రష్యన్ ఖగోళశాస్త్రవేత్త నికోలాయ్ కర్డషేవ్ విశ్లేషణ ప్రకారం భావి మానవ నాగరికతలో మూడు రకాలు, లేక దశలు ఉంటాయట.
1 వ రకం నాగరికత - ఇది గ్రహవ్యాప్త నాగరికత
2 వ రకం నాగరికత - ఇది దాని సౌరమండలానికే పరిమితమైన నాగరికత
3 వ రకం నాగరికత - ఇది తారల దారులు తెలిసిన నాగరికత
ఈ మూడూ కూడా భావి నాగరికతలలో రకాలు అనుకుంటే మన ప్రస్తుత నాగరికత ఇంకా 0 వ రకం నాగరికతే నని చెప్పుకోవాలి. ఈ 0 రకం నాగరికత లక్షణాలేంటి?
ఈ రకం నాగరికత యొక్క మొట్టమొదటి లక్షణం తీరని విభజనలతో కూడుకున్న సమాజం. మనకు తెలిసినంత మేరకు మానవ చరిత్రని తిరగేస్తే మానవ సమాజాలని వేరు చేసే నానారకాల లోతైన విభజన రేఖలే కనిపిస్తాయి. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జాతి, దేశం, భాష, మతం, ఐశ్వర్యం, వాతావరణ పరిస్థితులు ఇలా ఎన్నో కారణాలు మనుషులు ఒకరినొకరు దూరంగా ఉండేలా చేస్తూ వచ్చాయి. కాల ప్రవాహంలో కొన్ని రేఖలు చెరిగిపోతుంటాయి, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. కొన్ని మాత్రం తీరని, చెరగని సరిహద్దు రేఖలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఆ కారణం చేత రాజకీయ అస్థిరత, యుద్ధం మొదలైనవి ఉంటూనే ఉంటాయి. ఈ నల్లని అవశేషాలు ఉన్న నాగరికత ఇంకా 1 వ రకం నాగరికత స్థాయికి ఎదగలేదన్నమాట.
మానవ జాతులలో వైవిధ్యం ప్రకృతి సహజం. కాని ఆ వైవిధ్యం విభజనకి దారితీయడం, ఆ విభజన జాతుల అస్తిత్వాన్నే ప్రశ్నించేటంత తీవ్ర రూపాన్ని దాల్చడం - ఇవి 0వ రకం నాగరికతకి చిహ్నాలు.
ఈ కోవకి చెందిన నాగరికతకి మరో లక్షణం ప్రకృతికి నిబద్ధమైన జీవనాన్ని గడపడం. అంటే ప్రకృతి చేసే ఏర్పాట్లకి ఒడంబడి సాగే జీవనం అన్నమాట. ప్రకృతి సహజ వనరులు పుష్కలంగా ఉన్న చోట నాగరికతలు వెల్లివిరుస్తాయి. జల వనరుల కోసం నదీతీరాల వద్ద, రవాణా సదుపాయాల కొసం సముద్ర తీరం వద్ద, లేదా ఖనిజాలు ఉన్న చోట, వృక్ష సంపత్తి ఉన్న చోట - ఇలా ప్రకృతి చేసిన ఏర్పాట్ల అనుసారం భూమి మీద జనాభా విస్తరించి ఉండడం కనిపిస్తుంది. ఉదాహరణకి అంత విశాల భూభాగం ఉన్న చైనా లో కూడా జనాభా అధికశాతం తూర్పులోను, దక్షిణ-తూర్పు లోను ఉన్న తీర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండడం కనిపిస్తుంది. తూర్పు యూరప్ లో కన్నా సుదీర్ఘమైన తీరరేఖ గల పశ్చిమ యూరప్ లో జన సాంద్రత హెచ్చుగా కనిపిస్తుంది. అమెరికాలో పశ్చిమ, తూర్పు, ఉత్తర-తూర్పు తీర ప్రాంతాలలోను, ఆ ప్రాంతాలకి దగ్గరలోను అధికంగా జనావాసం కనిపిస్తుంది. 1 వ రకం నాగరికతలో ఈ ఒరవడులు ఎలా మారిపోతాయో ముందు ముందు చూద్దాం.
