శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మరో గ్రహంపై మహానగరాలు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, December 23, 2009



(Mars city - artist's impression)
మరో గ్రహంపై మహానగరాలు

మార్స్ మీద కొంత కాలంగా వస్తున్న పోస్ట్ లలో ఇది ఆఖరి పోస్ట్. ఇందులో మార్స్ మీద నగర నిర్మాణం గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

మార్స్ మీద మనిషి పాదం మోపిన మర్నాటి నుండి నగర నిర్మాణం ఆరంభం కాదన్నది స్వయం విదితం. మొదటి చిన్న సంఖ్యలో మనుషులు అక్కడ నివసించడం మొదలుపెడతారు. వారి నివాసానికి మత్రం చిన్న చిన్న స్థావరాల ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రథమ నివాసాన్ని ’ఆల్ఫా’ అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. (ఆల్ఫా అనేది గ్రీకులో మొదటి అక్షరం అని వేరే చెప్పనక్కర్లేదు.) ఆ తరువాత నగరం (పోనీ చిన్న ఊరు, పేట) అని చెప్పుకోదగ్గ నిర్మాణాన్ని ’బీటా’ అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ ’బీటా’ కూడా మనం ఊహించుకునే విశాల వీధులతో, విస్తృత రవాణా సౌకర్యాలతో, భూమి మీద ఆధునిక మెట్రోలాగా ఏమీ ఉండబోదు. ఇది కూడా మహా అయితే ఒక చిన్న పరిశోధనా కేంద్రం లా, ఓ చిన్న క్యాంపస్ లా ఉంటుంది, ఎందుకంటే మొదట కొన్ని (బహుశ ఎన్నో) ఏళ్ల పాటు కొంత భద్రతా సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బంది మాత్రమే మార్స్ మీద జీవించబోతారు. సామాన్య పౌరులకి ఆ దశలో పెద్దగా పాత్ర ఉండదు.

మరి ఈ ప్రప్రథమ పురాల తీరుతెన్నులు ఎలా ఉండాలి అన్న విషయం మీద ఎంతో చర్చ జరుగుతోంది.

1. ఈ బీటా నగరాలు భూగర్భంలో ఉండాలని ఎంతో మంది సూచించారు. దీని వెనుక ముఖ్యోద్దేశం సూర్యరశ్మిలో హానికరమైన కిరణాల నుండి రక్షణను పొండడం. ఈ విషయంలో కిమ్ స్టాన్లీ రాబిన్సన్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఎంతో ముందుకు వెళ్ళారు. మార్స్ మీద జీవనం అనే అంశం మీద Red Mars, Blue Mars, Green Mars అనే అధ్బు తమైన నవలాత్రయాన్ని రాశారు. ఈ కథలో రమారమి క్రీ.శ. 2070 లో మొదలైన మార్స్ వలస కార్యక్రమం క్రమంగా పుంజుకున్నట్టు, మార్స్ మీద ఎన్నో నగరాలు నిర్మితమైనట్టు, వివిధ దేశాల జాతులు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నట్టు, స్పేస్ ఎలివేటర్ల సహాయంతో మార్స్ కి భూమికి మధ్య రాకపోకలు జరుగుతన్నట్టు, పెద్ద పెద్ద కృత్రిమ సౌర తెరల సహాయంతో మార్స్ ఉపరితలాన్ని కృత్రిమంగా వెచ్చజేసే సౌకర్యాలు ఉన్నట్టు – అంతా నమ్మశక్యం కానంత అద్భుత వాస్తవికతో, అసమాన ప్రతిభతో రాశారాయన.

నగర నిర్మాణ విషయంలో, ఈ కిమ్ స్టాన్లీ రాబిన్సన్, మార్స్ భూగర్భంలో మూడు అంతస్థుల వరకు పోయే ఇళ్లు కట్టుకుంటే బావుంటుందని సూచించారు. ఇలాంటి చిన్న చిన్న స్థావరాలలో 200 మంది దాకా జీవించొచ్చు. ఆ స్థావరంలో ఒక పక్క వివిధ వైజ్ఞానిక సౌకర్యాలు ఉంటాయి. మరో పక్క విశ్రాంతికి, మనోల్లాసానికి కావలసిన సౌకర్యాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా పరిశోధనలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి.
ఈ ఆలోచన సమంజసంగానే అనిపించినా దీన్ని వాస్తవీకరించడం కూడా అంత సులభవేం కాదు. అందుకే భారీ ఎత్తున ఉత్పత్తి చెయ్యగలిగేది, మర్స్ లోనే స్థానికంగా దొరికేదీ అయిన నిర్మాణ పదార్థాన్ని వాడాలంటారు రచయిత కిమ్ రాబిన్సన్. తన రెడ్ మార్స్ అన్న నవలలో మార్స్ లో ఉత్పత్తి అయిన ఇటుకలతో ఇళ్లు కట్టబడినట్టు వర్ణిస్తారు. అయితే ఇవి సామాన్యమైన ఇటుకలు కావు. వాతావరణంలోని CO2 మీద అధిక వత్తిడిని ప్రయోగించి తద్వారా వజ్రపు రజను తయారుచేసి, ఇటుకల మీద ఆ వజ్రపు రజను పూత వెయ్యాలని ఆలోచన. స్పేస్ షటిల్ లో వాడే ఉష్ణకవచ ఫలకాలు (heat shield tiles) లో వాడే RTV (Room Temperature Vulcanising) సిలికోన్ ని పోలిన పదార్థం ఈ ఇటుకల పదార్థం. ఈ RTV సిలికోన్ బాగా రాటు దేలి, వాతావరణానికి సంబంధించిన నానా రకాల ఒత్తిడులకి తట్టుకోగల పదార్థం. దీన్ని సినిమా సిట్టింగుల నిర్మాణంలో వాడతారు.

2. ఇక రెండవ పద్ధతి, మార్స్ మీద canyon లనే గోడలుగా చేసుకుని ఊరు నిర్మించే పద్ధతి.
1050-1300 నడిమి ప్రాంతంలో ప్రాచీన ప్వాబ్లో శకానికి చెందిన ప్వాబ్లో (Pueblo), అనసాజీ (Anasazi) మొదలైన అమెరికన్ ఇండియన్ తెగలు అలాంటి ఇళ్లలోనే ఉండేవారట. పొట్టి కొండల నడుమ, ఆ కొండల మధ్య సందుల్లో వాళ్లు ఇళ్లు కట్టుకునే వారట. అంగారక కనుమలలో, కొండల గోడల మధ్య బీటా నగరాన్ని నిర్మించాలని ఒక ఆలోచన.
ఈ బీటా నగరపు నిర్మాణానికి ఒక నెల నుండి, ఒక ఏడాది వరకు పట్టొచ్చు. అది ఎంత కాలం పడుతుంది అనేది మొదటి అక్కడి బృందంలో కూలీలు ఎంత మంది ఉన్నారు అన్నదాని మీద ఆధారపడుతుంది. కూలీలు తక్కువై, శాస్త్రవేత్తలు ఎక్కువైతే పని నెమ్మదిస్తుంది. మరో కీలకమైన విషయం అక్కడ నిర్మాణ పదార్థాలు ఎంత సులభంగా దొరుకుతాయి అన్నది. ముఖ్యంగా వజ్రపు రజను తయారుచెయ్యాలంటే చాలా సమయం, శక్తి అవసరమవుతాయి.

ఈ విధంగా ఎన్నయినా చెప్పొచ్చుగాని, చివరికి మార్స్ మీద నగర నిర్మాణానికి ఏది శ్రేష్ఠమైన పద్ధతి అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అందుకే ఇక్కడ ఊహాశక్తికి బాగా పదును పెట్టాల్సి ఉంది!

పద్ధతి ఎదేతైనేం ఈ విధంగా మొదటి తరానికి చెందిన చిన్నచిన్న ఊళ్ల నిర్మాణం జరుగుతుంది. అలాంటి ఇరుకైన, ఇబ్బందికరమైన వాసాలలో జీవిస్తూ మనుషులు అక్కడి పరిస్థితులకి అలవాటు పడతారు. మార్స్ వాతావరణాన్ని మానవ నివాస యోగ్యంగా మలచుకోవడానికి ప్రప్రథమ సన్నాహాలు చేస్తారు.

అలా కొంత కాలం పోయాక రెండవ తరం నగరాలు వెలుస్తాయి. ఈ రెండవ తరం నగరాలు మొదటి తరం నగరాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయంటాడు లిండన్ హెచ్. లరూష్ (జూనియర్) అనే ఓ నిపుణుడు. నేలమాళిగలో, కొండ గోడల మధ్య, దుర్భర నివాసాలకి బదులు, ఈ కొత్త ఊళ్లు మార్స్ ఉపరితలం మీద, విశాల వీధులతో, ఆకాశసౌధాలతో మహా వైభవంగా ఉంటాయి.

ఈ రెండవ తరం నగరాలలో, సగటు నగరం 20 చదరపు కిమీలు ఉంటుందని ఊహిస్తున్నాడు లరూష్ (జూనియర్). ఆ ఊరి మీదుగా అర్థగోళాకారంలో, ఓ ’డోమ్’ ఏర్పాటై ఉంటుంది. ఆ డోమ్ యొక్క పదార్థం తేలిగ్గా, చవగ్గా స్థానికంగా దొరికే పదార్థాలతో నిర్మితమై ఉండాలి. అంతే కాక అది పారదర్శకంగా కూడా ఉండాలి. అందువల్ల సూర్యరశ్మి ఊళ్లోకి ప్రవేశించడానికి వీలవుతుంది. పైగా పైన ఆకాశం కూడా ఇంపుగా కనిపిస్తుంది. అంతే కాక డోమ్ వల్ల ఊరికి ఒక విధమైన లోకోత్తర సౌందర్యం అబ్బుతుంది. మాగ్నెటిక్ లెవిటేషన్ మీద పని చేసే మెట్రో రైళ్లు ఊళ్లో మనుషులని, సరుకులని రవాణా చేస్తుంటాయి (image below).

“గతంలో మరే ఇతర మానవ తరం కన్నా మనకిప్పుడు నగర నిర్మాణంలో అనుపమాన సాంకేతిక సామర్థ్యం ఉంది. రాబోయే వేయేళ్ల పాటు నగర వాసులు మనకి కృతజ్ఞతలు చెప్పుకునేటంత గొప్పగా మనం ఈ నాడు నగరాలని నిర్మించగలం,” అంటాడు లారూష్.

మార్స్ లో నాగరక జీవనం ఎప్పుడు మొదలవుతుందో గాని, దానికి కావలసిన వ్యూహాలు, ఊహలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవన్నీ ఎప్పుడు సాకారం అవుతాయో, అసలు ఎప్పటికైనా అవుతాయో లేదో, కాలమే నిర్ణయించాలి.

మార్స్ ధరాసంస్కరణ ప్రక్రియ దీర్ఘ కాలం పాటు సాగే వ్యవహారం. మార్స్ ని ధరాసంస్కరించ గలిగితే ఇక ఇతర గ్రహాలని కూడా ఆ విధంగా సంస్కరించగలిగే అవకాశం ఏర్పడుతుంది. మార్స్ ని ధరాసంస్కరించలేకపోతే మాత్రం ఈ సౌరమండలంలోనే కాక, ఈ విశాల విశ్వంలో మరే ఇతర గ్రహాన్నీ ధరాసంస్కరించ లేము అన్నది వాస్తవం.

మార్స్ యొక్క ధరాసంస్కరణ, మానవావాసం ఆర్థికంగా కూడా ఫలదాయకమైన, లాభదాయకమైన విషయం. మార్స్ గ్రహం మీద ఖనిజ సంపత్తి సమృద్ధిగా ఉంది. పైగా పొరుగునే ఉన్న గ్రహశకల వలయం (asteroid belt) లో కూడా ఎంతో గొప్ప ఖనిజ నిధులు ఉన్నాయి. అలాగే మార్స్ మీద వాతావరణం ప్రాణవాయుపూరితమై, జలవనరులు కుదిరితే, గ్రహం సస్యశ్యామలం అవుతుంది. గురుత్వం తక్కువ కనుక మొక్కలు బాగా ఏపుగా ఎదుగుతాయి.

ఇవన్నీ నిజం కావాలంటే అనువైన రాజకీయ పరిస్థితులు అత్యవసరం. ప్రపంచ దేశాలు అన్నీ సామరస్యంగా పని చేస్తే గాని ఈ మహర్లక్ష్యం సాకారం కాదు. సమగ్ర మైన అవగాహనతో, సుహృద్ భావనతో కలిసి పని చేస్తే ఓ బంగరు భవితవ్యం మనది కాగలదు.

References:
1. http://www.redcolony.com/art.php?id=0012240
2. http://www.redcolony.com/art.php?id=061008a




2 comments

  1. భూమి ప్రతీ పదార్దన్ని ఎలా ఆకర్సింగలుగుతొంది సామాన్యులకు తెలిసేల వివరీంచంది.plese.

    సౌరకుటుంబం యొక్క ప్రారంభం మరియు పరిణామం video లొ చుదలనుకుంతె కింది లింక్స్ donload చెసుకొది.
    http://rapidshare.com/files/267954371/BBC_Space_E1_-_Star_Stuff.part1.rar

    http://rapidshare.com/files/267950491/BBC_Space_E1_-_Star_Stuff.part2.rar

    http://rapidshare.com/files/267954275/BBC_Space_E1_-_Star_Stuff.part3.rar

    http://rapidshare.com/files/267950371/BBC_Space_E1_-_Star_Stuff.part4.rar

     
  2. భూమి మాత్రమే కాదు, ఈ విశ్వంలో ద్రవ్యరాశి గల ప్రతీ వస్తువు ఇతర ద్రవ్యరాశులని ఆకర్షిస్తుంటుంది. అది ద్రవ్యరాశి యొక్క లక్షణం. ఆ ఆకర్షణ వస్తువుల ద్రవ్యరాశి మీద, వాటి మధ్య దూరం మీద ఆధారపడుతుంది. దీన్నే గురుత్వాకర్షణ అంటారు.
    1) ఆ ద్రవ్యరాశులు పెద్దవి అయితే వాటి మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి భూమి పెద్దది కనుక మనని బలంగా ఆకర్షిస్తుంది, కిందకి లాగుతుంది. కాని మన (మనుషుల) ద్రవ్యరాశి కొంచెం తక్కువ కనుక మన మధ్య ఆకర్షణ (నేను చెప్పేది గురుత్వాకర్షణ గురించి) కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మనం చంద్రుడి మీద నించుంటే, ఆకర్షణ ఉంటుంది కాని, భూమి ఆకర్షణ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది.
    2) అలాగే వస్తువుల మధ్య దూరం పెరుగుతున్న కొలది ఆకర్షణ తగ్గుతుంది. అందుకే ఆకాశంలో ఒక ఎత్తు వరకు పోయిన సాటిలైట్లు కింద పడకుండా తిరగగలుగుతాయి.
    ఈ రెండు లక్షణాలని కలుపుతూ గురుత్వాకర్షణ బలాన్ని తెలిపే సూత్రం ఇలా ఉంటుంది:

    ఈ A, B అనే వస్తువుల ద్రవ్యరాశుల విలువలు, ma, mb, అయితే, వాటి మధ్య దూరం r అయితే, వాటి మధ్య గురుత్వాకర్షణ బలం, F:
    F = G ma X mb/(r*r)
    ఇక్కడ G గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు.

    అయితే వస్తువుల మీద పని చేసే బలాలలో గురుత్వం ఒక ప్రత్యేక బలం మత్రమే. ప్రకృతిలో మరి ఇతర మూడు మూల బలాలు ఉన్నాయి. అవి – 2) విద్యుదయస్కాంత బలం (electromagnetic force), 2) కేంద్రకంలో రేణువుల (ప్రోటాన్లు + న్యూట్రాన్లు) మధ్య పని చేసే బలవత్తర బలం (strong force), 3) బలహీన బలం (weak force).

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts