గాలెన్
ఆధునిక టర్కీ లో ఉన్న అందమైన పెర్గమన్ నగరంలో రమారమి క్రీ.శ. 129 లో పుట్టాడు గాలెన్. అతడి తండ్రి నికొన్ ఓ స్థపతి (architect). గాలెన్ కి పదిహేడేళ్లప్పుడు నికొన్ కి ఎస్కులేపియస్ అనే దేవత కనిపించి కొడుకుని వైద్యుణ్ణి చెయ్యమని ఆదేశించాట్ట. (ఈ దేవత ఇప్పటికీ సర్వీస్ లో ఉంటే బహుచక్కని కెరియర్ కౌన్సెలర్ అయ్యేవాడేమో!) దేవత మాట నమ్మిన నికొన్ కొడుకుని పెర్గమన్ లోనే ఉన్న ఎస్కులేపియన్ అనే వైద్య విద్యాలయంలో చేర్పించాడు.
ఈ వైద్యసంస్థలో వివిధ వైద్య సాంప్రదాయాలకి, వర్గాలకి చెందిన వైద్య నిపుణులు వచ్చేవారు. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కోలా ఉండేది. కొందరు శరీర నిర్మాణ శాస్త్రానికే (anatomy) చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కొందరు పుస్తక పరిజ్ఞానం కన్నా అనుభవానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. మరి కొందరు ప్రాచీన వైద్యుడు హిపోక్రేటిస్ కి చెందిన వైద్య సాంప్రాదాయం పొందుపరచబడ్డ ’కార్పస్ హిప్పోక్రాటికమ్’ లో లేని వైద్య విషయం లేదని గాఢంగా నమ్మేవారు.
ఈ సంవాదాలు, వివాదాలు, అభిప్రాయ విభేదాలు అన్నీ చూశాడు గాలెన్. ఆ రోజుల్లో వైద్యుల్లా కేవలం మంత్రాలు వేసి, మహత్యాలు చేసి, మంచి సంగీతం వినిపించి రోగాలు నయం చేసే వైద్యుడిగా తయారవ్వ కూడదని మాత్రం గట్టిగా నిశ్చయించుకున్నాడు. అలాగే ప్రాచీన రోమ్ కి చెందిన సెల్సస్, ప్లైనీ వంటి పండితుల్లా కేవలం అంతూపొంతూ లేకుండా సమాచారాన్ని సమీకరించే పని తెలివితక్కువగా అనిపించింది గాలెన్ కి. వైద్య వృత్తి అంటే ఎలా ఉండాలి, వైద్యుడు అంటే ఎలా ఉండాలి మొదలైన విషయాల గురించి తనకంటూ కొన్ని విలక్షణమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు.
జీవనిర్మాణ శాస్త్రం (anatomy), జీవక్రియా శాస్త్రం (physiology) అనే రెండు చక్రాల మీద నడిచే బండి వైద్యం అనుకున్నాడు గాలెన్. అలాగే ఆ రోజుల్లో చలామణిలో ఉన్న వైద్య మతాలన్నీ త్రోసిపుచ్చడం కూడా అతడి అభిమతం కాదు. ప్రతీ దాంట్లోనూ ఉన్న మంచి సారాన్ని తీసుకుని తన కంటూ ఓ ప్రత్యేక పంథాని ఏర్పరచుకోవాలి. కలగాపులగంగా ఉన్న వైద్య శాస్త్ర రంగాలన్నిటికీ ఒకే త్రాటి మీద నడిపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ మహోన్నత లక్ష్యం కోసమే తన జీవితాన్ని ధారపోశాడు. ఆ లక్ష్యసాధనకి అడ్డొస్తుందేమోనని వివాహం కూడా చేసుకోలేదు.
వైద్య ఆచరణ విషయంలో గాలెన్ దృక్పథంలోని సారం అంతా ఇరవై ఏళ్లు కూడా నిండని వయసులో గాలెన్ రాసిన ఈ ఒక్క వాక్యంలో వచ్చేస్తుంది:
"ఇంద్రియాలతో గుర్తించగల దానినే నేను సమ్మతిస్తాను. ఇంద్రియాలతో గ్రహించబడి, పరిశీలన చేత పోషించబడి, స్మృతి యొక్క బోధన చేత సమర్ధించబడే విషయాలని తప్ప నేను మరేదీ ఒప్పుకోను. అనవసరమైన, అసందర్భమైన సైద్ధాంతిక నిర్మాణాల జోలికి నేను పోను."
