గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికే యుద్ధం పద్నాలుగేళ్లుగా నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో కాథలిక్ వర్గం యొక్క అధిపత్యాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోప్ అర్బన్ VIII మీద పడింది. కాథలిక్కుల ప్రతినిధిగా తన పెత్తనం కొనసాగాలంటే ప్రొటెస్టంట్ల విప్లవాన్ని ఎలాగైనా అణచాలి. ముందుగా కాథలిక్ మతానికి విరుద్ధంగా మాట్లాడే గొంతికలని మూయించాలి. కనుక కాథలిక్ మతానికి విరుద్ధమైన ప్రచారాన్ని బహిష్కరిస్తూ, అలాంటి ప్రచారానికి తీవ్ర దండన ప్రకటించాడు. మతం సమర్ధించే పృథ్వీ కేంద్ర సిద్ధాంతానికి వ్యతిరేక ప్రచారం మీద వేటు వేయాల్సిన అవసరం కనిపించింది.
అయితే పోప్ అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వ్యక్తిగతమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. పెరుగుతున్న గెలీలియో పరపతికి ఓర్వలేని కొందరు ఆస్థాన ఖగోళశాస్త్రవేత్తలు గెలీలియో మీద లేని పోని చాడీలు చెప్పసాగారు. పోప్ తెలివితేటలని కించపరుస్తూ గెలీలియో తన పుస్తకంలో ఎన్నో విసుర్లు విసిరాడని చెప్పారు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. సర్వశక్తివంతుడైన దేవుడు భౌతిక ధర్మాలకి అతీతంగా విశ్వాన్ని సృష్టించాడని పోప్ ఎన్నో చోట్ల చాటుతూ వచ్చాడు. ఈ విషయం గురించే గెలీలియో “సంవాదాల”లో ఒక చోట పండితుడైన సాల్వియాటీ, మూఢుడైన సింప్లీసియోతో హేళనగా ఇలా అంటాడు: “అవున్లే! దేవుడు తలచుకుంటే పక్షుల అస్తిపంజరాలలో ఎముకకి బదులు బంగారం ఉండేదేమో, వాటి రక్తనాళాలలో పాదరసం ప్రవహించేదేమో, వాటి మాంసం సీసం కన్నా బరువుగా ఉండేదేమో! చిట్టి చిట్టి రెక్కలతో ఆకాశంలో అంతెత్తున సునాయాసంగా ఎగిరేవేమో! కాని దేవుడు అలా చెయ్యలేదు. దీన్ని బట్టి నీకో విషయం అర్థం కావాలి. అది తెలుసుకోడానికి ప్రయత్నంచకుండా నీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ అడుగడుగునా దేవుడి పేరు ఎందుకు వాడుకుంటావు?” ఇవన్నీ చదివిన పోప్ కి నిజంగానే చిర్రెత్తి ఉంటుంది.
“సంవాదాలు” ప్రచురితం అయిన కొంతకాలం తరువాత మతధర్మకర్తల సదస్సు (Inquisition) గెలీలియోని న్యాయవిచారణ కోసం పిలిపించింది. మతవ్యతిరేక ప్రచారం చేస్తున్నాడన్న నింద మోపి రోమ్ కి రమ్మని సందేశం పంపింది. అలాంటి పరిస్థితుల్లో రోమ్ కి వెళ్తే ఏం జరుగుతుందో గెలీలియోకి బాగా తెలుసు. పైగా ఆ సమయంలో తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రోమ్ కి ప్రయాణం ఆ పరిస్థితుల్లో తన వల్లకాదని కబురు పెట్టాడు గెలీలియో. రానని మొండికేస్తే రెక్కలు కట్టి తిసుకురావలసి ఉంటుందని తీవ్రంగా వచ్చింది సమాధానం. ఇక గతిలేక ప్రయాణానికి సిద్ధం అయ్యాడు గెలీలియో.
(సశేషం...)
0 comments