కర్డషేవ్ వర్గీకరణ ప్రకారం సగటున 10^26 Watts power ని ఖర్చు పెట్టే నాగరికత 2 వ రకం నాగరికత అవుతుంది. సాగన్ ప్రతిపాదించిన సూత్రంలో ఈ విలువని ప్రతిక్షేపిస్తే,
K = (log10(W) - 6)/10
వచ్చే K విలువ 2 అవుతుంది.
అంత శక్తి కావాలంటే ఆ నాగరికత కేవలం అది ఉన్న గ్రహం మీద ఉన్న వనరుల మీద ఆధారపడితే సరిపోదు. దాని సమీపంలో ఉన్న తార వెలువరించే శక్తి మొత్తాన్ని గ్రహించి వాడవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక సెకనుకి మన సూర్యుడి నుండి వెలువడే శక్తి విలువ 3.86 X 10^26 Watts. మరి అంత శక్తి కావాలంటే గ్రహోపరితలం మీద సూర్య కాంతిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చగల సోలార్ కలెక్టర్ల ని పెట్టుకుంటే సరిపోదు.
పెద్ద పెద్ద వ్యోమ నౌకలని అంతరిక్షంలోకి పంపించి, సౌరశక్తిని గ్రహించి నేరుగా గ్రహం మీదకి ప్రసారం చెయ్యగలగాలి.
తార నుండి ఆ విధంగా భారీ ఎత్తున శక్తిని గ్రహించేందుకు గాను ఫ్రీమన్ డైసన్ (Freeman Dyson) అనే భౌతిక శాస్త్రవేత్త ఓ సాహసోపేతమైన ఉపాయాన్ని సూచించాడు. దాన్నే డైసన్ గోళం అంటుంటారు.
డైసన్ గోళం (Dyson sphere): సూర్యుడు/తార చుట్టూ గోళాకారంలో పెద్ద సంఖ్యలో సౌర ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. తార నుండి వచ్చే శక్తిని అవి గ్రహించి గ్రహం మీదకి తంతిరహిత (wireless) పద్ధతి ద్వారా శక్తిని ప్రసారం చేస్తాయి. ఆ స్థాయిలో శక్తిని గ్రహిస్తే గాని అధునాతన నాగరికతలకి సరిపడేటంత శక్తిని ఉత్పత్తి చెయ్యడం సాధ్యం కాదని ఊహించిన డైసన్ 1959 లో తన ఆలోచనని ఒక వ్యాసంగా రాసి ప్రఖ్యాత ’సైన్స్’ పత్రికలో ప్రచురించాడు. అయితే డైసన్ కి ఈ ఆలోచన 1937 లో వెలువడ్డ ’Star maker’ అనే కాల్పనిక విజ్ఞాన నవల చదవగా వచ్చిందట. డైసన్ గోళం అనే భావనకి మార్గాంతరాలుగా ఇతర భావనలు కూడా కొందరు వెలిబుచ్చారు.
వాటిలో అత్యంత సరళమైనది డైసన్ వలయం (Dyson ring) (చిత్రం చూడండి). ఇందులో పెద్ద సంఖ్యలో సౌర ఉపగ్రహాలు సూర్యుడి చుట్టూ వలయాకారంలో తిరుగుతుంటాయి. ఆ వలయం యొక్క వ్యాసార్థం 1 Astronomical Unit (A.U.) (=149, 597, 871 kms). ఒక్కొక్క సౌర ఉపగ్రహం యొక్క వ్యాసం 10^7 kms (భూమికి చంద్రుడికి మధ్య దూరానికి ఇది 25 రెట్లు) ఉంటుందట. పక్క పక్క ఉండే ఉపగ్రహాల మధ్య ఎడం 3 డిగ్రీలు ఉంటుందట. అంటే మొత్తం వలయంలో 120 ఉపగ్రహాలు ఉంటాయి. ఈ ఉపగ్రహాలన్నిటిని ఒక్కసారే నిర్మించి అంతరిక్షంలోకి పంపనక్కర్లేదు. మెల్ల మెల్లగా దీర్ఘకాలం పాటు పంపించుకోవచ్చు నంటాడు డైసన్. నాగరికత యొక్క శక్తి వినియోగం పెరుగుతుంటే, క్రమంగా ఈ ఉపగ్రహాల నుండి వచ్చే శక్తి మోతాదు కూడా పెరుగుతుంటుంది.
