంగా ఉండొచ్చు. అలంటి పరిస్థితిలో ఆహారాన్ని మొదట కనుక్కున్న పక్షికి నష్టం జరిగే ప్రసక్తి ఉండదు. పైపెచ్చు కొన్ని సందర్భాలలో మొదట ఆహారాన్ని కనుక్కున్న జీవానికి తోడుగా మరి కొన్ని జీవాలు ఉంటే ఇంకా మంచిది.

గానెట్ లు అనబడే పక్షులు తెల్లని దేహాలతో, నాజూకైన మెడలతో, కూసు ముక్కులతో మహా సొగసుగా ఉంటాయి. అవి చేపలని వేటాడుతున్నప్పుడు, గుంపుగా ఒక్కసరిగా నీటి మీదకి దండయాత్ర చేస్తాయి. ఆ ధాటికి చేపలకి ఎటు పోవాలో తెలీక తికమకపడి పక్షుల ముక్కుల్లో చిక్కుకుపోతాయి. నల్లని తలకాయలు గల గల్ పక్షుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. గుంపుగా వేటాడటం వల్ల ప్రతీ పక్షికీ మరింత ఆహారం దొరుకుతుంది.
(సశేషం...)


ఎంపరర్ పెంగ్విన్ జంటల అన్యోన్యత


అంటార్కిటికాలో జీవించే ఎంపరర్ పెంగ్విన్లు అనే జాతి పెంగ్విన్ల జంటలలో అద్భుతమైన అన్యోన్యత కనిపిస్తుంది. వాటి సంతతనికి సాకడంలో అవి చూపించే త్యాగనిరతి చూస్తే జంతు లోకం మీద గౌరవం పెరుగుతుంది.


ఎంపరర్ పెంగ్విన్లు మామూలు పెంగ్విన్ల కన్నా బాగా పెద్దవి. వీటి ఎత్తు 120 cm ఉంటుంది. బరువు సుమారు 34 kg ఉంటుంది. ఎంపరర్ పెంగ్విన్ల నివాస విధానాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద గుంపులుగా పోగై గుడ్లు పెడతాయి. ఈ సమిష్టి నివాసాలనే రూకరీలు అంటారు. అలాంటివి మొత్తం 14 రూకరీలు ఉన్నట్టు సమచారం. ఒక్కో రూకరీలో ఇంచుమించు 11,000 పెంగ్విన్లు ఉంటాయి.

ఈ రూకరీలు తీరానికి 80-120 కిమీల దూరంలో ఉంటాయి. చేపలు తిని బతుకుతాయి కాబట్టి ఎంపరర్ పెంగ్విన్లు ఆహారం కోసం తీరం వద్దకి రావాలి. కాని గుడ్లు పెట్టడానికి రూకరీల వద్దకి నడుచుకు పోవాలి. అక్కడికి నడవడానికి నెల రోజులు పడుతుంది.

ఒకసారి నడక మొదలుపెట్టాక ఇక ఆహారం దొరకదు. కాబట్టి ఓ నెల రోజుల పాటు పస్తు తప్పదు అన్నమాట.
శీతాకాలంలో రూకరీ చేరగానే ఆడ పెంగ్విన్ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు గూట్లో పెట్టదు. ఆ గుడ్డుని మగ పెంగ్విన్ తీసుకుని తన ఒడిలో దాచుకుంటుంది. ఈకలు లేకుండా, వేలాడుతూ ఉండే ఓ చర్మపు పొరలో కప్పి ఆ గుడ్డుని మగ పక్షి వెచ్చగా ఉంచుతుంది.

గుడ్డు పెట్టేశాక ఆడ పెంగ్విన్ తిరిగి సముద్రానికి వెళ్లిపోతుంది. అంటే ఆహారం లేకుండా మరో నెల రోజులు కఠిన ప్రయాణం.

మగ పెంగ్విన్ రూకరీలోనే ఓ రెండు నెలలు ఉండి అంటార్కిటిక్ శీతాకాలంలో గుడ్డుని వెచ్చగా కాపాడుతుంది. రూకరీకివ్ వచ్చే ముందు మగ పెంగ్విన్వంట్లో బాగా కొవ్వు పట్టించుకుంటుంది. ఆ కొవ్వుని ఇప్పుడు వాడుకుంటుంది.
వేలాది మగ పెంగ్విన్లు దగ్గర దగ్గరగా వొదిగి నించుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత -60 C కి పడిపోతుంటే అతి చల్లని మంచు గాలులు గంటకి 144 కిమీల వేగంతో వీస్తూ వంటిని కోస్తుంటే, ఒక్కొక్క మగ పెంగ్విన్ ఒక్కొక్క గుడ్డుని జాగ్రత్తగా పొదివి పట్టుకుని కాపాడుతుంటుంది. గుంపు కేంద్రంలో ఉన్న పెంగ్విన్లు కొంచెం వెచ్చగా ఉంటాయి. గుంపు అంచుకి ఉన్న పెంగ్విన్లు గుంపు మధ్యలో దూరడానికి తహతహలాడుతుంటాయి. అలా గుంపు బయటికి లోపలికి జరుగుతూ ఎలాగోలా ఆ దారుణ శీతాకాలం అంతా నెమ్మదిగా వెళ్లబుచ్చుతాయి.

గుడ్లు పగిలి పిట్ట వచ్చే సమయానికి ఆడ పెంగ్విన్లు తిరిగి వచ్చేసి బిడ్డల బాధ్యత స్వీకరిస్తాయి. మగ పెంగ్విన్లకి అప్పుడు విమోచనం కలుగుతుంది. నాలుగు నెలల పస్తు తరువాత తీరం చేరే వేళ మళ్లీ వచ్చింది. ఆ పస్తుతో 25-40 శాతం బరువు కోల్పోతాయి.

గుడ్డు పగిలి పిట్ట బయటికి వచ్చాక తల్లి పెంగ్విన్ తన రెక్క మాటున ఉన్న ఆహారంతో దానిని పోషిస్తుంది. కాని పాపం తన రెక్క మాటున ఎంతని దాచుకుంటుంది? ఆహారం అయిపోగానే తిరిగి తీరానికి బయలుదేరుతుంది. ఇంతలో తండ్రి పెంగ్విన్ తీరం వద్ద నుండి తిరిగి వస్తుంది. ఆ విధంగా తల్లి పెంగ్విన్, తండ్రి పెంగ్విన్లు వంతులు తీసుకుంటూ తీరానికి, గూటికి మధ్య యాత్రలు చేస్తూ సంతతిని కంటికి రెప్పలా కాపాడతాయి.


References:


1. Isaac Asimov, How did we find out about Antarctica?

కలసి ఉంటే కలదు క్షేమము

Posted by V Srinivasa Chakravarthy Friday, December 25, 2009 2 comments




మందగా బతకడం వల్ల శత్రువుల నుంచి రక్షణ మరింత కట్టుదిట్టం అవుతుంది. మందలో ఉన్నప్పుడు ఒకరు కాకపోతే మరొకరు అప్రమత్తంగా ఉంటారు కనుక శత్రువు రాకని ఎవరో ఒకరు గుర్తించక మానరు. శత్రువుని ఒకరు గుర్తించగానే, రకరకాల కూతలతో, కేకలతో మంద మొత్తానికి ఆ వార్త ఇట్టే తెలిసిపోతుంది. మందలో అన్ని కళ్లు శత్రువు కోసం కనిపెట్టుకుని ఉంటాయి కనుక, సగటున మందలో ఉన్న జంతువు మరింత ఎక్కువగా, మరింత నిర్భయంగా మేయగలుగుతుంది.

ఈ సత్యాన్నే ఎర్రని ముక్కున్న వీవర్ పక్షులలో (red-billed weaverbird) లాజరస్ అనే శాస్త్రవేత్త గమనించాడు. గాల్లో ఎగురుతున్న డేగలని ఈ పక్షులు ఒంటరిగా ఉన్నసమయంలో, లేదా మందలో ఉన్న సమయంలో ఎలా గుర్తిస్తాయో ఇతగాడు గమనించాడు. ఒంటరిగా ఉన్న వీవర్ పక్షులు ఎన్నో సందర్భాలలో వస్తున్న డేగని గుర్తించలేకపోయాయట. అందుకు భిన్నంగా రెండు మూడు వీవర్ పక్షులు ఉన్న సన్నివేశంలో డేగని సులభంగా గుర్తించగలిగాయట..

ఇలాంటి సూత్రమే ఒక ప్రత్యేక కాకుల జాతి (Corvus corone) విషయంలో కూడా వర్తించడం కనిపించింది. గుంపు పెద్దదవుతున్న కొలది వాటి సామూహిక అప్రమత్తత పెరిగింది. కాని సహజ పరిస్థితులలో పక్షుల ప్రవర్తనని పరిశీలిస్తున్నప్పుడు, ఇలాంటి కచ్చితమైన నిర్ణయాలు చెయ్యడం కష్టం. ఎందుకంటే కచ్చితంగా సమానమైన పరిస్థితులలో క్రమంగా గుంపు యొక్క పరిమాణాన్ని పెంచుతూ, శత్రు జీవాన్ని ప్రవేశపెడుతూ, శత్రువు రాకని ఆ గుంపు ఎన్ని సార్లు గుర్తించగలిగిందో చూడాలి. గణాంకాల దృక్పథంతో అలాంటి పరిశీలనలని గమనించినప్పుడు, మన నిర్ణయాలు అర్థవంతమై ఉండాలంటే, చాలా పకడ్బందీగా పరిస్థితులని నియంత్రిస్తూ ప్రయోగాలు చెయ్యాలి. అలాంటి ప్రయోగాలు సహజ, బహిరంగ పరిస్థితుల్లో చెయ్యడం కష్టం.

కనుక ఆ విధంగా మరింత పకడ్బందీగా పరిస్థితులని నియంత్రిస్తూ, కొంచెం కృత్రిమమైన పరిస్థితులల్లో పొవెల్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు చేశాడు. ఈ సారి ఇందాకటి సూత్రాన్నే అతడు మరింత విశ్వసనీయంగా నిర్ధారించగలిగాడు. గుంపులో, లేదా మందలో ఉన్న ప్రాణికి మరింత రక్షణ ఉంటుంది, మరింత భక్షణ చేసే అవకాశం కూడా ఉంటుంది!

మంద వల్ల రక్షణ దొరుకుతుంది అన్నది నిజమే గాని, అక్కడ ఏవైనా ’మోసం’ జరుగుతుందా అన్న ప్రశ్న వస్తుంది. మానవ మందల్లో కూడా ఈ సమస్య ఎప్పుడూ వస్తుంది. మందలో భాగం కావడం వల్ల వచ్చే లాభాలు, ఆ మందలో ఉన్న అందరికీ సమానంగా దక్కుతాయా అన్న ప్రశ్న వస్తుంది. మానవ లోకంలో సామాన్యంగా ఆ లాభాలు సమానంగా అందరికీ సంక్రమించడం లేదన్న గుర్తింపు కారణంగా మందలు ఇంకా చిన్న మందలుగా విడిపోవడం, వేరే రాష్ట్రం కావాలనడం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి. (ఈ గొడవ పరలోక వాసుల్లోనూ ఉందని మనం కథలు చదివాం. రాక్షసులకి అమృతం అందలేదని ఎంత గొడవ జరిగిందనీ?) మరి పక్షుల గుంపుల్లో కూడా ఈ సమస్య వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.