0 వ నాగరికతలో మరో ముఖ్య లక్షణం దాని శక్తి వనరుల వినియోగానికి సంబంధించినది. 1 వ రకం నాగరికతతో పోల్చితే మన ప్రస్తుత 0 వ నాగరికతలో శక్తి వినియోగం అత్యల్పంగా ఉంటుంది. ఉదాహరణకి రాత్రి పూట భూమి యొక్క చీకటి ముఖాన్ని అంతరిక్షం నుండి సందర్శిస్తే చెదురుమొదురుగా మాత్రమే జనావాసానికి చిహ్నాలైన విద్యుత్ దీపాల మినుకు మినుకు కాంతులు కనిపిస్తాయి. కాని 1 వ రకం నాగరికత ఉన్న గ్రహం యొక్క చీకటి ముఖం మొత్తం సహస్ర దీపాలంకృత వివాహ మండపంలా అవిచ్ఛిన్న ప్రభతో వెలిగిపోతూ ఉంటుంది.
0 వ దశ నుండి 1 వ దశకి ఎదుగుతున్న నాగరికతలో శక్తి వినియోగం గణనీయంగా పెరుగుతుంది. జనావాసం కూడా భూమి మీద మరింత సమంగా విస్తరించడం మొదలెడుతుంది. వనరులు ఉన్నచోటికి మనుషులు తరలడం కాకుండా, మనుషులు ఉన్న చోటికి సాంకేతిక సామర్థ్యంతో వనరులని తరలించడం జరుగుతుంది. ఈ ఒరవడులు ఇప్పటికే మన నాగరికతలో కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
(ఇలాంటి లక్షణాలు గల గ్రహం ఒకటి ఐసాక్ అసిమోవ్ రాసిన ’Foundation series' నవలలలో కనిపిస్తుంది. Trantor అన్న పేరు గల ఈ గ్రహం, మొత్తం గెలాక్సీ అంతా విస్తరించిన ఒక మహాసామ్రాజ్యానికి ఎనిమిది వేల సంవత్సరాల పాటు రాజధానిగా ఉండేది. ఆ గ్రహం మీద జీవితం ఎలా వ్యవస్థీకరించబడి ఉందో అసిమోవ్ మాటల్లోనే విందాం:
"ట్రాంటర్ ఉపరితలం అంతా లోహపు పూత వేసినట్టు ఉంటుంది. దాని ఎడారులలోను, సస్య భూములలోను ఒకే విధంగా జనావాసం ఉంటుంది. అధికార భవనాల కారడవులు, కంప్యూటరీకృత జీవన స్రవంతి, విశాలమైన ఆహారనిలువలు, బృహత్తరమైన యంత్రవిడిభాగాల గోడవున్లు... ఈ గ్రహం మీద కొండలన్నీ చదును చెయ్యబడ్డాయి. లోయలు, అగాధాలు అన్నీ పూడ్చివేయబడ్డాయి. అంతే లేని ఈ ఊరి సొరంగ మార్గాలు ఖండపు అరల (continental shelves) అడుగున కూడా చొచ్చుకుపోతుంటాయి. నాగరక ప్రభావం దాని సముద్ర గర్భంలోకి కూడా విస్తరించింది. సముద్రాలు జలచరాలని పెంచే తొట్టెలుగా మార్చివేయబడ్డాయి. ఆ గ్రహం మీద వాడబడే ఖనిజాలకి, ఆహారానికి ఈ సముద్రాలే స్థానిక, చాలీచాలని వనరులు...) ("Foundation's Edge" by Isaac Asimov, pg 91).
(అసిమోవ్ ’ట్రాంటర్’ వర్ణనని ఆధారంగా చేసుకుని ’స్టార్ వార్స్’ చిత్రంలో చిత్రీకరించబడ్డ కోరుస్కంట్ అనే నగరం)
0 వ దశ నుండి 1 వ దశని చేరుకోవాలంటే...
