చంద్రుడిపై కట్టబోయే మొట్టమొదటి ఇళ్లు తప్పనిసరిగా చాలా చిన్నవిగానే ఉంటాయని సులభంగా ఊహించొచ్చు. దాన్ని ఇల్లు అనే కన్నా ఓ అధునాతన గుడిసె అని అనుకోవచ్చేమో! పునశ్శక్తివంతమైన బట్ట (reinforcement fabric) చేతగాని, ప్లాస్టిక్ పొర చేత గాని నిర్మించబడి, అర్థగోళాకారంలో ఉన్న చిన్న మందిరం లాంటిది నిర్మించుకోవాలి. అందులో అధికపీడనం వద్ద గాలి పూరించి అది ఉబ్బెత్తుగా పొంగి ఉండేట్టు చెయ్యాలి. దానికి ద్వారంలా పనిచేసే ఓ ఎయిర్లాక్ ని ఏర్పాటు చెయ్యాలి. దాని మీద పడ్డ సూర్యకిరణాల వల్ల మందిరం లోపలి భాగం వేడెక్కిపోకుండా, దాని మీద సిల్వర్ పూత వేసుకోవచ్చు. ఆ పూత వల్ల మీద పడ్డ కాంతి ప్రతిబింబితమై తిరిగి అంతరిక్షంలోకి పోతుంది. చూడడానికి ఇలాంటి మందిరం ఎస్కిమోల “ఇగ్లూ” లాగా ఉంటుందేమో. మన మొట్టమొదటి చంద్ర స్థావరం (Lunar Base) అలా ఉండొచ్చు.
(చంద్ర గ్రామాన్ని ప్రదర్శించే ఓ ఆధునిక ఊహాచిత్రం)
తొలి దశల్లో చంద్రుడికి ప్రయాణమయ్యే రాకెట్లు అధికశాతం ఆ చంద్ర స్థావరం దరిదాపుల్లోనే వాలే అవకాశం ఉంది. స్థావరాన్ని విస్తరించ డానికి అవసరమయ్యే పదార్థాలని భూమి నుండి బట్వాడా చేసే రాకెట్లు ఆ ప్రదేశంలోనే ఆగుతాయి. అలాంటి ఏర్పాటు వల్ల భూమి నుండి వచ్చే వనరులన్నీ ఒక్కచోటే పోగవుతాయి. అలా కాకుండా తొలిదశల్లోనే భూమి నుండి రవాణా అయ్యే వనరులు మొత్తం చందమామ ఉపరితలం అంతా విస్తరింపజేయడం మంచిది కాదు. ఇంచుమించు ఆఫ్రికా ఖండం అంత పెద్ద చంద్ర ఉపరితలం మీద వనరులని సమంగా పంచడం ఇంచుమించు అసంభవం. కనుక ఆ మొట్టమొదటి స్థావరం ఎక్కడ ఉండాలి అన్న నిర్ణయం చెయ్యడానికి చందమామ ఫోటోల మీద, అధిక సంఖ్యలో మనుషులు చందమామ వద్దకి ప్రయాణించక ముందు రోబో బృందాలు చేసిన పర్యవేక్షణల మీద, ఆధారపడవలసి ఉంటుంది. భూమి నుండి చూసినప్పుడు చందమామకి ఒక పక్కే మనకి కనపిస్తుందని బాగా తెలిసిన విషయమే. ఈ మొట్టమొదటి స్థావరం భూమినుండి కనిపించే ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యడం మంచిది. ఆ విధంగా అయితే స్థావరానికి భూమికి మధ్య సమాచార ప్రసారాలు నిరంతరాయంగా జరిగే అవకాశం ఉంటుంది.
చందమామ మీద స్థావరాన్ని ఏర్పాటు చేశాక అక్కడ మొట్టమొదట తలపెట్టదగ్గ ఓ కార్యక్రమం ఓ వేధశాల (observatory) ని నర్మించడం. కనీసం ఓ 20 ఇంచిల వ్యాసం ఉన్న పరావర్తనపు దూరదర్శిని (reflecting telescope) అక్కడ స్థాపించాలి. దాని కోసమని ప్రత్యేకంగా ఓ వ్యోమనౌకని ఉపయోగించినా నష్టమేం లేదు. చందమామ మీద ఉండే వేధశాల వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు ఉన్నాయి. భూమి మీద నుండి ఖగోళాన్ని చూసినప్పుడు వాతావరణం ఓ ఆచ్ఛాదనలా అడ్డొచ్చి దృశ్యాన్ని కలుషితం చేస్తుంది. కాని చందమామ మీద అలంటి సమస్య లేదు కనుక మరింత మేలైన పరిశీలనలు చేసుకోవచ్చు. తరువాత చందమామ మీద రాత్రి 14 (భూమి) రోజులు, పగలు 14 (భూమి) రోజులు ఉంటుంది కనుక వరుసగా 14 రోజుల పాటు రాత్రి పూట హాయిగా రోదసిలోకి తొంగిచూడొచ్చు. అలాంటి అద్భుతమైన వేధశాల వల్ల ఖగోళశాస్త్రంలో ఎంతో కాలంగా తేలని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తాడు క్లార్క్. ఉదాహరణకి మార్స్ గ్రహం మీద వెనకటికి కొన్ని “కాలువలు” ఉన్నాయని, అవన్నీ అక్కడి నాగరిక జీవుల ఉన్కికి ఆనవాళ్ళు అని కొందరు పరిశీలకులు పొరబడ్డారు. చందమామ మీద వేధశాల నిర్మిస్తే అలంటి మార్స్ ఉపరితలాన్ని మరింత స్పష్టంగా చూడొచ్చని, ఆ “కాలువల” సంగతేంటో తేల్చుకోవచ్చని అంటాడు క్లార్క్. అయితే చందమామ మీద వేధశాలతో పని లేకుండానే 1965 లో అమెరికా పంపిన మారినర్-4 నౌక తీసిన మార్స్ చిత్రాల వల్లను, ఆ తరువాత విలియమ్ హార్ట్ మన్ అనే శాస్త్రవేత్త తీసిన చిత్రాల వల్లను ఈ “కాలువల” సమస్య విడిపోయింది. అవి కాలువలు కావని, మార్స్ గాలులు మట్టిలో గీసిన బాటలని ఆ పరిశీలనల వల్ల తేలింది.
చందమామ మీద వేధశాల వల్ల లాభాల్లో మరొకటి కూడా పేర్కొంటాడు క్లార్క్. వాటి వల్ల మరింత మెరుగైన సమాచారం అందడమే కాదు. చందమామ మీద గురుత్వం తక్కువ కావడంతో అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలుచెయ్యడం భూమి మీద కన్నా కొంచెం సులభం. అయితే తొలి దశల్లో అలాంటి పెద్ద పెద్ద వేధశాలల నిర్మాణం జరిగే అవకాశం తక్కువ. ఎందుకంటే అంత పెద్ద నిర్మాణాల జరగడానికి ముందు అక్కడ ఊరికే స్థావరం ఉంటే సరిపోదు. ఓ పూర్తి గ్రామాన్ని, అంటే ఓ చంద్రగ్రామాన్ని (moon colony) నిర్మించుకోవాలి. అక్కడ తగిన సంఖ్యలో సిబ్బందిని పోగుచేసుకోవాలి.
కాని ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం ముఖ్యంగా సమకూర్చుకోవలసినది ఆక్సిజన్, నీరు. చంద్రుడి మీద వీటి కోసం ఎక్కడ వెతకాలో చెప్తాడు క్లార్క్.
(సశేషం...)
Image credits:
http://www.planit3d.com/source/gallery_files/lyne/moonbase.jpg
పాపులర్ సైన్స్ అనే అమెరికన్ పత్రిక గురించి చాలా మంది వినే ఉంటారు. చాలా కాలంగా దీని గురించి విని ఉండడంతో ఇది పాత పత్రిక అని తెలుసుగాని మరీ ఇంత పాతదని ఇవాళే తెలిసింది. ఆ మాగజైన్ కి చెందిన గత 138 (అవును అంకెలో దోషం లేదు!) ఏళ్లనాటి పాత ప్రతులు ఇప్పుడు నెట్ లో పెట్టారు (గూగుల్ వారి సౌజన్యంతో). అదో మహా విజ్ఞాన భాండారం అని వేరే చెప్పనక్కర్లేదు. అమెరికాలో కొన్ని తరాల వారు పాపులర్ సైన్స్ చదువుతూ, స్టార్ స్ట్రెక్ చూస్తూ, అసిమోవ్, క్లార్క్ నవళ్లు చదువుతూ, స్టాన్లీ కుబ్రిక్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్లు ఉన్నారు. లక్షలాది మందికి ఈ సీరియళ్లు, పత్రికలు, పుస్తకాలు స్ఫూర్తి నిచ్చి సైన్సు దిక్కుగా మరల్చాయి.
పాపులర్ సైన్స్ archives ని ఊరికే తిరగేస్తుంటే ఒక చోట ఆర్థర్ క్లార్క్ రాసిన వ్యాసం ఒకటి కనిపించింది.
http://www.popsci.com/technology/gallery/2010-10/archive-gallery-space-colonies
ఏప్రిల్ 1952 నాటి సంచిక అది. చందమామ మీద స్థావరాలు ఎలా ఏర్పాటుచేసుకోవాలో వివరంగా ఏకరువు పెడుతున్నాడు మహానుభావుడు! (మనిషి చంద్రుడి మీద పాదం మోపడానికి 16 ఏళ్లకి ముందు). వ్యాసం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందులో కొన్ని విశేషాలు.
కొత్తగా చంద్రుడి మీద మనిషి పాదం మోపిన దశలో ఇంకా స్థావరాలు, సొరంగాలు ఉండవు కనుక ఆ తొలి దశల్లో మనిషిని అక్కడికి మోసుకెళ్లే వ్యోమనౌకే తాత్కాలిక స్థావరంగా పనిచేస్తుంది. ఆ నౌకనే ఇల్లుగా చేసుకుని చుట్టు పక్కల ప్రాంతాలని స్పేస్ సూట్ లలో పర్యవేక్షించి రావలసి ఉంటుంది. బయట గాలి ఉండదు కనుక, స్పేస్ సూట్ లోపల పీడనం హెచ్చుగా ఉంటుంది. ఆ కారణం చేత సూట్ బిగుతుగా, వాహనపు టైర్లలా ఉండక తప్పదు. ఒక్క కీళ్ల దగ్గర మాత్రం సులభంగా వంగే వెసులుబాటు ఉంటుంది. ఇంచుమంచు కవచంలా ఉండే ఈ సూట్ల మరి భారీగానే ఉంటాయి. అయినా చందమామ మీద గురుత్వం తక్కువ కనుక భారీ సూట్లయినా సునాయాసంగా మోసేయొచ్చు అనుకుంటారేమో. బరువు వరకు అది నిజమే కావచ్చు గాని, భారీ సూట్ల ద్రవ్యరాశి ఎక్కువ కనుక వాటి జడత్వం (inertia) మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఆ సమస్య ఏంటో చెయ్యి విదిలించినప్పుడో, కాలు వేగంగా పైకెత్తినప్పుడో స్పష్టంగా తెలిసొస్తుంది.
ప్రస్తుతం వ్యోమగాములు వాడే స్పేస్ సూట్లు ఇంచుమించు పైన క్లార్క్ చెప్పినట్టే ఉంటాయి. కాని వ్యాసంలో క్లార్క్ మరి కొన్ని రకాల స్పేస్ సూట్లని కూడా ఊహిస్తాడు. స్పేస్ సూట్లు మెత్తగా, శరీరం యొక్క రూపానికి అతుక్కునేట్టుగా ఉండాలంటే పైన చెప్పుకున్న స్పేస్ సూట్ లాంటిది తప్పని సరి అవుతుంది. దాంతో పాటు వచ్చే సమస్యలు కూడా తప్పవు. అలా కాకుండా కఠినంగా ఉండే లోహపు సూట్లు ఫరవాలేదు అనుకుంటే మరో రకం సూట్లని ఊహించుకోవచ్చు. సిలిండర్ లాంటి లోహపు సూట్ లో ముందు దృశ్యం కనిపించడానికి కిటికీ లాంటిది ఉంటుంది. కింద ప్రత్యేకంగా అమర్చిన లోహపు కాళ్లు ఉంటాయి. ఆ కాళ్లని మోటార్లతో/బ్యాటరీ శక్తితో నడిపించాలి. అసలు “కాళ్లు” ఉండే స్పేస్ సూట్లు సర్వశ్రేష్ఠం అనుకోవాల్సిన పని లేదంటాడు క్లార్క్. పోగో స్టిక్ (pogo stick) లాంటి సాధనం మీద కంగారూలలా గెంతుతూ పొవచ్చు అంటాడు. అలాంటి పోగో స్టిక్ ల మీద భవిష్యత్తులో “చందమామ మీద కుందేళ్ల” లా వ్యోమగామలు గెంతుతూ తిరిగే దృశ్యం ఊహించుకోడానికి గమ్మత్తుగా ఉంటుంది.
స్పేస్ సూట్లలో ఓ 12 గంటల పాటు వచ్చే ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కాని అంతకన్నా పెద్ద సమస్య సూట్ లోని ఉష్ణోగ్రతని నియంత్రించడం. చందమామ మీద ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే పగటి వైపు నుండి చీకటి వైపుకి వెళ్లగానే కొద్ది సెకన్లలోనే ఉష్ణోగ్రత 400 C కింద పడుతుంది. బాహ్య ఉష్ణోగ్రతలో ఈ విపరీతమైన మార్పులకి తట్టుకోవడానికి ఓ సులభమైన ఉపాయం ఉంది – దేహానికి, బహిరంగానికి మధ్య సూట్లో ఓ శూన్యపు పొర ఏర్పాటు చేసుకుంటే చాలు. చందమామ మీద గాలి పెద్దగా ఉండదు కనుక శూన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్ట కాదు. కాని దీని వల్ల మరో సమస్య వస్తుంది. దేహం లోంచి పుట్టుకొచ్చే వేడి బయటికి పోలేక దేహం వేగంగా విపరీతంగా వేడెక్కిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక సూట్ లో పగటి పూట ఏ.సీ. వాడుకోక తప్పదు.
వాతావరణం లేకపోవడం వల్ల మాట్లాడుకోవడానికి రేడియో వాడడం తప్పదు. కాని ఈ రేడియోల రేంజి తక్కువ. చంద్రుడి వ్యాసం తక్కువ కనుక, రడియో తరంగాలు సరళ రేఖల్లో ప్రసారం అవుతాయి కనుక ఆరడుగుల ఎత్తు మనిషి నుండి ప్రసారం అయ్యే సంకేతాలు రెండు మైళ్లు మించి చేరవు... ఆ సహజ ఉపగ్రహం చుట్టూ, మనం కృత్రిమ ఉపగ్రహాలని స్థాపిస్తే తప్ప.
ఆ విధంగా వ్యోమనౌకే ఇల్లుగా, స్పేస్ సూటే వాహనంగా కొంత కాలం వ్యవహారం నడిపించొచ్చు. కాని ఏదో ఓ నాటికి ఇల్లు కట్టుకోవాలిగా? మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి?
(సశేషం...)
