ఒక దశలో గ్రీకు తత్వచింతన అవసాన దశ చేరుకుంది. దాంతో పాటు ఖెమియా కళ కూడా క్షీణించింది. క్రీ.శ. 100 తరువాత ఆ విద్యలో కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదనే చెప్పాలి. అలా ఎదుగు బొదుగు లేకుండా స్థబ్దుగా ఉన్న విజ్ఞానంలోని వెలితిని పూడ్చడానికి లేనిపోని అధ్యాత్మిక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.
క్రీ.శ. 300 ప్రాంతాల్లో ఈజిప్ట్ కి చెందిన జోసిమస్ అనే రచయిత ఖెమియా మీద 28 పుస్తకాలుగల ఒక గొప్ప విజ్ఞాన సర్వస్వాన్ని (encylcopedia) రాశాడు. అంతకు పూర్వం ఐదు, ఆరు శతాబ్దాలుగా పోగైన ఖెమియా విజ్ఞానాన్ని ఆ గ్రంథాలలో పొందుపరిచాడు. కాని దురదృష్టవశాత్తు అందులో విలువైన సమాచారం చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కడో అరుదుగా నాలుగు అర్థవంతమైన విషయాలు దొర్లవచ్చునేమో. ఉదాహరణకి ఒక చోట ఇవ్వబడ్డ వర్ణన బట్టి ఆ వర్ణించబడ్డ పదార్థం ఆర్సెనిక్ అని అర్థమవుతుంది. అలాగే మరో చోట్ లెడ్ అసిటేట్ అనే విషపదార్థం యొక్క తయారీ గురించి కూడా రాశాడు. ఆ పదార్థం తియ్యగా ఉంటుందని కూడ పేర్కొన్నాడు. (ఆ పదార్థాన్ని ఆధునిక భాషలో ’సీసపు చక్కెర’ (sugar of lead) అంటారన్నది గమనించాల్సిన విషయం).
అసలే శిధిలావస్థలో ఉన్న ఈ ఖెమియా కళకి ఒక దశలో చావుదెబ్బే తగిలింది. ఆ వేటు వేసినవాడు రోమన్ చక్రవర్తి డయోక్లిటియన్. ఖెమియా కళ వల్ల మామూలు పదార్థాల నుండి బంగారం చెయ్యడం నలుగురికీ తెలిస్తే, అసలే బలహీనంగా ఉన్న ఆ నాటి రోమన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చక్రవర్తి భయపడ్డాడు. ఆ కారణం చేత ఖెమియా మీద ఉన్న పుస్తకాలన్నిటినీ సేకరించి తగులబెట్టించాడు. ఖెమియా విశేషాలు ప్రస్తుతం మనకి పెద్దగా లభ్యం కాకపోవడానికి కారణాల్లో ఈ సంఘటన ఒకటి.
ఖెమియా శైధిల్యానికి మరో కారణం కూడా ఉంది. అవి క్రైస్తవ మతం యొక్క పరపతి, ప్రభావం పెరుగుతున్న రోజులు. క్రైస్తవ మతానికి వ్యతిరేకమైన సాంప్రదాయాలకి, సంస్కృతులకి గడ్డురోజులు మొదలయ్యాయి. క్రీ.శ. 400 లో జరిగిన క్రైస్తవ మతాస్థుల నిరసనలలో అలెగ్జాండ్రియాలోని చారిత్రాత్మక గ్రంథాలయం తగులబడిపోయింది. ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన అధ్యాత్మిక సంస్కృతితో లోతైన సంబంధాలు గల ఖెమియా కళ నెమ్మదిగా అంతరించిపోయింది, అదృశ్యమైపోయింది.
ఆ కాలంలోనే గ్రీకు తత్వచింతన రోమన్ సామ్రాజ్యం నుండి ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. క్రైస్తవమతం చిన్న చిన్న వర్గాలుగా ఛిన్నాభిన్నం అయిపోయింది. వారిలో నెస్టోరియన్లు అనే ఒక వర్గానికి చెందినవారు ఉండేవారు. ఈ వర్గం వారు ఐదవ శతాబ్దానికి చెందిన నెస్టర్ అనే ఓ సిరియన్ సాధువు యొక్క బోధనలు అనుసరించేవారు. కాన్స్టాంటినోపుల్ కి చెందిన ఛాందస క్రైస్తవులు ఈ వర్గీయులని వేధించేవారు. ఆ వేధింపులు భరించలేక ఆ వర్గీయులు తూర్పుదిశగా పారిపోయి పర్షియాలో తలదాచుకున్నారు. పెర్షియాని ఏలే రాజులు వారికి సాదరంగా ఆశ్రయం ఇచ్చారు (బహుశ రోమ్ కి వ్యతిరేకంగా వీళ్లని వాడుకోవాలని వాళ్ల పన్నాగం కాబోలు).
ఈ నెస్టీరియన్లు గ్రీకు చింతనని, జ్ఞానాన్ని తమతో పెర్షియాకి తీసుకువచ్చారు. దాంతో పాటు పరుసవేదం మీద కూడా ఎన్నో పుస్తకాలు మోసుకువచ్చారు. క్రమంగా వారి ప్రభావం, పరపతి పెరిగి పెరిగి క్రీ.శ. 500 కాలానికి తారస్థాయిని చేరుకుంది.
(చిత్రం - http://www.corbisimages.com/Enlargement/MF002952.html)
(సశేషం...)
0 comments