కాని 0 వ దశకి చెందిన నాగరికత 1 వ దశ నాగరికతగా సునాయాసంగా, సుస్థిరంగా మారిపోతుందని నమ్మకం ఏమీ లేదు. ఆ పరివర్తన చెందగోరే నాగరికత కొన్ని కఠిన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. శైశవ దశ నుండి ఎదిగే ఏ నాగరికత అయినా, మనలాగానే ఏదో ఒకనాడు రెండు విషయాలని కనుక్కుంటుంది. వాటిలో మొదటిది ఆవర్తక పట్టికలో (periodic table) 92 వ మూలకం తో మొదలుకుని మరింత భారమైన, రేడియోధార్మిక మూలకాల ఆవిష్కరణ. రెండవది రసాయనిక పరిశ్రమ. యురేనియం ఆవిష్కరణతో పరమాణు బాంబుల తయారీ సాధ్యపడింది. అందుకు పర్యవసానంగా మానవాళి సామూహిక ఆత్మవినాశనావకాశం అనే ప్రేతం ప్రత్యక్షమయ్యింది. మానవజాతి అస్తిత్వాన్నే అది సవాలు చేస్తోంది.
ఇక రెండవదైన రాసాయనిక పరిశ్రమల సంస్థాపన వల్ల నానా రకాల విషపదార్థాలు వాతవరణంలోకి ప్రవేశించి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మనుషులకి ఊపిరి కావలసిన వాతావరణం, బతుకు పీక నులిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ భయాలు ఇలా ఉండగా, 0 వ నాగరికతలో ముఖ్య లక్షణమైన విభజనకి పర్యవసానమైన ’పరపీడన పరాయణత్వం’, యుద్ధం మొదలైన విధ్వంసాత్మక శక్తులు మానవ జాతులని కబళించే ప్రమాదం ఉంది.
ఈ దుర్గమమైన అవరోధాలని దాటగలిగితే, తీరని విభేదాలని తేల్చుకోగలిగితే 0 వ రకం నాగరికత ఎదిగి 1 వ రకం నాగరికతగా పరిణమించే అవకాశం ఉంది. లేకుంటే దాని గతిరేఖ అక్కడితో అంతరించిపోతుంది. ఏకకణ జీవి దశ నుండి ఒక గ్రహం మీద ఆవిర్భవించి, కోటానుకోట్ల సుదీర్ఘపరిణామం తరువాత 0 వ నాగరిక దశకి చేరుకున్న జాతి ఆ గ్రహం మట్టిలోనే కలిసిపోయే అవకాశం ఉంది.
200 బిలియన్ల (200,000,000,000) తారలు ఉన్న మన పాలపుంత గెలాక్సీలో అర్థశతాబ్దం నుండి వెతుకుతున్నా ఎక్కడా నాగరిక జాతుల జాడ కనిపించదేం? అని శాస్త్రవేత్తలు తరచు ఆశ్చర్యం వెలిబుచ్చుతుంటారు. దానికి కారణం 0 వ రకం నాగరికత 1 వ రకం నాగరికతగా రూపాంతరం కావడంలో విఫలం కావడమే కావచ్చు. 0 వ దశలోనే అంతరించిపోవడమే కావచ్చు. (నాగరిక జీవులు ఉన్నా వారి జాడ మనకి తెలియకపోడానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాలు మరోసారి చర్చించుకుందాం.)
ఎన్నో ప్రమాదకరమైన జీవ పరిణామ దశలని దాటి మన ప్రస్తుత 0 వ రకం నాగరిక దశ వరకు వచ్చాం. మన మానవ జాతి చిరకాలం నిలవాలంటే, ప్రస్తుత స్థితి నుండి 1 వ దశ నాగరికతకి ఎదగడంలో పొంచిన ఉన్న ప్రమాదాలని అర్థం చేసుకుని, విజయవంతంగా ఆ పరివర్తనని పరిపూర్ణం చేసుకుంటామని, అందరం కలిసికట్టుగా ఆ భవి దశలోకి ప్రవేశించగలమని ఆశిద్దాం.
(1 వ రకం నాగరికత లక్షణాల గురించి వచ్చే పోస్ట్ లో...)
0 comments