ఈ సారి మునుపటి ప్రయోగంలో చిన్న మార్పు చేసి చూశారు. బీటలు వారిన కృత్రిమ నేలలో కొంచెం నీరు పోసి తడి అయ్యేట్టు చేసి ఆ సరంజామాని మళ్లీ వాయుసొరంగం (wind tunnel) లో పెట్టారు. ఈ సారి నిజంగానే రాళ్లు మరి కాస్త ఎక్కువగా కదిలాయి. కాని ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఎక్కడో ఓ ముఖ్యమైన కారణం వారికి అంతుబట్టకుండా పోతోంది.
ఈ జారే రాళ్ల గురించి పి. మెస్సీనా అనే శాస్త్రవేత్త చాలా పరిశోధన చేసింది. ఈమె సాన్ హోసే స్టేట్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్. వాస్తవంలో జరిగినట్టుగా ప్రయోగశాలలో రాళ్లు ఎందుకు కదలడంలేదో ఆమెకి చాలా కాలం అర్థం కాలేదు. ఆ విషయమే లోతుగా ఆలోచిస్తూ ఒకసారి ఆమె ఓ ఐస్ హాకీ ఆట చూడడానికి వెళ్లింది. ఆట చూస్తుంటే ఉన్నట్టుండి ఓ ఆలొచన స్ఫురించిందట. ఐస్ మీద కదిలే హాకీ “బంతి” చిన్న దెబ్బకే ఎంతో దూరం కదులుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. బంతికి నేల మధ్య ఉండే రాపిడి వల్ల వాటి మధ్య ఐసు కరిగి, ఓ సన్నని నీటి పొర ఏర్పడుతుంది. దాని వల్ల రాపిడి తగ్గి, బంతి సులభంగా ఎంతో దూరాలు జారుతుంది. ఇలాంటి పరిణామం ఏవైనా ఈ కదిలే రాళ్ల విషయంలో జరిగే అవకాశం ఉందా?
లేకపోలేదు. అందుకు రేస్ట్రాక్ ప్లాయా వాతావరణ పరిస్థితులని మరి కాస్త పరీక్షగా గమనించాలి.
వర్షాకాలం తరువాత వచ్చే చలికాలంలో, రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతపు ఉష్ణోగ్రతలు సున్నా కన్నా తక్కువకి (ముఖ్యం రాత్రి వేళల్లో) పడే అవకాశం ఉంది. అంటే నీరు గడ్డ కట్టి ఐసు గా మారుతుందన్నమాట. ఆ నీటికి లోతు తక్కువ కనుక మొత్తం రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతం అంతా ఓ సహజ ఐస్ హాకీ మైదానం లా తయారయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో గాలి తాకిడికి రాళ్ళు సులభంగా కదిలే వీలు ఉంది. అంతే కాకుండా కింద నేల బురదగానే ఉంటుంది కనుక కదిలే రాళ్లు ఆ బురదలో బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతాయి!
సిద్ధాంతం బాగానే ఉంది. కాని అది నిజమని తేలాలంటే ప్రయోగం చేసి చూడాలి. వెంటనే ఈ విషయాన్ని పరీక్షించదలచుకుంది డా మెసీనా.
ఈ సారి ప్రయోగశాలలో కాస్త భిన్నమైన ఏర్పాటు చేశారు. ఓ చదునైన ఐసు గడ్డ తీసుకుని దాని మీద ఇందాక తయారుచేసిన ఎండిన మట్టి పలకని పెట్టారు. ఐసు ప్రభావం వల్ల ఆ పలక తడి అయ్యింది. అంతేకాక దాని మీద కూడా పలచని మంచు పొర ఏర్పడింది. ఈ సారి ఈ సరంజామాని వాయుసొరంగంలో పెట్టి వాయువేగాన్ని క్రమంగా పెంచారు. 70-90 mph వేగం వరకు రాగానే రాళ్లు నెమ్మదిగా, హుందాగా కింద మెత్తని బురదలో జాడ వేసుకుంటూ ముందుకి సాగాయి.
నడక నేర్చిన రాళ్ల గుట్టు ఆ విధంగా రట్టయ్యింది.
References:
http://en.wikipedia.org/wiki/Racetrack_Playa
http://en.wikipedia.org/wiki/Sailing_stones
(A Discovery science program telecast on 24/10/10!!!)
నిన్న డిస్కవరీ సైన్స్ లో ఓ ప్రోగ్రాం చూశాను.
ఎక్కడో ఓ ఎడారిలో రాళ్ళు వాటంతకవే కదుల్తూ పోతుంటాయట. పైగా అవి కదిలిన దారి వెంట ఓ కచ్చితమైన జాడ కూడా పడుతుందట. అదేదో మహత్యం అని మొదట్లో అంతా అనుకునేవారు. కాని అలా మహత్యంలా, విచిత్రంలా కనిపించే విషయంలోకి కూడా క్రమబద్ధంగా శోధించి, అందులోని రహస్యాన్ని అంచెలంచెలుగా బయటకు ఎలా తీశారన్నదే ఈ ప్రోగ్రాం లోని సారాంశం. ఆసక్తికరంగా అనిపించి గూగుల్ చేస్తే మరి కొంత సమాచారం కనిపించింది. ఆ విషయాలన్నీ క్లుప్తంగా ఈ వ్యాసంలో...
అమెరికాలో, కాలిఫోర్నియాలో, డెత్ వాలీ నేషనల్ పార్క్ లో ’Racetrack Playa’ అనే ప్రాంతంలో ఈ విచిత్రమైన రాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రేస్ట్రాక్ ప్లాయా సముద్ర మట్టానికి 3608 అడుగులు పైన ఉంటుంది. పొడవు 4.5 కి.మీలు, వెడల్పు 2 కి.మీ.లు ఉంటుంది. చాలా చదునుగా ఉంటుంది. కొండల మధ్య ఇమిడి ఉన్న ఓ విశాలమైన మైదానం లాంటిది ఈ ప్లాయా.
ఇక్కడ కనిపించే ఓ విశేషం ఈ కదిలే రాళ్లు. అయితే ఈ కదలిక చాలా నెమ్మదిగా సాగుతుంది. రెండు మూడేళ్లకి ఒకసారి కదులుతాయి. ఒకసారి కదలగా ఏర్పడ్డ బాటలు/జాడలు మూడు నాలుగు ఏళ్ల పాటు నిశ్చలంగా ఉంటాయి. పెద్ద పెద్ద బండలు కూడా నెమ్మదిగా జరుగుతూ పోతుంటాయి (చిత్రం). కొన్ని బండలు సూటిగా సరళ రేఖల్లో కదిలితే, కొన్ని వంకర టింకర గతుల్లో కదులుతుంటాయి. దీన్ని వీడియో తీసిన వాళ్లు ఎవరూ లేరు. ఇది ఎలా జరుగుతుందో ఎవరికీ చాలా కాలం అంతుబట్టలేదు.
ఏంటీ రహస్యం?
దీని గురించి నానా రకాల ఊహాగానాలు బయలుదేరాయి.
ఆ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక అది జంతువుల పని అయ్యే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. అయితే పోలీసులు ప్రతీ చోట గస్తీ తిరుగుతుంటారు కనుక, ఆ ప్రాంతపు పోలీసులు ఊరికే జనాన్ని భయపెట్టాలని ఇలా రాళ్లు జరుపుతున్నారని ఓ సిద్ధాంతం బయలుదేరింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆ ప్రోగ్రాంలో “మాకు ఇంతకన్నా వేరే పనే లేదా?” అంటాడు ఆ ప్రాంతపు పోలీసొకడు!
మరి ఎవరు జరుపుతున్నారు వీటిని?
