శ్రీరామ
ఈ బ్లాగులో కేవలం సైన్సు విషయాలు తప్ప మరొకటి ప్రచురించకూడదన్నది మా నియమం. కానీ, ప్రస్తుతానికి నాకు ఈ విషయాన్ని పంచుకోవడానికి మరో సరైన బ్లాగు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్న పాఠకులకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి మన్నించగలరు.
మన రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన మూడు ఐఐఐటీల గురించి మీకు తెలిసిందే...అవి ఇడుపులపాయ, నూజివీడు మరియు బాసరలో ఉన్నవన్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ మూడు విశ్వవిద్యాలయల లక్ష్యం ప్రభుత్వ గ్రామీణ పాఠశాలల్లో చదువుతూ పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించడమే. వీటిలోని విద్యా ప్రమాణాలు ఐఐటీల (Indian institute of Technology) స్థాయికి సమానంగా ఉంటాయి.
ఇప్పుడు అసలు విషయానికొస్తే, ఈ కాలేజిలల్లో మన దేశ చరిత్రలోనే ఏ ఇంజినీరింగ్ కాలేజీలో లేని విధంగా మాతృభాష (తెలుగు భాష) కూడా నాలుగు సంవత్సరాల పాటు ఒక పాఠ్యాంశంగా చేర్చడమైనది. కారణం, మన భారతీయ ఆత్మగతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టు బాట్లు, నీతి నియమాలు, పెద్దల పట్ల గౌరవ భావనలు, చిన్న పిల్లల పట్ల ప్రేమాను రాగాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వాత్సల్యాలు పెంపొందించటం. ఇటువంటివన్నీ కూడా మాతృభాషలోనే నేర్చుకోవడం సాధ్యమౌతుంది. అలాగున, ఐఐఐటీ స్థాపించిన పెద్దలు భావించడం మూలాన తెలుగు భాషను ప్రవేశ పెట్టడం జరిగింది. దానితో పాటు పిల్లల్లో ఉండే సాహిత్య సృజనాత్మకతను వెలికి తీయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు, మనో నిబ్బరం కలుగజేసినట్లవుతుంది.
ఈ క్రమంలో భాగంగా ఇడుపుల పాయలో ఉన్న ఐఐఐటీలో ఒక చారిత్రాత్మక ఘట్టం విద్యార్థుల రూపంలో వెల్లి విరిసింది. అదేమిటనగా, ఎం. ఎన్. బ్రహ్మానందయ్య అనే తెలుగు మెంటర్ పదహారు మాసాలుగా విద్యార్థులలోని సృజనాత్మక సృష్టిని తెలుగు ప్రాచీన సాహిత్య ప్రక్రియయైన శతక రూపంలో బయటకు తీయటం జరిగింది. శతకమనగా నూరు పై చిలుకు పద్యాల సమాహారం. పద్యం రాయడమంటేనే తెలుగు ఉపాధ్యాయులకే గగనంలా ఉన్న ఈ ఆధునిక కాలంలో ఏకంగా విద్యార్థుల చేతనే శతకం రాయించటం పట్ల బ్రహ్మానందయ్య గారికున్న సాహిత్య రచనా పిపాస ఎలాంటిదో తెలుస్తున్నది.
పద్యం రాసిన వారు ఇంకా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే. ఈ శతకాన్ని ఇరవై మంది విద్యార్థులు కలిసి రచించారు. వారు రాసిన పద్యాలన్నిటినీ “విశ్వవీణ శతకం” అన్న పేరుతో ప్రచురించడమైనది. బ్రహ్మానందయ్య గారు, ఆ శతకాన్ని తన స్వంత ఖర్చుతో (దాదాపు 16 వేల రూపాయలతో) అచ్చు వేయించారు. అందుకు ఇడుపుల పాయలోని డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించారు. ఇది ఒక ఎత్తైతే, విషయం తెలిసి, వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ గారు ప్రతిభకు పట్టం కట్టాలనే సదుద్దేశంతో ఇడుపుల పాయ వరకు వెళ్ళి ఆ విశ్వవీణ శతకాన్ని ఆవిష్కరిస్తూ, అందు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పరిష్కర్తయైన “బ్రహ్మానందయ్య” గారిని శాలువాతో సత్కరిస్తూ ఇది నిజంగానే “చారిత్రాత్మక ఘట్టం” అని ఎంతగానో కొనియాడారు.
ఈ పద్యాలన్నీ కూడా ఆటవెలది ఛందస్సులో విద్యార్థులు రాశారు. ఆ విశ్వవీణ శతకంలోని మచ్చుకు కొన్ని పద్య రత్నాలు.
