శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
రాజకీయాల్లో ఎలా ఉన్నా, విజ్ఞానంలో ఏకత్వం అనివార్యం

ఈ పోస్ట్ కి "స్ఫూర్తి" ఇటీవల ఈ బ్లాగ్ లో వచ్చిన ఈ కింది వ్యాఖ్యానం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాదు.

"భూమి గురుత్వాకర్షణ శక్తి కి మూలం భూమి ద్రవ్యరాశి ఎంతమాత్రము కాదు ఓంకార శబ్దాన్ని ప్రణవ నాదం మరియు బ్రహ్మ నాదమని అంటారని చెప్పిన విషయం అక్షర సత్యం కానీ ఈ ఓంకార శబ్దం అనేది సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల శక్తుల సమ్మేళనం సూర్యునిలో ఐక్యమైనప్పుడు వెలువడె శబ్దాల ఐక్య రాగం దీనినే పాశ్చాత్యులు విశ్వసంగీతం అంటున్నారు ఈ క్రమంలొ సూర్యుని నుండి తిరిగి విశ్వం లోనికి విడుదలయ్యే శక్తి ని గ్రహాలు శక్తి మార్పిడి క్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి ఇదే మూలాధార శక్తి ఈ మూలాధార శక్తి ఉప గ్రహాల ప్రమేయంతో ఆయా గ్రహాల పై వాతావరణం సృస్టించబడుతుంది భూ వాతావరణంలో వివిధ రకాల జీవజాతులు వివిధ జీవనాధార శక్తులతో జీవనం సాగిస్తూ ఉన్నాయి ఈ జాతులన్నీటి జీవనాధార సహజీవన శక్తుల సమ్మేళనమే ప్రకృతి శక్తి."

పై వివరణ నాకు ససేమిరా అర్థం కాలేదు.
1) ఓంకారం, 2) బ్రహ్మనాదం, 3) విశ్వసంగీతం, 4) గ్రహాల శక్తులు (?), 5) మూలాధార శక్తి... ఆ మాటలు వింటుంటే ఏదో విదేశీ భాష వింటున్నట్టు ఉంది. దీన్ని విజ్ఞానం కన్నా కవిత్వం అంటే మేలు.


దీనికి స్పందించాలని ఉంది. (అసలు ఈ బ్లాగే ఒక విధంగా ఇలాంటి (ప్రమాదకరమైన) ఒరవడికి ఒక స్పందన.) కాని ఎక్కడ మొదలుపెట్టాలో కూడా అర్థం కావడం లేదు...


మన దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్లనో, (సరిగ్గా జీర్ణం కాని) ప్రాచీన భావనల పట్టు బలంగా ఉండడం వల్లనో, సుదీర్ఘ విదేశీ పాలన వల్లనో (కారణాలు ఎన్నెన్నో...) మరి భౌతిక ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, విశ్వం పట్ల సామాన్య ప్రజలలో ఎన్నో విచిత్రమైన, విడ్డూరమైన భావనలు చెలామణిలో ఉన్నాయి. వాటిలో చాలా మటుకు పారంపర్యంగా వస్తున్న అనిర్ధారిత నమ్మకాలు.

నమ్మకాలు వేరు, జ్ఞానం వేరు. ముందు అందరం నమ్మకంతోనే మొదలుపెడతాం. కాని ఆ నమ్మకాన్ని యదార్థం అనే గీటు రాయి మీద పరీక్షించినప్పుడు, ఆ నమ్మకం స్థానంలో జ్ఞానం వచ్చి చేరుతుంది. ఆ విధంగా నమ్మకం, జ్ఞానంగా మారే పద్ధతే వైజ్ఞానిక పద్ధతి.
నమ్మకం అలా నమ్మకం స్థానంలోనే మిగిలిపోవడం ప్రమాదకరం. అది వీలైనంత త్వరంగా జ్ఞానంగా మారాలి.

సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఒక విషయం మీద వివిధ వ్యక్తులకి ఎంతటి వైవిధ్యంతో కూడిన నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నా ఫరవాలేదు. కాని శాస్త్రరంగంలో అది చెల్లదు. ఒక నమ్మకం సరైనదా, తప్పుడుదా అన్న పరీక్ష జరపాల్సిందే. యదార్థం అనే జల్లెడతో తప్పుడు నమ్మకాలని ఏరివేయాల్సిందే.

విశ్వ చలనాల గురించి, ప్రకృతి గతుల గురించి ఇంచుమించు వర్తమాన ప్రపంచం అంతా సమ్మతిస్తున్న ఒక విశ్వదర్శనం, ఒక ఆధునిక దృక్పథం ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా, పదే పదే తిరస్కరిస్తూ, ఏవో బూజు పట్టిన భావాలని పట్టుకుని వేలాడుతూ, వైజ్ఞానిక విషయాలలో కూడా ఎవరి తోచినట్టు వాళ్లు వ్యాఖ్యానం చేసే ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాకరమైన పరిస్థితి అనిపిస్తుంది.