రేస్ట్రాక్ ప్లాయా లో ఓ గమనించదగ్గ విషయం అక్కడి బలమైన ఈదురు గాలులు. 90 mph వేగంతో విస్తుంటాయి అక్కడి గాలులు. ఈ గాలులు సామాన్యంగా నైరుతి (southwest) నుండి ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఈశాన్య (northeast) వైపు నుండి బయటికి పోతాయి. విశేషం ఏంటంటే రాళ్లు వేసే జాడలు కూడా తరచు ఆ దిశలోనే ఉంటాయి. అంటే మరి ఈ రాళ్లు గాలికి కదులుతున్నాయా?
అదే నిజమైతే ఆ విషయాన్ని ప్రయోగశాలలో, కృత్రిమ పరిస్థితుల్లో కూడా సాధించ గలగాలి. ఆ విషయాన్ని శాస్త్రీయంగా శోధించడానికి ఓ వైజ్ఞానిక బృందం పూనుకుంది. (అది ఏ యూనివర్సిటీయో గుర్తులేదు. క్షమించాలి.)
రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతం నుండి కొంత మట్టి తిసుకుని, దాంతో బురద తయారుచేసి, దాన్ని చదునుగా ఓ పళ్లెం మీద పరిచి ఎండబెట్టారు. అది బీటలు వారి రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతంలో సామాన్యంగా కనిపించే బీటలు వారిన నేల (చిత్రం) మాదిరిగా తయారయ్యింది. ఆ కృత్రిమ నేల మీద రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతం నుండి తెచ్చిన ఓ నాలుగు రాళ్లు ఉంచారు. ఇప్పుడు ఈ సరంజామాని ఓ వాయుసొరంగం (wind tunnel) లో పెట్టి వాయు వేగాన్ని క్రమంగా పెంచసాగారు. వాయువేగం 70 mph దాటుతుంటే ఆ రాళ్లలో ఓ చిన్న రాయి కొద్దిగా జరిగి ముందుకు దొర్లిపోయింది.
ఆశించినట్టే అయ్యింది. వైజ్ఞానిక బృందం చాలా సంతోషించింది. గాలికి రాళ్లని కదిలించగలిగే శక్తి ఉందన్నమాట. కాని ఇక్కడ ఓ సమస్య ఉంది. వాస్తవంలో రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతంలోని రాళ్లు దొర్లవు (అరుదుగా తప్ప). ఎక్కువగా జారుకుంటూ, జాడలు వేసుకుంటూ ముందుకు పోతాయి. మరి ఆ పరిణామం ప్రయోగశాలలో కనిపించలేదు.
ప్రయోగంలో ఎక్కడో ఏదో లోపిస్తోంది? అదేంటబ్బా?
(మిగతాది వచ్చే పోస్ట్ లో...)
విశ్వం వ్యాకోచిస్తోందని చెప్పే కొత్త సిద్ధాంతాన్ని ఈ పరిశీలనలు సమర్ధిస్తున్నాయి. అయితే ఈ ఒక్క పరిశీలనతోనే ఒక నిర్ణయానికి రాకుండా, మరింత సమాచారం కోసం ఎదురుచూడాలి,” అంటూ జేబులోంచి ఒక కాగితం పైకి తీసి ఇస్తూ ఇలా అన్నాడు ప్రొఫెసర్. “ఈ విషయం మీదే కవితలు రాసే కొలీగ్ ఒకడు ఓ పద్యం రాశాడు. కావాలంటే చదువుకో.”
“ఇన్నేళ్ళూ నువు పడ్డ శ్రమ
వృధా అయ్యింది మిత్రమ”
అని హొయల్ తో చేసె రైల్ సవాలు
“ఎన్నడూ మారని విశ్వం
ఎనకటి రోజుల గుడ్డి నమ్మకం
ఎక్కడా కనిపించదు దానికి ఆనవాలు.”
“నా దూరదర్శిని
నీ భావ వినాశిని.
మనం ఉంటున్న విశ్వం
ఎదుగుతోంది దినదినం
అవుతూ ఇంకా ఇంకా విరళం.”
“గామోవ్, లమేత్రులవి పనికిమాలిన భావాలు,”
ఘాటుగా బదులిచ్చాడు హొయలు,
“వారికి రాదు ఓ అంటే ఢం
మహా విస్ఫోటమట మహావిస్ఫోటం!
వారిని ఎందుకు ఊరికనే సమర్ధించటం?”
“ఇదుగో చూడు ప్రియ నేస్తం
చెప్తున్నా వినుకో నిజం
విశ్వానికి లేవు అంతం, ఆరంభం
అంటున్నాం బోండీ, గోల్డ్, నేను
ఇది కల్లయితే అసలు నేనే లేను.”
“అబద్ధం!” అరిచాడు రైలు
ప్రత్యర్థిపై చెరిగె నిప్పులు.
“నువ్వే చూడు గెలాక్సీల ఛందం
దాపున కన్నా దవ్వున సాంద్రం
నిజం అవుతోంది బట్టబయలు.”
’చాల్లే వయ్యా రైలు”
కోపంగా అన్నాడు హొయలు.
“విశ్వంలో కొంగ్రొత్త పదార్థం
పుట్టుకొస్తోంది ప్రతీదినం
నిత్యమై విలసిల్లెను విశ్వం.”
...
పద్యం ఇంకా చాలా బోలెడు ఉండడంతో, చదువుతూ కూర్చుంటే ఇక్కడే తెల్లారుతుందని గ్రహించిన సుబ్బారావు, పద్యాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వాడిలా, బయటికి గట్టిగా నవ్వుతూ, చదవమని దాన్ని రమ్యకి అందించాడు. నాలుగు వాక్యాలు చదవగానే ఆ అమ్మాయి ముఖంలో విరిసిన చిరునవ్వు పువ్వులని సంతోషంగా ఓ సారి చూసుకుని, ప్రొఫెసర్ కి, రమ్యకి గుడ్ నైట్ చెప్పి నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు.
--
(ఇక్కడితో “సుబ్బారావు సాపేక్ష లోకం” సమాప్తం. మూల గ్రంథంలో ఇక్కణ్ణుంచి “క్వాంటం మెకానిక్స్” కి సంబంధించిన విశేషాలు మొదలవుతాయి. ప్లాంక్ స్థిరాంకం (Planck’s constant) చాలా పెద్దదిగా ఉన్న ప్రపంచంలో దైనిక జీవన ఘట్టాలలో కూడా క్వాంటం ప్రభావాలు కనిపిస్తుంటాయి. జీవితం గందరగోళంగా మారిపోతుంది. అలాంటి ప్రపంచంలో Mr. Tompkins పడే కష్టాలే ఇక్కణ్ణుంచి వృత్తాంతం. ఈ విషయాలని “సుబ్బారావు-క్వాంటం లోకం” అన్న పేరుతో మళ్లీ ధారావాహికంగా పోస్ట్ చేద్దామని ఉద్దేశం.
అయితే మరీ వరసపెట్టి బాదకుండా చిన్న బ్రేక్...)
“ఏంటిది సుబ్బూ?” గట్టిగా కుదుపుతూ రమ్య అన్న మాటలకి లేచి కూర్చున్నాడు సుబ్బారావు.
“ఏ కాలంలోనైనా, ఏ స్థలంలోనైనా హాయిగా నిద్రపోగలవని నాకు తెలుసు. కాని ఇంత మంచి సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఇలా నిద్రపోవడం ఏం బాలేదు,” కాస్త బాధగా అంది రమ్య.
కాసేపట్లో సుబ్బారావు రమ్యని వాళ్ల ఇంట్లో దిగబెట్టాడు. బయట వరండాలో ప్రొఫెసర్ కూర్చుని “ఆంధ్ర విజ్ఞానం” అనే పత్రిక తిరగేస్తున్నాడు.
“ఏవయ్యా ఎలా వుంది నాటకం?” అడిగాడు ప్రొఫెసర్.
“ఓ బ్రహ్మాండం!” తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అన్నాడు సుబ్బారావు. “ముఖ్యంగా శాశ్వత, నిశ్చల విశ్వం గురించి ఆయనెవరో పాడిన గీతం చాలా నచ్చింది. హమ్మయ్య అనిపించింది.”
“అనిపిస్తే అనిపించింది. కాని ఆ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మకు. మెరిసేదంతా బంగారం కాదంటారు. ఇప్పుడే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్టిన్ రైల్ రాసిన వ్యాసం ఒకటి చదువుతున్నాను. ఇతగాడు ఓ పెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మించాడు. మౌంట్ పాలొమర్ లో ఉన్న 200 ఇంచిల టెలిస్కోప్ కన్నా ఇది చాలా శక్తివంతమైనది. దీంతో మరింత దూరాలలో ఉన్న గెలాక్సీలని పరిశీలించొచ్చు. ఆయన పరిశీలనల ప్రకారం మనకి సమీపంలో ఉన్న గెలాక్సీల కన్నా దూరంలో ఉన్న గెలాక్సీలు మరింత దగ్గరి దగ్గరిగా ఉన్నాయి.”
“అంటే మనం ఉన్న చోట గెలాక్సీల సాంద్రత తక్కువగా ఉందని అనుకోవాలా?” అడిగాడు సుబ్బారావు.
“అలాంటిదేం లేదు,” ప్రొఫెసర్ వివరించుకుకొచ్చాడు. “కాంతి వేగం అమితం కాదని మనకి తెలుసు కనుక విశ్వంలో దూరాల లోతుల్లోకి తొంగి చూస్తున్నప్పుడు, ఆయా ప్రాంతాల గతంలోకి కూడా తొంగి చూస్తున్నాం అన్నమాట. ఉదహారణకి సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిముషాలు పడుతుంది. అంటే సూర్యుడి మీద మనం గమనించిన, ఎగసి పడుతున్న సౌరాగ్నికీల (solar flare) ఎనిమిది నిముషాల క్రితమే జరిగిపోయింది అన్నమాట. అలాగే మనకి సమీపంలో ఉన్న పెద్ద గెలాక్సీ – ఆండ్రోమెడా గెలాక్సీ – పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే ప్రస్తుతం మనం తీస్తున్న ఆ గెలాక్సీ చిత్రాలు పది లక్షల సంవత్సరాల క్రితం ఆ గెలాక్సీ ఎలా ఉండేదో చూపిస్తున్నాయి. కనుక మార్టిన్ రైల్ తన రేడియో టెలిస్కోప్ ద్వారా చూస్తున్న, లేదా వింటున్న సంకేతాలన్నీ ఆ విశ్వప్రాంతాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విశేషాలు. విశ్వం ఎప్పుడూ నిశ్చలంగా ఉన్నట్లయితే దూరంలో గెలాక్సీల సాంద్రత ఎలా ఉందో, సమీపంలో కూడా అలాగే ఉండాలి. కాని దూరంలో ఉన్న గెలాక్సీల సాంద్రత మరింత ఎక్కువగా ఉందని చూపిస్తున్న రైల్ పరిశీలనలకి అర్థం ఏంటంటే, గతంలో ఆ దశలో విశ్వం అంతటా గెలాక్సీల సాంద్రత కాస్త ఎక్కువగా ఉందన్నమాట. అదే నిజమైతే ’స్థిర స్థితి విశ్వ సిద్ధాంతం’ తప్పన్నమాట. విశ్వం వ్యాకోచిస్తోందని చెప్పే కొత్త సిద్ధాంతాన్ని ఈ పరిశీలనలు సమర్ధిస్తున్నాయి. అయితే ఈ ఒక్క పరిశీలనతోనే ఒక నిర్ణయానికి రాకుండా, మరింత సమాచారం కోసం ఎదురుచూడాలి.”
(సశేషం...)
గామోవ్ పాట ముగియగానే ఆ నృత్య నాటకాన్ని రాసిన రచయిత తానే స్వయంగా ప్రవేశించాడు. ఆ ప్రవేశం సామాన్యమైన ప్రవేశం కాదు. చీకటి నేపథ్యంలో పరిభ్రమిస్తున్న గెలాక్సీల మధ్య నుండి ఇతగాడు ఉన్నట్లుండి ఊడి పడ్డాడు. అక్కడితో ఆగక కోటు జేబు లోంచి ఓ బుల్లి గెలాక్సీని పిల్లిపిల్లని తీస్తున్నట్టు పైకి తీస్తూ ఓ పాట అందుకున్నాడు:
నిన్న నేడు రేపను భేదం
లేక నిత్యమై వెలుగొందు విశ్వం
కాదిది క్షణికపు మానవ భావన
పరమసత్యమిది పరమాత్మ ఆన
బోండీ, గోల్డ్, నేను – ఇది మా ముగ్గురి సందేశం
ఉన్కిపై భాష్యం చెప్పే “స్థిర స్థితి విశ్వ సిద్ధాంతం.”
(The universe, by Heaven’s decree,
Was never formed in time gone by,
But is, has been, shall ever be—
For so say Bondi, Gold and I.
Stay, O Cosmos, O Cosmos, stay the same!
We the Steady State proclaim!)
ముదుసలి తారలు కాంతిహీనమై
నెమ్మదించి మరి నిష్క్రమించు
అయినా లోకం క్షయ, వృద్ధి రహితమై
త్రికాలాల ప్రాకారాల నతిక్రమించు
నిత్య నిఖిలమై వెలిగే విశ్వం
పరమ సత్యమని మా విశ్వాసం.
(The aging galaxies disperse,
Burn out, and exit from the scene.
But all the while, the universe
Is, was, shall ever be, has been.
Stay, O Cosmos, O Cosmos, stay the same!
We the Steady State proclaim!)
రోదసి సరసిలో ఆగ్నినేత్రులు,
నవ్య తారకలు నీలి తమ్ములు
(ఏమన్నా గామోవ్, లమేత్రులు)
విశ్వాంశములు శాశ్వతమ్ములు
నిత్య నిఖిలమై వెలిగే విశ్వం
పరమ సత్యమని మా విశ్వాసం.
(And still new galaxies condense
From nothing, as they did before.
(Lemaitre and Gamow, no offence!)
All was, will be for evermore.
Stay, O Cosmos, O Cosmos, stay the same!
We the Steady State proclaim!)
ఆ విధంగా ఆ పెద్దమనిషి విశ్వం గురించి ఎంత గట్టిగా స్తోత్రం చదివినా, నేపథ్యంలో గిర్రున తిరుగుతున్న గెలాక్సీలు నెమ్మదిగా కాంతివిహీనం కాసాగాయి. ఒక్కొక్కటిగా పూలలా రాల్తూ కింద వేదిక మీద టపటపా కురియసాగాయి. అనతికాలంలోనే ఈ విచిత్ర ఖగోళ విలాసానికి తెరపడింది.
(సశేషం...)
ఆ విధంగా లమేత్ర్ గారు దండకం పూర్తి చేశాక, మరో వ్యక్తి రచ్చకెక్కాడు. ఇతగాడు జార్జ్ గామోవ్ అని ఓ రష్యన్ శాస్త్రవేత్త. సెలవలకని అమెరికా వెళ్లి అక్కడే ఓ ముప్పై ఏళ్లు గడిపిన గడుగ్గాయి ఇతగాడు. ఇదీ ఈ పెద్దమనిషి పాడిన... దాన్ని దండకం అంటారో, పాట అంటారో, వట్టి దండుగ పాట అంటారో మీరే తేల్చుకోండి.
ఓ ఫాదరీ! నా ఫాదరీ!
నువ్ చెప్పింది నిజమేలె ఓ ఫాదరీ!
అంతమే లేకుండ జన్మెత్తినాది
ఎల్లలే తెలియకా ఎదుగుతుండాది
ఓ ఫాదరీ! నా ఫాదరీ!
నువ్ చెప్పింది నిజమేలె ఓ ఫాదరీ!
పరమాణు రూపమని అంటావు ఏమి?
న్యూట్రాను ద్రవ్యమని తెలుసుకో సామి!
ఆది నుండీ అది అనంతమే,
విశ్వం ఆది నుండీ అపరిమితమే.
ఆది నుండీ అది అనంతమే,
విశ్వం ఆది నుండీ అపరిమితమే.
వినీల విశాల నిశీధిలో
పతనమయినదొక వాయురాశి
ఎన్నో కోట్ల యుగాల క్రితం
అయ్యిందది అతి సాంద్రం
ఎన్నో కోట్ల యుగాల క్రితం
అయ్యిందది అతి సాంద్రం
అదో ఆదిమ, అద్భుత అనన్య తరుణం
ఆ విశ్వం ఓ కాంతి మహార్ణవం
పదార్థాన్ని ముంచెత్తెను వెలుతురు
ప్రాసను మించిన ఛందం తీరు
పదార్థాన్ని ముంచెత్తెను వెలుతురు
ప్రాసను మించిన ఛందం తీరు
కొండంత కాంతికి కాస్తంత జడం
తేజం ప్రధానంగా గల లోకం
జనియించె మొదటి విస్ఫోటం
మొదలాయె విశ్వ వ్యాకోచం
జనియించె మొదటి విస్ఫోటం
మొదలాయె విశ్వ వ్యాకోచం
ఎన్నో లక్షల యుగాలు దొరలెను
కాంతి వైభవం పాలిపోయెను
తేజస్సును గెలిచింది జడం
వెలసెను ఘనతర ప్రపంచం
తేజస్సును గెలిచింది జడం
వెలసెను ఘనతర ప్రపంచం
సంఘననమయ్యెనిక మృత్తిక
(జేమ్స్ జీన్స్ సూచించిన రీతిగ)
వ్యాపించె బృహత్తర ధూళి మేఘములు
శైశవ తారాసందోహములు
వ్యాపించె బృహత్తర ధూళి మేఘములు
శైశవ తారాసందోహములు
పెటేలుమని నక్షత్ర రాశులు
పెనుచీకటిలో పరుగులిడె
చీకటి తెరపై పొడిచె తారకలు
రోదసి మోమున దీపికలు
చీకటి తెరపై పొడిచె తారకలు
రోదసి మోమున దీపికలు
నెమ్మదిస్తున్న విశ్వతాండవం
వన్నె పోతున్న తారాతేజం
చలిగుప్పెటలో సోలిన విశ్వం
నిశ్చేష్టం, నిర్జీవం, మృతం
చలిగుప్పెటలో సోలిన విశ్వం
నిశ్చేష్టం, నిర్జీవం, మృతం
(సశేషం...)
ఓ విరాడ్రూపమా!ఓ విశ్వబీజమా
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
తొల్లి గురుతెరుంగని యుగంబుల క్రిందటన్
లెక్కింపరానన్ని తుత్తునియలై నీవు
ఆదిశక్తివై, విశ్వశక్తివై,
జగద్రక్షవై, జగద్ధాత్రివై,
విశాల తారామండలాదులన్ సృజియించినావు!
ఓ విరాడ్రూపమా!ఓ విశ్వబీజమా
ఓ దైవకార్యమా!
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
సుదీర్ఘయుగముల వికాస క్రమమున
జగమంతయు విరిసిన తారావళి
నీ చిరునవ్వు కాంతుల దీపావళి
ప్రచండ హిరణ్య తారాగ్ని కీలలు
సమస్త భక్షక కృష్ణబిలములు
నీ ఆదిమ జన్మకు జ్ఞాపికలు!
ఓ విశ్వబీజమా!
ఓ దైవకార్యమా!
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
(సశేషం...)
మర్నాడు ఉదయం సుబ్బారావు టిఫిన్ చేద్దామని మళ్ళీ హోటల్ లో రెస్టారెంట్ కి వెళ్లాడు. మళ్లీ అక్కడ ప్రొఫెసర్ కనిపించాడు. రాత్రి తనకి వచ్చిన చిత్రమైన కల గురించి ప్రొఫెసర్ కి పూస గుచ్చినట్టు చెప్పాడు.
కల అంతా విన్నాక ప్రొఫెసర్ అన్నాడు,
“విశ్వం అంతా అలా అంతరించిపోవడం కాస్త బాధాకరమైన ముగింపే. కాని ప్రస్తుత స్థితిలో గెలాక్సీలు పరస్పరం దూరం అయ్యే వేగం ఎంత ఎక్కువగా ఉందంటే విశ్వం ఇలా అంతులేకుండా వ్యాకోచిస్తూనే ఉంటుంది. గెలాక్సీల మధ్య దూరం పెరుగుతూ విశ్వంలో ద్రవ్యరాశి యొక్క విస్తరణ ఇంకా ఇంకా పలచబడుతూనే ఉంటుంది. ఏదో ఒక దశలో తారలలోని ఇంధనం అంతా హరించుకుపోయాక అవి కూడా చల్లబడిపోతాయి, చచ్చిపోతాయి. అప్పుడిక విశ్వం అంతా అనంతంగా విస్తరించిన ఈ తాపరహిత, క్రియారహిత మహాశిలల మరుభూమిలా తయారవుతుంది. ఇది ఒక వాదం.”
“ఇందుకు భిన్నంగా ఆలోచించే శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీళ్లది నిశ్చల స్థితి విశ్వదర్శనం (theory of a steady state universe). వీళ్ల భావన ప్రకారం విశ్వం సంకోచ వ్యాకోచాలు లేకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. అనంతమైన గతంలోనూ అలాగే ఉండేది, అనంతమైన భావిలోనూ అలాగే ఉండబోతుంది. ఇలాంటి విశ్వం బ్రిటిష్ సామ్రాజ్యానికి మహా నచ్చేస్తుందేమో! ఎందుకంటే వాళ్ల హయాంలో ఉన్న రాజ్యాలని ఎదుగు బొదుగు లేకుండా తొక్కి పట్టి ఉంచడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కాని నిశ్చల స్థితి సిద్ధాంతం నిజమని నేను నమ్మడం లేదు. ఈ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక ఖగోళ శాస్త్రంలో ప్రొఫెసరు. ఈ పెద్దమనిషికి సంగీతం, నాటకం మొదలైన కళా విషయాల్లో కూడా మంచి ప్రవేశం ఉంది. ఈ సిద్ధాంతం గురించి ఆయన ఓ పెద్ద నృత్యనాటిక కూడా రాశాడు. వచ్చే వారమే ఆ నాటక ప్రదర్శన. కావాలంటే మా రమ్యని తీసుకెళ్లు. సరదాగా ఉంటుందేమో!”
