మెదడు చరిత్ర గురించి వరుసగా కొన్ని పోస్ట్ లలో చెప్పుకొద్దామని ఉద్దేశం. అరిస్టాటిల్, గాలెన్ ల దగ్గర్నుండి, ఆధునికులైన రోజర్ స్పెర్రీ, సర్ జాన్ ఎక్లిస్ ల వరకు ఒక్కొక్కరి కృషి గురించి, భావనల గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాను. ఈ సీరీస్ లో ఇది మొదటి పోస్ట్.
---
మెదడు చరిత్ర
మనిషి మెదడు గురించి మనిషి మెదడుకి తట్టిన ఆలోచనల చరిత్ర
(హిప్పోక్రేటిస్)
మానవుడు అన్న మాటకి ’మనసు గల వాడు’ అనే అర్థం వుంది. ఆ మనసు గలిగి ఉండే లక్షణమే మనిషిని జీవలోకంలో అగ్రస్థానంలో ఉంచుతోంది. కాని చిత్రం ఏమిటంటే అంత ముఖ్యమైన మనస్సు, మనుష్య స్థితికి ఇంచుమించు నిర్వచనాన్ని ఇస్తున్న మనస్సు, మన కంటికి కనిపించదు. ’అల్లదిగో మనస్సు’ అని వేలితో చూబించేది కాదది. అలాంటి మనసు గురించి మనిషి అనాదిగా ఎన్నో రకాలుగా శోధిస్తూ వచ్చాడు. ’మనిషి అంటే ఏంటి? మనసు అంటే ఏంటి?’ ఇలాంటి ప్రశ్నలు మనిషి మనసులో వేల ఏళ్లుగా మెదుల్తూ వస్తున్నాయి. మథన కలిగిస్తున్నాయి.
అయితే కచ్చితంగా చెప్పాలంటే మనసు గురించిన చర్చ తత్వశాస్త్రం కిందకి వస్తుంది. తాత్వికులు మనసు తత్వం గురించి ఎన్నో బరువైన పుస్తకాలు రాశారు. భావుకులు కమ్మని కవిత లల్లారు. కాని మనం తాత్వికులం కాము. అర్థం లేని భార పదజాలంతో అవతలి వారిని మొహమాట పెట్టే ఒడుపు మనకి లేదు. మనం భావకవులమూ కాము. నేల విడిచి సాము చేసే భావుకత మనకి లేదు. మనం వైజ్ఞానికులం వైజ్ఞానిక ప్రపంచంలో పౌరులం. మనకి తెలిసింది ఒకే ఒక ఆట. ఆ ఆట పేరు: "ప్రయోగం చెప్పే సంగతుల సుమాలని సిద్ధాంతం అనే దారంతో మాల కట్టడం." ఇది మహా ఆసక్తి కరమైన ఆట! దీన్నే పండితులు ’వైజ్ఞానిక పద్ధతి’ అని కూడా అంటూంటారు. కనుక మనసు గురించి కాసేపు పక్కన పెడదాం. ఉందో లేదో కూడా సరిగ్గా తెలీని శాల్తీలకి వైజ్ఞానిక లోకంలో (ఫ్రస్తుతానికి) స్థానం లేదు. అంచేత కొంచెం మనసు లాగానే ఉంటూ, ప్రవర్తనలో కాస్త దాని లాగే చాలా చంచలంగా మారే లక్షణం కలిగి, అన్నిటికన్నా ముఖ్యంగా కంటికి కనిపించే, దాని తమ్ముడి లాంటి మరో వస్తువును తీసుకుందాం. అదే మెదడు. మరి మెదడు మనసు ఒకటేనా? మెదడులో రేగే రొదనే కదా మనసు అంటాం? ఈ రెండూ వేరు వేరు విషయాలైతే మరి వాటి మధ్య సంబంధం ఏంటి?... ఆగండాగండి! అంత జోరైతే ఎలా? ఈ ప్రశ్నలకి సమాధానాలు నేటికీ ఎవరికీ తెలీదనే అనిపిస్తోంది. కాని సమాధానాలు తెలుసుకోడానికి ఎన్నో వేల మంది ప్రతిభావంతులు ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నారు. (కాస్త మీరు సాయం పడతారా?)