ఒక గుంపులో ఉన్న పక్షులని తీసుకుందాం. కొన్ని పక్షులు తలెత్తకుండా శ్రద్ధగా తింటున్నాయి. మరి కొన్ని పక్షులు అప్పుడప్పుడు తెలెత్తి చూస్తూ శత్రువు రాకని కనిపెట్టుకుని ఉన్నాయి. మొదటి వర్గం పక్షులు మరి కాస్త, ప్రశాంతంగా, మరింత ఎక్కువ తినగలవన్నది స్వయం విదితం. శత్రువు వస్తే తలెత్తి చూస్తూ అప్రమత్తంగా ఉన్న పక్షులే ముందు కనిపెడతాయి. ఒక సారి ఒక పక్షి శత్రువుని చూసిందంటే దాని హెచ్చరిక గుంపులో ఉన్న పక్షులన్నిటికీ ఠక్కున అందిపోతుంది. కనుక మధ్య మధ్యలో తలెత్తి చూస్తున్న పక్షులు అనవసరంగా నష్టపోతున్నట్టు అనిపిస్తుంది. అవి నిజంగానే నష్టపోతున్నాయా, లేక మధ్య తలెత్తు చూస్తున్న పక్షులకి మరే విధంగానైనా నష్టపరిహారం దక్కుతోందా?

ఈ విషయాన్ని తేల్చుకోడానికి ఎడ్గార్ అనే శాస్త్రవేత్త, అతడి బృందం కొన్ని పిచుకల గుంపులని వీడియో తీశారు. ఇవి ఒక గుంపులో ఉండి తింటున్న సమయంలో అదాటున ఒక శత్రు వస్తువుని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ముందు తలెత్తి చూసిన పక్షులు ఇతర పక్షుల కన్నా ముందుగా అక్కణ్ణుంచి ఎగిరిపోగలగడం వీడియోలో కనిపించింది. తరువాత సామాన్యంగా గుంపుకి సరిహద్దు వద్ద నున్న పక్షులు అప్రమత్తంగా తప్పనిసరిగా ఉండాలి. గుంపుకి కేంద్రంలో ఉన్న పక్షులకి సహజంగా మరింత రక్షణ లభిస్తుంది. కనుక గుంపుకి సరిహద్దుకి దగ్గరిగా ఉన్న పక్షులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంటే వాటి సామాజిక బాధ్యతని కొంతవరకు భరించాలి. అలా చెయ్యకుండా తలెత్తకుండా మౌనంగా తినేస్తూ, సమాజాన్ని ’మోసం’ చెయ్యాలని చూస్తే, వాటికే ప్రమాదం. కనుక దేని స్వార్థం కోసం అది అన్నట్టుగా ప్రతీ పక్షి బతికినా, ఆ స్వార్థం వల్ల అనుకోకుండానే అవి ఒక సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నాయి. తమ కోసం చేసినా వాటి అప్రమత్తత అందరికీ ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ పక్షుల యొక్క ప్రవర్తనలో వ్యక్తి యొక్క లక్ష్యాలకి, సమిష్టి యొక్క లక్ష్యాలని మధ్య అద్భుతమైన సమతూనిక కనిపించి అబ్బురపాటు కలిగిస్తుంది. మానవ సమూహాలలో ఇలాంటి సమతూనిక తరచు అదృశ్యమై, ఎంతో ఘర్షణకి, సంక్షోభానికి దారితీయడం విచారం కలిగిస్తుంది.

అయితే ఇలాంటి ’సక్రమమైన స్వార్థం’ అనే పద్ధతి కూడా అన్ని జంతువుల ప్రవర్తనని వివరించలేదు. మీర్కాట్ (meerkat) లు అనబడే ఒక రకం ముంగీసలకి, నిస్వార్థమైన ప్రవర్తన సాధ్యమైనట్టు అనిపిస్తుంది. ఈ జాతి జీవాలలో పహరా కాసే బాధ్యతని గుంపులో కొన్ని ప్రత్యేక జీవాలు మాత్రమే నెత్తిన వేసుకుంటాయి. ఇవి అప్పుడప్పుడు, వంతుల వారీగా వెళ్లి ఒక ఎత్తైన ప్రదేశానికి (ఓ చెట్టునో, పుట్టనో, గట్టునో ఎక్కి) వెళ్లి శత్రు జీవాలేమైనా పొంచి ఉన్నాయేమో చూసి వస్తుంటాయి. ఇది నిజంగా నిస్వార్థమైన ప్రవర్తనే ఎందుకంటే పహరా కాసే సమయంలో ఇవి భుజించలేవు. కాని ఈ ముంగీసలు సామాజిక జీవాలు. అవి ఎప్పుడూ కొన్ని ప్రత్యేక, ఇతర ముంగీసలతో కలిసి సహజీవనం చేస్తాయి. ఆ గుంపులో ప్రతీ ముంగీసకి, ఇతర ముంగీసలు బాగా తెలిసి ఉంటాయి. పహరా కాసే ముంగీసకి ఆ సమాజంలో స్థాయి పెరగొచ్చు. లేదా కొంత కాలం ఒక ముంగీస అలాంటి సేవలు చేస్తే, ఆ విషయం గుర్తుపెట్టుకున్న మరి కొన్ని ముంగీసలు, మరో సమయంలో, పహరా కాసే బాధ్యతని తాము చేపట్టొచ్చు.

ఇంత అద్భుతమైన సామరస్యంతో కూడిన సామాజిక ప్రవృత్తి జంతువులలో సాధ్యం అని వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జంతులోకం నుండి మనిషి నేర్చుకోవాల్సినది ఇంకా ఎంతో నిశ్చయంగా ఉంది.

మందల వల్ల కేవలం శత్రువుల ఆగమనాన్ని గురించిన హెచ్చరిక లభించడమే కాదు. కొన్ని సార్లు ఆ ఆత్మరక్షణా కార్యక్రమం మరింత సక్రియమైన రూపాలని దాల్చవచ్చు. ఆ మంద శత్రువు మీద వ్యూహాత్మకంగా తిరగబడి ఎదురుదెబ్బ తీయొచ్చు...
(సశేషం)


చిత్రాల సౌజన్యం:
http://www.naturephoto-cz.com/red-billed-buffalo-weaver-:bubalornis-niger-photo-11211.html
http://blog.craftzine.com/meerkat.jpg




జంతువులు మందలుగా ఎందుకు ఏర్పడతాయి?

జంతువులేం ఖర్మ, మనుషులు కూడా వందలు వందలుగా మందలుగా ఏర్పడతారు – దేశం మంద, జాతి మంద, ప్రజాస్వామ్య మంద, రాష్ట్రం మంద, ఇక ఇటీవలి కాలంలో ఫ్యాషనై పోయిన ఉపరాష్ట్ర మంద, మతం మంద, కులం మండ... సారీ అప్పుతచ్చు... కులం మంద (ఇది మహా ప్రమాదకరమైనది)... మనుషులు, ఆంటే మనం, ఎందుకు మందలుగా ఏర్పడతామో మనకి తెలుసు... తెలుసు అనుకుంటాం. ఉదాహరణకి కులం మందగా ఏర్పడితే రాజకీయ బలం సంక్రమిస్తుంది. ఎన్నికల్లో టికట్టు దక్కుతుంది, వోట్లు దొరుకుతాయి... అలాగే మతం మందలకీ ఈ బాపతు లాభాలు ఎన్నో ఉన్నాయి. కాని మొత్తం మీద ఇలాంటి మంద ప్రవృత్తి వల్ల మొత్తం మానవ సమాజం యొక్క అనుభవాన్ని గమనిస్తే, దాని వల్ల సౌకర్యం కన్నా సంఘర్షణే ఎక్కువగా మిగులుతున్నట్టు కనిపిస్తుంది. అందరికీ కష్టాలని పెంచే మందలుగా కాక, అందరికీ ఎదగడానికి వీలైనన్ని అవకాశాలని కల్పించి, సుఖశాంతులని పెంచే మంచి మందలుగా ఎలా ఏర్పడాలో, ఆ రహస్యం మనిషికి ఇంకా పట్టుబడినట్టు లేదు.

ఇలాంటి ధర్మసందేహాలు మనిషికేగాని, జంతువుల విషయంలో ఈ మంద ప్రవృత్తి సత్ఫలితాలని ఇస్తూ, ఇటు వ్యక్తిగత జీవానికి, అటు సమిష్టికి చక్కని సమతూనికకి దారితీస్తున్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న క్రిమి కీటకాల దగ్గర్నుండి, బలిష్టమైన జీవాలైన సింహాలు, ఏనుగుల వరకు కూడా మంద ప్రవృత్తి కనిపిస్తుంది. అలాగని అన్ని జంతు జాతులలోను మంద ప్రవృత్తి ఉంటుందని కాదు. ఉదాహరణకి పులులు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుతాయి. ఒంటరిగా వేటాడతాయి. ముఖం సీరియస్ గా పెట్టి, “I always work alone” అనే హాలీవుడ్ హీరోల లాంటివి పులులు! ఎప్పుడూ దండులు దండులుగా సంచరించే తేనెటీగలు వీటికి పూర్తిగా వ్యతిరేకం.

జంతువులు మందలు అన్నప్పుడు ఇక్కడ రెండు విభిన్న రకాల మందల మధ్య తేడాని గుర్తించాలి. కొన్ని జంతువుల మందల్లో లోతైన సాంఘిక సంబంధాలు కనిపిస్తాయి. వాటిని మందలు అనడం కన్నా ’సమాజాలు’ అనడం సమంజసమేమో. వాటికి బదులుగా ఉదాహరణకి ఈగలని తీసుకుంటే వాటిని సమాజాలు అనడం కన్నా కేవలం ’సమూహాలు’ అనడం సబబుగా ఉంటుంది. అయితే సమాజాలు, సమూహాలు అనే ధృవాల మధ్య వివిధ జంతు జాతులు ఎక్కడో మధ్యలో ఉంటాయి. కనుక మనం మాత్రం రెండిటినీ కలిపి సామాన్యంగా ’మంద’ గానే వ్యవహరిద్దాం.

మందలుగా ఎందుకు ఏర్పడతాయి అంటే ఒక్కొక్క జంతుజాతికీ ఒక్కొక్క కారణం. చిన్న కీటక జాతులతో మొదలుపెట్టి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

నీట్లో జీవించే ఫ్లీ (water fleas) అనబడే ఒక విధమైన కీటక జాతిలో ’మంద’ ప్రవృత్తి ఎంత అద్భుతంగా పని చేస్తుందో అల్లీ అనే శాస్త్రవేత్త, అతడి సహోద్యోగులు కలిసి ప్రయోగాలు చేసి చూశారు. ఈ ఫ్లీ లు క్షారవంతమైన నీటిలో (alkaline water) జీవించలేవని ముందుగా వీళ్లు చూపించారు. కాని అవి తగినంత పెద్ద సంఖ్యలో సమిష్టిగా నీట్లో ఉంటే, అవన్నీ విడిచే CO2 వల్ల నీరు కొద్దిగా ఆమ్లవంతమై, క్షారాన్ని విరుస్తుంది. నీరు తటస్థ స్థితికి దగ్గరగా వస్తుంది. ఫ్లీ అలాంటి నీటిలో మరింత సులభంగా మనగలవు.

ఫ్రూట్ ఫ్లై (fruit fly) అనే ఒక రకమైన ఈగ జాతిలో ఈ మంద ప్రవృత్తి యొక్క పర్యవసానాలు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. ఈ ఈగల సమూహాలలో మరీ పెద్ద సంఖ్యలో గుడ్లు ఉంటే, వాటిలోంచి వచ్చే లార్వేలు అన్నిటికీ తగినంత ఆహారం దొరకదు. కనుక సంఖ్య మరీ పెద్దదైతే మంచిది కాదు. అలాగని సంఖ్య మరీ చిన్నదైనా మంచిది కాదు. ఇవి తగినంత పెద్ద సంఖ్యల్లో ఉంటే ఆహారపదార్థాన్ని విచ్ఛిన్నం చేసి, యీస్ట్ (ఒక రకమైన శిలీంధ్రం) యొక్క ఉత్పత్తికి దొహదం చేసి, ఆహారం తగినంతగా మెత్తబడేట్టు చెయ్యగలవు. అలా సిద్ధం చెయ్యబడ్డ ఆహారాన్ని ఇతర లార్వా లు మరింత సులభంగా ఆరగించగలవు. కనుక లార్వాలలో ఒకవిధమైన సహకార ప్రవృత్తి కనిపిస్తోంది.