ఆ మధ్యన ఎవరో ఒక తెలుగు బ్లాగులో రాస్తున్నారు. చంద్రుడి మీద నీరు కనుక్కోబడ్డ నేపథ్యంలో ఆ బ్లాగర్ ఎవరో ఆ ఆవిష్కరణ అసలు పెద్దగా ఆశ్చర్యకరమే కాదని, మన పురాణాలలో అదంతా ఎప్పటినుంచో ఉందని రాస్తున్నారు. అదెలాగయ్యా అంటే, "శివుడి తల మీద గంగ ఉంటుంది. అక్కడే శశిరేఖ కూడా ఉంటుంది. గంగాజలం ఎప్పుడూ శశిరేఖ మీద పడుతూ ఉంటుంది" కనుక చంద్రుడి మీద నీళ్లు ఉండడం కొత్తేమీ కాదు! ఇదీ వాదన.

ఇది నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి. నిజానికి రెండూ కాక, బాధపడాల్సిన, భయపడాల్సిన పరిస్థితి. విశ్వాన్ని గురించి ఎవరి తోచినట్టు వాళ్లు ఊహించుకుంటూ బతుకుతుంటే, మనం యదార్థంతో వ్యవహరించడం లేదు. మన భ్రమలలో బతుకుతున్నాం. సమాజానికి అదంత శ్రేయస్కరం కాదు.

ప్రస్తుత సమాజంలో మరో విపరీతమైన ఒరవడి కనిపిస్తోంది. అది - a crude, unenlightened cultural chauvinism. మన ప్రాచీన సంస్కృతికి చెందిన ప్రతీ అంశం నిర్దోషమైన, పరిపూర్ణమైన విషయం అన్న భావన. వాటి గురించి ఎవరు ఏమన్నా విరుచుకు పడిపోతారు. అలా అన్నవాడికి భారతీయ విషయాల మీద గౌరవం లేదు, వాడో దేశ ద్రోహి! ఇదీ వరస!

వేదాలు ఎన్ని ఉన్నాయో, వాటి పేర్లు ఏమిటో, వాటిలో సారాంశంగానైనా ఏముందో తెలీని వాళ్లు కూడా ’ఓహో! మా వేదాలు’అని ముచ్చట పడిపోతుంటారు. మనకి అవి ఏంటో కూడా తెలీనప్పుడు, వాటిని చూసి ఎలా గర్వపడగలం? ఇలాంటి diehard cultural chauvinists లో ప్రాచీన భారత సంస్కృతి గురించి లోతైన జ్ఞానం కలిగి, ఆ అధికారంతో మాట్లాడగలిగే వారు చాలా అరుదు అనిపిస్తుంది. ప్రాచీన విషయాలని గ్రామ్ ఫోన్ రికార్డుల్లా, వాళ్లకి కూడా అర్థం కాకపోయినా, గుడ్డిగా వల్లించే వాళ్లే ఎక్కువగా తారసపడుతుంటారు.


నేను చెప్తున్నదాన్ని దయచేసి అపార్థం చేసుకోకండి. My intention is neither to demean ancient India nor to unconditionally celebrate modern science. Let both our condemnation or appreciation be based on solid knowledge and understanding of the thing we are dealing with. If we wish to defend our culture, let that defence be based on firm grasp of our culture. How can we defend something that we hardly understand, something that we ourselves have never taken the trouble to study sufficiently deeply?


గత మూడు, నాలుగు శతాబ్దాలుగా విజ్ఞానం ఒక రకమైన విశ్వదర్శనాన్ని నిర్మించింది. అది రాజకీయాలకి, సంస్కృతులకి, మతాలకి, జాతులకి, దేశాలకి అతీతమైన దృక్పథం. ఆ దృక్పథం ఏంటి అన్నది అంత ముఖ్యం కాదు. ఎందుకంటే మరో నూరేళ్లలో ఆ దర్శనం పూర్తిగా మారిపోవచ్చు. ఆ దృక్పథం ఎలా వచ్చింది అన్నదే ముఖ్యం. కేవలం నమ్మకాలతో ఆగిపోకుండా, అనుభవం మీద ఆధారపడుతూ, ఒక విషయాన్ని పదే పదే, పదే పదే, పదే పదే ప్రయోగం అనే గీటురాయి మీద పరీక్షిస్తూ అతి జాగ్రత్తగా నిర్మించిన విశ్వదర్శనం అది.

రాజకీయ విషయాల్లో ఎలాగూ అందరం ఒక దాని మీద ఏకీభవించలేకపోతున్నాం. అందుకే అడుగడుగునా విభజన తప్ప మనకి వేరే మార్గాంతరం కనిపించడం లేదు. కాని వైజ్ఞానిక విషయాల్లో మనకి ఆ అవకాశం లేదు. మనకి నచ్చినా నచ్చకున్నా, నమ్మకం ఉన్నా లేకున్నా, ప్రకృతి కొన్ని నియత ధర్మాలని అనుసరిస్తూ పని చేస్తుంది. వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకుని, కనీసం ఆ రంగంలోనైనా ఒక ఏకీభావానికి రావడం ఆరోగ్యకరం, అత్యవసరం కూడా.

1 Responses to రాజకీయాల్లో ఎలా ఉన్నా, విజ్ఞానంలో ఏకత్వం అనివార్యం

  1. Anonymous Says:
  2. "దేశ ద్రోహి"అని అన్నా భయపడాల్సిన పనిలేదు గురువుగారూ!.నిజాలను నిర్భయంగా చెప్పాలి,తప్పదు.
    వారు,మన అమాయక ,మూర్ఖ సోదరులే(సోదరీమణులే)ననుకుని క్షమించేద్దురూ!.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts