భారతీయ భాషల్లో పాపులర్ సైన్స్ కావాలంటూ రచయిత NS Rajaram రాస్తున్నారు. రచయిత అమెరికాలో గణితరంగంలో ఉన్నారు. ఆయన గురించి ఓ వికీపీడియా వ్యాసం కూడా ఉంది. (http://en.wikipedia.org/wiki/N._S._Rajaram)
ఆ వ్యాసానికి అనువాదం...
---
చిన్నప్పుడే విజ్ఞానం పట్ల అభినివేశం కలిగించాలి - ఎన్.ఎస్. రాజారామ్
వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో ప్రముఖులైన ఎన్.ఆర్. నారాయణ మూర్తి, డా. సి.ఎన్.ఆర్. రావ్ లాంటి ప్రముఖులు భారత దేశపు వైజ్ఞానిక పరిశోధనా రంగం లోని వెలితిని గుర్తించి స్పందించడం చాలా హర్షించదగ్గ విషయం. శాస్త్రవేత్తల కృషికి బాసటా తగు సౌకర్యాలు ఉండాలని, వారికి ఉత్సాహం కలిగేలా తగిన పారితోషకాలు ఏర్పాటు చెయ్యాలని శ్రీ నారాయణ మూర్తి అన్నారు. మన సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థలైన ఐ.ఐ.టి.లు పరిశోధనా రంగంలో వెనుకబడి ఉన్నాయని, విఫలమవుతున్నాయని, అవి "కొద్దిగా రంగులు దిద్దిన ఇంజినీరింగ్ కాలేజిల్లా" తయారు కాకూడదని డా. సి.ఎన్.ఆర్. రావు మాట్లాడారు.
ఈ రెండు విషయాలూ నిజాలే. కాని నేను సమస్య యొక్క మరో కోణం గురించి ఇక్కడ ప్రస్తావించదలచుకున్నాను. అది - చిన్న వయసులోనే పిల్లలని విజ్ఞానం దిక్కుగా ఆకర్షితులయ్యేట్టు చెయ్యడం. వైజ్ఞానిక అంశాలు పిల్లలకి ఆకర్షణీయంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? యూ.ఏస్. లో, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో ఇరవై ఏళ్ళ బోధనా అనుభవం నుండి నాకు తెలిసింది ఏంటంటే, హైస్కూలు స్థాయిలోనే (అసలైతే ఇంకా ముందు నుంచే) పిల్లల్లో సైన్సు విషయాల పట్ల అభినివేశం కలుగజేయాలి.
సంగీతం లాగానే, విజ్ఞానం లో కూడా అభిరుచి ఉంటే అది చిన్నప్పుడే బయటపడుతుంది. సైన్సులోని సౌందర్యంతో, అద్భుతాలతో పిల్లలకి చిన్నప్పుడే పరిచయం కలిగేలా చెయ్యాలి. ఇక్కడ నా వ్యక్తిగత అనుభవం గురించి చెప్తాను. చిన్నప్పుడు గణితంలో నా ఆసక్తి పెరగడానికి ఓ ముఖ్య కారణం మా నాన్నగారు నాకు ఇచ్చిన ఓ పుస్తకం. అది సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ రాసిన "భౌతిక ప్రపంచపు తీరు తెన్నులు" (The Nature of the Physical World). ఇది చదివాక ఇలాంటిదే మరో పుస్తకం, ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ (లియోపోల్డ్ ఇన్ఫీల్డ్ తో కలిసి రాసిన) "భౌతిక శాస్త్రపు పరిణామం" (The Evolఉtion of Physics) అన్న పుస్తకం, కూడా చదివాను.
నా ప్రాథమిక శిక్షణ ఇంజినీరింగ్ రంగంలోనే జరిగినా, మంచి ఉద్యోగావకాశాలు ఊరిస్తున్నా, గణితం యొక్క ఆకర్షణే చివరికి గెలిచింది. ఒక ఐ.ఐ.టి.లో ఓ సెమిస్టర్ గడిపి, అక్కడ నచ్చక, గణితంలో (గణితభౌతిక శాస్త్రంలో) ఉన్నత చదువులకి యూ.ఎస్. కి వెళ్లాను. అక్కడ సైన్సు, ఇంజినీరింగ్ రంగాలకి చెందిన విద్యార్థులతో పని చేశాను. ఈ రెండు వర్గాలకి చెందిన విద్యార్థుల దృక్పథంలో ఉండే సమూలమైన తేడా చూసి ఆశ్చర్యపోయాను.