ఇలాంటిడే డిట్క్టో స్టీలియం డిస్కో ఇడియం అనే ఏకకణ జీవుల సమూహంలోనూ కనిపిస్తుంది. ఇవి నిజానికి మట్టిలో జీవించే ఒక రకమైన అమీబా జాతి. పరిసరాలలో ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవి వేరువేరుగా జీవిస్తుంటాయి. పరిసరాలలో ఆహర కొరత ఏర్పడి పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడితే ఇవి క్రమంగా ఏకీకృతం కావడం మొదలెడతాయి.

అవి అలా దగ్గర పడే ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ఆకలి’ వేసిన అమీబా కణాలు cAMP అనే పదార్థాన్ని వెలువరిస్తాయి. అది నలుదిశలా వ్యాపించి చుట్టూ ఉన్న ఇతర అమీబాలని చేరుతుంది. అది అందగానే ఇతర అమీబాలూ కూడా ’ఓహో! మీరు అన్నది మాకు వినిపించిందోచ్!’ అన్నట్టుగా, ప్రతిస్పందనగా అవి మరింత cAMP వెలువరిస్తాయి. ఆ విధంగా అమీబాలు ఉన్న ప్రాంతం అంతా cAMP పోగవుతుంది. ఇప్పుడు అమీబాలు cAMP తక్కువగా ఉన్న చోటి నుండి ఎక్కువగా ఉన్నచోటికి కదలడం మొదలెడతాయి. ఆ విధంగా ఒక రసాయనం ఎక్కువగా ఉన్న దిశగా కణం కదలడాన్ని రసాయనచలనం (chemotaxis) అంటారు. అలా cAMP ల ద్వారా సందేశాలు ఇచ్చి పుచ్చుకుంటూ, ప్రతీ అమీబా తన బంధుమిత్రులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటూ, అమీబా ’మంద’గా ఏర్పడతాయి. ఈ మంద ఒక చిన్న ముద్దలా ఉంటుంది. దీని పొడవు 2-4 mm ఉంటుంది. ఈ రాశిని slug అంటారు. ఈ స్లగ్ కేవలం కొన్ని కణాల రాశి అయినా, అది ఒక ప్రత్యేక జీవంలాగా కదలగలదు. అలా నెమ్మదిగా కదులుతూ ఆ “సామూహిక జీవం” ఆహర వనరులు ఉన్న ప్రాంతం వరకు పోతుంది.

ఇది మొదటి మెట్టు మాత్రమే. అలా దగ్గర పడ్డ అమీబా కణ రాశి ఇంకా ఇంకా సాంద్రమై, నిటారుగా నించున్న ఓ చిన్న నాళంలా, ఆకాశాన్ని సూచిస్తున్న చూపుడు వేలిలా, ఏర్పడుతుంది. ఈ నాళం ఇంకా ఇంకా సాగి, సన్నని కాడలా ఏర్పడి, దాని పై కొసలో చిన్న తలలాగా ఏర్పడుతుంది (ఎడమ పక్క చిత్రం). అప్పుడు ఆ తల పేలి, అందులో ఉన్న కణాలు బయట పడి నలుదిశలా వెదజల్లబడతాయి.

అంటే పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు ఈ ఏకకణ జీవులు కలిసికట్టుగా ఎన్ని విన్యాసాలు చెయ్యగలుగుతున్నాయో చూడండి. సంక్లిష్టమైన రసాయనిక సంభాషణలు జరుపుకుంటూ దగ్గర పడతాయి. ఒక సంఘనిత రాశిగా కదులుతాయి. ఆహారం కోసం వెతుకుతాయి. మళ్ళీ ఆహారం దొరకగానే వేరువేరుగా విడిపోతాయి. ఇంత తెలివితో కూడిన ఐకమత్యం తరచు మనుషుల్లోనే కనిపించదు. వీటికి ఇంత ’ఇంగితం’ ఎక్కణ్ణుంచి వచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది. మరీ విష్ణుమాయ అనకపోయినా, ప్రకృతి మహిమ అని సరిపెట్టుకోవాలి...

పై ఉదాహరణలో మంద ప్రవృత్తి వల్ల ఎవరూ బతకలేని పరిస్థితి పోయి, చాలా మంది బతకగలిగే పరిస్థితి ఏర్పడింది. మంద ప్రవృత్తి వల్ల మరో ముఖ్యమైన సత్ఫలితం కూడా ఉంది. అది శత్రు దాడుల నించి ఆత్మరక్షణ...

(సశేషం)

మరో గ్రహంపై మహానగరాలు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, December 23, 2009 2 comments




(Mars city - artist's impression)
మరో గ్రహంపై మహానగరాలు

మార్స్ మీద కొంత కాలంగా వస్తున్న పోస్ట్ లలో ఇది ఆఖరి పోస్ట్. ఇందులో మార్స్ మీద నగర నిర్మాణం గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

మార్స్ మీద మనిషి పాదం మోపిన మర్నాటి నుండి నగర నిర్మాణం ఆరంభం కాదన్నది స్వయం విదితం. మొదటి చిన్న సంఖ్యలో మనుషులు అక్కడ నివసించడం మొదలుపెడతారు. వారి నివాసానికి మత్రం చిన్న చిన్న స్థావరాల ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రథమ నివాసాన్ని ’ఆల్ఫా’ అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. (ఆల్ఫా అనేది గ్రీకులో మొదటి అక్షరం అని వేరే చెప్పనక్కర్లేదు.) ఆ తరువాత నగరం (పోనీ చిన్న ఊరు, పేట) అని చెప్పుకోదగ్గ నిర్మాణాన్ని ’బీటా’ అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ ’బీటా’ కూడా మనం ఊహించుకునే విశాల వీధులతో, విస్తృత రవాణా సౌకర్యాలతో, భూమి మీద ఆధునిక మెట్రోలాగా ఏమీ ఉండబోదు. ఇది కూడా మహా అయితే ఒక చిన్న పరిశోధనా కేంద్రం లా, ఓ చిన్న క్యాంపస్ లా ఉంటుంది, ఎందుకంటే మొదట కొన్ని (బహుశ ఎన్నో) ఏళ్ల పాటు కొంత భద్రతా సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బంది మాత్రమే మార్స్ మీద జీవించబోతారు. సామాన్య పౌరులకి ఆ దశలో పెద్దగా పాత్ర ఉండదు.

మరి ఈ ప్రప్రథమ పురాల తీరుతెన్నులు ఎలా ఉండాలి అన్న విషయం మీద ఎంతో చర్చ జరుగుతోంది.

1. ఈ బీటా నగరాలు భూగర్భంలో ఉండాలని ఎంతో మంది సూచించారు. దీని వెనుక ముఖ్యోద్దేశం సూర్యరశ్మిలో హానికరమైన కిరణాల నుండి రక్షణను పొండడం. ఈ విషయంలో కిమ్ స్టాన్లీ రాబిన్సన్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఎంతో ముందుకు వెళ్ళారు. మార్స్ మీద జీవనం అనే అంశం మీద Red Mars, Blue Mars, Green Mars అనే అధ్బు తమైన నవలాత్రయాన్ని రాశారు. ఈ కథలో రమారమి క్రీ.శ. 2070 లో మొదలైన మార్స్ వలస కార్యక్రమం క్రమంగా పుంజుకున్నట్టు, మార్స్ మీద ఎన్నో నగరాలు నిర్మితమైనట్టు, వివిధ దేశాల జాతులు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నట్టు, స్పేస్ ఎలివేటర్ల సహాయంతో మార్స్ కి భూమికి మధ్య రాకపోకలు జరుగుతన్నట్టు, పెద్ద పెద్ద కృత్రిమ సౌర తెరల సహాయంతో మార్స్ ఉపరితలాన్ని కృత్రిమంగా వెచ్చజేసే సౌకర్యాలు ఉన్నట్టు – అంతా నమ్మశక్యం కానంత అద్భుత వాస్తవికతో, అసమాన ప్రతిభతో రాశారాయన.

నగర నిర్మాణ విషయంలో, ఈ కిమ్ స్టాన్లీ రాబిన్సన్, మార్స్ భూగర్భంలో మూడు అంతస్థుల వరకు పోయే ఇళ్లు కట్టుకుంటే బావుంటుందని సూచించారు. ఇలాంటి చిన్న చిన్న స్థావరాలలో 200 మంది దాకా జీవించొచ్చు. ఆ స్థావరంలో ఒక పక్క వివిధ వైజ్ఞానిక సౌకర్యాలు ఉంటాయి. మరో పక్క విశ్రాంతికి, మనోల్లాసానికి కావలసిన సౌకర్యాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా పరిశోధనలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి.
ఈ ఆలోచన సమంజసంగానే అనిపించినా దీన్ని వాస్తవీకరించడం కూడా అంత సులభవేం కాదు. అందుకే భారీ ఎత్తున ఉత్పత్తి చెయ్యగలిగేది, మర్స్ లోనే స్థానికంగా దొరికేదీ అయిన నిర్మాణ పదార్థాన్ని వాడాలంటారు రచయిత కిమ్ రాబిన్సన్. తన రెడ్ మార్స్ అన్న నవలలో మార్స్ లో ఉత్పత్తి అయిన ఇటుకలతో ఇళ్లు కట్టబడినట్టు వర్ణిస్తారు. అయితే ఇవి సామాన్యమైన ఇటుకలు కావు. వాతావరణంలోని CO2 మీద అధిక వత్తిడిని ప్రయోగించి తద్వారా వజ్రపు రజను తయారుచేసి, ఇటుకల మీద ఆ వజ్రపు రజను పూత వెయ్యాలని ఆలోచన. స్పేస్ షటిల్ లో వాడే ఉష్ణకవచ ఫలకాలు (heat shield tiles) లో వాడే RTV (Room Temperature Vulcanising) సిలికోన్ ని పోలిన పదార్థం ఈ ఇటుకల పదార్థం. ఈ RTV సిలికోన్ బాగా రాటు దేలి, వాతావరణానికి సంబంధించిన నానా రకాల ఒత్తిడులకి తట్టుకోగల పదార్థం. దీన్ని సినిమా సిట్టింగుల నిర్మాణంలో వాడతారు.

2. ఇక రెండవ పద్ధతి, మార్స్ మీద canyon లనే గోడలుగా చేసుకుని ఊరు నిర్మించే పద్ధతి.
1050-1300 నడిమి ప్రాంతంలో ప్రాచీన ప్వాబ్లో శకానికి చెందిన ప్వాబ్లో (Pueblo), అనసాజీ (Anasazi) మొదలైన అమెరికన్ ఇండియన్ తెగలు అలాంటి ఇళ్లలోనే ఉండేవారట. పొట్టి కొండల నడుమ, ఆ కొండల మధ్య సందుల్లో వాళ్లు ఇళ్లు కట్టుకునే వారట. అంగారక కనుమలలో, కొండల గోడల మధ్య బీటా నగరాన్ని నిర్మించాలని ఒక ఆలోచన.
ఈ బీటా నగరపు నిర్మాణానికి ఒక నెల నుండి, ఒక ఏడాది వరకు పట్టొచ్చు. అది ఎంత కాలం పడుతుంది అనేది మొదటి అక్కడి బృందంలో కూలీలు ఎంత మంది ఉన్నారు అన్నదాని మీద ఆధారపడుతుంది. కూలీలు తక్కువై, శాస్త్రవేత్తలు ఎక్కువైతే పని నెమ్మదిస్తుంది. మరో కీలకమైన విషయం అక్కడ నిర్మాణ పదార్థాలు ఎంత సులభంగా దొరుకుతాయి అన్నది. ముఖ్యంగా వజ్రపు రజను తయారుచెయ్యాలంటే చాలా సమయం, శక్తి అవసరమవుతాయి.

