గాలెన్, వెసేలియస్ ల లాగానే లియొనార్డోకి కూడా మెదడులోని కోష్ఠాల గురించి తెలుసు. వాటికి వరుసగా 1, 2, 3, 4 అని పేర్లు పెట్టాడు. వాటిలో మూడవ కోష్ఠాన్ని (third ventricle, 3v - చిత్రంలో చూడండి) sensus communis అని పిలిచాడు. అది ఇంద్రియాలు (senses) కలిసే సంగమ (commune) స్థానం అని భావించడం చేత దానికలా పేరు పెట్టాడు. (అయితే అక్కడ కచ్చితంగా పప్పులో కాలు వెయ్యడం జరిగిందని వేరే చెప్పనక్కర్లేదు!) దృశ్యాలు, శబ్దాలు, వాసనలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ చేరుతుంది అనుకున్నాడు. ఇదే వ్యక్తిలోని ’నేను’ అన్న భావనకి ఉపాధి అని భావించాడు.
(పైన చిత్రంలో పైభాగంలో (A) మెదడు అడుగుభాగం లో ఉండే రక్తనాళాల జాలం కనిపిస్తోంది. అదే చిత్రంలో కింది భాగంలో కోష్ఠాలు కనిపిస్తున్నాయి.)
అలాగే కాస్త ముందుకి ఉండే anterior ventricle (ఆధునిక పరిభాషలో ఒకటొ కాదు, రెండు - అవే పార్శ్వ కోష్ఠాలు, lateral ventricles) లో "imprensiva" అనే సామర్థ్యం ఉంటుంది అన్నాడు. అంటే ఇంద్రియాలు అందించే సంగతులని శోధించి, అందులోంచి వస్తువులకి సంబంధించిన విషయాలని వెలికి తీయడం. కళ్ల నుండీ వచ్చే దృశ్య నాడి (optic nerve) ఈ anterior ventricle వద్ద నిలిచిపోతున్నట్టు తను వేసిన బొమ్మలలో చిత్రీకరించాడు. (అయితే ఇది కూడా నిజం కాదు. దృశ్య నాడి థాలమస్ లో భాగమైన ’లేటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్’ అనే చోట నిలిస్తుంది.) కాని ఘ్రాణ నాడి (olfactory nerve), శబ్ద నాడి (auditory nerve) మాత్రం మూడవ కోష్ఠం మీద ఆగుతాయన్నాడు. చిత్రకారుడు కనుక ఎంతైనా ఇంద్రియాలలో దృష్టి పట్ల తన పక్షపాతాన్ని ప్రదర్శించుకున్నాడు. అనుభూతికి అతి ముఖ్యమైన పునాది దృష్టి అన్నాడు. "కళలో ప్రకృతిని అన్వయించాలంటే, చిత్రకారుడి మనసు ప్రకృతి మనసుతో మమేకం కావాలి." సమకాలీన శాస్త్ర ప్రమాణాల దృష్ట్యా చూస్తే లియొనార్డో పరిశీలనలలో ఎన్నో దోషాలు ఉన్నాయన్నది నిజమే. కాని మామూలుగా భౌతిక ప్రక్రియలకి అతీతమైనదిగా, పారభౌతికమైనదిగా భావింపబడే రసాస్వాదన వంటి విషయం గురించి కూడా ఆ విధంగా ఒక కళాకారుడు భౌతిక ధర్మాల పరంగా ఇంత లోతుగా శోధించడం అబ్బురపాటు కలిగిస్తుంది.
ఈ సెన్సస్ కమ్యూనిస్ ఇచ్చే ఆజ్ఞనల అనుసారం శరీరంలో కదలిక పుడుతుందని అన్నాడు. కొన్ని సార్లు దాని ఆజ్ఞలతో సంబంధం లేకుండా కూడా శరీరంలో కదలికలు పుడతాయన్నాడు. ఆ విషయం గురించి ఇలా రాశాడు: "కొన్ని సార్లు పక్షవాతం వచ్చిన వాళ్ళు, తమ శరీరం తమ అధీనంలో అధీనంలో లేకపోయినా, చలికి వణకడం చూస్తాం. ఆ కంపన ఆత్మ యొక్క అనుజ్ఞ చేత జరిగుతున్నది కాదు. మూర్ఛ రోగం (epilepsy) ఉన్న వారిలో కూడా కొన్ని సార్లు ఇదే చూస్తాం..." సంకల్పిత చర్యలకి, అసంకల్పిత చర్యలకి మధ్య తేడాని లియొనార్డో గుర్తించాడు అన్నమాట.
