క్రీ.పూ. 8000 లో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది. అంత వరకు మనిషి రాతియుగంలోనే ఉన్నాడు. ఆ పరిణామం ఆహారోత్పత్తికి సంబంధించినది. ప్రస్తుతం మనం మిడిల్ ఈస్ట్ అని పిలుచుకునే ప్రాంతంలో జరిగిందది. అంతవరకు మనిషి కూడా జంతువుల లాగే ఇతర జంతువులని వేటాడి ఆహారాన్ని సంపాదించేవాడు. క్రీ,పూ. 8000 నుండి మనిషి జంతువులని పెంచి, పోషించి సకాలంలో వాటిని ఆహారంగా వాడుకోవడం నేర్చాడు. అలాగే కేవలం ప్రకృతిలో సహజంగా పెరిగే మొక్కల మీద ఆధారపడడం కాకుండా, తనే మొక్కలు పెంచి వాటి నుండి ఆహారాన్ని సంపాదించేవాడు. ఆ విధంగా పశుసంరక్షణ, సేద్యం వంటి సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఈ కొత్త పద్ధతుల వల్ల ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగింది. దాంతో జనాభా కూడా అమితంగా పెరిగింది. సేద్యం చేసే మనిషి దేశదిమ్మరిలా బతికితే కుదరదు. ఒక చోట స్థిరంగా జీవించాలి. దాంతో స్థిరనివాసాలు ఏర్పడ్డాయి. ఊళ్లు, వాడలు వెలిశాయి. ఆ పరిణామంతో నాగరికత అనేది మొదలయ్యింది. నగరాలు నిర్మించడంతో మొదలయ్యింది కనుకనే దాన్ని ’నాగరి’కత అంటాం.
మొదట కొన్ని వేల ఏళ్ల కాలం వరకు కూడా పనిముట్లు తయారుచేసుకోవడానికి ఎక్కువగా రాతినే వాడుతూ వచ్చారు. అయితే ఆ పనిముట్ల తయారీలో కొన్ని కొత్త పద్ధతులు రూపొందించుకున్నారు. ఈ ’కొత్త రాతి యుగాన్ని’ Neolithic (neo = కొత్త, lith = రాయి)’ యుగం అంటారు. రాతిని నునుపుగా చెక్కి, తీరుగా మలచగలగడం ఈ యుగం యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఈ దశలో కుమ్మరి వృత్తి కూడా బాగా వృద్ధి చెందింది. నెమ్మదిగా ఈ కొత్తరాతి యుగంలో మొదలైన సత్పరిణామాలు మిడిల్ ఈస్ట్ లో వాటి జన్మస్థానం నుండి నలు దిశలా విస్తరించడం మొదలెట్టాయి. క్రీ.పూ. 4000 కాలానికి మొట్టమొదటి నాగరికతా ఛాయలు పాశ్చాత్య యూరప్ మీద కనిపించసాగాయి. ఈ కాలానికల్లా మిడిల్ ఈస్ట్ కి చెందిన ఈజిప్ట్, సుమేరియా (ఈ ప్రాంతం ఆధునిక ఇరాన్ దేశంలో ఉంది) మొదలైన ప్రాంతాల్లో మరింత ఉన్నతమైన పరిణామాలు రంగప్రవేశం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి.
మానవజాతి మరి కొంచెం అరుదైన పదార్థాల వినియోగం గురించి తెలుసుకుంది.ఈ కొత్త పదార్థాలు ఇచ్చే సత్ప్రయోజనాల కోసం మనుషులు వాటి కోసం ఎంతో గాలించారు, వాటిని ఎలా వాడాలో తెలుసుకోడానికి విపరీతంగా శ్రమపడ్డారు. అలా కనుక్కోబడ్డ పదార్థాలే లోహాలు (metals). అన్వేషణ అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఈ metal అన్న పదం వచ్చింది.
(సశేషం...)
GOOD ARTICLE! USEFUL
nice