ఈ విధంగా ఎన్నయినా చెప్పొచ్చుగాని, చివరికి మార్స్ మీద నగర నిర్మాణానికి ఏది శ్రేష్ఠమైన పద్ధతి అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అందుకే ఇక్కడ ఊహాశక్తికి బాగా పదును పెట్టాల్సి ఉంది!

పద్ధతి ఎదేతైనేం ఈ విధంగా మొదటి తరానికి చెందిన చిన్నచిన్న ఊళ్ల నిర్మాణం జరుగుతుంది. అలాంటి ఇరుకైన, ఇబ్బందికరమైన వాసాలలో జీవిస్తూ మనుషులు అక్కడి పరిస్థితులకి అలవాటు పడతారు. మార్స్ వాతావరణాన్ని మానవ నివాస యోగ్యంగా మలచుకోవడానికి ప్రప్రథమ సన్నాహాలు చేస్తారు.

అలా కొంత కాలం పోయాక రెండవ తరం నగరాలు వెలుస్తాయి. ఈ రెండవ తరం నగరాలు మొదటి తరం నగరాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయంటాడు లిండన్ హెచ్. లరూష్ (జూనియర్) అనే ఓ నిపుణుడు. నేలమాళిగలో, కొండ గోడల మధ్య, దుర్భర నివాసాలకి బదులు, ఈ కొత్త ఊళ్లు మార్స్ ఉపరితలం మీద, విశాల వీధులతో, ఆకాశసౌధాలతో మహా వైభవంగా ఉంటాయి.

ఈ రెండవ తరం నగరాలలో, సగటు నగరం 20 చదరపు కిమీలు ఉంటుందని ఊహిస్తున్నాడు లరూష్ (జూనియర్). ఆ ఊరి మీదుగా అర్థగోళాకారంలో, ఓ ’డోమ్’ ఏర్పాటై ఉంటుంది. ఆ డోమ్ యొక్క పదార్థం తేలిగ్గా, చవగ్గా స్థానికంగా దొరికే పదార్థాలతో నిర్మితమై ఉండాలి. అంతే కాక అది పారదర్శకంగా కూడా ఉండాలి. అందువల్ల సూర్యరశ్మి ఊళ్లోకి ప్రవేశించడానికి వీలవుతుంది. పైగా పైన ఆకాశం కూడా ఇంపుగా కనిపిస్తుంది. అంతే కాక డోమ్ వల్ల ఊరికి ఒక విధమైన లోకోత్తర సౌందర్యం అబ్బుతుంది. మాగ్నెటిక్ లెవిటేషన్ మీద పని చేసే మెట్రో రైళ్లు ఊళ్లో మనుషులని, సరుకులని రవాణా చేస్తుంటాయి (image below).

“గతంలో మరే ఇతర మానవ తరం కన్నా మనకిప్పుడు నగర నిర్మాణంలో అనుపమాన సాంకేతిక సామర్థ్యం ఉంది. రాబోయే వేయేళ్ల పాటు నగర వాసులు మనకి కృతజ్ఞతలు చెప్పుకునేటంత గొప్పగా మనం ఈ నాడు నగరాలని నిర్మించగలం,” అంటాడు లారూష్.

మార్స్ లో నాగరక జీవనం ఎప్పుడు మొదలవుతుందో గాని, దానికి కావలసిన వ్యూహాలు, ఊహలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవన్నీ ఎప్పుడు సాకారం అవుతాయో, అసలు ఎప్పటికైనా అవుతాయో లేదో, కాలమే నిర్ణయించాలి.

మార్స్ ధరాసంస్కరణ ప్రక్రియ దీర్ఘ కాలం పాటు సాగే వ్యవహారం. మార్స్ ని ధరాసంస్కరించ గలిగితే ఇక ఇతర గ్రహాలని కూడా ఆ విధంగా సంస్కరించగలిగే అవకాశం ఏర్పడుతుంది. మార్స్ ని ధరాసంస్కరించలేకపోతే మాత్రం ఈ సౌరమండలంలోనే కాక, ఈ విశాల విశ్వంలో మరే ఇతర గ్రహాన్నీ ధరాసంస్కరించ లేము అన్నది వాస్తవం.

మార్స్ యొక్క ధరాసంస్కరణ, మానవావాసం ఆర్థికంగా కూడా ఫలదాయకమైన, లాభదాయకమైన విషయం. మార్స్ గ్రహం మీద ఖనిజ సంపత్తి సమృద్ధిగా ఉంది. పైగా పొరుగునే ఉన్న గ్రహశకల వలయం (asteroid belt) లో కూడా ఎంతో గొప్ప ఖనిజ నిధులు ఉన్నాయి. అలాగే మార్స్ మీద వాతావరణం ప్రాణవాయుపూరితమై, జలవనరులు కుదిరితే, గ్రహం సస్యశ్యామలం అవుతుంది. గురుత్వం తక్కువ కనుక మొక్కలు బాగా ఏపుగా ఎదుగుతాయి.

ఇవన్నీ నిజం కావాలంటే అనువైన రాజకీయ పరిస్థితులు అత్యవసరం. ప్రపంచ దేశాలు అన్నీ సామరస్యంగా పని చేస్తే గాని ఈ మహర్లక్ష్యం సాకారం కాదు. సమగ్ర మైన అవగాహనతో, సుహృద్ భావనతో కలిసి పని చేస్తే ఓ బంగరు భవితవ్యం మనది కాగలదు.

References:
1. http://www.redcolony.com/art.php?id=0012240
2. http://www.redcolony.com/art.php?id=061008a





మానవ జాతి భవిష్యత్తు నాచు మీద ఆధారపడి ఉందా?


మార్స్ గ్రహం మానవ నివాస యోగ్యం కావాలంటే అక్కడి పర్యావరణం సమూలంగా మారాలి. ఆ మార్పులో కొన్ని దశలని కిందటి పోస్ట్ లో గుర్తించాం. 1) ముందు వాతావరణపు ఉష్ణోగ్రత పెరగాలి. దాని వల్ల ఘనరూపంలో ఉన్న CO2 ఆవిరై, వాతావరణంలోకి ప్రవేశించాలి. ఆ విధంగా ఉష్ణోగ్రత మరింత పెరగాలి. 2) పెరిగే ఉష్ణోగ్రత వల్ల మంచు కరిగి జలాశయాలు ఏర్పడాలి. 3) ఇక ఈ మధ్యలో అక్కడి వాతావరణంలో మనగల వృక్షరాశిని ప్రవేశపెడితే దాని ప్రభావం చేత CO2 కాస్తా O2 గా మారి, ఆక్సిజన్ పుష్కలంగా ఉన్న వాతావరణం ఏర్పడాలి. ఆ లోకానికి అతిథిగా, ఓ ప్రవాసిగా మనిషి అప్పుడు మార్స్ మీద అడుగు పెట్టొచ్చు.

మార్స్ వాతావరణాన్ని మార్చే ప్రణాళికలో ఓ ముఖ్యపాత్రని పోషించగల ఓ అతిసామాన్యమైన మొక్క ఉంది. దాన్ని మొక్క అనడం కన్నా ఓ జీవ పదార్థం అనడం సబబేమో. దాన్ని లైకెన్ (lichen) అంటారు. సామాన్య పరిభాషలో దీన్ని నాచు ని పిలుచుకోవచ్చు. కాని కచ్చితంగా అయితే ఇది నాచు (moss) కాదు, శిలీంధ్రం (fungus), శైవలమూ (algae) కాదు, శిలీంధ్రానికి, శైవలానికి సహజీవన స్థితి (symbiotic state) నెలకొన్న పదార్థం ఇది. మార్స్ లోని CO2 ని O2 గా మార్చే బృహత్కార్యానికి ఇది బాగా పనికొస్తుందని శాస్త్రవేత్తల నమ్మకం.

అన్ని మొక్కల లాగానే లైకెన్ కూడా గాల్లోని CO2 ని, నీటితోను, సూర్యరశ్మితోను కలిపి, చక్కెరలని, O2 ని ఉత్పత్తి చేస్తుంది. వాతావరణంలోని ఆటుపోట్లకి తట్టుకోగల గట్టి పిండం దీనిది. కాని దీనికి కూడా మార్స్ వాతావరణాన్ని నిలదొక్కుకోవడం కొంచెం కష్టమే. మార్స్ గ్రహమధ్యరేఖకి దగ్గరగా ఉండే ఉష్ణమండల (tropical) ప్రాంతంలో ని ఉష్ణోగ్రతల వద్ద లైకెన్స్ నిలదొక్కుకోగలదు గాని, దాని ఉన్కికి జలం అవసరం. మరి మార్స్ మీద ద్రవ రూపంలో జలం ఇంచుమించు లేనట్టే గనుక ప్రస్తుత స్థితిలో లైకెన్ అక్కడ బతికి బట్టకట్టలేదు! పోనీ నీటి ఏర్పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసినా గాల్లో తగినంత CO2 (వాయు రూపంలో) లేకపోవడం మరో సమస్య.

ఇవన్నీ ఒక్కసారిగా జరగవు కనుక, కిందటి పోస్ట్ లో చెప్పుకున్నట్టు మొదటి లక్ష్యం మర్స్ మీద ఉష్ణోగ్రతని ఓ మూడు, నాలుగు డిగ్రీలు పెంచడం. పైన చెప్పుకున్నట్టు ఒకసారి ఉష్ణోగ్రత ఆ మాత్రం పెరిగితే, ఆ ప్రక్రియ దానినదే పోషించుకుంటుంది కనుక, గాల్లో CO2 ఒక స్థాయి వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యంతర దశనే పాక్షిక ధరాసంస్కరణ అంటారు.

ఈ దశకి అంతంలో ఉష్ణోగ్రత ఎంత మేరకు పెరుగుతుంది అంటే, దాని వల్ల మంచునేలలో ఉండే మంచు కరుగుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అలా కరిగిన మంచులో కొంత నీరు ఆవిరై గాల్లో కలవొచ్చు. అయితే నీటి ఆవిరి కూడా హరితగృహ వాయువే కనుక, దాని వల్ల కూడా అలా ఒకసారి పెరిగిన ఉష్ణోగ్రత అలా హెచ్చు స్థాయి వద్దనే నిలిచే ఆస్కారం ఉంది. వాడే సాంకేతిక సామర్థ్యాన్ని బట్టి ఈ వ్యవహారం అంతా పూర్తి కావడానికి 20 ఏళ్ల దగ్గర్నుండి 10,000 ఏళ్ల వరకు కూడా పట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ లైకెన్ లది గట్టి పిండం అని ఇందాక చెప్పుకున్నాం. అవి -24 C వద్ద కూడా మనగలవు. చలి మరీ ఎక్కువైతే అవి హైబర్నేషన్ (హిమసమాధి) స్థితిలోకి ప్రవేశించి, తిరిగి పరిస్థితులు వెచ్చబడ్డాక మళ్లీ తేరుకోగలవు. ఆ విధంగా అవి -100 C వద్ద కూడా సజీవంగా ఉండగలవు. అంతే కాక ఒంటెల్లాగా ఇవి వాటిలో గుక్కెడు నీటిని నిలువ ఉంచుకుని, ఇలాంటి ఆపత్సమయాలలో ఆ నీటిని నెమ్మదిగా వాడుకుంటూ బతికేయగలవు. అయితే సూర్యరశ్మిలో ఉండే జీవప్రతికూల కిరణాలకి తట్టుకునే శక్తి వీటికి ఉందో లేదో ఇంకా స్పష్టంగా లేదు. కాని పాక్షిక ధరాసంస్కరన జరిగిన మార్స్ లో అప్పటికే దట్టమైన వాతావరణం ఉంటుంది కనుక, CO2 ఉంది గనుక బహుశ ఓజోన్ పొర కూడా ఏర్పడి ఉంటుంది కనుక, హానికరమైన కిరణాల వల్ల పెద్దగా బెడద ఉండదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
లైకెన్ లతో వచ్చిన ఒక పెద్ద చిక్కు ఏంటంటే అవి చాలా నెమ్మదిగా పునరుత్పత్తి చెందుతాయి. కనుక అవి గ్రహం మొత్తం వ్యాపించాలంటే చాలా చాలా కాలం పడుతుంది. మరో చిక్కు ఒక్క లైకెన్ లకి మాత్రమే సంబంధించినది కాదు, మొత్తం వృక్ష జాతికే సంబంధించినది. సూర్య రశ్మిని వినియోగించడంలో మొక్కల సమర్థత కేవలం 3.5% మాత్రమే. ఆ కారణం చేత వాతావరణంలోని CO2 ని O2 గా మార్చాలంటే చాలా కాలం పడుతుంది.

