ఈ వ్యాసాన్ని మీ కళ్లు ఎలా చదువుతున్నాయి?
మీరు దేన్నయినా చదువుతున్నప్పుడు మీ కళ్లు అక్షరాల మీద ఏ విధంగా కదులుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీ కళ్లు ఒక్కొక్క అక్షరాన్ని ఎడమ నుండి కుడి పక్కకి వరుసగా ఓ టైప్ రైటర్ లాగా చదువుతూ పోవు. పదం నుండి పదానికి, కొన్ని సార్లు పదాల కూటముల మీద గంతులు వేస్తూ పోతాయి. పోనీ వాక్యాలని చదువుతున్నప్పుడు ఎంత లేదన్నా వాక్యాల అమరిక మన కళ్ల కదలికలని శాసిస్తుంది. వాక్యాల కన్నా, అక్షరశూన్యమైన చిత్రాన్ని చూస్తున్నప్పుడు మన కళ్లు కదిలే తీరులోని రహస్యం ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. మీరొక చిత్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీ కళ్లు దాన్ని సాఫీగా ఒక కొస నుండి అవతలి కొసకి కదలవు. ఆ మూల పూవు మీద ఓ బొట్టు, ఈ మూల విరి మీద మరో బొట్టు జుర్రుకుంటూ పూదోట మీద మొహరించే తుమ్మెద కదలికల్లా ఉంటాయి మీ కళ్ల కదలికలు. చిత్రంలో కొన్ని స్థానాలు మెదడుకి ఆసక్తికరంగా, ప్రధానంగా కనిపిస్తాయి. వాటి వైపు ఓ సారి దృష్టి సారించి, కాసేపు అక్కడ ధ్యాస నిలిపి, వీలైనంత సమాచారాన్ని సేకరించి వెంటనే మరో చోటికి మళ్లుతాయి. దృశ్యం మీద కళ్లు నిలిచిపోయే చోటినే fixation point (స్తాపిత బిందువు) అంటారు. ఉదాహరణకి భానుప్రియ చిత్తరువును చూస్తున్నప్పుడు, ఆమె కళ్ల మీద నుండి మీ కళ్లు మరలమని మొరాయిస్తున్నప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది! ఒక స్థాపిత బిందువు నుండి మరో స్థాపిత బిందువు వద్దకి మాత్రం కళ్లు అత్యంత వేగంగా కదులుతాయి. ఆ సువేగమైన నయన చలనాలనే saccades (సకాడ్స్) అంటారు. సకాడ్ జరుగుతున్నప్పుడు కళ్ల వేగం 1000 degrees/sec దాకా ఉంటుంది.
పైన కనిపిస్తున్న పాప చిత్రంలో కళ్లు ఎక్కడెక్కడ ఎంత సేపు నిలిచాయో సులభంగా చూడొచ్చు. కళ్ల మీద, నోటి మీద ఎక్కువ సేపు నిలవడం కనిపిస్తుంది. సామాన్యంగా ముఖంలో మనకి కళ్ళు, నోరు ప్రధాన అంగాలుగా అనిపిస్తాయి. అందుకే ముఖం యొక్క కార్టూన్ ని వెయ్యాలంటే ముఖాన్ని సూచిస్తూ ఓ పెద్ద చక్రం వేసి, అందులో కళ్లని సూచిస్తూ పై భాగం లో రెండు చిన్న చక్రాలు, నోటిని సూచిస్తూ కింద భాగంలో ఓ చక్రం వేస్తే చాలు! మనం ఈ-మెయిళ్లలో వాడే స్మైలీ లు ఇలాంటివే!
ఆగాగే కదిలే ఈ కళ్ల కదలికల గురించి మొట్ట మొదట అధ్యయనం చేసిన వాడు ఫ్రెంచ్ ఆఫ్తాల్మాలజిస్ట్ (నయన శాస్త్రవేత్త) లూయీ ఎమీల్ జవాల్. పుస్తకంలో అక్షరాల మీద కళ్లు ఆగాగి కదలడాన్ని ఇతడు గమనించాడు. ఇతడే ఆ కదలికలకి saccades అని పేరు పెట్టాడు. చదువుతున్న కళ్లు ఆగాగి కదిల్తే, మరి ఏఏ పదాల మీద ఆగుతాయి? ఆ ఆగిన పదాల్లో ఏ అక్షరం మీద ఆగుతాయి మొదలైన ప్రశ్నలు సహజంగా బయలుదేరుతాయి. చదువుతున్న వ్యక్తి కళ్లని నేరుగా మన కళ్ల చూసి ఆ వ్యక్తి కళ్లు ఆగాగి కదులుతున్నాయని సులభంగా చెప్పొచ్చు. కాని ఏ పదం మీద, పదంలో ఏ అక్షరం మీద ఆగుతున్నాయో చెప్పడం ఎలా? అందుకు తగ్గ పరికరాన్ని తయారు చెయ్యాలి. జవాల్ ఏ పరికరమూ లేకుండా స్వయంగా అవతలి వాళ్ళ కళ్ల కదలికలని చూసి చేసిన పరిశీలనలు ఇవి. కనుక పై ప్రశ్నల సమాధానాలు అతడి తెలీలేదు.
అలాంటి పరికరాన్ని మొట్టమొదట నిర్మించినవాడు ఎడ్మండ్ హుయీ. ఇలా కళ్ల కదలికలని నమోదు చెయ్యగల పరికరాన్ని eye-tracker అంటారు. హుయీ నిర్మించిన eye-tracker లో వ్యక్తి కళ్ల కి కంటాక్ట్ లెన్స్ లు తొడుగుతారు. లెన్స్ కి ఓ సన్నని అల్యుమినమ్ సూచి తగిలించి ఉంటుంది. కళ్లు కదులుతుంటే సూచి కదులుతుంటుంది. పరికరం కొంచెం మోటైనదే అయినా, ఇందులో బయట పడ్డ ఒక విషయం ఏంటంటే చదువుతున్నప్పుడు మన కళ్లు ప్రతీ పదం మీద ఆగవు అన్న విషయం తెలిసింది. అయితే ఈ పద్ధతి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
(సశేషం...)
0 comments