లియొనార్డో మేధస్సు స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదేమో. విశ్వంలో ప్రతీ విషయాన్ని కొన్ని నియత భౌతిక ధర్మాలు పాలిస్తున్నాయన్న ప్రగాఢ విశ్వాసం ఉండడంతో ప్రతీ విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడడానికి అలవాటు పడ్డాడు. ఆ దృక్పథంతోనే దయ్యాలు, భూతాలు లాంటి శాస్త్ర దూరమైన అంశాల మీద కూడా అతడు తన దృష్టిని మళ్లించాడు. దయ్యాలనేవి లేవని, ఉండలేవని ఇలా వాదిస్తాడు: "గాలిలో చలనం లేనిదే స్వరం ఉండదు; ఏ స్థూల సాధనం లేకుండా గాలిలో కంపన కలగదు; కనుక అశరీరమైన తత్వానికి స్వరమూ, శక్తి ఉండే అవకాశం లేదు."
1508 - 1509 నడిమి ప్రాంతంలో మెదడుని అధ్యయనం చెయ్యడానికి లియొనార్డో ఒక చక్కని పద్ధతి కనిపెట్టాడు. ఒక ఎద్దు మెదడుని తీసుకుని దాని అడుగు నుండి, లోపల ఉన్న కోష్ఠాల వరకు, ఒక రంధ్రం చేశాడు. ఆ రంధ్రంలోకి ఓ సిరింజ్ తో కరిగించిన మైనాన్ని ఎక్కించాడు. మైనపు ద్రవం లోపల ఉన్న కోష్ఠాలలోకి ఎక్కేది. మైనం చల్లారాక చుట్టూ ఉన్న మెదడు ధాతువుని సున్నితంగా తొలగిస్తే, లోపల కోష్ఠాల రూపాన్ని ప్రదర్శిస్తూ మైనపు పోత మిగిలేది. అంతరంగ అవయవాలని పరిశీలించడానికి ఈ పద్ధతి వాడటం ఇదే మొదటి సారి ఏమో. ఇక్కడే లియనార్డో లోని శిల్పి, శాస్త్రవేత్త ఒక్కటవుతున్నారు.
ఆ విధంగా కళని, విజ్ఞానాన్ని తనలోనే అధ్బుతంగా సమన్వయపరచుకున్నాడు లియొనార్డో. ఒక తైలవర్ణ చిత్ర రూపకల్పనలో చొప్పించే కళాత్మకత, సౌందర్య దృష్టి జీవరహిత క్షుద్ర శవపరిచ్ఛేదనలో కూడా ప్రదర్శించి కళాకారాడుకి, వైజ్ఞానికుడికి మధ్య తేడా లేదని నిరూపించాడు. ప్రకృతిలో రూపలావణ్యాలని చూసి మురిసిపోతాడు కళాకారుడు. ఆమె హొయలులో లయలని చూసి పరవశిస్తాడు. ప్రకృతి గతులలో దాగి వున్న ప్రతిభని, పొందికను పొడగని పొంగిపోతాడు వైజ్ఞానికుడు. ఆ ఇద్దరినీ తనలోనే కలుపుని, ఒక మనిషి ఒక జీవిత కాలంలో, అన్ని రంగాల్లో అంత సాధించాడంటే నమ్మశక్యం కాదు. అంతటి మేధావి కనుకనే యూరప్ సాంస్కృతిక విప్లవానికి మూలపురుషుడు అన్న పేరు పొందాడు లియొనార్డో డా వించీ.
References:
1. Pevsner, Jonathan, "Leonardo da Vinci: Neuroscientist" Scientific American, April 2005.
2. http://www.leonardo-da-vinci-biography.com
0 comments