అధ్యాయం 2
పరుసవేదం
పరుసవేదం
అలెగ్జాండ్రియా
అరిస్టాటిల్ కాలంలోనే మాసెడాన్ ని (ఇది గ్రీస్ కి ఉత్తరాన ఉన్న ఓ రాజ్యం) ఏలే అలెగ్జాండర్ చక్రవర్తి విశాలమైన పర్షియా సామ్రాజ్యాన్ని జయించాడు. క్రీ.పూ. 323 లో అలెగ్జాండర్ మరణం తరువాత అతడు స్థాపించిన విశాల సామ్రాజ్యం అంతా ముక్కలుచెక్కలు అయ్యింది. అయితే ఆ తరువాత కూడా మిడిల్ ఈస్ట్ కి చెందిన ఎన్నో ప్రాంతాలు ఇంకా గ్రీకుల, మాసెడోనియన్ల హయాంలో ఉండేవి. తరువాత కొన్ని శతాబ్దాల పాటు ఆ ప్రాంతంలో ఎన్నో విభిన్న సంస్కృతుల సమ్మేళనం జరిగింది. ఆ కాలాన్నే హెల్లెనిస్టిక్ కాలం అంటారు.
అలెగ్జాండర్ కింద పని చేసిన సేనాపతులలో ఒకడైన టోలెమీ ఈజిప్ట్ లో ఓ కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి అలెగ్జాండ్రియా నగరం రాజధాని అయ్యింది. అలెగ్జాండర్ స్థాపించిన ఈ నగరానికి ఆ చక్రవర్తి పేరే పెట్టారు. అలెగ్జాండ్రియాలో టోలెమీ, ఇంకా అతడి కొడుకైన టోలెమీ II, జ్ఞాన దేవతలైన మ్యూస్ (Muses) ల కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు. మ్యూస్ దేవతల ఆలయం కనుకనే దాన్ని మ్యూసియమ్ (Museum) అన్నారు. వర్తమాన ప్రపంచంలో ఓ పరిశోధనా కేంద్రానికో, ఓ విశ్వవిద్యాలయానికో ఎలాంటి స్థానం ఉంటుందో ఆ రోజుల్లో ఆ మ్యూసియమ్ కి అలాంటి స్థానమే ఉండేది. ఆ మ్యూసియమ్ తో పాటు ప్రాచీన లోకంలో కెల్లా అతి పెద్దదైన ఓ గొప్ప గ్రంథాలయాన్ని కూడా నిర్మించారు.
ఆ విధంగా ఒక పక్క ఈజిప్షియన్లకి సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచరణాత్మక రసాయనిక విజ్ఞానం, మరో పక్క గ్రీకు సాంప్రదాయం నుండి వచ్చిన సైద్ధాంతిక విజ్ఞానం రెండూ చేతులు కలిపాయి. అయితే అలాంటి సంగమం వల్ల పూర్తిగా మంచే జరిగిందని చెప్పడానికి లేదు. ఈజిప్షియన్లు తమకి తెలిసిన రసాయన విద్యని ప్రత్యేకించి చనిపోయిన వారి దేహాలని భద్రపరచడం కోసం, తదితర మతపరమైన ఆచారాల కోసం మాత్రమే వాడేవారు. ఈజిప్షియన్ ఆచారం ప్రకారం ఐబిస్ అనే పక్షి తలకాయ గల థోథ్ అనే ఓ దేవత రసాయన విద్యకి అధిదేవత. ఈజిప్షియన్ రసాయనిక నైపుణ్యాన్ని చూసి మురిసిపోయిన గ్రీకులు ఆ విద్యని, ఆ విద్యతో పాటు ఈజిప్షయన్ల అధ్యాత్మిక సాంప్రదాయాలని, నమ్మకాలని కూడా పూర్తిగా స్వీకరించారు. అంతేకాక గ్రీకు దేవత అయిన హెర్మిస్, ఈజిప్షియన్ల దేవత అయిన థోథ్ ఇద్దరూ ఒక్కరే నని కూడా గ్రీకులు భావించేవారు.
అంతకు పూర్వం అయోనియాకి చెందిన తాత్వికులు మతాన్ని, విజ్ఞానాన్ని వేరు వేరుగా ఉంచారు. రెండూ కలియని దిక్కులుగా ఉండేవి. కాని ఈజిప్ట్ లో జరిగిన ఈ కొత్త మత, విజ్ఞానాల సంగమం వల్ల జ్ఞానం యొక్క పురోగతి మందగించింది.
(సశేషం...)
0 comments