కొన్ని సార్లు ఒక ప్రత్యేక వ్యక్తి తను పుట్టిన తరం మొత్తం వివిధ రంగాలలో సాధించవలసిన పురోగతి యొక్క సారాన్ని తాను ఒక్కడే సాధించి ఆ పురోగతికి ఆదర్శంగా నిలుస్తాడు. యూరప్ లో మధ్య యుగానికి అంతంలో, సాంస్కృతిక పునరుజ్జీవన శకారంభంలో పుట్టిన లియొనార్డో డా వించీ నిజంగా ఓ యుగపురుషుడే. జరామరణాలు లేని మోనాలిసాకి ప్రాణం పోసిన అసమాన చిత్రకళాకారుడు. గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ అనేకముఖ ప్రతిభాశాలి కేవలం కళాకారుడు మాత్రమే కాడు. అనుపమాన శాస్త్రవేత్త, ఇంజినీరు కూడా. నాడీ విజ్ఞానంలో, శరీర నిర్మాణ శాస్త్రంలో ఇతడు ఎన్నో అమూల్యమైన విషయాలు కనుక్కున్నాడు. వస్తువుల సాంద్రతని కొలచే పరికరాలు కనుక్కున్నాడు. ఒక పక్క "వెర్రితనం, వట్టి పశుత్వం" అంటూ యుద్ధాలని దుయ్యబడుతూనే, దారుణమైన యుద్ధ యంత్రాలని కూడా నిర్మించాడు.
లియోనార్డో ఎప్పుడూ విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకోలేదు. స్వాధ్యాయం, స్వానుభవం - ఇవి రెండే అతడి గురువులు. "నా సృజన అంతా శుద్ధ స్వానుభవం నుండి జనించిందే, అదే నా అసలు ప్రేయసి," అని తనే చెప్పుకున్నాడు. ప్రాచీన గ్రీకు, రోమన్ నిపుణులు చెప్పిన ముక్కల్నే వల్లె వేసే తన సమకాలీనులకి భిన్నంగా సొంతగా అధ్యయనాలు చేస్తూ పోయాడు. మెదడులోని కొన్ని భౌతిక చర్యల ఆధారంగా ఇంద్రియాలు బాహ్య ప్రపంచం నుండి వచ్చే సమాచారాన్ని గ్రహిస్తాయని, అర్థం చేసుకుంటాయని నిరూపించడానికి ప్రయత్నించాడు. అంతకు ముందు గాలెన్, వెసేలియస్ మొదలైన వారు ప్రతిపాదించిన కృతక "ప్రాణ శక్తుల" తో సంబంధం లేకుండా మెదడు క్రియలని పూర్తిగా భౌతిక ధర్మాల సహాయంతో అర్థం చేసుకోజూసిన నాడీశాస్త్ర పురోగామి లియొనార్డో.
1452 లో, ఏప్రిల్ 15 నాడు వించే అనే ఊళ్లో జన్మించాడు లియొనార్డో. ఈ ఊరు ఫ్లోరెన్స్ నగరానికి 20 మైళ్ల దూరంలో ఉంది. ఇరవై నిండని కుర్రవాడిగా ఫ్లోరెన్స్ కి చెందిన ప్రఖ్యాత ఇటాలియన్ శిల్పి, కళాకారుడు అయిన ఆడ్రియాస్ దెల్ వెర్రోచియో కి చెందిన చిత్రకళా స్టూడియోలో పనికి చేరాడు. ఇరవై ఏళ్ల వయసులో చిత్రకళాకారుల సదస్సులో సభ్యుడయ్యాడు. ఆ దశలోనే లియొనార్డో వేసిన సెయింట్ జెరోమ్ చిత్తరువుని (చిత్రం 1) బట్టి అప్పటికే అతడికి మానవ శరీరంలో కండరాల అమరిక గురించి చాలా క్షుణ్ణంగా తెలిసి ఉండాలని అర్థమవుతుంది. తరువాత 1480 ప్రాంతాల్లో ఫ్లోరెన్స్ నుంచి మిలాన్ కి వెళ్లాడు. ఆ కాలంలో త్యజించబడ్డ మానవ కళేబరాల మీద పరిచ్ఛేదాలు చేసి శరీర నిర్మాణం గురించి తన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. ఆ అధ్యయనాలలో కళని, విజ్ఞానాన్ని అద్భుతంగా సమన్వయపరచుకున్నాడు.