ఈ ఉపాయలన్నీ ఫలించి, అన్నీ అనుకున్నట్టు జరిగితే కొన్ని సహస్రాబ్దాలలో మార్స్ గ్రహం మీద పరిస్థితులు మానవ నివాస యోగ్యం కావచ్చని ఆశించవచ్చు. లైకెన్ లు పనిలో కొంచెం నెమ్మది కావచ్చు. కాని ఈ పనికి అంత కన్నా చవకైన, ఆచరణశీలమైన పద్ధతి మరొకటి లేదు. చిత్తడి నేల మీద, తడిసిన గోడల మీద అక్కడక్కడ కనిపించే ఈ అవిశేషమైన జీవపదార్థాన్ని ఈ సారి ఎక్కడైనా చూసినప్పుడు ఆ పదార్థమే ఓ అపరిచిత లోకంలో మానవ భవిష్యత్తుకు ప్రాణం పోసే కార్యంలో కీలక పాత్ర వహించగలదని గుర్తుంచుకుందాం.
Reference:
http://www.redcolony.com/art.php?id=0109020

ధరాసంస్కరణంలో విధానాలు

Posted by V Srinivasa Chakravarthy Monday, December 21, 2009 2 comments



(<-- Before Terraforming)
(<-- After Terraforming)









మానవ నివాసానికి అనుగుణంగా మార్స్ గ్రహాన్ని సంస్కరించడం అనేది ఓ బృహద్ ప్రయత్నం. ఆ ప్రయత్నంలోని మొదటి దశే కొన్ని దశాబ్దాలు, లేదా శతాబ్దాలు పట్టొచ్చు. భూమిని పోలిన పరిస్థితులు అక్కడ నెలకొనాలంటే కొన్ని సహస్రాబ్దాలు కూడా పట్టొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. తేమ ఛాయలైనా Add Imageలేని ఎర్రని బంజరు లోకంలో, చెట్లు చేమలతో, పశుపక్ష్యాదులకే కాక మానవ నాగరక జీవనానికి ఆలవాలం కాగల హరితభూమిగా, ఓ కొత్త బంగారు లోకంగా రూపాంతరం గావించడానికి ఏంటి పద్ధతి? ఇందుకు శాస్త్రవేత్తలు మూడు మార్గాలు ఊహించారు:

1. అంతరిక్షంలో మార్స్ చుట్టూ పరిభ్రమించే పెద్ద పెద్ద అద్దాలని నిలపడం. ఆ అద్దాలు సూర్యకాంతిని గ్రహం మీదకి ప్రతిబింబించి, అక్కడి ఉష్ణోగ్రతని పెంచుతాయి.

వ్యోమనౌకలని చోదించడానికి సౌరతెరచాపలు అనే భావన కొంత కాలంగా ఉంది. వాటి గురించి అంతకు ముందు ఒక పోస్ట్ లో చెప్పుకున్నాం. కొన్ని కిలోమీటర్ల వ్యాసం ఉన్న సన్నని మేలిమి తెరల మీద కాంతి చేసే ఒత్తిడి వల్ల వ్యోమ నౌక చోదింపబడుతుంది. ఆ తెరలని మరో ప్రయోజనం కోసం కూడా వాడొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విశాలమైన మెరిసే తెరలని మార్స్ ఆకాశంలో కొన్ని వందల వేల మైళ్ల ఎత్తున స్థిర కక్ష్యలో నిలుపుతారు. అవి సూర్యకాంతిని ప్రతిబింబించి గ్రహం మీదకి ప్రసరించి, గ్రహోపరితలాన్ని వేడెక్కిస్తాయి. మైలార్ అనే పదార్థంతో చేసిన ఈ తెరలని 250 కిమీల వ్యాసం గల వాటిని వాడితే మేలని కొందరు శాస్త్రవేత్తలు సూచించారు. ఈ ’అద్దాల’ లో ఒక్కొక్క దాని బరువు 200,000 టన్నులు ఉంటుంది. అంటే వాటిని ఏకంగా భూమి నించి లాంచ్ చెయ్యడానికి వీలుపడదు. కనుక అంతరిక్షంలో దొరికే పదార్థాలతోనే వీటిని నిర్మించాలన్న ఆలోచన కూడా ఉంది.


ఇంత పెద్ద అద్దాలు కాంతిని గ్రహం మీద ఒక చోట కేంద్రీకరిస్తే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు పెరుగుతుంది. ముఖ్యంగా ఆ కాంతిని ధృవాల మీదకి ప్రసరిస్తే అక్కడ ఘనరూపంలో ఉన్న CO2 కరిగి, ఆవిరై వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. CO2 హరితగృహ వాయువు అని మనకి తెలుసు. దానికి సూర్యతాపాన్ని లోన దాచుకునే లక్షణం ఉంది. మార్స్ వాతావరణంలో CO2 పాలు పెరిగిందంటే, గాల్లో వేడి పెరిగి, దాని వల్ల ధృవాల వద్ద మరింత ఐసు కరగడం మొదలెడుతుంది. అంటే గాల్లోకి మరింత CO2, అంటే మరింత వేడి... ప్రస్తుతం మనకి అనుభవం అవుతున్న ’గ్లోబల్ వార్మింగ్’ (ధరాతాపనం) ని అక్కడ సృష్టించాలని ఆలోచన. ఏదైతే భూమి మీద జరిగితే దుష్పరిణామం అవుతోందో, సరిగ్గా అలాంటి పరిణామాన్ని కృత్రిమంగా సృష్టించి మార్స్ ని సంస్కరించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2. కనుక మార్స్ మీద ఉష్ణోగ్రత పెంచి, అక్కడ వాతావరణాన్ని పోషించడానికి మరో ఉపాయం పైన చేసిన దాన్నే మరింత సూటిగా చెయ్యడం – హరితగృహ వాయువులని ఉత్పన్నం చేసే కర్మాగారాలని అక్కడ స్థాపించడం. ప్రస్తుతం మనం వాడే ఏసీ, రెఫ్రిజెరేటర్ మొదలైన యంత్రాలు క్లోరోఫ్లోరో కార్బన్లని వాతావరణంలోకి వెలువరిస్తాయి. ఇవి హరితగృహ వాయువులు. వాతావరణ తాపనానికి ఈ వాయువులు తోడ్పడతాయి. అయితే ఇది ఆ యంత్రాల అనుకోని దుష్ఫలితమే గాని అది వాటి నిర్మాణంలోని ముఖ్యోద్దేశం కాదు. కాని మర్స్ మీద కేవలమ్ ఆ వాయువులని వాతావరణంలోకి వెలువరించడమే లక్ష్యంగా రూపొందించబడ్డ యంత్రాలని, కర్మాగారాలని స్థాపించి తద్వార అక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రతని పెంచడం రెండవ ఉపాయం.

3. ఇక మూడవ పద్ధతి కాస్త దుడుకు పద్ధతి. చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పద్ధతి. కొంచెం ప్రమాదకరమైన పద్ధతి. దీన్ని సూచించిన వారు క్రిస్టఫర్ మక్ కే అనే ఖగోళవేత్త, రాబర్ట్ జుబ్రిన్ అనే నవలా రచయిత. మంచుకణికలతో ఆవరించబడి, అమోనియా పుష్కలంగా గల ఓ పెద్ద గ్రహశకలం (asteriod) తో మార్స్ గ్రహాన్ని ఢీ కొట్టిస్తే అనుకున్న పని నెరవేరుతుందని వీరి భావన. అణుధార్మిక రాకెట్ ఇంజెన్లని ఓ గ్రహశకలానికి తగిలించి బాహ్య సౌరమండలంలో ఉన్న గ్రహశకలాలని మార్స్ దిశగా మళ్లించాలి. సెకనుకి 4 కిమీల వేగంతో ఆ ఇంజెన్లు గ్రహశకలాలని చోదిస్తాయి. ఆ విధంగా ఓ పదేళ్లు తోస్తే, పది బిలియన్ టన్నుల బరువు ఉన్న గ్రహశకల రాశిని మార్స్ తో ఢీ కొనేలా ముందుకు తోయొచ్చు. ఆ విఘాతం వల్ల 130 మిలియన్ మెగావాట్ల శక్తి పుడుతుందని అంచనా.

ఇదంతా ఏదో సినిమాలలోను, కాల్పనిక విజ్ఞాన నవలలోను జరిగే వ్యవహారంలా కనిపించొచ్చు. కాని అదే నిజంగా జరిగితే మార్స్ ఉష్ణోగ్రత ఓ మూడు డిగ్రీల సెల్షియస్ పెరగొచ్చు. ఉన్నపళంగా ఉష్ణొగ్రత అంతలా పెరిగితే ధృవాల వద్ద ఐసు కరిగి ఓ ట్రిలియన్ టన్నుల నీరు విడుదల కావచ్చు. ఈ విధంగా ఓ 50 ఏళ్లు మళ్లీ మళ్లీ గ్రహం మీద విస్ఫోటాలు కలుగజేస్తే, ఆ తరువాత మార్స్ మిద వాతావరణం కాస్త వెచ్చగా మారి, గ్రహోపరితలం మీద 25% నీరు నిలువగలదు. కాని గ్రహం మీద అంత పెద్ద విస్ఫోటాలు సృశ్టించడం వల్ల వాతావరణం, పర్యవరణం అస్థిరం అవుతుంది. అది కుదుట పడే వరకు అక్కడ మానవ నివాసాలు నెలకొనడం వీలు కాదు.


శతాబ్దం నడిమి కాలంలో ఎప్పుడో మనిషి మార్స్ మీద అడుగుపెట్టే అవకాశం ఉంది. కాని అక్కడ మానవ సమాజాలు విలసిల్లే రోజు రావడానికి ఇంకా ఎంతో దూరం ఉందని మత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

References:
http://science.howstuffworks.com/terraforming2.htm
http://www.redcolony.com/


(సశేషం...)

అంగారక లోకపు ధరాసంస్కరణ

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 20, 2009 2 comments



అంగారక లోకపు "ధరాసంస్కరణ"

భూమి తరువాత మనుషులు పెద్ద సంఖ్యలో నివసించదగ్గ గ్రహం అంటూ ఏదైనా ఉంటే అది మార్స్ గ్రహమే నని స్పష్టమయ్యింది. ఎందుకంటే మార్స్ కి భూమికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.

