జంతువులు మందలుగా ఎందుకు ఏర్పడతాయి?
జంతువులేం ఖర్మ, మనుషులు కూడా వందలు వందలుగా మందలుగా ఏర్పడతారు – దేశం మంద, జాతి మంద, ప్రజాస్వామ్య మంద, రాష్ట్రం మంద, ఇక ఇటీవలి కాలంలో ఫ్యాషనై పోయిన ఉపరాష్ట్ర మంద, మతం మంద, కులం మండ... సారీ అప్పుతచ్చు... కులం మంద (ఇది మహా ప్రమాదకరమైనది)... మనుషులు, ఆంటే మనం, ఎందుకు మందలుగా ఏర్పడతామో మనకి తెలుసు... తెలుసు అనుకుంటాం. ఉదాహరణకి కులం మందగా ఏర్పడితే రాజకీయ బలం సంక్రమిస్తుంది. ఎన్నికల్లో టికట్టు దక్కుతుంది, వోట్లు దొరుకుతాయి... అలాగే మతం మందలకీ ఈ బాపతు లాభాలు ఎన్నో ఉన్నాయి. కాని మొత్తం మీద ఇలాంటి మంద ప్రవృత్తి వల్ల మొత్తం మానవ సమాజం యొక్క అనుభవాన్ని గమనిస్తే, దాని వల్ల సౌకర్యం కన్నా సంఘర్షణే ఎక్కువగా మిగులుతున్నట్టు కనిపిస్తుంది. అందరికీ కష్టాలని పెంచే మందలుగా కాక, అందరికీ ఎదగడానికి వీలైనన్ని అవకాశాలని కల్పించి, సుఖశాంతులని పెంచే మంచి మందలుగా ఎలా ఏర్పడాలో, ఆ రహస్యం మనిషికి ఇంకా పట్టుబడినట్టు లేదు.
ఇలాంటి ధర్మసందేహాలు మనిషికేగాని, జంతువుల విషయంలో ఈ మంద ప్రవృత్తి సత్ఫలితాలని ఇస్తూ, ఇటు వ్యక్తిగత జీవానికి, అటు సమిష్టికి చక్కని సమతూనికకి దారితీస్తున్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న క్రిమి కీటకాల దగ్గర్నుండి, బలిష్టమైన జీవాలైన సింహాలు, ఏనుగుల వరకు కూడా మంద ప్రవృత్తి కనిపిస్తుంది. అలాగని అన్ని జంతు జాతులలోను మంద ప్రవృత్తి ఉంటుందని కాదు. ఉదాహరణకి పులులు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుతాయి. ఒంటరిగా వేటాడతాయి. ముఖం సీరియస్ గా పెట్టి, “I always work alone” అనే హాలీవుడ్ హీరోల లాంటివి పులులు! ఎప్పుడూ దండులు దండులుగా సంచరించే తేనెటీగలు వీటికి పూర్తిగా వ్యతిరేకం.
జంతువులు మందలు అన్నప్పుడు ఇక్కడ రెండు విభిన్న రకాల మందల మధ్య తేడాని గుర్తించాలి. కొన్ని జంతువుల మందల్లో లోతైన సాంఘిక సంబంధాలు కనిపిస్తాయి. వాటిని మందలు అనడం కన్నా ’సమాజాలు’ అనడం సమంజసమేమో. వాటికి బదులుగా ఉదాహరణకి ఈగలని తీసుకుంటే వాటిని సమాజాలు అనడం కన్నా కేవలం ’సమూహాలు’ అనడం సబబుగా ఉంటుంది. అయితే సమాజాలు, సమూహాలు అనే ధృవాల మధ్య వివిధ జంతు జాతులు ఎక్కడో మధ్యలో ఉంటాయి. కనుక మనం మాత్రం రెండిటినీ కలిపి సామాన్యంగా ’మంద’ గానే వ్యవహరిద్దాం.
మందలుగా ఎందుకు ఏర్పడతాయి అంటే ఒక్కొక్క జంతుజాతికీ ఒక్కొక్క కారణం. చిన్న కీటక జాతులతో మొదలుపెట్టి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
నీట్లో జీవించే ఫ్లీ (water fleas) అనబడే ఒక విధమైన కీటక జాతిలో ’మంద’ ప్రవృత్తి ఎంత అద్భుతంగా పని చేస్తుందో అల్లీ అనే శాస్త్రవేత్త, అతడి సహోద్యోగులు కలిసి ప్రయోగాలు చేసి చూశారు. ఈ ఫ్లీ లు క్షారవంతమైన నీటిలో (alkaline water) జీవించలేవని ముందుగా వీళ్లు చూపించారు. కాని అవి తగినంత పెద్ద సంఖ్యలో సమిష్టిగా నీట్లో ఉంటే, అవన్నీ విడిచే CO2 వల్ల నీరు కొద్దిగా ఆమ్లవంతమై, క్షారాన్ని విరుస్తుంది. నీరు తటస్థ స్థితికి దగ్గరగా వస్తుంది. ఫ్లీ అలాంటి నీటిలో మరింత సులభంగా మనగలవు.