చిత్రకళ కోసం మొదలుపెట్టిన జీవశరీర పరిచ్ఛేదాలు అతణ్ణి నాడీ విజ్ఞానం వైపుకి తీసుకెళ్లాయి. 1487 ప్రాంతాల్లో ఒక సారి కప్ప మీద ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగాన్ని చేసిన మొదటివాడు బహుశ అతడేనేమో. ఆ ప్రయోగం గురించి ఇలా వర్ణిస్తాడు: "కప్పలో వెన్నుపాములో మెడుల్లా (మెడుల్లా అబ్లాంగాటా) ని పొడిస్తే కప్ప తక్షణమే చచ్చిపోయింది. అంతకు ముందు కొన్ని ప్రయోగాలలో తల మొత్తం తీసేసినా బతికింది. గుండె, ఇతర అంతరంగ అవయవాలు, పేగులు, చర్మం మొదలైనవి తొలగించినా బతికింది. దీన్ని బట్టి చూస్తే చలనానికి, జీవనానికి మూలం ఇక్కడే ఉందని అర్థమవుతోంది." ఈ వర్ణన రాసుకున్న నోట్సు పుస్తకంలో అదే పేజీ మీదే కప్ప వెన్ను పాము బొమ్మ కూడా వేసి ఆ పక్కనే "generative power" (జనన శక్తి) అని రాసుకున్నాడు. ఇక్కడే తన స్వానుభవం మీద ఆధారపడక, పూర్వీకుల భావాలకి తెలిసోతెలీకో దాసోహం అన్నాడు. శుక్రకణాలు (sperm cells) వెన్నుపాము నుండి వస్తాయన్న తప్పుడు భావన అప్పటికి 1900 ఏళ్ల క్రితం హిప్పోక్రేటిస్ కాలం నుండి వుంది. ఆ భావననే నిర్విమర్శగా లియొనార్డో అక్కడ సమ్మతించాడు.
1487 ప్రాంతాల్లోనే లియొనార్డో మెదడుని ప్రదర్శిస్తూ వేసిన చిత్రాలలో ఒక పేజీలో ఓ ఉల్లిపాయ పరిచ్ఛేదం బొమ్మ, ఓ మనిషి మెదడు పరిచ్ఛేదం బొమ్మ పక్క పక్కనే ఉన్నాయి. ఆ బొమ్మల పక్కనే రెండిట్నీ పోల్చుతూ ఇలా రాశాడు: "ఉల్లిపాయని మధ్యకి కోస్తే అందులో కేంద్రాన్ని కప్పే పలు పొరలు కనిపిస్తాయి. వాటిని లెక్కించొచ్చు కూడా. అలాగే మనిషి తలని మధ్యగా కోస్తే, ముందు జుట్టుని తొలగించాలి. తరువాత తలపై ఉండే చర్మం, ఆ తరువాత కండరసహితమైన మాంసపు పొర, ఆ తరువాత కపాలాన్ని కోయాల్సి ఉంటుంది. కపాలం లోపలికి పోతే వరుసగా డ్యురా మాటర్, పయా మాటర్, మెదడు ఉంటాయి. అలాగే ఇంకా లోపలికి చొచ్చుకుపోతే మళ్లీ పయా మాటర్, డ్యురా మాటర్, రేట్ మిరాబీల్ (rete mirabile) అనబడే రక్తనాళాల జాలాలు, మళ్లీ ఎముక వస్తాయి. ఆ ఎముకే మెదడుకి పునాది అవుతుంది."
(సశేషం...)
0 comments