- మార్స్ మీద రోజు వ్యవధి - 24 గంటల 37 నిముషాలు
భూమి మీద రోజు వ్యవధి - 24 గంటల 56 నిముషాలు
- మార్స్ అక్షం యొక్క వాలు - 24 డిగ్రీలు
భూమి అక్షం యొక్క వాలు - 23.5 డిగ్రీలు
- మార్స్ గురుత్వం భూమి గురుత్వంలో మూడో వంతు
- భూమి మీద లాగానే మార్స్ మీద కూడా ఋతువులు ఉంటాయి

అయితే మార్స్ అతిశీతలమై, శుష్కమైన, నిర్జీవమైన లోకం. జీవం ఉన్నా అది ఏకకణజీవులకి మించి పోదు. ప్రస్తుత స్థితిలో మార్స్ మీద మనిషి మనుగడ సాగకపోవచ్చు కాని, మానవ నివాసానికి కావలసిన కొన్ని ముఖ్యమైన వనరులు మార్స్ మీద ఉన్నాయి. ముఖ్యంగా జీవసృష్టికి కావలసిన పదార్థాలు ఉన్నాయి. అవి -
- ధృవప్రాంతాల్లో ఘనీభవించి ఉన్న పుష్కలమైన నీరు
- సమృద్ధిగా కార్బన్ డయాక్సయిడ్ (దీనిలోని కార్బన్, ఆక్సిజన్లని వాడుకోవచ్చు)
- నైట్రోజెన్
మార్స్ వాతావరణపు ప్రస్తుత స్థితి:
CO2 - 95.3%
N2 - 2.7%
Argon - 1.6%
O2 - 0.2%

మార్స్ మీది ఈ పరిస్థితులని చూస్తుంటే ఒకప్పుడు భూమి మీద ఇలాంటి పరిస్థితులే ఉండేవేమోననిపిస్తుంది. తొలిదశల్లో భూమి మీద కూడా ఎక్కువ ఆక్సిజన్ ఉండేది కాదు. వాతావరణం నిండా కార్బన్డయాక్సైడ్, నైట్రోజెన్ లే ఉండేవి. అంతలో కిరణజన్య సంయోగక్రియా బాక్టీరియా (photosynthetic bacteria) రంగ్రప్రవేశం చేశాయి. మొక్కల్లాగానే ఇవి సౌరశక్తిని వాడుకుంటూ, CO2 ని ఆక్సిజన్ గా మార్చడం మొదలెట్టాయి.
భూమి మీద ప్రస్తుత వాతావరణ వివరాలు:
N2 - 78.1%
O2 - 20.9%
Argon - 0.9%
CO2 etc - 0.9%
ఇది కాక మార్స్ మీద ఉష్ణోగ్రత కూడా విపరీతంగా ఉంటుందని ఇంతకు ముందు గమనించాం. మార్స్ ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత -62.77 C అయితే, భూమి మీద సగటు ఉష్ణోగ్రత 14.4 C. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మార్స్ ని సందర్శించామంటే, ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుపోతూ, స్పేస్ సూట్లలో మాత్రమే మార్స్ నేల మీద సంచరించగలం. అలా కాకుండా ఈ సరంజామా ఎమీ లేకుండా స్వేచ్ఛగా తిరగాలంటే వాతావరణం మారాలి. లేదా మార్చుకోవాలి! శైశవ దశలో ఉన్న భూ వాతావరణం ఈ దశ వరకు ఎలా పరిణామం చెందిందో, అలాంటి ప్రక్రియలే వాడి మార్స్ గ్రహాన్ని కూడా మనకు అనువుగా మలచుకోగలమా? ఇది చాలా ఘనమైన ఆలోచన. ఇలా చెయ్యడం అంటే ఒక విధంగా మనిషి దేవుడిలా ప్రవర్తించ బూనుతున్నట్టు అవుతుంది. అలంటి మానవ సంకల్పిత పరిణామానికి, పృథ్వీ పరిణామానికి మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామం వల్ల భూ వాతావరణం ప్రస్తుత స్థితికి వచ్చింది. ఏవో యాదృచ్ఛికమైన హఠాత్ పరిణామాల వల్ల, అనుకోని అదృష్టమైన సంఘటనల వల్ల భూమి ఓ ప్రత్యేక పరిణామ రేఖ వెంట నెమ్మదిగా ప్రయాణిస్తూ ఈ స్థితికి వచ్చింది. మార్స్ విషయంలో ఆ గమనాన్ని, దాని పరిణామ రేఖని, పరిణామ వేగాన్ని మనం శాసించ బూనడమా? ఇది అయ్యే పనేనా? అది మంచి పనేనా?
సాధ్యాసాధ్యతల మాట అటుంచితే, మంచి చెడుల మాట పక్కన పెడితే అసలు అలాంటి ఉద్దేశం మాత్రం బలంగా ఉందని చెప్పొచ్చు. ఈ భావనకే ధరాసంస్కరణ (Terraforming) ఓ పేరు కూడా ఉంది. ఓ గ్రహం యొక్క పరిణామ క్రమంలో వైజ్ఞానిక దృష్టితో జోక్యం చేసుకుంటూ, అందులో సకాలంలో కొన్ని అంశాలని ప్రవేశపెట్టి ఓ బొంసాయి మొక్కని మలచుకున్నట్టు ఆ గ్రహం మీది పరిస్థితులని కొన్ని శతాబ్దాలుగానో, సహస్రాబ్దాలుగానో మలచుకోవాలన్న ఆలోచననే ధరాసంస్కరణ అంటారు. మనిషి చింతన చేరిన అందనంత ఎత్తుకి ఇదొక చక్కని తార్కాణం.
ఈ ధరాసంస్కరణలోని విధివిధానాల గురించి వచ్చే పోస్ట్ లో...
(సశేషం...)

అంగారక చందమామలు

Posted by V Srinivasa Chakravarthy Saturday, December 19, 2009 0 comments










(Deimos)

అంగారక చందమామలు
పేరుకైతే మార్స్ కి రెండు చందమామలు. కాని వాటిని చూపిస్తే పిల్లలు బువ్వ తినడం మాని కెవ్వు మంటారు. ప్రేయసి మోముని వాటితో పోల్చితే వొదిలేసి వెంటనే భూమికి తిరిగెళ్లిపోవడం ఖాయం!
అయినా సరే... మార్స్ మీద సెటిలయ్యే ఉద్దేశం ఉన్నప్పుడు, మరీ అక్కడి సాటిలైట్ల గురించి తెలీకపోతే ఎలా?
మార్స్ కి చెందిన రెండు ఉపగ్రహాలూ గ్రహానికి చాలా దగ్గరలో తిరుగుతుంటాయి. (భూమి నుండి చంద్రుడి దూరం కన్న వీటి దూరం చాలా తక్కువ). వీటిలో కాస్త చిన్నదైన డెయిమోస్ వ్యాసం 15 కిమీలు మత్రమే. అది గ్రహం నుండి 23,500 కిమీల దూరంలో తిరుగుతుంటుంది. జన్మత: ఇదో గ్రహశకలం (asteriod). ఎప్పుడో గతంలో మర్స్ గురుత్వపు వలలో చిక్కుకుని అప్పట్నుంచి అంగారకుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయింది.
హాలీవుడ్ తారల్ మొత్తం దీవులు కొనుక్కున్నట్టు ఓ మొత్తం ఉపగ్రహాన్నే కొనేసుకుందాం అనుకుంటున్నారేమో. నన్నడిగితే అది వట్టి డబ్బు దండుగ. అంత చిన్న వస్తువు మీద నిలకడగా నించో గలిగితే గొప్ప. ఇక ఇళ్లు, వాకిళ్లు నిలిపేదెప్పుడు? కనుక డెయిమోస్ మీద ప్లాటు కొని పాట్లు పడకండి. అయితే ఒక్కటి చెయ్యొచ్చు. ఇల్లు మార్స్ మీదే కట్టుకుని వంటింట్లో అరుగు మీదకి కడప స్లాబుకి ఎలాగూ నోచుకోలేం కనుక (పైగా 2050 నాటికి కడప ఏ రాష్ట్రంలో ఉంటుందో ఏమో!) ఈ ఉపగ్రహం నుండి నల్లని కఠిన శిలని కోసుకు తెచ్చుకుని వంటింట్లో వాడుకోవచ్చు!
మరి కొంచెం పెద్దదైన ఫోబోస్ వ్యాసం 27 కిమీలు. ఇది మార్స్ కి ఇంకా దగ్గరిగా 9380 కిమీల దూరంలో తిరుగుతుంటుంది. అంత దగ్గరగా ఉండడం వల్ల గ్రహణ సమయంలో ఇంత చిన్న ఉపగ్రహం కూడా సూర్యబింబాన్ని కప్పేయగలదు. పైగా అంత దూరంలో సూర్యబింబం కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. ఫోబోస్ బుగ్గన దిష్టి చుక్కలా స్టిక్నీ అనే ఓ పెద్ద 6 కిమీల వ్యాసం గల ఉల్కాబిలం ఒకటి ఉంటుండి. ఫోబోస్ కూడా నివాస యోగ్యం కాదు. ఏదో సెలవల్లో ఓ సారెళ్లి కంగారూలలా కంగారుగా ఉపగ్రహం అంతా గంతులేసి రావడానికి బావుంటుందంతే!
(Phobos)
మార్స్ ఉపగ్రహాల గురించి ఆసక్తికరమైన ఓ చారిత్రాత్మక కథ ఉంది. ’గలివర్ యాత్రల’ కథ గురించి మనమందరం వినే ఉంటాం. 1726 లో జోనాథన్ స్విఫ్ట్ రాసిన నవల అది. అందులో ఒక చోట గలివర్ ’లపుటా’ అనే ఎగిరే దీవిన సందర్శిస్తాడు. ఆ దీవికి చెందిన కొందరు తలతిక్క శాస్త్రవేత్తలు ఏవో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. దోసకాయల నుండి సూర్యకాంతిని వెలికితీయడం లాంటివి! అయితే లపుటాకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఉద్దండులు. వీళ్లు మార్స్ కి రెండు ఉపగ్రహాలు ఉన్నాయని పేర్కొంటూ, వాటి పరిభ్రమణ కాలాలని చాలా కచ్చితంగా చెప్తారు. చిత్రం ఏంటంటే అమెరికన్ ఖగోళవేత్త అసాఫ్ హాల్ 1877 లో తన దూరదర్శిని లోంచి చూస్తూ మార్స్ చుట్టూ తిరుగుతున్న రెండు ఉపగ్రహాలని మొట్టమొదటి సారి కనిపెట్టాడు. మరి అంతకు 150 ఏళ్ల క్రితం జోనాథన్ స్విఫ్ట్ కి ఆ విషయం ఎలా తెలుసు? ఈ రహస్యం ఇప్పటికీ ఓ తెగని సమస్యగా మిగిలిపోయింది.

ఇక్కడితో మన మార్స్ సందర్శనం ముగిసింది. మార్స్ మీద వివిధ ప్రాంతాలతో పాటు ఉపగ్రహాలని కూడా ఓ చూపు చూసేశాం.
మార్స్ కి వలస పోవడానికి జరుగుతున్న దీర్ఘకాలిక సన్నాహాల గురించి వచ్చే పోస్ట్ నుంచి వివరంగా చెప్పుకుందాం...
Reference:
1. Giles Sparrow, Traveler's guide to the Solar System, Collins.
2. http://en.wikipedia.org/wiki/Mars
3. http://www.edb.utexas.edu/missiontomars/bench/mw.html
4. http://en.wikipedia.org/wiki/Moons_of_Mars
5. http://en.wikipedia.org/wiki/Olympus_Mons
6. http://en.wikipedia.org/wiki/Martian_canal

మార్స్ లోకపు కొసలు

Posted by V Srinivasa Chakravarthy Friday, December 18, 2009 0 comments




మార్స్ లోకపు కొసలు



మార్స్ ఉపరితలాన్ని పరిశీలించాం. ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు చూశాం. గుట్టలు, మిట్టలు, కొండలు, బండలు, అగాలు, అగడ్తలు, హిమవన్నగాలు, హిమానీనదాలు... అంగారక అవనీతలాన్ని అంగరఖాలా ఆవహించే అగమ్యమైన అరుణానిలాలతో అందరం ఆ లోకాన్ని ఆలోకించాం. ఇక ఆ ప్రపంచపు అంచులే మిగిలాయి. అవే శాశ్వత హిమావృతమైన ఉత్తర, దక్షిణ ధృవాలు.


మార్స్ ధృవాల వద్ద పైపొరలో ఉన్నది గడ్డకట్టుకున్న కార్బన్ డయాక్సయిడ్ అని ముందు చెప్పుకున్నాం. అయితే దాని అడుగున కొంత గడ్డ కట్టిన నీరు కూడా లేకపోలేదు. రెండు ధృవాలని అంతరిక్షం నుంచి చూస్తే తెల్ల రాయంచ కలికితురాయిలా ముద్దొస్తూ ఉంటాయి. రెండు ధృవప్రాంతాలు మార్స్ సగటు ఉపరితలం కన్నా కొన్ని కిమీల ఎత్తున ఉంటాయి. తెల్లని మిట్ట ప్రాంతానికి పల్లానికి మధ్య ఎన్నో మెలికలు తిరిగే లోయలు, దొలిచినట్టుండే కొండ చెరియలు, కేవలం తెలుపు గోధుమ వన్నెలతో వేసిన ఏవో సమకాలీన చిత్రకళాఖండాలలా మనోహరంగా ఉంటాయి.


ధృవప్రాంతాలని చుట్టుముడుతూ దాని నేపథ్యంలా ఎర్పడ్డ విశాలమైన మంచునేల (permafrost) ప్రాంతం ఉంటుంది. ఎత్తుల్లో ఉండే నేలలో ఎక్కువగా మట్టి, గడ్డకట్టిన నీరు కలగలిసి రాయిలా అతికఠినంగా ఉంటుంది. ఋతుచక్రానికి అనుసారంగా ఆ మంచునేల మళ్లీ మళ్లీ కరిగి గడ్డ కట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా ఏవో చిత్రవిచిత్రమైన ఆకృతులు ఏర్పడతాయి. వాటి హొయలు చూసి మోసపోయిన మన వారు కొందరు, అవన్నీ అక్కడి ’వాళ్లు’ కట్టిన ఇళ్లు, ఊళ్లు అనుకుని అపోహ పడ్డారు.


ధృవాల వద్ద మంచు కరిగిన నీరు గురించి చెప్పుకోవాలంటే అక్కడి ఋతువుల గురించి చెప్పుకోవాలి. భూమి కక్ష్య ఇంచుమించు వృత్తాకారంలో ఉంటుంది కనుక ఉత్తర గోళార్థం సూర్యుడివైపుకి వాలినప్పుడు అక్కడ ఎండాకాలం వస్తుంది. ఆ సమయంలో దక్షిణ గోళార్థంలో చలికాలం వస్తుంది. కాని మార్స్ కక్ష్య దీర్ఘవృత్తీయం కనుక, ఋతువులు గ్రహం యొక్క వాలు మీదే కాక, సూర్యుడినుండి దూరం మీద కూడా ఆధారపడతాయి.


మార్స్ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు (perihelion) దక్షిణ ధృవం సూర్యుడి వైపుకి వాలి ఉంటుంది. కనుక అప్పుడు అక్కడ ఎండాకాలం అన్నమాట. ఉష్ణోగ్రత ఆ సమయంలో 30 C దాకా పోవచ్చు.


మార్స్ సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఉత్తర ధృవం సూర్యుడి దిశగా ఒరిగి ఉంటుంది. కనుక అప్పుడు దక్షిణ ధృవం బాగా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత అక్కడ -140 C దాకా పోవచ్చు. అందుకే దక్షిణ ధృవాలలో వాతావరణ, ఉష్ణొగ్రతలు విపరీతంగా ఉంటాయి. మకాం పెడితే ఉత్తరాన పెట్టమనేది అందుకే!


ఆ(! ఆ నిర్జల, నిర్జన ప్రదేశంలో ఏం మకాంలే? అంటారేమో. నిజమే. నీరు ఉన్నా గడ్డ రూపంలో, కార్బన్ డయాక్సయిడ్ బండ కింద దాక్కుని ఉంది. అంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వెయ్యకండేం? ఉత్తర ధృవం వద్ద ఉండే గడ్డ నీటి ఘనపరిమాణం 1.6 మిలియన్ ఘన కిమీలు! అంటే అది గాని కరిగిందంటే వెయ్యి కిమీల వ్యాసం గల ఉత్తర ధృవ ప్రాంతం మొత్తం 2 కిమీల నీటి అడుగున ఉంటుందట.


ఇకనేం? ఆ ఐసుని కరిగిస్తే చాలు కాబోసు! బాంక్ లోను తీసేసుకోవచ్చు! చుట్టూ కంచెలు కట్టేసుకోవచ్చు! శంఖుస్థాపన ముహూర్తం పెట్టేసుకొవచ్చు!


ఏంటండీ! ముహూర్తం అనగానే నక్షత్రాల కేసి చూస్తున్నారు?


అబ్బ! చూసేశారా? వద్దు. అసలటు చూడనే వద్దు. అవి ఇల్లు కట్టుకోదగ్గ సైట్లు కావు. మార్స్ గ్రహపు సాటిలైట్లు! పరాయి చందమామలు! వాటిని నమ్ముకుంటే బతుకు అమావాస్యే అవుతుంది.
(సశేషం...)




మార్స్ మీద రెండు బహుచక్కని ఉల్కాబిలాలు



మార్స్ కి వెళ్లినప్పుడు అక్కడ తప్పనిసరిగా చూడదగ్గ రెండు ఉల్కాబిలాలు ఉన్నాయి. ఈ ఉల్కాబిలాల ప్రత్యేకత ఏంటంటే గతంలో నాసా పంపిన రెండు మార్స్ పర్యటనా వాహనాలు (వాటి పేర్లు Spirit మరియు Opportunity - కుక్కపిల్లల పేర్లలా ఉన్నాయంటారా?) అక్కడే వాలాయి. ప్రాచీన కాలంలో మార్స్ మరింత వెచ్చగా ఉండేదని, మరింత జలమయంగా ఉండేదని తేల్చడానికి సాక్ష్యాధారాలు కూడా అక్కడే దొరికాయి.



గసేవ్ ఉల్కాబిలం (Gusev crater)

(Sunset from Gusev crater - photo taken by Spirit)




170 కిమీల వెడల్పు ఉన్న ఈ ఉల్కాబిలానికి నడిబొడ్డులో దిగింది స్పిరిట్. మాదిమ్ వల్లిస్ (Ma'adim Vallis) అనే ప్రాచీనమైన, మెలికలు తిరిగే అగాధానికి (కోట్ల సంవత్సరాల పాటు జలప్రవాహాల కోత చేత మలచబడ్డ అగాధం ఇది) ఉత్తర కొసలో ఉందీ ఉల్కాబిలం. మిట్ట ప్రాంతాలలో ఉండే జలాలన్నీ ఈ అగాధం ద్వారా గసేవ్ ఉల్కాబిలంలోకి చేరేవి. కనుక ఆ ఉల్కాబిలానికి అడుగున ఉన్నదంతా అవక్షేపక శిలేనని నాసా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రవాహం మోసుకు వచ్చిన మట్టి ఉల్కాబిలం నేల మీద స్థిరపడి, అధికపీడనం వద్ద గట్టిపడగా ఏర్పడ్డ శిల ఇది.



(Image taken by Opportunity in Victoria crater)




మెర్డియానీ ప్లేనమ్ (Merdiani Planum)






రెండవ ఉల్కాబిలం అయిన మెర్డియానీ ప్లానమ్ లో Opportunity కి ఇందుకు పూర్తిగా భిన్నమైన కథనం కనిపించింది. అది దిగిన ప్రాంతం ఓ బల్లపరుపు ప్రాంతం. భూమ్మీద బాల్టిక్ సముద్రం అంత పెద్ద మహాసముద్రపు ఒడ్డున ఉండేదీ ప్రాంతం. ఇక్కడి రాళ్లలో హెమటైట్ ఖనిజం బాగా పుష్కలంగా ఉందని తెలిసింది. రాతిలో హెమటైట్ ఉన్కి నీటి ఉన్కికి చక్కని సంకేతం.



ఇంతవరకు వచ్చాం కనుక ఈ దగ్గర్లోనే ఉన్న మరో చూడదగ్గ ప్రదేశాన్ని కూడా చూసేస్తే ఓ పనయిపోతుంది. ఈ దరిదాపుల్లోనే Endurance అనే మరో చిన్న ఉల్కాబిలం ఉంది. ఈ ఉల్కాబిలం మార్స్ యొక్క అంతరంగానికి అద్దం పట్టినట్టు ఉంటుంది. దాని వెడల్పు 130 మీటర్లు మాత్రమే. పెద్దలోతుగా కూడా ఏమీ ఉండదు. కోవెలలో మెట్లకొలను లోకి దిగినట్టు కాలినడకని లోపలికి దిగొచ్చు. దాని గోడలలో కనిపించే రాతి స్తరాల నిండా అవక్షేపక శిలలే. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు జలమయమై ఉండేదని ఈ రాళ్లు చెప్తున్న సాక్ష్యం.



మార్స్ మీద ధూళి తుఫానులు



మార్స్ పర్యటన అంటే పర్వతాల నుండి తలాలకి, అక్కడి నుండి ఉల్కాబిలాలకి, ఇంకా దిగువన లోయల్లోకి వరుసగా గెంతుకుంటూ పోవడమే అనుకుంటున్నారేమో! దారిలో ఎదురయ్యే ప్రమాదాల అవగాహన లేకపోతే పర్యటన కాస్తా పరివేదనగా మారుతుంది! క్రూర మృగాలు, కిరాతక జీవులు లేని నిర్జన ప్రాంతమే అయినా మార్స్ మీద మనకి ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం ధూళి తుఫానులు. అసలు అందుకే మనం భూమి సూర్యుడికి దూరంగా (aphelion) ఉన్నప్పుడు ఈ యాత్ర తలపెట్టాం. గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు (perihelion), ఆ సౌరశక్తి చేత పోషించబడి కాబోలు, పెద్ద పెద్ద ధూళి తుఫానులు గ్రహోపరితలాన్ని అతలాకుతలం చేస్తాయి. ఈ తుఫానులు కొన్ని సార్లు ఒక ప్రాంతానికే పరిమితం అయినా, కొన్ని సార్లు గ్రహోపరితలం మొత్తం కార్చిచ్చులా వ్యాపిస్తాయి.



ఎర్రని మార్స్ ఇసుకని ఒక చోటి నుండి మరో చోటికి మోసుకుపోయే ఈ ఉధృత వాయుతరంగాల మార్గానికి ఏదైనా అవరోధం ఎదురైతే దాని వద్ద కొంత ఇసుక పోగవుతుంది. అలా పోగైన ఇసుక వల్ల క్రమంగా ఇసుక తిన్నెలు ఏర్పడతాయి. ఎర్రగా ఉవ్వెత్తున లేచిన ఇసుక తిన్నెల సొగసు ఎంతో కాల్పనిక విజ్ఞాన (science fiction) సాహిత్యానికి ఊపిరి పోసింది. ఈ ఇసుక తిన్నెల క్షేత్రాలు చిత్ర విచిత్ర ఆకృతులతో భూమి మీద ఎడారులని తలపించేవిగా ఉంటాయి.



