అధ్యాయం 1
ప్రాచీనులు
1. నిప్పు – రాయి
అప్పుడప్పుడే పనిముట్లని వాడడం నేర్చుకుంటున్న ఆదిమానవుడు, ప్రకృతిలో సహజంగా దొరికే వస్తువులనే వాడేవాడు. పెద్ద జంతువుల తుంటి ఎముకలు, చెట్ల కొమ్మలు, పదునైన రాళ్లు – ఇవే అతడి అస్త్రశస్త్రాలు. కాలక్రమేణా రాళ్లని చెక్కి, కోయడానికి పదునైన వాదర, పట్టుకోడానికి అనువైన పిడి కలిగేలా వాటిని మలచడం నేర్చుకున్నారు. మరి కొంత కాలం పోయాక ఆ రాళ్లని చెక్కతో చేసిన ఒరలో ఇమడ్చడం నేర్చుకున్నారు. ఇన్ని చేసినా ఆ రాయి రాయిగానే ఉండిపోయింది, చెక్క చెక్కగానే ఉండిపోయింది.
కాని కొన్ని సందర్భాల్లో వస్తువుల లక్షణాలు అనుకోకుండా మారుతాయి. అడవిలో పిడుగు పడి ఎండుచెట్లు భగ్గున నిప్పంటుకోవచ్చు. చెట్టు ధగ్ధం కాగా మిగిలిన నల్లని బూడిదకి, అంతకు ముందు ఉన్న చెట్టులోని కట్టెకి మధ్య పోలికే కనిపించకపోవచ్చు. అలాగే ఊరికే గాలికి వొదిలేసిన మాంసం కొంతకాలానికి కుళ్ళు కంపుకొడుతుంది. నిలవబెట్టిన పళ్లరసం పులిసిపోవచ్చు, లేదా మత్తెక్కించే పానీయంగా మారనూవచ్చు.
అలా పదార్థపు లక్షణాల్లో వచ్చే కొన్ని మౌలికమైన మార్పులు మనం రసాయనిక శాస్త్రం అనే ఈ శాస్త్రంలో ప్రధానాంశం. అలాంటి మార్పులు పదార్థంలోని సూక్షాంశాల స్థాయిలో జరుగుతాయని మనకిప్పుడు తెలుసు. పదార్థం యొక్క తత్త్వంలోను, సూక్ష్మ నిర్మాణం లోను వచ్చే ఈ మౌలికమైన మార్పునే రసాయనిక మార్పు అంటారు.
మానవుడు నిప్పుని కనుక్కున్న తరువాత అతడి జీవన పరిస్థితులు ఎంతగానో మారాయి. ముఖ్యంగా నిప్పుని కృత్రిమంగా రాజేసి, ఆ నిప్పును ఆరకుండా స్థిరంగా ఇంట్లో నిలుపుకోవడం నేర్చుకున్నాకనే రసాయనిక మార్పులని తన సొంత మేలుకు వాడుకోవడం మొదలయ్యింది. అగ్నితో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్న మనిషి రసాయన శాస్త్రంలో మొదటి పాఠాలు నేర్చుకున్నట్టే. ఎందుకంటే నిప్పు పుట్టించాలంటే కట్టెని ఎలా కాల్చాలో తెలియాలి. కట్టెను కాల్చి దాని నుండి వేడిమిని, ప్రకాశాన్ని పుట్టించాలంటే కట్టెకి గాలికి మధ్య సంపర్కం ఎంత గాఢంగా ఉండాలో తెలియాలి. కట్టెకి, గాలికి మధ్య సంపర్కంలోని గాఢతను బట్టి ప్రకాశం, వేడి పుడుతుందా, లేక బూడిద, పొగ, ఆవిరి పుడతాయా అన్న విషయం బాగా తెలియాలి. అంటే కట్టెను ముందు బాగా ఎండబెట్టాలి. అందులో కొంత భాగాన్ని పొడిచేసి సులభంగా నిప్పు అంటుకునే పొట్టుగా మార్చాలి. అప్పుడు రాళ్ల మధ్య రాపిడిని ఉపయోగించి ఆ పొట్టు యొక్క ఉష్ణోగ్రతని తగినంత మేరకు పెంచాలి. నిప్పు అలా రాజేయాలి.
అలా పుట్టించిన నిప్పుతో మరిన్ని రసాయన చర్యలు సాధించొచ్చు. నిప్పుతో అన్నం వండుకోవచ్చు. నిప్పు ప్రభావం వల్ల అన్న యొక్క రూపురేఖలు మారతాయి. అన్నం మెత్తబడుతుంది. రుచిగా మారుతుంది. నిప్పుని ఉపయోగించి బంకమట్టితో ఇటుకలు చెయ్యొచ్చు, కుండలు తయారు చెయ్యొచ్చు. తదనంతరం పింగాణీ, తదితర రకాల గాజులని తయారుచెయ్యడానికి వీలయ్యింది.
మనిషి తన దినచర్యలో వాడడం నేర్చుకున్న మొట్టమొదటి పదార్థాలు తన చుట్టూ రోజూ సహజంగా కనిపించే పదార్థాలే. అంటే చెక్క, ఎముకలు, చర్మం, రాళ్లు మొదలైనవి అన్నమాట. వీటన్నిట్లోకి అత్యధిక ఆయుర్దాయం ఉన్న పదార్థం రాయి. అందుకే ఆదిమానవుడు వాడిన రాతిపనిముట్లు ఇప్పటికీ తవ్వకాలలో చెక్కుచెదరకుండా దొరుకుతున్నాయి. అందుకే ఆ కాలాన్ని మనం రాతి యుగం అంటాం.
(సశేషం...)
"లోకం" ఇప్పటికీ అస్తిత్వంలో ఉన్న ప్రపంచాన్ని సూచిస్తుంది. "ప్రాచీన "ప్రపంచం" మీరుద్దేశించిన అర్థానికి ఎక్కువ సద్యఃస్ఫురణను కలిగిస్తుంది.