బీచి నుండి తమ సొంతూరికి తిరిగొచ్చిన కొన్నాళ్ల తరువాత ఒక రోజు రమ్య, సుబ్బారావులు ఆ నృత్య నాటిక చూడడానికి వెళ్లారు. ఐదొందల రూపాయల టికట్లు కొనుక్కుని, ముందు వరసలో ఉండే మెత్తని సీట్లలో కుర్చుని, యవనిక ఎప్పుడు లేస్తుందా అని ఇద్దరూ ఉత్కంఠతో చూస్తూ కూర్చున్నారు. కాసేపయ్యాక తెరలో చిన్న కదలిక కనిపించింది. ఇద్దరూ ఊపిరి బిగబట్టారు. తెర లేవలేదు గాని సన్నగా, పీలగా ఉన్న ఓ బట్టతలాయన తెరసందుల్లోంచి బయటికి పొడుచుకొచ్చాడు. ఆయన చెవుల్లోంచి పొడుచుకొస్తున్న కేశసౌభాగ్యం అల్లంత దూరం నుండి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ’నాటకం మేనేజరు కామోసు’ అనుకున్నారంతా. ఏవో అనివార్య కారణాల వల్ల నాటకం ఆలీసెం అవుతోందని, కాస్త ఓపిక పట్టమని విన్నవించుకుని వెనక్కు మళ్లాడు. అలా మరో రెండు సార్లు విన్నవించుకునేసరికి ప్రజలకి సహనం చచ్చి, చేతికి వచ్చింది విసరడానకి చేతులెత్తబోయేంతలో ఎవరో తెర ఎత్తేశారు.
గణపతి స్తోత్రంతో మొదలెట్టడం ఆనవాయితీ కనుక వేదిక మీద గణపతి పటం కోసం అందరి కళ్లూ గాలించాయి. కాని అలాంటిదేవీ కనిపించలేదు. అసలు ఏవీ కనిపించలేదు. కళ్లు జిగేలు మనిపించే ప్రచండ కాంతితో వేదిక నిండిపోయింది.
ఐదొందల రూపాయలు, యాభై రూపాయలు అన్న తారతమ్యం లేకుండా, హాల్లో సీట్లన్నిటినీ ఆ కాంతి ఉప్పెనలా ముంచెత్తింది.
నెమ్మదిగా ఆ కాంతి పలచబడింది. దాని స్థానంలో క్రమంగా చీకటి చోటుచేసుకోసాగింది. హాల్లో ఎటు చూసినా చీకటే వ్యాపించింది. ఆ చీకట్లో అక్కడక్కడా దివిటీల్లా... కాదు నిప్పులు చెరిగే దీపావళి విష్ణు చక్రాల్లా అక్కడక్కడ ఏవో కాంతిమయమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అంతలో నేపథ్యంలో కమ్మని సంగీతం ఊటలా పుట్టుకురాసాగింది. ఎన్నో వీణలు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని కమ్మని స్వరాల తేనె తీపులతో ఆ నిశిని నింపసాగాయి. వినసొంపైన మృదంగ ధ్వనులు ఆ కాంతి వర్షపు చిటపటల్లా అనిపించసాగాయి. అలా ఆ కాంతివలయాల విశ్వలాస్యం కొనసాగుతుండగా, ఆ విశ్వసంగీత తరంగాలు మిన్నంటుతుండగా ...
...ఓ నిలువెత్తు మనిషి నిండుగా సూటుబూటుతో రంగప్రవేశం చేశాడు.
(సశేషం...)
“ఈ విచిత్ర, వికృత ప్రపంచంలో కొంపదీసి రంధ్రం చేశానా?” సుబ్బారావు మనసులో ఆలోచన మెదిలింది. సందేహ నివృత్తి కోసం ప్రొఫెసర్ ని అడగాలని చుట్టూ చూశాడు. కాని పరిసరాలలో ఎక్కడా ప్రొఫెసర్ కనిపించలేదు. చుట్టూ చూసుకుంటే తన హోటల్ రూమ్ లో పక్క మీద ఉన్నాడు.
“మళ్లీ వ్యాకోచించడం మొదలెట్టాకే కొత్త జీవాలు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది.”అన్న ప్రొఫెసర్ మాటలు మనసులో మననం చేసుకుంటూ, విశ్వం ఇంత నెమ్మదిగా వ్యాకోచిస్తున్నందుకు మనసులోనే కాలానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కాలకృత్యాలు తీర్చుకుందామని తీరిగ్గా మంచం దిగాడు సుబ్బారావు.
(సశేషం...)
“అవును నిజమేనే. మీరు చెప్పినట్టు దూరంగా ఉన్న వస్తువులకి ఒక విధమైన గులాబి రంగు ఛాయ వున్నట్టుంది.” ’మీ అమ్మాయి బుగ్గల్లా,’ అని మనసులోనే అనుకుని, బయటికి మాత్రం వినమ్రంగా, “ఎందుకంటారూ?” అని ప్రశ్నించాడు సుబ్బారావు.
“మీరు ఎప్పుడైనా గమనించారా?” వివరించుకొచ్చాడు ప్రొఫెసర్. “మన దిశగా దూసుకు వస్తున్న రైలు కూత కీచుగా వినిపిస్తుంది. కాని ఆ రైలు మనని దాటి వెళ్లిపోగానే, కూత కిచుదనం హఠాత్తుగా తగ్గుతుంది. దీన్నే డాప్లర్ ప్రభావం అంటారు. శబ్దం యొక్క కీచుదనం (లేదా శ్రుతి) శబ్ద మూలం యొక్క వేగం మీద ఆధారపడడం అన్నమాట. విశ్వం అంతా వ్యాకోచిస్తోంది గనుక, అందులో వస్తువులన్నీ ఒకదాన్నుంచి ఒకటి దూరంగా తరలిపోతున్నాయి. వాటి మధ్య సాపేక్ష వేగం వాటి మధ్య దూరానికి అనులోమంగా (directly proportional) మారుతోంది. అంటే దూరదూరంగా ఉన్న వస్తువుల మధ్య సాపేక్ష వేగం మరింత ఎక్కువ అన్నమాట. అందుకే దూరంగా ఉన్న వస్తువుల నుండి వచ్చే కాంతి కాస్త ఎర్రబారినట్టు ఉంటుంది. శబ్దానికి శ్రుతి ఎలాగో, కాంతికి రంగు అలాగ. కాంతి మూలం మన నుండి దూరంగా తరలిపోతోంది కనుక, దాని నుండి మన దిశగా వచ్చే కాంతి, వస్తువు యొక్క గమన దిశకి వ్యతిరేక దిశలో వస్తోంది కనుక, ఆ కాంతి ’శ్రుతి’ అంటే రంగు కాస్త ఎర్రబారినట్టు ఉంటుంది. ఎందుకంటే రంగులలో ఎరుపు కాస్త తక్కువ “శ్రుతి” గలది. వస్తువు దూరం పెరుగుతున్న కొలది, దాని వేగం కూడా పెరుగుతుంది కనుక దాని నుండి వచ్చే కాంతి మరింత ఎర్రబారినట్టు కనిపిస్తుంది. ఎలా కాంతి వర్ణం ఎరుపు దిశగా మారడాన్నే ’అరుణ-భ్రంశం’ (red shift) అంటారు. ఉదాహరణకి మనం ఉండే ఆ పెద్ద విశ్వంలో, మనకి అతి దగ్గరలో ఉన్న తారామేఘాలు, అంటే ఆండ్రోమెడా నీహారికల (Andromeda nebula) లాంటివి తీసుకుంటే, వాటి నుండి వచ్చే కాంతి 0.05% ఎర్రబారుతుంది అని తెలుసుకోవచ్చు. ఆ నీహారికలకి మనకి మధ్య దూరం పాతిక లక్షల కాంతి సంవత్సరాలు. ప్రస్తుతం మన దూరదర్శినులు చూడగల దూరాల అంచుల వద్ద కొన్ని నీహారికలు ఉన్నాయి. వాటి నుండి వచ్చే కాంతిలో అరుణభ్రంశం 15% వరకు కూడా ఉంటుంది. బహుశ ఆ పెద్ద విశ్వపు విశ్వమధ్యరేఖ (equator) కి సగం దూరంలో ఉన్నాయేమో. ఖగోళ శాస్త్రవేత్తలకి తెలిసిన విశ్వభాగం, మొత్తం విశ్వంలో గణనీయమైన భాగమే. ప్రస్తుతం విశ్వం వ్యాకోచించే వేగం ఏడాదికి 0.00000001%. అంటే ఒక సెకనులో పది మిలియన్ మైళ్ళు పెరుగుతోంది అన్నమాట. మన ఈ బుల్లి విశ్వం పెరిగే వేగం మరి కాస్త ఎక్కువ. దీని పరిమాణం నిముషానికి 1% పెరుగుతోంది.”