ఆ స్థాయిలో శక్తిని ఉత్పత్తి చెయ్యగల నాగరికత 2 వ రకం నాగరికత అవుతుంది. ప్రఖ్యాత కాల్పనిక విజ్ఞాన టీ.వీ. సీరియల్ ’స్టార్ ట్రెక్’ లో వర్ణించబడ్డ ’సమైక్య గ్రహ కూటమి’ (United Federation of Planets) ఈ 2 వ రకం నాగరక దశలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న నాగరికత.
ఈ రకం నాగరికత బ్రహ్మాండమైన శక్తిని ఉత్పన్నం చెయ్యగలగడమే కాక, ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాల బారి నుండి కూడా సమర్థవంతంగా తనను తాను రక్షించుకోగలుగుతుంది.
ఉదాహరణకి అంతరిక్షం నుండి రాలి పడే ఉల్కల బెడద నాగరికత గల గ్రహాలకి ఎప్పూడూ ఉంటుంది. భూమి మీద ఉండే దట్టమైన వాతావరణం ఈ ఉల్కల బారి నుండి మనను కొంతవరకు రక్షిస్తుంది.. అయితే ఆ ఉల్క తగినంత చిన్నది అయితేనే వాతావరణం అలాంటి రక్షణ కల్పించగలదు. ఉల్క వ్యాసం 150 m కన్నా పెద్దది అయినా, భూమి నుండి దాని దూరం 7.7 X 10^6 km కన్నా తక్కువైనా, ఆ ఉల్క భూమికి హాని చెయ్యగలదని అంచనా. భూమికి నలుదిశలా మొహరించి ఉండే ఈ వస్తువులని Near Earth Objects (NEOs) అంటారు. అధునాతన సాంకేతిక సత్తా గల రెండవ రకం నాగరికతకి ఇవో లెక్క కాదు. పరమాణు బాంబులని ప్రయోగించి ఈ మహమ్మారి ఉల్కలని ఛిద్రం చెయ్యడం గాని, లేక తగినంత దూరం నుండే వాటి ఆగమనాన్ని గుర్తించి, రాకెట్లతో వాటి మార్గాన్ని మళ్లించడం గాని చెయ్యగలవు.
అలాగే భూమి మీద చక్రికంగా వస్తూ జీవ రాశి మొత్తాన్ని జీవసమాధి చేసే హిమయుగాలని (ice ages) కూడా నివారించగల అద్భుతమైన సాంకేతిక శక్తి ఈ రకం నాగరికతకి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అవసరమైతే భూమి ఆత్మభ్రమణ వేగంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం, ధృవ ప్రాంతాలకి చెందిన శీతల వాయుధారల (jet streans of polar ice caps) దారి మళ్లించడం వంటివి చేసి, హిమయుగాలని నివారించగలవని ఆలోచన.
ఇంత శక్తిసామర్థ్యాలు ఉన్నా ఈ రకం నాగరికతని వినాశనం చెయ్యగల ప్రకృతి సహజమైన పరిణామాలు లేకపోలేవు.
ఉదాహరణకి ఆ నాగరికత సమీపంలో ఉన్న తార సూపర్నోవాగా మారితే, ఆ విస్ఫోటంలో పుట్టిన అతి శక్తివంతమైన X-కిరణాల వల్ల ఆ నాగరికత అంతా మాడి మసైపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిణామం నిజంగా వచ్చేలా ఉంటే, దాన్ని కొన్ని శతాబ్దాల ముందే గుర్తించి, పెద్ద పెద్ద వ్యోమనౌకలు నిర్మించుకుని, పెద్ద సంఖ్యలో మనుషులని/జీవులని, తగినంత దూరంలో ఉన్న, సురక్షిత పరిస్థితులు గల తారా వ్యవస్థల వద్దకి తరలించగలవు.
ఆ విధంగా రాజకీయ స్థిరతని సాధించి, ప్రకృతి ఉత్పాతాలని జయించి, బ్రహాండమైన శక్తిని ఉత్పన్నం చేసుకుని వైభవంగా బతకగలుగల ఈ రెండో రకం నాగరికత ఇంచుమించు అమరమైన నాగరికతే అవుతుంది. అంత శక్తి వంతమైన నాగరికత యొక్క పరిణామంలో తదుపరిమెట్టు, ఉన్న గ్రహాన్ని, సౌరమండలాన్ని విడిచి పెట్టి, ఇతర తారలని, వాటి పరిసరాలలో ఉండే జీవన అవకాశాలని అన్వేషించడమే. అలాంటి అన్వేషణకి ఫలితంగా ఆ నాగరికత మూడో రకం నాగరికతగా వికాసం చెందుతుంది.
(సశేషం...)
0 comments