అయితే భూమి మీద ఎడారులకి, అంగారక ఎడారులకి మధ్య ఓ ముఖ్యమైన తేడా ఉంది. భూమి మీద ఎడారుల మల్లె కాక, ఇక్కడ ఎడారులలో నీరు పుష్కలంగా ఉంటుంది. అయితే అది ద్రవ రూపంలో కాక, ఘనమైన మంచురూపంలో ఉంటుంది. గాల్లో ఉన్న తేమని ఇక్కడి ఇసుక పీల్చుకుంటుంది. ఇసుకలో మంచు రూపంలో ఉన్న ఈ తేమ ఇసుక రేణువులు దగ్గర పడేలా చేస్తుంది. ఈ అంతర్గత తేమ వల్ల ఇక్కడి ఇసుక, చక్కగా గంజి పెట్టిన అంగీలా, నిటారుగా లేచి గోడలుగా, చెరియలుగా ఏర్పడుతుంది. అలా లోపల చిక్కుబడ్డ తేమ కొన్ని సార్లు ఆవిరై తిరిగి గాల్లోకి పోతుంది. అలా ఆవిరైన తేమ వల్ల ఇసుకలో చీలికలు ఏర్పడతాయి. అలాంటి చీలికల వల్ల ఎడారులలో అల్లసాని వారి అల్లికని పోలిన ఇంపైన గజిబిజి రేఖలు ఏర్పడతాయి.



(సశేషం...)






Spirit, Opportunity చిత్రాల మూలం:http://en.wikipedia.org/wiki/Mars

ఒలింపస్ మాన్స్

Posted by V Srinivasa Chakravarthy 1 comments


ఒలింపస్ మాన్స్

థార్సిస్ కుంభ ప్రాంతంలో మొత్తం నాలుగు అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా పెద్దది ఒలింపస్ మాన్స్ . తక్కిన మూడింటి పేర్లు - ఆర్సియా, పావోనిస్, ఆస్క్రియస్ మాంటిస్. పృథ్వీ ప్రమాణాలతో చూస్తే మూడూ బృహన్నగాలే. ఇక ఒలింపస్ మాన్స్ అయితే అది నగలోకపు రారాజే. ఈ పర్వతం యొక్క పాదం నుండి చూస్తే దాని ఎత్తు అంతగా తెలిసి రాదు. ఎందుకంటే దాని ఎత్తు 27 కిమీలు అయినా, దాని వెడల్పు 500 కిమీలు! ఈ ఒలింపస్ మాన్స్
ఎలాంటి రాకాసి కొండో అర్థం కావాలంటే దాన్ని విమానం నుండి కూడా కాదు, అంతరిక్షం నుండి చూడాలి. పర్వతం అంత ఎత్తున్న పీటభూమిలా ఉంటుంది.
(దీని గురించి ఈ బ్లాగ్ లో ఇంతకు ముందు రాయడం జరిగింది. http://scienceintelugu.blogspot.com/2009/07/blog-post_06.html)

అంతరిక్షం నుండి చూస్తే పర్వతం పైనున్న అగ్నిబిలం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే caldera అంటారు. ఈ బిలం లోంచే గ్రహం అంతరంగం లో ఉండే లావా బయటికి తన్నుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పర్వతం నిష్క్రియంగానే ఉన్నా, మిలియన్ల సంవత్సరాలుగా అందులోంచి బయటికి తన్నుకొచ్చిన లావా బయటకు స్రవించి, పొరలు పొరలుగా గట్టిపడగా ఈ పర్వతం ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో మాత్రం ఒలింపస్ మాన్స్ విస్ఫోటం జరగలేదు. (అయితే ఇక్కడ ’ఇటీవల’ అన్నమాటని ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంలో వాడుతుంటారన్న సంగతి మర్చిపోకూడదు. భూగర్భ (అదే లేండి, అంగారక గర్భ) శాస్త్రవేత్తలని అడిగితే, ’ఇటీవల’ అంటే కేవలం కొద్ది మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు కూడా మార్స్ మీద అగ్నిపర్వతాలలో విస్ఫోటక చర్యలు జరిగాయి అంటారు. వాళ్లంతేలేండి! అయితే ఒకటి. ఐదు బిలియన్ల (అంటే ఐదు వేల మిలియన్ల) సంవత్సరాల వయసు గల సౌరమండలంలో కొన్ని మిలియన్ల ఏళ్లు అంటే ’ఇటీవలే’ మరి!)
caldera, లేదా అగ్నిబిలం అంటే కొండ మీద ఓ చిట్టి గొయ్యిని ఊహించుకుంటున్నారో ఏమో. దాని వెడల్పు 90 కిమీలు! అంటే ఒక అంచు వద్ద నించుంటే అవతలి అంచు కనిపించదు అన్నమాట. దాని అంచుల వద్ద ఉండే చెరియల ఎత్తే 6 కిమీలు! గ్రహం చిన్నదే గాని ఈ మార్స్ మీద ప్రతి ఒక్కటి మెగాసైజులో ఉంటుంది!

మార్స్ మీద మరి కొన్ని చూడదగ్గ ప్రదేశాల గురించి వచ్చే పోస్ట్ లో...


మార్స్ గ్రహం మీద కాలువలు ఉన్నాయా?

పందొమ్మిదవ శతాబ్దం అంతంలో మార్స్ ఉపరితలాన్ని దూరదర్శినితో పరిశీలించిన ఇటాలియన్ ఖగోళశాస్త్రవేత్త జియొవానీ షియాపరెల్లీకి మార్స్ గ్రహోపరితలం మీద పొడవాటి రేఖలు కనిపించాయి. వాటిని ఇటాలియన్ లో canali అని పిలుచుకున్నాడు. ఇటాలియన్ లో canali అన్న మాటకి అర్థం channel (సహజ కాలువ). కాని ఇంగ్లీషు వాళ్లు దాన్ని canal (కృత్రిమ కాలువ) గా అనువదించుకున్నారు. తను చూసిన ఆ కాలువలని చిత్రిస్తూ ఎన్నో మాపులు కూడా గీశాడు (చిత్రం). షియాపరెల్లీ తరువాత అమెరికాకి చెందిన పార్సివాల్ లొవెల్ అనే ఖగోళవేత్త ఈ భావనని ఇంకా ముందుకి తీసుకెళ్ళాడు. మార్స్ మీద ఉన్న నాగరక జీవులే ఈ కాలువలు నిర్మించారని అతడు భావించాడు. ఇక ఆనాటి నుండి మార్స్ ని పరిశీలించిన ప్రతి ఒకరికి, మన వినాయకుడి పాలారగింపులా, మార్స్ గ్రహోపరితలం నిండా కృత్రిమ కాలువల గజిబిజి గీతలే కనిపించాయి. మార్స్ గ్రహం మీద హిమానీ ధృవప్రాంతాలలో కరిగిన నీటిని ఈ కాలువలు గ్రహమధ్య రేఖ వద్ద ఉండే సస్యశ్యామల ప్రాంతాలకి తరలిస్తున్నాయన్న సిద్ధాంతం కూడా ఒకటి బయలుదేరింది. తదనంతరం ఇ.ఇ. బర్నార్డ్ అనే అమెరికన్ ఖగోళవేత్త ఈ సంగతి తేలుద్దామని మార్స్ పరిశీలనలకి పూనుకున్నాడు. తన పూర్వులు చూసిన కాలువలేవీ అతడికి కనిపించలేదు. తరువాత 1903 లో జె.ఇ.ఇవాన్స్ మరియు ఇ. మౌండర్ లు అదంతా కేవలం దృశ్య భ్రాంతి అని నిరూపించారు. క్రమంగా మరింత మెరుగైన పరికరాలతో చేసిన పరిశీలనల వల్ల ఆ కాలువల కథనం అంతా పుక్కిటి పురాణం అని తేలింది.



మార్స్ పై మారినర్ లోయ


మారినర్ వ్యోమ నౌక మొట్టమొదట కనుక్కుంది కనుక ఈ లోయకి మారినర్ లోయ అని పేరొచ్చింది. ఉండడానికి, ఊళ్లు నిర్మించుకోడానికి అనువుగా ఉండకపోయినా చూసి రావడానికి బాగానే ఉంటుంది. అయితే ఆ చెరియ అంచు వరకు లోయలోకి తొంగి చూడడానికి స్టీలు గుండె ఉండాలి. గుండె జబ్బుల వాళ్లకి అది నిషిద్ధం! ఎందుకంటే ఆ లోయ లోతు... ఎంత అనుకుంటున్నారు?... 100 అడుగులా? 1000 అడుగులా? ఉహు... 10 కిలోమీటర్లు!!! పైగా దుమారాల వల్ల చెరియ అంతా ఇసుక ఇసుకగా ఉంటుంది. మనం పాదం మోపినప్పుడు కింద నేల కొంచెం సడెలెనా? జీవితం పాతాళానికి ప్రయాణమే అవుతుంది!

అందుకే ఈ లోయని చూడాలంటే విమానం నుంచి చూడాలి. మార్స్ వాతావరణంలో విమాన యానం కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. వాతావరణం పలుచగా ఉండడంతో ఇక్కడ విమానానికి రెక్కలు బాగా విశాలంగా ఉండాలి. (భూమి ఉపరితలం వద్ద వాతావరణ పీడనంలో ఇక్కడ ఉపరితలం వద్ద వాతావరణ పీడనం నూరో వంతు ఉంటుంది.) కాని గ్రహం చిన్నది కనుక, గురుత్వం తక్కువ కనుక (భూమి గురుత్వంలో 0.38 వంతు) ఒక ఎత్తు వరకు గాల్లోకి లేస్తే చాలు, ఆ పైన సునాయాసంగా గాలిపటంలా తేలిపోతుంది.

---
సుబ్బారావ్: "ఏం బాబూ? గురుత్వం అంత తక్కువ అని ఇప్పుడంటున్నావ్! మా ఎముకలేంగావాలి?"
రియలెస్టేట్ ఏజెంటు: "ఎకరం రూపాయికి పోతోంది. ఎముకల కోసం చూసుకుంటారేంట్సార్?"
---


ఇంత వెడల్పయిన లోయ భూమి మీద ఎక్కడా చూసి ఉండరు. మార్స్ ముఖం మీద 600 కిమీల వెడల్పున్న గాటు ఈ లోయ. సూర్యోదయ సమయంలో గాల్లోకి లేస్తే తూరుపులో నింగి నేల కలిసే చోట, విడుతున్న పొగమంచు మాటున ఎర్రని కాంతుల చిరుమందహాసం మనసుని గిచ్చినట్టవుతుంది.



పేరుకి ఇది లోయ అయినా నదీ ప్రవాహం నేలని కోయగా ఏర్పడ్డ లోయ కాదిది. ఉత్తరంలో థార్సిస్ కుంభ ప్రాంతం పైకి లేస్తున్నప్పుడు ఆ భారానికి మార్స్ గ్రహపు పైపొర (crust) లో ఏర్పడ్డ పగుళ్లే ఈ లోయ అని ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం. నదీ ప్రవాహాల వల్ల ఈ లోయ ఏర్పడకపోయినా, ఒకసారి ఏర్పడ్డాక అక్కడ నీరు చేరుకుంది అనడానికి దాఖలాలు ఉన్నాయి. శిలాశాస్త్రం గురించి బాగా తెలిసిన వారు ఈ లోయల అంచుల వద్ద ఉండే పలువన్నెల రాతి స్తరాలలో ఉన్నది అవక్షేపక శిల (sedimentary rock) అని తెలుసుకుంటారు. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతం జలమయమై ఉండేదన్నమాట.

అయినా మీ పిచ్చి గాని, ఇంత దూరం వచ్చి పది కిలోమీటర్ల లోతున్న గోతిలో ఇళ్ళు కట్టుకుని బతికే బదులు, భూమి మీదే ఏ గనిలోనో తలదాచుకుని మహారాజులా బతకొచ్చు!!! పదండి. ఈ గోతి లోంచి బయటపడి ఇతర ప్రాంతాలు సందర్శిద్దాం.


(సశేషం...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts