(NASA image)
మార్స్ యాత్ర మీద ఎప్పుడు బయలుదేరాలి అన్న నిర్ణయం మార్స్ కక్ష్యకి సంబంధించిన ఒక వాస్తవం మీద ఆధారపడుతుంది. సూర్యుడి చుట్టూ భూమి కక్ష్య ఇంచుమించు వృత్తాకారంలో ఉంటుంది. కనుకనే భూమి మీద ఋతువులు ఎక్కువగా భూమి అక్షం యొక్క వాలు (tilt) మీదే ఆధారపడతాయి. కాని మార్స్ కక్ష్య దీర్ఘవృత్తీయంగా (elliptical), అంటే సాగదీసిన వృత్తంలా, ఉంటుంది. దాని సూర్యసమీపస్థానం (aphelion) వద్ద సూర్యుడి నుండి దూరం 249 మిలియన్ కిమీలు అయితే, సూర్యదూర స్థానం (perihelion) వద్ద దూరం 206 మిలియన్ కిమీలు అవుతుంది. మార్స్ సూర్యసమీపస్థానం వద్ద ఉన్నప్పుడు అక్కడ దిగామంటే గనక ఎర్రని ఇసుక దుమారాలలో చిక్కుపడిపోతాం. అయినా మీ స్పేస్ సూట్ రక్షణగా ఉంటుంది అనుకోండి. అయితే దుమారం ఉన్న సమయంలో కళ్లు పొడుచుకున్నా ఏమీ కనిపించదు కనుక మార్స్ గ్రహం సూర్యసమీపస్థానం వద్ద ఉన్నప్పుడే అక్కడికి చేరుకుందాం.
మీలో స్కీయింగ్ ఔత్సాహికులు ఎవరైనా ఉంటే, స్కీయింగ్ సామాను పట్టుకోవడం మర్చిపోకండి. ధృవాల వద్ద స్కీయింగ్ కి అనువైన చక్కని ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ ధృవం వద్ద కన్నా ఉత్తర ధృవం వద్దనైతే మరీను. అయితే అక్కడ మీరు స్కీయింగ్ చెయ్యబోయేది గడ్డ కట్టుకున్న నీటి మీద కాదు. ఘనీభవించిన కార్బన్ డయాక్సయిడ్ మీద! శీతాకాలంలో వాతావరణంలో పుష్కలంగా (95.72%) ఉండే కార్బన్ డయాక్సయిడ్ ఘనీభవించి ఈ డ్రై ఐస్ గా మారుతుంది. మళ్లీ వసంతంలో ఆవిరై గాల్లో కలిసిపోతుంది.
ఇక బయల్దేరుదామా?
---
"మార్స్ వచ్చేసింది... లేవండి, లేవండి! ..."
"అబ్బ! అంగారక దర్శనం! నారింజపండులా ఎలా వెలిగిపోతున్నాడో! ఒరేయ్ రాముడూ! ఓ రూపాయి కాసు ఉంటే ఇవ్వరా. కిందకి విసుర్తాను."
"లాభం లేదే బామ్మా! విసిర్నా ఆ రూపాయి కాసు కిందపడదు. గ్రహం చుట్టూ ఎప్పటికీ ప్రదక్షిణ చేస్తూ ఉండిపోతుంది. పుణ్యం అంతా దానికే, నీకేం రాదు!"
---
మార్స్ మీద వాలే ముందు అంతరిక్షం లోంచే కాసేపు దాని అందచందాలని తిలకిద్దాం. మనం వచ్చింది దుమారాలు లేని కాలం కనుక గ్రహం ఉపరితలం మొత్తాన్ని స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ గోళార్థాల (hemispheres) మధ్య తేడా ఇంత దూరం నుంచి బాగా కనిపిస్తుంది. ఉత్తర గోళార్థం నునుపుగా, పడిలేచే విశాల తలాలతో, మెలికలు తిరిగే లోయలతో, బృహత్తరమైన థార్సిస్ కుంభ ప్రాంతం (Tharsis bulge)తో రియాల్టర్లకి జీవనోత్సాహాన్ని కలిగించేలా ఉంటుంది. అదే దక్షిణ గోళార్థం అయితే తూట్లు పొడిచినట్టు లెక్కలేనన్ని ఉల్కాబిలాలతో (craters), మధ్యలో హెల్లాస్ అనే విశాల సైకత ప్రాంతంతో స్ఫోటకం వచ్చినట్టుంటుంది.
---
"మార్స్ గ్రహం మీద నార్త్-సౌత్ ఫీలింగ్ బాగా ఎక్కువంటారు, నిజమేనా మాష్షారూ?"
--
మార్స్ ది కచ్చితమైన గోళాకారం కాదు. ఉత్తర గోళార్థంలో ఉబ్బెత్తుగా లేచిన ఓ సువిశాల ప్రాంతం ఉంది. దాన్నే థార్సిస్ కుంభ ప్రాంతం అంటారు. అంతరిక్షంలో గ్రహాన్ని బాగా దూరం నుండి నిశితంగా చూస్తే దీన్ని కనిపెట్టొచ్చుగాని, కక్ష్యలో ప్రస్తుతం మనం ఉన్న ఎత్తు నుండి చూస్తే కనిపెట్టడం కష్టం. దాని వెడల్పు సుమారు 5000 కిమీలు, ఎత్తు సగటున దిగువ ప్రాంతాల మీద 10 కిమీలు ఉంటుంది. ఈ ఉబ్బెత్తు ప్రాంతం మీదే కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో మూడు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడే సౌరమండలంలోనే అతి పెద్దదైన ’ఒలింపస్ మాన్స్’ అనే అగ్నిపర్వతం ఉంది.
---
"ఈశాన్యంలో అగ్నిపర్వతంట! ఫరవాలేదంటారా శాస్త్రిగారూ?"
---
దక్షిన అంచు మీద విశాల అగాధమైన మారినర్ లోయ ఉంది.
మార్స్ ముఖం మీద ఇలాంటి కర్కశమైన, ఆదిమమైన రూపురేఖలన్నీ బాగా దూరం నుండి కూడా కనిపిస్తాయి. పందొమ్మిదవ శతాబ్దంలో మార్స్ ని పరిశీలించిన ఓ ఇటాలియన్ ఖగోళవేత్త ఇలాంటివి చూసే అవన్నీ నాగరిక జీవులు నిర్మించిన నీటికాలువలు అని భ్రమపడ్డాడు.
(సశేషం...)
సూర్యసమీపస్థానం (perihelion) వద్ద సూర్యుడి నుండి దూరం 206 మిలియన్ కిమీలు అయితే, సూర్యదూర స్థానం (aphelion) వద్ద దూరం 249 మిలియన్ కిమీలు అవుతుంది.అని ఉండాలనుకుంటా గురువుగారూ!
అవును. aphelion, perihelion నిర్వచనాలు తారుమారు అయ్యాయి. సారీ!