అంతకన్నా కొంచెం సున్నితమైన eye-tracker ని చేసిన వాడు చికాగో నగరానికి చెందిన గయ్ థామస్ బాస్వెల్. ఈ పద్ధతిలో కళ్ల మీదకి సన్నని కాంతి రేఖని ప్రసరిస్తారు. ఆ రేఖ కళ్ల మీద నుండి పరావర్తనం చెంది ఓ తెర మీద పడుతుంది. తెర మీద కాంతి బిందువు యొక్క కదలికలని బట్టి, కళ్ల కదలికల గురించి తెలుసుకోవచ్చు. మనుషులు చదువుతున్నప్పుడు, చిత్రాలు చూస్తున్నప్పుడు కళ్లు ఎలా కదులుతాయి అన్న విషయం మీద ఇతడు విస్తృతంగా పరిశోధనలు చేశాడు.
1950 లలో ఆల్ఫ్రెడ్ యార్బస్ ఈ నయన చలనాల గురించి విస్తృతంగా పరిశోధనలు చేశాడు. 1967 లో ఈ రంగంలో అతడు రాసిన పుస్తకం ప్రామాణిక గ్రంథం అయ్యింది. ఇతడి పరిశీలనల లో తేలిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓ చిత్రాన్ని చూస్తున్నప్పుడు కళ్లు కదిలే తీరు, కేవలం ఆ చిత్రం మీదే ఆధారపడదు. ఆ చిత్రంలో చూస్తున్న వ్యక్తి ఏ సమాచారం కోసం అన్వేషిస్తున్నాడు అన్న విషయం మీద కూడా కళ్ల కదలికలు ఆధారపడతాయి.
ఉదాహరణకి పైన కనిపిస్తున్న చిత్రంలో ఓ గది కనిపిస్తోంది. గదిలో ద్వారం వద్ద ఓ పురుషుడు నిల్చుని వున్నాడు. అప్పుడే ఎక్కడినుంచో గదిలోకి వచ్చినట్టున్నాడు. చిత్రంలో ఓ డైనింగ్ టేబుల్ ఉంది. టేబుల్ దగ్గర ఒక స్త్రీ నిల్చుని ద్వారం వద్ద నించున్న ఓ వ్యక్తిని చూస్తోంది.
ఈ చిత్రాన్ని కొంత మంది వ్యక్తులకి చూబించి ఈ కింది ప్రశ్నలని మనసులో పెట్టుకుని చిత్రాన్ని పరిశీలించమన్నారు. ఒక్కో సందర్భంలోను చూస్తున్న వ్యక్తుల కళ్ళ కదలికలు ఎలా ఉన్నాయో పరిశీలించారు.
1. ఏ ప్రశ్నలూ లేకుండా చిత్రాన్ని చూస్తున్నప్పుడు.
ఈ సందర్భంలో కళ్లు ఎక్కువ సేపు లోపలికి వచ్చిన పురుషుడి మీద, టేబుల్ పక్క నించున్న స్త్రీ మీద నిలిచినట్టు కనిపిస్తుంది. కాసేపు టేబుల్ వెనుక పక్క కూర్చున్న పిల్లవాడు/పాప మీద కూడా నిలిచినట్టు కనిపిస్తుంది. ఎక్కువగా మనుషుల మీద దృష్టి నిలిచినట్టు, జీవం లేని వస్తువుల మీద నిలవనట్టు కనిపిస్తుంది.
2. ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులని ఏమై ఉంటాయి?
ఈ సందర్భంలో కళ్లు ఎక్కువ సేపు బల్ల మీద, బల్ల మీది వస్తువుల మీద, నేపథ్యంలో ఉన్న చిత్తరువుల మీద నిలిచినట్టు కనిపిస్తుంది.
3. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తుల వయస్సు ఎంతై ఉంటుంది?