మెదడు గురించి, నాడీ మండలం గురించి ఎన్నో రకాల పరిజ్ఞానం ఎన్నో వేల ఏళ్లుగా మానవ సమాజంలో చలామణిలో ఉందని చరిత్ర చెప్తుంది. గ్రీకు వైద్య పితామహుడు హిప్పోక్రేటిస్ (రమారమి క్రీ.పూ. 400) మెదడే మనలో తెలివికి, ప్రజ్ఞకి మూలాధారం అయిన అవయవం అని బోధించాడు. తాత్వికుడు ప్లేటో (క్రీ.పూ. 387) కూడా మనో వృత్తికి మెదడే వేదిక అన్నాడు. కాని ఆయన శిష్యుడు అరిస్టాటిల్ (క్రీ.పూ. 335) కాస్త విడ్డూరం మనిషి లేండి. భౌతిక శాస్త్రంలో ఈయన చెప్పిన ఎన్నో విషయాలు తరువాత తప్పని తేలాయి. ’ఆత్మకి పీఠం గుండె’ (heart is the seat of the soul) అని ఈయన అభిప్రాయం. అయితే ఆత్మ మొదలైన పదాలకి ప్రస్తుతానికి వైజ్ఞానిక పరిభాషలో సభ్యత్వం లేదు. ఏదైతేనేం ఆలోచనలు లాస్యం చేసే వేదిక మెదడే, గుండె కాదు అని ఆధునిక వైద్య శాస్త్రం స్థిరంగా చెబుతోంది.
(ప్లేటో - అరిస్టాటిల్)
ఈ మనసు గోల ఎలా ఉన్నా, మెదడు కంటికి కనిపిస్తుంది కనుక, మృతకళేబరాల నుండి దాన్ని బయటికి తీసి, నానా రకాలుగా ముక్కలు కోసి, దాని అంతరంగ నిర్మాణాన్ని తెలుసుకునే వీలుంది కనుక మెదడు నిర్మాణం గురించిన పరిజ్ఞానం ఎంతో కాలంగా ఉంది. గ్రీకులకేనా మెదడు ఉన్నది, మేమేం తక్కువ అని రోమన్లూ ఈ మెదడు కోత వ్యవహారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. హీరోఫైలస్ (రమారమి క్రీ.పూ. 300) అనే వైద్యుడు (ఇతడు శరీర శాస్త్రానికి (anatomy) మూలకర్త అంటారు) మెదడులో ఉండే నాలుగు అరలని (ventricles) వర్ణించాడు. తెలివితేటలన్నీ ఆ ఖాళీ అరలలోనే ఉనాయని నొక్కి వక్కాణించాడు! ఖాళీలలో తెలివితేటలు ఉండడం మాటేమోగాని కొంత మందికి తెలివితేటలు ఉండాల్సిన చోట ఖాళీలు ఉంటాయేమోనని అప్పుడప్పుడు సందేహం కలుగుతూ ఉంటుంది! తరువాత ఎరాసిస్ట్రాటస్ (క్రీ.పూ. 280) మెదడులో విభాగాలని విపులంగా వర్ణించాడు.
పాశ్చాత్య వైద్య చరిత్రలో ఎంత మంది ఫేర్లు చెప్పుకున్నా, గాలెన్ పేరు తలవకపోతే చర్చ సంపూర్ణం కానట్టే. ఆ మహా వైద్యుడి భావనలు ఓ వెయ్యేళ్లకి పైగా పాశ్చాత్య వైద్య లోకాన్ని ప్రభావితం చేశాయి.
(సశేషం...)
0 comments