ఫ్రూట్ ఫ్లై (fruit fly) అనే ఒక రకమైన ఈగ జాతిలో ఈ మంద ప్రవృత్తి యొక్క పర్యవసానాలు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. ఈ ఈగల సమూహాలలో మరీ పెద్ద సంఖ్యలో గుడ్లు ఉంటే, వాటిలోంచి వచ్చే లార్వేలు అన్నిటికీ తగినంత ఆహారం దొరకదు. కనుక సంఖ్య మరీ పెద్దదైతే మంచిది కాదు. అలాగని సంఖ్య మరీ చిన్నదైనా మంచిది కాదు. ఇవి తగినంత పెద్ద సంఖ్యల్లో ఉంటే ఆహారపదార్థాన్ని విచ్ఛిన్నం చేసి, యీస్ట్ (ఒక రకమైన శిలీంధ్రం) యొక్క ఉత్పత్తికి దొహదం చేసి, ఆహారం తగినంతగా మెత్తబడేట్టు చెయ్యగలవు. అలా సిద్ధం చెయ్యబడ్డ ఆహారాన్ని ఇతర లార్వా లు మరింత సులభంగా ఆరగించగలవు. కనుక లార్వాలలో ఒకవిధమైన సహకార ప్రవృత్తి కనిపిస్తోంది.
ఇలాంటిడే డిట్క్టో స్టీలియం డిస్కో ఇడియం అనే ఏకకణ జీవుల సమూహంలోనూ కనిపిస్తుంది. ఇవి నిజానికి మట్టిలో జీవించే ఒక రకమైన అమీబా జాతి. పరిసరాలలో ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవి వేరువేరుగా జీవిస్తుంటాయి. పరిసరాలలో ఆహర కొరత ఏర్పడి పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడితే ఇవి క్రమంగా ఏకీకృతం కావడం మొదలెడతాయి.
అవి అలా దగ్గర పడే ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ఆకలి’ వేసిన అమీబా కణాలు cAMP అనే పదార్థాన్ని వెలువరిస్తాయి. అది నలుదిశలా వ్యాపించి చుట్టూ ఉన్న ఇతర అమీబాలని చేరుతుంది. అది అందగానే ఇతర అమీబాలూ కూడా ’ఓహో! మీరు అన్నది మాకు వినిపించిందోచ్!’ అన్నట్టుగా, ప్రతిస్పందనగా అవి మరింత cAMP వెలువరిస్తాయి. ఆ విధంగా అమీబాలు ఉన్న ప్రాంతం అంతా cAMP పోగవుతుంది. ఇప్పుడు అమీబాలు cAMP తక్కువగా ఉన్న చోటి నుండి ఎక్కువగా ఉన్నచోటికి కదలడం మొదలెడతాయి. ఆ విధంగా ఒక రసాయనం ఎక్కువగా ఉన్న దిశగా కణం కదలడాన్ని రసాయనచలనం (chemotaxis) అంటారు. అలా cAMP ల ద్వారా సందేశాలు ఇచ్చి పుచ్చుకుంటూ, ప్రతీ అమీబా తన బంధుమిత్రులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటూ, అమీబా ’మంద’గా ఏర్పడతాయి. ఈ మంద ఒక చిన్న ముద్దలా ఉంటుంది. దీని పొడవు 2-4 mm ఉంటుంది. ఈ రాశిని slug అంటారు. ఈ స్లగ్ కేవలం కొన్ని కణాల రాశి అయినా, అది ఒక ప్రత్యేక జీవంలాగా కదలగలదు. అలా నెమ్మదిగా కదులుతూ ఆ “సామూహిక జీవం” ఆహర వనరులు ఉన్న ప్రాంతం వరకు పోతుంది.
ఇది మొదటి మెట్టు మాత్రమే. అలా దగ్గర పడ్డ అమీబా కణ రాశి ఇంకా ఇంకా సాంద్రమై, నిటారుగా నించున్న ఓ చిన్న నాళంలా, ఆకాశాన్ని సూచిస్తున్న చూపుడు వేలిలా, ఏర్పడుతుంది. ఈ నాళం ఇంకా ఇంకా సాగి, సన్నని కాడలా ఏర్పడి, దాని పై కొసలో చిన్న తలలాగా ఏర్పడుతుంది (ఎడమ పక్క చిత్రం). అప్పుడు ఆ తల పేలి, అందులో ఉన్న కణాలు బయట పడి నలుదిశలా వెదజల్లబడతాయి.
అంటే పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు ఈ ఏకకణ జీవులు కలిసికట్టుగా ఎన్ని విన్యాసాలు చెయ్యగలుగుతున్నాయో చూడండి. సంక్లిష్టమైన రసాయనిక సంభాషణలు జరుపుకుంటూ దగ్గర పడతాయి. ఒక సంఘనిత రాశిగా కదులుతాయి. ఆహారం కోసం వెతుకుతాయి. మళ్ళీ ఆహారం దొరకగానే వేరువేరుగా విడిపోతాయి. ఇంత తెలివితో కూడిన ఐకమత్యం తరచు మనుషుల్లోనే కనిపించదు. వీటికి ఇంత ’ఇంగితం’ ఎక్కణ్ణుంచి వచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది. మరీ విష్ణుమాయ అనకపోయినా, ప్రకృతి మహిమ అని సరిపెట్టుకోవాలి...
పై ఉదాహరణలో మంద ప్రవృత్తి వల్ల ఎవరూ బతకలేని పరిస్థితి పోయి, చాలా మంది బతకగలిగే పరిస్థితి ఏర్పడింది. మంద ప్రవృత్తి వల్ల మరో ముఖ్యమైన సత్ఫలితం కూడా ఉంది. అది శత్రు దాడుల నించి ఆత్మరక్షణ...
(సశేషం)
ఇలాంటి చిత్ర విచిత్రాలు ఈ ప్రకృతిలో ఎన్నో!!.చాలా చాలా బాగుంది.