ఆ తరువాత ఇంచుమించు ఒకటిన్నర సహస్రాబ్దాల కాలం తరువాత ఆధునిక భౌతిక శాస్త్రానికి మూల స్తంభాలని నిలబెట్టిన ఐసాక్ న్యూటన్ Hypothesis non fingo (నేను నిరాధార ప్రతిపాదనలు చెయ్యను) అన్నప్పుడు, ఆ మాటల్లో అలనాడు గాలెన్ వెలిబుచ్చిన భావనలే ప్రతిధ్వనిస్తున్నాయి.
కనుక పరిశీలనలకి, ప్రత్యక్ష అనుభూతికి, వివేచనకి మాత్రమే ప్రాధాన్యత నిస్తూ లెక్క లేనన్ని అధ్యయనాలు చేశాడు గాలెన్. కాని మరి పరిశీలనలు చెయ్యాలంటే, ముఖ్యంగా జీవనిర్మాణ శాస్త్రంలో పరిశీలనలంటే, శరీరాన్ని కోసి లోపల ఏముందో చూడాలి. అలా చెయ్యాలంటే శవాల విషయంలోనే స్వేచ్ఛగా పరిచ్ఛేదాలు చేసుకునే వీలు ఉంటుంది. అయితే ఆ రోజుల్లో రోమన్ చట్ట వ్యవస్థ మానవ కళేబరాల పరిచ్ఛేదాలని నిషేధించింది. కనుక మానవ శవాలని కోసే అవకాశాలు తక్కువగానే ఉండేవి.
ఏవో కొన్ని "అనుకోని అవకాశాలు" వచ్చినప్పుడు మాత్రమే మానవ శరీరంలోకి తొంగిచూసే వీలు దొరికేది. సింహం వాత పడబోయి తప్పించుకున్న గ్లాడియేటర్లు, యుద్ధంలో గాయపడ్డ సిపాయిలు మొదలైన వాళ్లు చికిత్స కోసం వచ్చినప్పుడు మానవ శరీరం యొక్క అంతరంగ నిర్మాణాన్ని తెలుసుకునే అవకాశం దొరికేది.
ఈ పద్ధతి లాభం లేదని జంతు కళేబరాల పరిచ్ఛేదం మీదకి దృష్టిని మళ్లించాడు గాలెన్. మనిషిని పోలి వున్నాయి కదా అని కొన్ని రకాల వానరాల మీద పరిచ్చేదాలు చేసి, అలా సేకరించిన జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని మానవ శరీర నిర్మాణాన్ని ఊహించడానికి ప్రయత్నించాడు.
ఈ పరిచ్ఛేదాలలో జంతు మెదడు నిర్మాణం గురించి ఎంతో తెలుసుకున్నాడు. ముఖ్యంగా మెదడు పరిచ్ఛేదం గురించి ఆయన రాసిన "ఎద్దు మెదడు" అన్న పుస్తకంలో మెదడు పరిచ్ఛేదం ఎలా చెయ్యాలో విపులంగా వర్ణిస్తాడు.
"చక్కగా సంసిద్ధం చెయ్యబడి కపాలాంశాలు తొలగించబడ్డ ఎద్దు మెదడు కసాయి వాళ్ల దగ్గర దొరుకుతుంది... అవయవాన్ని (మెదణ్ణి) సరిగ్గా సంసిద్ధం చేస్తే పైన డురా మాటర్ (మెదడు పై పొర) కనిపిస్తుంది... మధ్య రేఖకి అటు ఇటుగా నిలువు కోతలు కోస్తే కోష్టాలు (ventrilces) కనిపిస్తాయి.
...ఇంత వరకు చర్చించుకున్న విభాగాలన్నిటినీ బట్టబయలు చేస్తే, ఇరుపక్కల ఉన్న కోష్టాలకి మధ్యన మూడో కోష్టం కనిపిస్తుంది. దాని వెనుకగా నాలుగో కోష్టం కూడా కనిపిస్తుంది..."
ఇంచుమించు రెండు వేల ఏళ్ల క్రితం గ్రీకులకి మెదడు యొక్క అంతరంగ నిర్మాణం గురించి అంత సూక్ష్మమైన పరిజ్ఞానం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
(సశేషం...)
0 comments