ఫాబ్రికా (చిత్రం) ప్రభావం యూరప్ ఖండం అంతా పాకింది. లాటిన్ నుండి ఆ పుస్తకాన్ని జర్మన్, ఫ్రెంచ్ వంటి ఆధునిక భాషల్లోకి కూడా తర్జుమా చేశారు. వెసేలియస్ అధ్యయనాలతో ప్రభావితులై అతడి బాటనే అనుసరించిన శరీర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు. చెప్పుడు మాటల మీద కాక ప్రత్యక్షానుభూతికి, ప్రయోగానికి ప్రాముఖ్యత నిస్తూ ఆధునిక వైద్య సాంప్రదాయానికి పునాదులు వేసిన వెసేలియస్ జీవితం సాఫీగా సాగిపోయింది అనుకుంటే పొరబాటే. ఫాబ్రికా వలన ప్రభావితులు అయినవారు ఉన్నట్టే, దాన్ని తీవ్రంగా విమర్శించిన వారూ ఉన్నారు.
అలా విమర్శించిన వారిలో ప్రథముడు పారిస్ లో వెసేలియస్ కి శరీర శాస్త్రంతో పరిచయం చేసిన మొదటి గురువైన జాకోబస్ సిల్వియస్. పుస్తకం పరిచయంలో వెసేలియస్ తన గురువు గురించి "ఎంత పొగడినా సరిపోని జాకోబస్ సిల్వియస్" అని మహా గొప్పగా చెప్పుకున్నాడు. కాని పుస్తకంలో గాలెన్ బోధనల పట్ల వెసేలియస్ చూపించిన నిరాదరణ, తిరస్కరణ సిల్వియస్ సహించలేకపోయాడు. గాలెన్ భావాలని కించపరచడం అంటే తనకి వ్యక్తిగత అవమానంగా తీసుకుని మండిపడిపోయాడు.
సైన్స్ చరిత్రలో ఇలాంటి విచిత్రమైన పరిణామం ఎన్నో సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి తాను ఎదిగే దశలో కొన్ని భావాలు నచ్చుతాయి. ఆ భావాలు నిజాలని నమ్ముతాడు. వాటిని సమర్ధిస్తూ కొద్దో గొప్పో ఆధారాలు కూడా సేకరిస్తాడు. క్రమంగా వాటికి అలవాటు పడి మత్తుమందులా ఆ భావాలని దాసోహం అయిపోతాడు. ఆ భావాలు పూర్తి నిజాలు కావని, వాటిలో ఎంతో అవాస్తవం దాగి వుందని గుర్తించలేని గుడ్డితనం ఆవరిస్తుంది. ఆ గుడ్డితనాన్ని ఎవరైనా వేలెత్తి చూబిస్తే సహించలేరు. ఆలాంటి వారిలో అకారణమైన శత్రుత్వాన్ని పెంచుకుంటారు. కాని వైజ్ఞానిక లోకం వ్యక్తిరహితమైన లోకం. అందులో వ్యక్తులకి, వ్యక్తిత్వాలకి స్థానం లేదు. ఫలానా పెద్ద మనిషి చెప్పాడు కనుక ఒక విషయం నిజం కాలేదు. ప్రయోగం నిరూపించింది కనుక నిజం అవుతుంది. ఇలాంటి వ్యక్తి రహితమైన స్వేచ్ఛా సంస్కృతికి అలవాటు పడాలంటే గొప్ప గుండెధైర్యం కావాలి. లోతైన నిగర్వం కావాలి. ఎంతో గొప్ప వాళ్లు అనుకునేవాళ్లకి కూడా ఈ లక్షణాలు ఉండవు.
ఆ విధంగా ఒక దశలో వెసేలియస్ భావాలని కొంత మంది నిరసించినా తదనంతరం తన కృషికి తగ్గ మన్నన దొరికింది. ఉదాహరణకి 1551 లో ట్యూబింగెన్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన లియర్డ్ ఫుక్స్ రాసిన రెండు పుస్తకాలలోని ప్రతీ అంగుళంలోను వెసేలియస్ స్తుతే కనిపిస్తుంది. ఉదాహరణకి ఆ పుస్తకాల పరిచయంలో ఫుక్స్ ఇలా అంటాడు.
"మన తరంలో మానవ శరీర నిర్మాణం గురించి వ్రాసిన వారిలో గొప్ప నిశిత దృష్టితో సముచిత రీతిలో వర్ణించినవాడు వెసేలియస్ ఒక్కడే. అతడి వ్యాఖ్యానలే ప్రచురితం కాకపోయుంటే మానవ దేహం గురించిన ఎన్నో సంగతులు మనకి తెలిసేవి కావు... సత్యాన్వేషణలో అతడు ప్రదర్శించిన అభినివేశం నిజంగా మెచ్చుకోదగ్గది."
ఆ విధంగా వెసేలియస్ పుణ్యమా అని మెదడు నిర్మాణం గురించి ఎన్నో విషయాలు తెలిసినా మెదడు క్రియల గురించి, మెదడు క్రియలకి మనుషుల ప్రవర్తనకి మధ్య సంబంధం గురించి ఇంకా అగమ్య గోచరంగానే ఉండిపోయింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో కూడా మెదడు క్రియలని గురించిన ఎన్నో ప్రాథమిక విషయాలు కూడా తెలీకుండా ఉన్నాయంటే, మరి ఆ రోజుల్లో తెలీకపోవడంలో ఆశ్చర్యం లేదు.
(వెసేలియస్ కథ సమాప్తం)
Reference:
Stanley Finger, Minds behind the brain, Oxford University Press.
0 comments