1905 ఆధునిక విజ్ఞానం ఓ పెద్ద మలుపు తిరిగిన సంవత్సరం. ఐన్స్టయిన్ తన సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రచురించిన సంవత్సరం. ఆ ఏడాది మిల్టన్ హుమాసన్ జీవితం కూడా ఓ ముఖ్యమైన మలుపు తిరిగింది. పద్నాలుగేళ్ల మిల్టన్ ఆ వేసవిలో కాలిఫోర్నియాలో, లాస్ ఏంజిలిస్ కి కాస్త ఉత్తరాన ఉన్న పాసడేనా కి చేరువలో ఉన్న మవుంట్ విల్సన్ మీద సమ్మర్ క్యాంపుకి వెళ్ళాడు. చల్లని పచ్చిక మీద పడుకుని చీకటి ఆకాశంలో మినుకు మినుకు మంటున్న తారలని తనివి తీరా చూసుకుంటూ వేసవి నెలలు గడిపేశాడు. తిరిగి ఇంటికి, బడికి వెళ్లాలని అనిపించలేదు. కాని వెళ్లక తప్పింది కాదు. ఆ పర్వతం, ఆ పరిసరాలు బాగా నచ్చేశాయి. ఇంటికి వెళ్లాక వాళ్ల అమ్మ, నాన్నలతో ఆ విషయమే నసుగుతూ చెప్పాడు. వాళ్లది పెద్దగా ఉన్న కుటుంబం కాదు. పైగా మిల్టన్ కూడా బడి చదువులలో రాణించే రకం కాదని వారికి తెలుసు. మౌంట్ విల్సన్ దరిదాపుల్లో ఏదైనా ఉద్యోగం వెతుక్కుని ఓ ఏడాది పాటు పని చెయ్యడానికి తల్లిదండ్రలు ఒప్పుకున్నారు. మౌంట్ విల్సన్ హోటెల్ లో ఓ పని కుర్రాడిగా చేరాడు మిల్టన్. ఏడాది కాలం పాటు అలా కష్టపడ్డాక కాలేజి మీదకి పిల్లవాడి మనసు మళ్లొచ్చని తల్లిదండ్రులకి ఒక ఆశ. కాని అలాంటిదేం జరక్కపోగా మౌంట్ విల్సన్ మీద మిల్టన్ ప్రేమ మరింత హెచ్చయ్యింది.
దానికి కారణం ఆ రోజుల్లో ఆ పర్వతం మీద వస్తున్న కొన్ని మర్పులే. 1905 కాలంలో ప్రపంచంలో అతి పెద్ద దూరదర్శిని (telescope) ఉన్న వేధశాల (observatory) నిర్మాణం మౌంట్ విల్సన్ మీదే జరుగుతోంది. ఆ నిర్మాణ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వాడు జార్జ్ హేల్ అనే ఖగోళశాస్త్రవేత్త. ఈ పెద్దమనిషి 24 వయసులోనే 1892 లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఖగోళశాస్త్ర ప్రొఫెసర్ గా చేరాడు. బాగా ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. కొడుకు పరిశోధనలకి పనికొస్తుందని ధనికుడైన తండ్రి 60 ఇంచిల (1.5 m) వ్యాసం అద్దం ఉన్న పరావర్తన దూరదర్శిని (reflecting telescope) కొనిచ్చాడు. దాన్ని ప్రతిష్ఠంచడానికి ఇప్పుడో వేధశాల కావాలి అంతే! వాషింగ్ టన్ లో కార్నెగీ సంస్థ ఇచ్చిన $150,000 విరాళంతో 1904 లో వేధశాల నిర్మాణం మొదలయ్యింది.
1905 కి నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇరుకైన మట్టి రోడ్ల మీద, మ్యూల్ అనే జంతువులు లాగుతున్న బళ్ల మీదకి, విలువైన సాంకేతిక సామగ్రిని ఎక్కించి కొండ మీదకి తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కుర్రాడైన మిల్టన్ కి చాలా ఆసక్తికరంగా అనిపించింది. తన హోటెల్ ఉద్యోగం వొదిలిపెట్టి మ్యూల్ బళ్లు తోలే డ్రైవర్ గా చేరాడు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే ఓ మేస్త్రి కూతుర్ని ప్రేమించి పెళ్లాడాడు.
కాలిఫోర్నియాలోనే ఓ చక్కని ద్రాక్ష తోట కొనుక్కుని నూతన దంపతులు హాయిగా స్థిరపడ్డారు. జీవితం సాఫీగా నడిచిపోతున్నా ఒక పక్క మౌంట్ విల్సన్ వేధశాల మిల్టన్ మనసుని పీకుతోంది. అలా ఉండగా ఆ వేధశాలలో ప్యూను ఉద్యోగం ఖాళీగా ఉందన్న వార్త వచ్చింది. ఆ వార్త తెచ్చింది ఎవరో కాదు – మిల్టన్ మామగారే! బంగారం లాంటి ద్రాక్ష తోటని అమ్మేసి, చీకూ చింతాలేని జీవితాన్ని కాదనుకుని, మౌంట్ విల్సన్ వేధశాలలో పనివాడుగా చేరాడు మిల్టన్ హుమాసన్. మొదట్లో కాఫీ చెయ్యడం, వేధశాలని శుభ్రం చెయ్యడం లాంటి చిన్న చితక పనులు చేసేవాడు. సాంకేతిక విషయాల పట్ల స్వతహాగా ఆసక్తి గల వాడు కనుక క్రమంగా దూరదర్శిని సరైన దిశలో తిరిగి ఉందో లేదో చూసుకోవడం, ఫోటాగ్రాఫిక్ ప్లేట్లు కడగడంలో సహాయపడడం లాంటి సాంకేతిక అంశం గల పనులలోకి ప్రవేశించగలిగాడు. ఇన్ని చేస్తే తీరా తన నెలసరి జీతం $80 మాత్రమే! జీవితంలో వచ్చిన ఈ హఠాత్ మార్పుకి భార్య అతణ్ణి క్షమించిందో లేదో సమాచారం లేదు!
మిల్టన్ అక్కడ పని చెయ్యడం మొదలెట్టిన కొత్తల్లో అంతరిక్షాన్ని ఫోటోలు తీసే పనిని ఖగోళశాస్త్రవేత్తలే చేసేవారు. ఈ పనిలో చాలా శ్రమ, సహనం అవసరం అవుతుంది. దూరదర్శిని మీదకి వంగి గంటల తరబడి ఓపిగ్గా లక్ష్యం కోసం కనిపెట్టుకుని ఉండాలి. తారావళులని ఫోటోలు తియ్యడం అంటే ఊరికే ఓ సారి ’క్లిక్’ మనిపిస్తే సరిపోదు. లక్ష్యం దిక్కుగా దూరదర్శినిని గురి పెట్టి గంటల తరబడి అలాగే పిల్మ్ ని ’ఎక్స్ పోజ్’ చెయ్యాలి. కొన్ని సార్లు అలా 40
గంటల వరకు కూడా ’ఎక్స్ పోజ్’ చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఫోటో ఒక్క రాత్రిలో పూర్తి కాదన్నమాట. వరుసగా పలు రాత్రులు ఫోటో తీసే కార్యక్రమాన్ని కొనసాగించాలి. మరుసటి రాత్రి దూరదర్శినిని మళ్లీ అదే లక్ష్యం వైపు గురి పెట్టి ఫోటో తియ్యాలి. ఈ వ్యవహారం అంతా మరి రాత్రే జరగాలి కనుక రాత్రులు కొంచెం దీర్ఘంగా ఉండే చలికాలంలో ఈ పరిశీలనలు మరింత ఎక్కువగా జరుగుతాయి. ఎముకలు కొరికే చలికి ఓర్చుకుని పరిశీలకుడు ప్రయాస పడాలి. దూరదర్శిని ఉన్న ’డోమ్’ లోపలి భాగాన్ని కృత్రిమంగా వేడి చెయ్యడం పెద్ద కష్టం కాదు. కాని దాని వల్ల గాలిలో వెచ్చని సంవహన తరంగాలు బయలుదేరి దూరదర్శిని గ్రహిస్తున్న చిత్రం విరూపం చెందుతుంది. కనుక చలికి ఓర్చుకుని పని చెయ్యాలి. ఈ ప్రయాస అంతా హుమాసన్ కి మహా ఆసక్తికరంగా అనిపించేది. అవన్నీ స్వయంగా చేసే అవకాశం వస్తే బావుంటుందని అనుకునే వాడు. ఆ అవకాశం త్వరలోనే వచ్చింది.
(సశేషం...)
0 comments