వైభవోపేతమైన గతం ఉందని కాబోలు మన దృష్టి తరచు భవిష్యత్తు మీద కన్నా గతం మీద ఎక్కువగా నిలుస్తుంది.
మరి కనీసం రెండు వేల ఏళ్ల గతం ఉన్నా, ఎంచుచేతనో పాశ్చాత్యుల మనసు గతం కన్నా తరచు భవిష్యత్తు మీదకే పోతుంటుంది. భవిష్యత్తు గురించి పథకాలు వెయ్యడం, విస్తృత ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలు కోసం పాటు పడడం వారి సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన విషయం. పాశ్చాత్యులలో ఆ లక్షణానికి ఓ చక్కని తార్కాణం మార్స్ మీద వలస పోయే విషయం గురించి పాశ్చాత్యలోకంలో జరిగిన చర్చ, సన్నాహం. మార్స్ మీద కొన్ని వేల ఏళ్ల పాటు జరుగవలసిన ధరాసంస్కరణ గురించి సాగిన ఊహాగానం తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అంతకు ముందు కొన్ని పోస్ట్ లలో చూశాం.
ఈ తూర్పు, పడమరల ఆలోచన విధానాలలో తేడాల విషయం పక్కన పెడితే, శాస్త్రవేత్తల మనసులు కూడా తరచు భవిష్యత్తు మీదకు పోతుంటాయి. మానవ జీవనానికి ఆసరాగా ఉండే సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించడం, ఏటేటా ఆ యంత్రాంగాన్ని అంతకంతకు పరిపూర్ణం గావించడం లక్ష్యంగా గల శాస్త్రవేత్త/ఇంజినీరు మనసు మరి భవిష్యత్తు మీదకి పోతోందంటే ఆశ్చర్యం లేదు.
మార్స్ గురించిన ఊహాగానమే మేధస్సు వెర్రితలలు వేయడంలా చాలా మందికి అనిపించవచ్చు. అలాంటిది మరింత సుదూరమైన భవిష్యత్తులో మానవ జాతి ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? భూమి మీదే మనుగడ సాగిస్తుందా? తారాంతర యానంలో దక్షత సంపాదించి నక్షత్రాలలో నివాసం ఏర్పరచుకుంటుందా? కేవలం సౌర, రసాయన, విద్యుత్, పరమాణు శక్తులే కాక ఇతర వినూత్న శక్తి రూపాలని కనుక్కుని వాటి వినియోగంలో ఆరితేరుతుందా? నేటి నుండి నూరేళ్ల తరువాత,, వేయేళ్ల తరువాత, పది వేలు, లక్ష.... ఏళ్ల తరువాత మన స్థితి ఏమిటి? ... ఇలాంటి లోతైన, జటిలమైన ప్రశ్నల గురించి ఎంతో ఆలోచన జరిగింది.
రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక లక్ష సంవత్సరాల తరువాత మానవాళి భవిష్యత్తు గురించిన ఆలోచనే హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కాని మనిషి మనసుకి వర్తమానపు ఇరుకు గోడలు ఇబ్బంది కలిగిస్తాయి కాబోలు. అందుకే నేడు అనే బందీఖానా నుండి తప్పించుకోవాలని పెనుగులాడతాడు. భవిష్యత్తు మీద విజయం కోసం ఉద్యమిస్తాడు. కాలానికే అతీతంగా ఎదగాలని ఆత్రుతపడతాడు. ఓ కొత్త బంగారు లోకంలో కొలువుండాలని కలగంటాడు.
మనవాళి యొక్క, లేదా మానవ సదృశ నాగరికతల యొక్క వికాస క్రమం ఎలా ఉంటుందో, వాటి భవితవ్యం ఎలా ఉంటుందో ఆలోచించిన వైజ్ఞానికులు ఆ వికాస క్రమాన్ని కొన్ని దశలుగా వర్గీకరించారు. ఆ క్రమంలో మనం ఇంకా మొదటి దశలోకి కూడా ప్రవేశించలేదట! అవును మరి. మన విశ్వం వయసు 15 బిలియన్ సంవత్సరాలు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీలొనే 200 బిలియన్ తారకలు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో మన కన్నా కొన్ని మిలియన్ల సంవత్సరాలు ముందున్న అధునాతన నాగరికతలు ఉండి ఉండాలి. అంత సుదీర్ఘ వికాస క్రమాన్ని నికొలాయ్ కర్డషేవ్ అనే రష్యన్ ఖగోళ శాస్త్రవేత్త నాలుగు వర్గాలుగా విభజించాడు. ఆ దశలు ఏంటో, ఆ పరిణామం తీరేంటో వరుసగా కొన్ని పోస్ట్ లలో చర్చించుకుందాం.
(సశేషం...)
0 comments