ఇంజినీరింగ్ విద్యార్థులు మరికొంచెం లౌకిక దృక్పథం కలిగి ఉంటారు. ఉద్యోగావకాశాల గురించి చక్కని స్పృహ కలిగి ఉంటారు. అందుకు భిన్నంగా సైన్సు విద్యార్థులు వైజ్ఞానిక భావాలలోని, ఆవిష్కరణలోని సౌందర్యానికి స్పందించి మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా గణితరంగంలో ఇదే జరుగుతుంది.
ఇలా సార్వత్రీకరించడం సమంజసమో కాదో గాని ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. సైన్సు, విజ్ఞాన రంగాలకి ఆకర్షితులయ్యే విద్యార్థుల కారణాలు పూర్తిగా వేరు. సైన్స్ స్ఫూర్తి దాయకంగా ఉంటుంది, ఇంజినీరింగ్ లో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. సైన్సులో మంచి ఉద్యోగావకాశాలు లేవని కావు. కాని యువతని ఆకర్షించేది అది కాదు. ఇంచు మించు ప్రతీ సందర్భంలోను ఒక్కటి మాత్రం నిజం. సైన్సు, గణిత రంగాల్లోకి ప్రవేశించినవారు, ముఖ్యంగా ఆ రంగాల్లో రాణించిన వారు, ఆ రంగాల పట్ల హైస్కూలు స్థాయిలోనో, లేక ఇంకా చిన్నప్పుడో, ఏ టీచరు ప్రభావం వల్లనో, తల్లిదండ్రుల ప్రభావం వల్లనో స్ఫూర్తి పొందిన వారే.
ఈ విషయంలో మన పిల్లలే కాక టీచర్లు కూడా ఎదుర్కునే పెద్ద సమస్య, భారతీయ భాషల్లో తీరుగా రాయబడ్డ జనరంజక వైజ్ఞానిక (popular science) పుస్తకాల కొరత. చైనీస్, జపనీస్, కొరియన్ దేశాల పిల్లల జీవితాలలో ఈ వెలితి ఉండదు. పిల్లలకి, టీచర్లకి నాణ్యమైన వైజ్ఞానిక పుస్తకాలని భారతీయ భాషల్లో అందించక పోతే, అధిక సంఖ్యలో యువ మనసులని సైన్సు దిశగా ఆకర్షించలేమని నా అభిప్రాయం.
కనుక తక్షణ కర్తవ్యం మనకి స్పష్టంగా కనిపిస్తోంది - తెలుసుకోవాలన్న తపన గల మనసుల వద్దకి సైన్సును తీసుకుపోవాలి. అంటే పిల్లలకి, వాళ్ళ టీచర్లకి అర్థమయ్యే భాషలో సైన్సును అందించాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అని గ్రహించాలి.
రాజారామ్ గారి తోటి మనమంతా అగ్రీ అవుతాము గాని నా ఉద్దేశం లో టీచర్స్ క్లాసు లో ఏవి చెప్పాలి అనే కాకుండా ఏలా చెప్పాలా అనేదాని మీద వర్క్ చెయ్యాలి. మేము చదువుకునేటప్పుడు పిల్లల పుస్తకాలు అసలు లేవు కాని ఆ సబ్జక్ట్స్ చెప్పిన టీచర్స్ ఇంకా గుర్తు ఉన్నారు. వారు చెప్పిన విధం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పచ్చు.
ఇంకొకటి అమెరికాలో పిల్లల పుస్తకాలు ఉన్నయ్యన్నారు. నిజమే. కానీ టీచర్స్ చెప్పే విధానం డిఫరెంట్. చిన్నప్పటినుండి ఆ పిల్లల పుస్తకాలూ చదివించి ప్రాజెక్ట్స్ చేయించే తల్లిదండ్రులు, టీచర్స్ ఉన్నారు. అవి కుడా చాల అవసరం అనుకుంటాను.