(సశేషం...)
“నిజమే,” ఒప్పుకుంటూ అన్నాడు సుబ్బారావు. “కాని అసలు ఎక్కడా ద్రవ్యరాశే లేకుంటే, విశ్వం యొక్క వాస్తవ జ్యామితి చిన్నప్పుడు నేను బళ్లో చదువుకున్న యూక్లిడియన్ జ్యామితి లా ఉండేదా? అప్పుడిక సమాంతర రేఖలు ఎప్పుడూ కలవవు కదా?”
“అవును కలవవనే అనుకోవాలి. కాని ఆ విషయాన్ని నిర్ధారించడానికి ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆ ఉన్నవారికి ద్రవ్యరాశి గల దేహం ఉండాలిగా?”
“అయితే బహుశా అసలు యూక్లిడ్ అన్న వాడే లేడేమో. అందుకే బొత్తిగా శూన్యమైన విశ్వానికి సంబంధించిన జ్యామితిని ఊహించి రాశాడు!” ఏదో గొప్ప ఆలోచన వచ్చినట్టు ఉత్సాహంగా అన్నాడు సుబ్బారావు.
అతను ఏం మాట్లాడుతున్నాడో ఒక్క నిముషం ప్రొఫెసర్ కి అర్థం కాలేదు. కాని ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శాల్తీలతో వాదన పొడిగించే కన్నా, మౌనమే మేలని ఊరుకున్నాడు.
ఇంతలో పుస్తకం యొక్క ప్రతిబింబం అది మొదట బయలుదేరిన దిశలోనే ముందుకు సాగి, మళ్లీ రెండవ సారి దగ్గరికి రావడం కనిపించింది. ఇప్పుడా పుస్తకం మునుపటి కన్నా ఎక్కువగా పాడైపోయింది. గుర్తుపట్టలేనంతగా పాడైపోయింది. పుస్తకం నుండి వచ్చే కాంతి రేఖలు విశ్వం అంతా చుట్టి రావడం వల్ల అల కనిపిస్తోందని ప్రొఫెసర్ వివరించాడు.
“మీరు ఒక సారి తల తిప్పి చూస్తే నా పుస్తకం విశ్వం అంతా చుట్టి తిరిగి మన దగ్గరికి రావడం కనిపిస్తుంది.” అని ప్రొఫెసర్ అంటూనే గాల్లో కొట్టుకొస్తున్న పుస్తకాన్ని చెయ్యి చాచి చటుక్కున అందుకుని జేబులో పెట్టుకున్నాడు. “విశ్వంలో ఎంత దుమ్ము, ధూళి ఉందంటే విశ్వం అంచుల వరకే కాక, పూర్తిగా విశ్వం చుట్టుకొలత వెంట స్పష్టంగా చూడడం ఇంచుమించు అసంభవం అవుతుంది. మన చుట్టూ తారాడుతున్న ఛాయారూపాలు మన యొక్క, లేదా మన చూట్టూ ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలే కావచ్చు. కాలాయతనపు వంపు వల్ల, ధూళి వల్ల ఈ ప్రతిబింబాలు ఎంతగా విరూపం అయిపోయాయి అంటే, వాటి ఆనవాళ్లు గుర్తించడానికి కూడా వీలుకావడం లేదు.”
“మనం అంతకు ముందు జీవించిన అసలు విశ్వం, ఆ మహా విశ్వంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతాయా?” అమాయకంగా అడిగాడు సుబ్బారావు.
“తప్పకుండా జరుగుతాయి. కాని చిక్కేంటంటే ఆ అసలు విశ్వంలో కాంతి విశ్వం అంతా ఓ చుట్టు చుట్టి రావడానికి కోటానుకోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆ విశ్వంలో కూడా వెనుక అద్దం లేకుండా క్షవరం చెయ్యించుకోవచ్చు. అయితే ఆ భాగ్యం కోసం మంగలి వాడి వద్ద కోటానుకోట్ల సంవత్సరాలు, విశ్వం అంతా చూట్టి తిరిగొచ్చే కాంతి కోసం, పడిగాపులు కాయవలసి ఉంటుంది. అదీ గాక తారాంతర ధూళి వల్ల దృశ్యం అలుక్కుపోయినట్టు ఉంటుంది. కనుక మంగలివాడి చాతుర్యం ఏ పాటిదో తెలుసుకొవడం అంత సులభం కాదు. ఈ విషయం గురించే ఓ బ్రిటిష్ ఖగోళ వేత్త ఒకసారి పరిహాసంగా అన్నాడు. మనం ప్రస్తుతం చీకటి ఆకాశంలో చూసే తారలలో కొన్ని ఎప్పుడో ఆ స్థానంలో ఉన్న తారల ప్రతిబింబాలు మాత్రమే.”
ఈ విచిత్ర వివరణలన్నీ విని విసిగిపోయిన సుబ్బారావు ఓ సారి ఇబ్బందిగా అటు ఇటు చూశాడు. ఇప్పుడు ఆకాశం మునుపటి కన్నా కాస్త తెరిపిపడడం చూసి ఆశ్చర్యపోయాడు. మునుపు ఉన్నంత ధూళి ఇప్పుడు లేదు. అంత వరకు ముక్కుకి అడ్డంగా కట్టుకున్న రుమాలు తీసేశాడు. ఆకాశంలో కొట్టుకొచ్చే రాళ్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. వాటి వేగం, ధాటి కూడా తగ్గింది. తాము నించుని ఉన్న లాంటి పెద్ద పెద్ద బండలు కూడా ఇప్పుడు దూరంగా తరలిపోయాయి.
“హమ్మయ్య!” గుండెల నిండా ఓ సారి ఊపిరి తీసుకున్నాడు సుబ్బారావు. “ఆ రాళ్లలో ఒకటి ఎప్పుడు నా నెత్తిన పడుతుందోనని భయపడి చచ్చాననుకోండి. అయినా ఉన్నట్లుండి మన పరిస్థితులు అలా ఎందుకు మారాయంటారూ?”
“ఓహ్! అదా? చాలా సులభం,” తనకి సులభం కాని ప్రశ్నలే లేవన్న ఫక్కీలో వక్కాణించాడు ప్రొఫెసరు. “మనం ఉంటున్న ఈ చిన్న విశ్వం కూడా వ్యాకోచిస్తోంది. మనం మొదట ఇక్కడికి వచ్చినప్పుడు దీని వ్యాసం ఐదు మైళ్లు అయితే, ప్రస్తుతం దీని వ్యాసం నూరు మైళ్లు. దూరంగా ఉన్న వస్తువులు కాస్త ఎర్రబారినట్టు కనిపించగానే అనుకున్నా, ఈ విశ్వం వ్యాకోచిస్తోందని.”
“అవును నిజమేనే. మీరు చెప్పినట్టు దూరంగా ఉన్న వస్తువులకి ఒక విధమైన గులాబి రంగు ఛాయ వున్నట్టుంది.” ’మీ అమ్మాయి బుగ్గల్లా,’ అని మనసులోనే అనుకుని, బయటికి మాత్రం వినమ్రంగా, “ఎందుకంటారూ?” అని ప్రశ్నించాడు సుబ్బారావు.
(సశేషం...)