ఈ సారి కళ్లు చిత్రంలో నలుగురు వ్యక్తుల మీద నిలిచాయి. ద్వారం వద్ద నిలిచిన పురుషుడి మీద, తలుపు తెరిచి పట్టుకున్న స్త్రీ మీద, టేబుల్ పక్కన నిలిచిన స్త్రీ మీద, టేబుల్ వెనుక కూర్చున్న బాబు/పాప మీద నిలిచాయి.
4. ఆ అనుకోని అతిథి రాక ముందు ఆ కుటుంబంలోని వాళ్లు ఏం చేస్తూ ఉండి ఉంటారు?
ఈ సందర్భంలో దృష్టి ఎక్కువగా బల్ల చుట్టు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది.
5. చిత్రంలో వ్యక్తుల దుస్తులని జ్ఞాపకం పెట్టుకో.
ఈ సారి దృష్టి చిత్రంలో కనిపిస్తున్న ఆరుగురి మీద నిలిచింది. వ్యక్తుల దుస్తులని జ్ఞాపకం పెట్టుకోవడం కోసం కాబోలు, పరిశీలన పై నుండి కింద దాకా జరిగినట్టు కనిపిస్తుంది.
6. చిత్రంలో వ్యక్తుల, వస్తువుల స్థానాలని జ్ఞాపకం పెట్టుకో.
ఈ సారి దృష్టి వ్యక్తులకే పరిమితం కాక, కుర్చీ, బల్ల మొదలైన వస్తువుల మీద కూడా నిలిచినట్టు కనిపిస్తుంది.
7. చిత్రంలో కనిపిస్తున్న పురుషుడు ఆ కుటుంబాన్ని ఎంత కాలం తరువాత సందర్శిస్తున్నాడు?
ఇందులో చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తుల తలల మీదనే ఎక్కువగా దృష్టి నిలిచినట్టుంది. తలలని, అంటా ముఖాలని పరిశీలించి, ముఖ కవళికల బట్టి, వాళ్ల భావావేశాలని తెలుసుకునే ప్రయత్నం కనిపిస్తుంది.
ఇలాంటి ప్రయోగాల వల్ల యాబస్ కనుక్కున్న మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి:
"కళ్ల కదలికలను బట్టి పరిశీలకుడి కళ్లని చిత్రంలో కొన్ని ప్రత్యేక అంశాలు మాత్రమే ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. నయన చలనాలు పరిశీలకుడి ఆలోచనా స్రవంతిని బట్టబయలు చేస్తాయి. కొన్ని సార్లు పరిశీలకుడి దృష్టి పెద్దగా సమాచారాన్ని ఇవ్వని స్థానాల మీద నిలుస్తుంది - కొంచెం నిశితంగా చూస్తే అక్కణ్ణుంచి ఏదైనా సమాచారాన్ని రాబట్టొచ్చన్న ఆశతో కాబోలు. మరి కొన్ని సార్లు చిత్రంలో విచిత్రంగా, అపరిచితంగా, అయోమయంగా కనిపించే ప్రాంతాలు కూడా పరిశీలకుడి దృష్టిని ఆకట్టుకుంటుంది."
"అలాగే దృష్టి ఒక బిందువు నుండి మరో బిందువు మీదకి మరలుతున్నప్పుడు అంతకు ముందు చూడని, అంతగా ప్రధానం కాని స్థానాల మీదకి మళ్లదు. ప్రధానం అనిపించిన స్థానాల వద్దకే మళ్లీ మళ్లీ దృష్టి తిరిగి వస్తుంటుంది."
ఆ విధంగా నయన చలనాలకి, నేపథ్యంలో జరిగే ఆలోచనలకి మధ్య బలమైన సంబంధం ఉందని అర్థం కావడంతో ’70-80 ప్రాంతాల్లో ఈ రంగంలో పరిశోధనలు బాగా పుంజుకున్నాయి. ముఖ్యంగా నాడీ మండలానికి సంబంధించిన కొన్ని వ్యాధులలో నయన చలనాలలో కూడా మార్పులు రావడంతో ఈ పరిశోధనలకి వైద్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిసింది.
(సశేషం...)
0 comments