శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

వెసేలియస్ - వైద్య లోకపు గెలీలియో - 2

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, October 23, 2009

ఈ రెండు అస్తిపంజరాలని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే ఒక రోజు ఎంతో కాలంగా తనని వేధిస్తున్న ఓ ప్రశ్న మబ్బులా విడిపోయింది.

(ఫాబ్రికా నుండి ఓ చిత్రం)

గాలెన్ బోధనలన్నీ తప్పులతడకలు అనుకోవడంలో పొరబాటు తనదే! గాలెన్ పొరబడలేదు. నిజంగానే అతడు మహా ప్రతిభావంతుడు. శవపరిచ్ఛేదనలో తను ప్రదర్శించిన సూక్ష్మబుద్ధిలో, నిశితదృష్టిలో వెలితి లేదు. అయితే వచ్చిన చిక్కేంటంటే గాలెన్ వర్ణించింది మానవ శరీరాలని కాదు! జంతు శరీరాలని. మానవ శరీరాలని దృష్టిలో పెట్టుకుని వాటిని పరిశీలిస్తే మరి అన్నీ తప్పులే కనిపిస్తాయి. ఇంత కాలం తనకీ విషయం ఎందుకు బోధపడలేదా అని తనను తానే మనసారా తిట్టుకున్నాడు వెసేలియస్.ఆ విధంగా ఏళ్ల అనుభవంలో వెసేలియస్ మనసులో శరీరనిర్మాణం గురించి స్థిరమైన అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన అంతా త్వరలోనే ఓ గ్రంథ రూపాన్ని దాల్చింది. ఫాబ్రికా అన్న పేరు గల ఆ పుస్తకం, పాశ్చాత్య వైద్య చరిత్రలో ఓ గొప్ప మైలు రాయి అనుకోదగ్గ ఆ 663 పేజీల పుస్తకం, వెసేలియస్ 28 వ ఏట వెలువడింది. కవరు పేజి మీద ఓ యువతి శరీరాన్ని పరిచ్ఛేదిస్తున్నట్టు దృశ్యం చిత్రించబడింది. గతంలో వెలువడ్డ శరీర నిర్మాణ వృత్తాంతాలు అన్నీ దోషభూయిష్టంగా ఉన్నాయన్న నమ్మకం మీదే ఆ పుస్తకం ఆధారపడి వుంది. కనుక మానవ కళేబరాల మీద విస్తృతంగా పరిచ్ఛేదాలు చేసి గత విషయాలని నిర్ధారించి సరిదిద్దాల్సిన అవసరం ఉంది. గాలెన్ బోధించిన "మానవ" శరీర నిర్మాణ శాస్త్రంలో మొత్తం 200 దోషాలు పట్టాడు వెసేలియస్. ఈ పుస్తకం ద్వారా వెసేలియిస్ తన పూర్వీకుడైన గాలెన్ ని కించ పరిచినట్టు కాదు. తన చెప్పదలచుకున్నది ఒక్కటే - స్వానుభవంతో నిర్ధారించుకోకుండా గతం చెప్పింది గుడ్డిగా నమ్మకు!

ఆరోగ్యవంతమైన మెదళ్లే కాక వ్యాధి సోకిన మెదళ్లు కూడా వెసేలియస్ దృష్టికి రాకపోలేదు. ఉదాహరణకి ఆ పుస్తకంలో ’తాటికాయంత తల ఉన్న ఓ పిల్లవాడు’ గురించి ప్రస్తావిస్తాడు. "ఆ పిల్లవాణ్ణి ఓ బిచ్చగత్తె ఇంటింటికీ తిప్పుతుంటే చూశాను. వాడి తల ఇద్దరు పెద్దవాళ్ల తలలు కలిపినంత మందంలో ఉంది." అతడు చెప్తున్నది హైడ్రోసెఫలస్ (మెదడు వాపు వ్యాధి) గురించి.

ఆ విధంగా మెదడు నిర్మాణం గురించి అతడు ఎంతో తెలుసుకున్నా, ఎంతో వ్రాసినా మెదడు క్రియల గురించి అతడికి ఇంకా అయోమయంగానే ఉండేది. దీనికి తోడు మెదడు కోష్ఠాల (ventricles) లో ఉండే ప్రాణ శక్తుల (animal spirits) వలన మనకి తలంపులు కలుగుతున్నాయని, ఆలోచనలు వస్తున్నాయని గాలెన్ భజన బృందం చెప్పే హరికథలు అతడికి అనుమానాస్పదంగా అనిపించేవి. మొత్తం మీద పుర్రెలో కూరుకున్న ఈ మాంసపు ముద్ద వల్ల మనోవృత్తి ఎలా కలుగుతుందో అతడికి అంతుబట్టేది కాదు. ఈ విషయం గురించి ఒక చోట అతడు ఇలా రాసుకున్నాడు -

"సజీవ జంతు శరీరాల పరిచ్ఛేదాల బట్టి మెదడు క్రియల గురించి కొద్దిగా అర్థం చేసుకోగలను. కాని మెదడు భావన, ధ్యానం, యోచన, స్మృతి మొదలైన క్రియలని ఎలా నిర్వర్తించగలుగుతుందో నాకు ససేమిరా బోధపడడం లేదు..." ఆ విధంగా తనకి తెలుసని, తెలీంది తెలీదని నిస్సంకోచంగా వెల్లడి చేసి వైజ్ఞానికులకి స్వతహాగా ఉండే నిగర్వానికి, వస్తుగత దృక్పథానికి తార్కాణంగా నిలిచాడు వెసేలియస్.

అదే విధంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మెదడు నుండి చేతులకి ఆజ్ఞ ఎలా ప్రసారం అవుతుంది అన్న విషయంలో కూడా గాలెన్ బోధనలు చాలా విచిత్రంగా ఉండేవి. నరాల లోపల అంతా డొల్లగా ఉంటుందట. మెదడు నుండి వెలువడ్డ ప్రాణశక్తులు ఆ డొల్లల లోంచి ప్రసరించి చేతిని కదిలిస్తాయట. ఈ ప్రాణశక్తుల గోలతో ప్రాణం విసిగిపోయిన వెసేలియస్ మనుషుల, కుక్కల, తదితర పెద్ద జంతువుల శరీరంగా దృశ్య నాడులని (optic nerves) కోసి పరీక్షించాడు. అతడికి ఎలాంటి డొల్లలు కనిపించలేదు. గాలెన్ సిద్ధాంతాలు విశృంఖల ఊహాగానాలని మరోసారి తేలిపోయింది.

(సశేషం...)

1 Responses to వెసేలియస్ - వైద్య లోకపు గెలీలియో - 2

  1. Anonymous Says:
  2. ఈ బ్లాగులోని విషయాలను చదువుతుంటే, మాబోటివారికి అమృతపానము చేస్తున్నట్లున్నది.నమస్సుమాంజలి.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email