గ్రీకుల “అణువులు”
పదార్థ లక్షణాల గురించి ఆలోచించిన ప్రాచీన గ్రీకు తాత్వికులలో మరో ముఖ్యమైన ప్రశ్న కూడా బయలుదేరింది. అది పదార్థం యొక్క భాజనీయతకి సంబంధించిన ప్రశ్న. ఒక రాయిని బద్దలు కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాం అనుకుందాం. ఆ ముక్కలు కూడా ఇంకా రాతి ముక్కలే. ఆ ముక్కలని ఇంకా బద్దలు కొడితే పొడి గా మారుతాయి. ఆ పొడిలో చాలా చిన్న రేణువులు ఉంటాయి. అలా పదార్థాన్ని విభజిస్తూ పోతే ఏం జరుగుతుంది? అలా ఎంతవరకు విభజించగలం?
ఈ విషయంలో అయోనియాకి చెందిన లూసిప్పస్ (క్రీ.పూ. 450 రమారమి) ఓ ముఖ్యమైన భావన వ్యక్తం చేశాడు. ఏ పదార్థాన్నయినా అనంతంగా విభజిస్తూ పోవచ్చని అంతవరకు మనుషులు నమ్మేవారు. కాని అలా జరగదన్నాడు లూసిప్పస్. పదార్థాన్ని విభజిస్తూ పోతే ఒక దశలో మనకి ఎంత చిన్న రేణువులు మిగులుతాయంటే, వాటిని అంత కన్నా చిన్న భాగాలుగా బద్దలు కొట్టడానికి వీలుపడదన్నాడు.
లుసిప్పస్ శిష్యుడైన డెమాక్రిటస్ (క్రీ.పూ. 470-380 రమారమి) ఈ భావనని మరింత ముందుకి తీసుకెళ్లాడు. ఇతగాడు ఉత్తర ఏజియాకి చెందిన అబ్డెరా నగరానికి చెందినవాడు. పదార్థంలో ఈ అతి చిన్న రేణువులని ఇతగాడు “అటొమోస్” (atomos) అన్నాడు. అంటే “అవిభాజ్యం” అని అర్థం. పదార్థాన్ని అనంతంగా విభజించడం సాధ్యం కాదని, పదార్థం కనిష్ఠ పరిమాణం గల రేణువులతో కూడుకున్నదని చాటే బోధననే పరమాణువాదం (atomism) అంటారు.
ఇక్కడితో ఆగక డెమాక్రిటస్ అంతకు ముందు అరిస్టాటిల్ చెప్పిన మూల తత్వాలకి, ఈ పరమాణువులకి మధ్య లంకె పెట్టాడు. ఒక్కొక్క మూలతత్వంలోను ప్రత్యేక లక్షణాలు గల పరమాణువులు ఉన్నాయన్నాడు. పరమాణువుల పరిమాణం, ఆకారం కూడా అవి ఉన్న మూలతత్వాన్ని బట్టి మారుతుంది అన్నాడు. మనం చుసే వస్తువుల లోని మూల తత్వాలన్నీ వివిధ రకాల పరమాణువులు వివిధ నిష్పత్తులలో కలియగా ఏర్పడ్డవే నన్నాడు. కనుక పరమాణువుల మిశ్రమాన్ని మార్చితే పదార్థం మారిపోతుంది అన్నాడు.
ఆధునిక పరమాణు విజ్ఞానానికి ఈ ప్రాచీన భావాలకి మధ్య ఎంతో సాన్నిహిత్యం కనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే డెమాక్రిటస్ కి ఈ భావనలని ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం లేకపోయింది. ( గ్రీకు తాత్వికులు ప్రయోగాలు చేసేవారు కారు. కేవలం కొన్ని “మూల సూత్రాల” నుండి బయలుదేరి, తర్కాన్ని ఉపయోగించి, వాదన ద్వార సత్య నిర్ణయం చేసేవారు.)
పదార్థాన్ని ఒక స్థాయికి మించి విభజించలేం అన్న భావన చాలా మంది తాత్వికులకి, ముఖ్యంగా అరిస్టాటిల్ కి, అసంగతంగా తోచింది. ఆ భావనలో వారికి అంతర్వైరుధ్యం ఉన్నట్టు తోచింది. కనుక దాన్ని సమ్మతించలేకపోయారు. కనుక డెమాక్రిటస్ తరువాత రెండు వేల ఏళ్ల వరకు ఆ ప్రసక్తి మళ్లీ ఎవరూ ఎత్తలేదు.
అలాగని పరమాణువాదం పూర్తిగా చచ్చిపోయిందని కాదు. తదనంతరం గ్రీకు తాత్వికుడు (క్రీ.పూ. 342-270) ఎపిక్యూరస్ పరమాణు వాదాన్ని తన చింతనలో భాగంగా చేసుకున్నాడు. అతడి తరువాత కొన్ని శతాబ్దాల పాటు అతడి భావాలని స్వీకరించి, ప్రచారం చేసినవాళ్లు ఉన్నారు. అలా ప్రచారం చేసిన వారిలో ఒకడు రోమన్ కవి టైటస్ లుక్రెటియస్ కారస్ (క్రీ.పూ. 95-55). ఇతణ్ణి లుక్రెటియస్ అని పిలుస్తారు. తన పూర్వీకులైన డెమొక్రిటస్, ఎపిక్యూరస్ ల భావనలని వివరంగా వర్ణిస్తూ అతడు De Rerum Natura (పదార్థం యొక్క స్వభావం) అనే ఓ సుదీర్ఘ కావ్యం రాశాడు. కేవలం మనోల్లాసానికి మత్రమే కాకుండా శాస్త్రబోధనకి పనికొచ్చే కావ్యాలు అరుదు. అలాంటి అరుదైన కావ్యాలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని పరిగణిస్తారు.
డెమొక్రిటస్, ఎపిక్యూరస్ ల రచనలు ప్రస్తుతం మనకి పెద్దగా మిగలకపోయినా, లుక్రెటియస్ కావ్యం మాత్రం మనకిప్పుడు సమగ్రంగా దొరుకుతుంది. రెండు వేల ఏళ్ల నాటి పరమాణువాదాన్ని ఆధునిక వైజ్ఞానిక యుగం వరకు భద్రంగా తీసుకొచ్చింది ఈ గ్రంథం.
(సశేషం...)
0 comments