పార్ట్ 1
1980 లలో అనుకుంటా... ఓ కొత్త ఒరవడి, ఓ వేగం, ఎదగాలన్న తాపత్రయం దేశం అంతా వ్యాపించింది. 90 లలో ప్రభుత్వ విధానాలలో వచ్చిన మౌలిక మార్పుల వల్ల దేశీయులలో అంతవరకు నిద్రపోతున్న సృజనాత్మక శక్తులు మేలుకున్నాయి. వేల వినూత్న రీతుల్లో అవి నేడు అభివ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ ఆధునిక మార్పులలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నది మధ్య గరగతి వారు మాత్రమే ననుకోవచ్చు. ఈ సమకాలీన సత్ఫలితాలు సమాజంలో అన్ని స్తరాల వారికీ అందాలంటే ఒక్కటే మార్గం. విద్య విస్తృతంగా వ్యాపించాలి. అక్షరాస్యత మరెంతో పెరగాలి.
అంతరిక్షం, అణుశక్తి, ఐ.టి. ఇలా ఎన్నో రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన మన దేశం, అక్షరాస్యతలో మాత్రం నమ్మలేనంత నిమ్న స్థితిలో ఉంది. 2001 సెన్సస్ ప్రకారం మన అక్షరాస్యత విలువ 64.84%. ఇది ఎంత తక్కువో ఒక అవగాహన రావాలంటే కొంత తులనాత్మక సమాచారాన్ని పరిశీలించాలి.
అక్షరాస్యతలో మన దేశం ప్రపంచ దేశాలలో 144 వ స్థానంలో ఉంది. అక్షరాస్యత 99% పైగా గల దేశాలు 40 ఉన్నాయి. 90% కన్నా అక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశాలు 88 ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలని పక్కన పెట్టినా, మనం పోల్చుకోదగ్గ దేశాలు – చైనా, మెక్సికో, థాయ్లాండ్ మొదలైన దేశాలు కూడా 90 ని మించిపోయాయి. బ్రెజిల్ కూడా ఆ దరిదాపుల్లోనే ఉంది. మొన్నమొన్నటి దాకా అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలో పడి నలిగి, బాగా చితికోపోయిన వియట్నాం అక్షరాస్యత 90.3%. అంతస్సమరంతో యాతన పడుతున్న పొరుగుదేశం – శ్రీ లంకలో కూడా అక్షరాస్యత 90.7%. పై సమాచారాన్ని బట్టి 90% దరిదాపుల్లో అక్షరాస్యత గలిగి ఉండటం అంత విశేషమేమీ కాదన్నమాట. కానీ ఆ పాటి వైభవం కూడా ప్రస్తుతం మనకి లేదు.
ఇక రాష్ట్రాలలో చూస్తే ఆంధ్ర రాష్ట్రం దేశం సగటు విలువ కన్నా కాస్త తక్కువలో 61.11% వద్ద ఉంది. ఉన్న 29 రాష్ట్రాలలో 22 వ స్థానంలో ఉంది.
మరి ఇంత ముఖ్యమైన రంగంలో ప్రభుత్వం చేతులు కట్టుకు కూర్చుందా అంటే లేదు. 1988లో ప్రభుత్వం National Literacy Mission ను స్థాపించింది. 2007 కల్లా అక్షరాస్యత 75% శాతం చేరగలిగితే ఇక అప్పట్నుంచి ప్రత్యేక పథకాల అవసరం లేకుండా, దానికదే నిలదొక్కుకుంటుందని ఆశిస్తున్నారు. 2007 లో ఆ విలువ ఎంత వరకు వచ్చిందో మరి 2011 సెన్సస్ సమాచారంతో గాని తెలీదు. పోనీ ఆ లక్ష్యం చేరుకున్నా అదంత పెద్ద విశేషం కాదని అనిపిస్తోంది. 75% అంటే ఏదో బొటాబొటి మారుకులతో పాస్ అయినట్టు ఉంది. ఆ విలువ 90% శాతం అయితే వినటానికి బావుంటుంది. మీసం మెలేసి ఇరుగు పొరుగు వాళ్ల దగ్గర బడాయి పోవడానికీ బావుంటుంది. బడాయి మాట అటుంచి సమకాలీన సత్ఫలితాలు నాలుగు కాలాల పాటు నిలవాలన్నా, ఇంకా వృద్ధి చెందాలన్నా అక్షరాస్యత విలువ 90 ఉండాలని అనిపిస్తోంది.
అంత ముఖ్యమైన లక్ష్యాని సాధించే బాధ్యతని పూర్తిగా ప్రభుత్వానికి వొదిలేయలేం. ప్రజాస్వామ్యంలో “ప్రజల చేత, ... ప్రజల కోసం” అన్న సూత్రం ఉండనే ఉంది. వర్తమాన ప్రపంచంలో ఇలాంటి మార్పుకు ప్రోద్బలాన్ని ఇవ్వగల రెండు మహాశక్తులు ఉన్నాయి.
1. ప్రతిభలో, పరిజ్ఞానంలో, జీవితంలో ఒక ఎత్తుకు ఎదిగి, ఆ సదవకాశాలు లేని వారి కోసం ఏదైనా చెయ్యాలనే స్ఫూర్తి, పట్టుదల ఉన్న విశేష వ్యక్తుల కూటమి.
2. ఇంటెర్నెట్ తో మొదలుకుని, దాని చుట్టూ పెనవేసుకుని పని చేసే సువిస్తార సమాచార మాధ్యమాల సౌలభ్యం.
ఈ రెండు శక్తుల కలయిక లోనే ఓ మహత్తర విద్యా విప్లవం పొంచి వుంది.
yes.
chala bagundi mee blog