విద్య వేగంగా వ్యాపించాలంటే, అట్టడుగు వర్గాలలో కూడా విజ్ఞత పెరగాలంటే కొన్ని పరిణామాలు రావాలి. నిజానికి మనం ఊహిస్తున్న స్థాయిలో పరిణామాలు రావాలంటే మూడు వర్గాలు/సంస్థలు కలిసి పని చెయ్యాలి: 1) ప్రభుత్వం, 2) ప్రైవేటు సంస్థలు, 3)ఈ రెండు వర్గాలకీ బయట ఉంటూ పని చేసే ప్రతిభా వంతులైన వ్యక్తులు.
ప్రభుత్వం ఎన్నో చేస్తే బావుంటుంది. కాని ప్రభుత్వం చెయ్యాల్సిన వన్నీ సక్రమంగా చేసి, ఆ సత్ఫలితాలని మనం అనుభవించాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి!!! మరి అంత పుణ్యానికి మనం నోచుకున్నామో లేదో తెలీదు. అంత పుణ్యం మూట గట్టుకునేంత వరకు ఎదురు చూసే సహనం నాకైతే లేదు.
ఇక ప్రైవేటు సంస్థలు స్వలాభం అనే లక్ష్యాన్ని వొదులుకుని పని చేసే అవకాశం తక్కువ. ప్రస్తుతం మనకి కనిపించే ప్రైవేటు విద్యా సంస్థల్లో చాలా మటుకు పిల్లలకి యాంత్రికమైన శిక్షణ నిచ్చి, వారిచేత ఎలాగోలా ప్రవేశ పరీక్షల కంచెలని అంచెలంచెలుగా గెంతించడం తప్ప మరొకటి చేస్తున్నట్టు కనిపించదు. పిల్లల మానసిక వికాసాన్ని గురించి లోతైన అవగాహన కలిగి, వాళ్లు సహజంగా, సలక్షణంగా ఎదగటానికి అనువైన వాతావరణాన్ని కల్పించగల సంస్కృతి ఉన్న ప్రైవేటు విద్యా వ్యవస్థలు బహు తక్కువ. (ఈ రంగంలో కొన్ని ఎన్.జి.వో. లు చక్కని కృషి చేస్తున్నాయి. కాని అవి ప్రైవేటు సంస్థల లెక్కలోకి రావనుకుంటా.)
ఇక మిగిలినది ప్రత్యేక వ్యక్తుల కూటమి. ఉన్నతమైన సంస్కారం, విజ్ఞత, సత్తా గలిగి ఉన్న వాళ్లు వీళ్లు. ప్రపంచాన్ని జయించగలం అన్న ఉత్సాహంతో ఉవ్విళ్లూరే, విశ్వాసం ఉట్టిపడే ధీమంతులు, ధీరులు వీళ్లు. మన ఆశలన్నీ ఇక వీరి మీదే. గత ఒకటి, రెండు శతాబ్దాలుగా మన దేశంలో, విద్యారంగంలో ఇలాంటి వ్యక్తులు మౌనంగా సాధించిన విజయాల కథలన్నీ చెప్పుకుంటే అది రామాయణాన్ని మించిన పురాణం అవుతుందేమో! (ఈ కథలు కొన్ని సందర్భోచితంగా ముందు ముందు విన్నవిస్తాను.)
ఎవరు చేసినా, ఎలా జరిగినా విద్య వేగంగా వ్యాపించాలంటే, అరవై ఐదుని తొంభైగా తొందరగా మార్చాలంటే కొన్ని పరిణామాలు జరగాలని అనిపిస్తుంది. ఇవన్నీ మళ్లీ ఒక దానితో ఒకటి పొంతన లేని ప్రయత్నాలు కావు. కాకూడదు. ఇవన్నీ కూడా ఓ బృహత్పథకంలో భాగాలుగా, మాలలో సుమాలుగా ఇంపుగా ఒదిగిపోవాలి. ఇదుగో ఆ పరిణామాల/ప్రయత్నాల పట్టిక.
1. భారతీయ భాషలలో ఇంటర్నెట్ మీద ఓ బృహత్తర శాస్త్రీయ/సైన్సు భాండారం యొక్క కల్పన.
2. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా సరదాగా సైన్సు నేర్చుకోవడానికి భారతీయ భాషల్లో కోకొల్లలుగా పుస్తకాల రచన.
3. విద్యా వ్యాప్తి కోసం వినూత్న పద్ధతులతో ఎఫ్.ఎం. రేడియో వినియోగం.
4. సైన్సు ప్రచారంలో టీవీ/సినిమా ల వినియోగం.
5. నాటకాలు, తోలుబొమ్మల ఆటలు, బుర్రకథలు మొదలైన సాంప్రదాయ కళా పద్ధతులలో సైన్సు ప్రచారం.
6. పట్టరానంతగా పెరిగిపోయిన మొబైల్ నెట్వర్కు ని సద్వినియోగం చేసుకుంటూ విద్యా వ్యాప్తి
7. ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎస్.సి, ఎన్.ఐ.టి లు మొదలుకుని , దేశం అంతటా వ్యాపించిన కొత్త ఇంజినీరింగ్, మొదలైన ప్రొఫెషనల్ విద్యా సంస్థలు అన్నీ కలిసి, ఓ బృహత్తర వ్యూహంలో భాగంగా, ప్రభుత్వ సహకారంతో, గ్రామాలకి విద్యా సేవలు అందించడం.
