ఒకసారి గాలెన్ ఓ పంది మీద శస్త్ర చికిత్స చేసున్నాడు. ఊపిరితిత్తులని శాసించే నాడులు ఎక్కడున్నాయో వెదుకుతున్నాడు. ఒక ప్రత్యేక నాడికి కోసే సరికి, అంతవరకు గిలగిల కొట్టుకుంటూ అరుస్తున్న పంది, అరవడం మానేసింది గాని, శ్వాస మాత్రం ఆగలేదు. ఇదే పద్ధతిలో మరి కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేసి ’స్వరాన్ని నియంత్రించే నాడి’ని కనుక్కున్నాడు గాలెన్. ఆ నాడులనే ప్రస్తుతం recurrent laryngeal నాడులు అంటారు.
మన కదలికలని శాసించడంలో వెన్నుపాము (spinal cord) పాత్ర గురించి కూడా గాలెన్ ఎన్నో విషయాలు కనుక్కున్నాడు. కోతిలో వెన్ను పాముని వివిధ స్థాయిలలో పరిచ్ఛేదించి, దాని ప్రభావం ఎలా ఉండేదో పరిశీలించాడు. "వెన్నుపాముని పరిచ్ఛేదించినప్పుడు, ఆ కోత వెన్నుపాము మధ్య వరకు లోతుగా పోకపోతే, వెన్నుపాములో ఆ ప్రాంతం శాసించే అవయవాలు మాత్రమే చచ్చుబడిపోతాయి" అని కనుక్కున్నాడు.
అరిస్టాటిల్ భావనల ఖండన
మనస్సుకి ఉపాధి గుండె అని, మెదడు కాదని అరిస్టాటిల్ అన్నట్టు అంతకు ముందు చెప్పుకున్నాం. పూర్వాచార్యులు అయిన హిప్పోక్రేటిస్, అరిస్టాటిల్ మొదలైన వారంటే గాలెన్ కి అపారమైన గౌరవం ఉండేది. కాని ’గుండెని చల్లగా, ప్రశాంతంగా ఉంచడమే మెదడు పని’ అని బోధించిన అరిస్టాటిల్ తో ఏకీభవించలేకపోయాడు. వివిధ ఇంద్రియాల నుండి వచ్చే నాడులు మెదడుని చేరుతాయని, గుండెని కాదని ప్రత్యక్షంగా చూసిన గాలెన్ కి అరిస్టాటిల్ వాదనలు నిరాధారంగా తోచాయి. కనుక మెదడు కేవలం గుండె మంటలారిపే సాధనం కాదని గాలెన్ నమ్మకం. ఈ విషయంలో ప్లేటో, హిప్పోక్రేటిస్ లు చెప్పింది సరైనదని, అరిస్టాటిల్ చెప్పింది తప్పని ధైర్యంగా చాటాడు.
నాడీమండలం యొక్క క్రియలు
ఆ విధంగా మెదడు యొక్క, నాడీ మండలం యొక్క నిర్మాణం (structure) విషయంలో ఎంతో ప్రగతి సాధించినా, మెదడు క్రియల (function) విషయంలో మాత్రం గాలెన్ తన పూర్వులు చేసిన పొరబాట్లే చేశాడు. ప్రాచీన గ్రీకుల జీవక్రియా శాస్త్రంలో న్యుమాటిసమ్ (pneumatism, pneuma అంటే వాయువు, గాలి) అనే సిద్ధాంతం ఒకటి ఉండేది. దీన్ని ప్రతిపాదించినవాడు ఎరాసిస్ట్రాటస్. శరీరం యొక్క చలనాలని కొన్ని అదృశ్య ప్రకృతి శక్తులు శాసిస్తున్నాయని ఈ సిద్ధాంతం చెప్తుంది. మెదడులో ఉండే ఖాళీలు, అంటే కోష్టాల(ventricles) నుంచి బయలుదేరి, నాడుల ద్వారా ప్రయాణించి, కండరాలని చేరి, కండరాలని ఉత్తేజపరిచి, ఆ విధంగా ఈ శక్తులు లేదా వాయువులు శరీరంలో కదలికలు పుట్టిస్తున్నాయని అంటుందీ సిద్ధాంతం. అయితే ఇలాంటి విశృంఖల ఊహాగానాలకి ప్రయోగాల నుండి ఏ విధమైన సమర్ధనా ఉండేది కాదు.
మిగతా విషయాలలో ప్రయోగాల సమర్ధన లేనిదే దేన్నీ ఊరికే ప్రతిపాదించను అని ఒట్టుపెట్టుకున్న గాలెన్, నాడీమండలం యొక్క క్రియల విషయంలో మాత్రం ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాడు. వాయువులు, అదృశ్య ప్రకృతి శక్తులు మొదలైన వెర్రి మొర్రి భావనలన్నీ అతడి బోధలలోను చోటు చేసుకున్నాయి. కాని విచిత్రం ఏంటంటే ఈ భావనలు గాలెన్ కాలం లోనే కాదు, అతడికి ఒకటిన్నర సహస్రాబ్దం తరువాత ఫ్రెంచ్ తాత్వికుడు దే కార్త్ కూడా ఆ భావాలనే పట్టుకుని వేళ్లాడడం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
ఆ విధంగా నాడీమండల క్రియల విషయంలో పొరబాట్లు చేసినా మొత్తం మీద ప్రాచీన పాశ్చాత్య వైద్య రంగంలో గాలెన్ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయింది. గత వైద్య సాంప్రదాయాలన్నీ కకావికలమై, ఏది సరైన బాటో తెలీని అయోమయ స్థితిలో, ప్రయోగాత్మక పద్ధతికి పెద్ద పీట వేసి, వైద్య శాస్త్రాన్ని, వైద్య ఆచరణని సుస్థిరంగా వ్యవస్థీకరించాడు. విజ్ఞాన, వైద్య, తత్వ రంగాల్లో గాలెన్ మొత్తం మీద ఐదు ఆరు వందల గ్రంథాలు రాశాడని, వాటిలో మొత్తం పదాల సంఖ్య నాలుగు మిలియన్లు దాటుతుందని, చెప్పుకుంటారు. పాశ్చాత్య విజ్ఞాన, వైద్య రంగాల్లో అతడి ప్రభావం పదమూడు వందల ఏళ్ల పాటు నిలిచింది.
కాని విచారించదగ్గ విషయం ఏంటంటే గాలెన్ గొప్పదనం మహిమో ఏంటో గాని, అతడి ప్రభావం ఉన్నంత కాలం అతడి రచనలే వేదమని పాశ్చాత్య వైద్య లోకమంతా కొలిచింది. గత భావనలని ఎప్పటికప్పుడు ప్రశ్నించి, పరీక్షించి సరిదిద్దుకునే వీలు విజ్ఞాన లోకంలో ఓ అమూల్యమైన వరం. ఆ వరాన్ని మర్చిపోయి గతాన్ని - అది ఎంత గొప్పదైనా సరే - గుడ్డిగా స్మరిస్తూ, సమ్మతిస్తూ, స్తుతిస్తూ కూర్చుంటే, విజ్ఞానం చచ్చుబడిపోతుంది.
మరి గాలెన్ తరువాత సరిగ్గా అదే జరిగింది... వెసేలియస్ వచ్చినంతవరకు.
0 comments