8. ఇంటర్నెట్ మీద పని చేసే “ట్యూషన్” కేంద్రాల సంస్థాపన
9. విద్యార్థుల వికాస/శిక్షణ క్రమాన్ని కనిపెట్టుకునే ఓ సమగ్ర సాఫ్ట్ వేర్ వ్యవస్థ
10. కోటి విద్యలు కూటీ కొరకే – చదువు పూర్తి కాగానే ఉద్యోగావకాశాలు చూబించే సులభ మార్గాలు.
ఈ వాక్యాలని వచ్చే కొన్ని టపాలలో విపులంగా వివరిస్తాను. ఇందులో చాలా మటుకు తెలిసినవే, కాని చాలామటుకు జరగనివే! వీటిలో కొన్ని సైద్ధాంతికంగా ఆచరణీయమే అయినా వాస్తవంలో ఎన్నో కారణాల వల్ల జరక్కపోవచ్చు. మరి కొన్ని వట్టి “పగటి కలలు” కావచ్చు. మరి రంగులేని లోకంలో మిగిలిన హంగు కలలే కదా?!
మరి కొన్ని వివరాలతో, వివరణలతో వచ్చే టపా లో...
ప్రయత్నం చాలా బాగుంది.ఇలాంటి ఆలోచనలు తప్పక చేయాలి. అసలు చదువే రాని జనానికి
బడి బాట పట్టించటమే సమస్య.చిత్త సుద్ధి లేని రాజకీయ పార్టీలు ,స్వార్ధ చింతన, ఉపయోగం లేని దైవ చింతన ,అవినీతి , బద్ధకం ..ఇన్ని రుగ్మతలతో ఈ జనం ఎలా మారాలి ..లోక సత్తా జయప్రకాశ్ గారి లాంటి వ్యక్తులు రావాలి ..మనమందరం పూనుకోవాలి ..
జయ హో ...
సత్యం
మనుషులకి చదువొస్తే అంతా మారిపోతుందనుకోవడం అమాయకత్వమే. ఆ తరువాత - మార్చడానికి అసాధ్యమైన మనుషులు ఉత్పత్తి అవుతారు.
కొంత మంది చదువుకున్న వాళ్లు తప్పులు చేశారని, అసలు చదువే వద్దనడం పొరబాటు. తింటే అజీర్తి చేస్తుందని ప్రపంచాన్ని పస్తులు ఉంచినట్టు ఉంటుంది.
ఇవ్వాళ అనగా 07.07.09 టైమ్స్ అఫ్ ఇండియా లో Inspiring Inida-Bridge to success..(page 8)
Satish Tripathi ,from Maharashtra,వీధి లో అడుక్కునే పిల్లలని, ఆరు సంవత్సరాలు కస్టపడి బడి బాట పట్టించాడు .అంతటితో ఊరుకోక ,వ్యాస్ మరియు మోహన్ చౌహన్ అనే ఇద్దరు మిత్రులతో కలసి సాయంత్రం బడి ప్రారంభించారు ,అందులో ఈ పిల్లలకి మిగతా విద్యార్ధులతో సమంగా తయారవడానికి కోచింగ్ మొదలుపెట్టారు .ఆ బడి పేరు సేతు- అనగా బ్రిడ్జి .ఆ పిల్లలకి పాఠాల తో పాటు ఆహారం ,స్నానానికి'' సులభ్' పాస్ ..కూడా అందించారు .ఎన్నో ఉద్యోగాలు చేసిన త్రుప్తికంటే ఈ ప్రయత్నంలో అవధిలేని ఆనందం పొందుతునారు .
ఇలాంటి వారు ముందుకురావాలి ..భజనపరులు, తిరుపతిలో మొక్కులు మొక్కేవారు కాదు మనకు కావలిసినది .జై హో ..
ఇలాంటిదే మరొక వార్త ,జ్యోతి దినపత్రిక లో-- బస్సు స్టాండ్ లో, ఒక నడవలేని వ్రుధుడు నానా బాధలు పడుతూ పది రోజులుగా పడుంటే, జ్యోతి అనే L I C ఉద్యోగి ,జాలి చెంది ఆ విషయం తనకు తెలిసిన శ్రీదేవి అనే వ్రుదాశ్రామం నడుపుతున్న స్నేహితురాలికి తెలిపితే ,,ఆవిడ వెంటనే స్పందించి ఆ నిరాశ్రయ
వృధుని ఆశ్రమంలో ఆహ్వానించారు ..ఆ ఆశ్రమం పేరు ''పల్లవి'' దుండిగల్ సమీపంలో ఉన్నది ...
జ్యోతి దినపత్రిక టెలిఫోన్ నెంబర్ కాని ఇతరవివరాలు కాని ప్రచురించలేదు ..మనం మనకు సాధ్యమైన సహాయం అందించగలం కదా ..వివరాలు ప్రచురిస్తే ..ఆవిషయం జ్యోతికి మునుపు రాసాను ప్రయోజనం కనిపించలా ..సో,,,ఇలాంటి వార్తలు చదివి అందరూ స్ఫూర్తి పొందాలని ..