1) ఆట: రాళ్ళుగొట్టునొకడు రాతనేర్చునొకడు
కూలిజేయునొకడు గొలువుదీరు
నొకడు నొకడు నొకడునొకదీరుగాంచరా |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఈ భూమి మీద అనేక వృత్తుల వారు ఉన్నారు. జీవితాన్ని పోషించుకోవడానికి వృత్తులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భాగంగా ఒకడు రాళ్ళను మలుస్తాడు. ఒకడు చదువు నేర్చుకుంటాడు. మరొకడు కూలి పని చేస్తాడు. ఇంకొకడు అధికారాన్ని చెలాయిస్తాడు. ఎవరు ఏ పని చేసినా అందరూ సమానమే గాని వాడిపని తక్కువ వీడిపని తక్కువ అని సాటి వ్యక్తులను తక్కువ చేయకూడదని భావం.
నీతి: “వృత్తి వ్యక్తి జీవన విధానానికి ప్రవృత్తి” అని గ్రహించు.
2) ఆట: కూతురున్నయింట కోడలు దుఃఖించ
తల్లిదొడ్డగుణము తగులబెట్టు
మమ్మమనసుదెలిసి యత్తమనవలదే |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | కూతురు పుట్టి పెరిగిన ఇంటిలోకి కోడలు వచ్చి దుఃఖపడినట్లైతే ఆ తల్లి యొక్క దొడ్డ గుణం తగులబడినట్లౌతుంది. ఎందుకంటే, ఈ ఇంటి కూతురు మరో ఇంటి కోడలని గ్రహిస్తుంది అమ్మ మనసు. ఆ విధంగా అమ్మ మనసు తెలిసి అత్త కోడల్ని చూడవలసి ఉంటుందని భావం.
నీతి: “అమ్మతనం లేని అత్త ఎన్నటికీ అమ్మ కాలేదు” అని గ్రహించు.
3) ఆట: రాజ్యమెంతయున్న రాటు దేలినవారు
భద్రతున్ననేమి? భటుడొకండు
మూర్కుడైనజాలు | ముప్పు వాటిల్లదే |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఒక మహారాజు తన రాజ్యాన్ని ఎంత విస్తారం చేసుకున్నా, యోధులైన వారిని భటులుగా నియమించుకొని ఎంత భద్రత కల్పించుకొన్నప్పటికీ, మూర్ఖుడైనవాడు ఒకడు ఆస్థానంలో ఉన్నట్లైతే ఆ రాజుకేగాక రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ముప్పు తెచ్చిపట్టగలడని భావం.
నీతి: “నీవు మూర్ఖుని దగ్గర ఉన్నా, మూర్ఖుడు నీ దగ్గర ఉన్నా ప్రమోదం మూర్ఖుడికీ, ప్రమాదం నీకూ” అని గ్రహించు.
4) ఆట: కళ్ళుమూసితెరచి కల్లుకల్లుయనుచు
చిందులేయునట్టి చిల్లరోళ్ళు |
గాలికితెగిపడ్డ గాలిపటాలయా |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | సమాజంలో చిల్లర మనుష్యులు ఉంటారు. వాళ్ళు రెప్పపాటు కాలాన్ని కూడా కల్లు త్రాగడానికే ఉపయోగిస్తూ, జీవితాన్ని, సమయాన్ని వృధాగా పోనిస్తుంటారు. అటువంటివారు గాలికి తెగిపోయి దిక్కులేక, ఏ ముళ్ళచెట్టు మీదనో, చెత్త గుట్టలపైనో ఊగులాడే గాలిపటాలతో సమానమని భావం.
నీతి: “నిరంతర మత్తు వృధా జీవిత పరంపర ముప్పు” అని గ్రహించు.
5) ఆట: ఎదుగుచున్న వాడునెదురైన హీనుని
మనసునోర్వలేక మండుచుండు |
అగ్నిబడ్డ వృక్షమాహుతియగునట్లు |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఈ కాలంలో ఈర్ష్యాపరులు ఎక్కువగుచున్నారు. ఎవరైనా కష్టపడి పైకి ఎదుగుతున్నారంటే వారికి సహాయం చేసి సహృదయంతో ముందుకు నడపాలని ఆలోచించక వారిని చూసి ఓర్వలేక మనసులో మంటపెట్టుకొని మాడిపోతుంటారు. అగ్నిలోపడిన వృక్షము ఏ విధంగా అయితే కాలిపోతుందో ఆవిధంగా వారికి వారే కాలిపోతుంటారని భావం.
నీతి: “ఓర్పు దేనికైనా మనిషి నేర్పు” అని గ్రహించు
6) ఆట: తొందరబడి మూఢదోవ బుద్ధిని గూడి
తప్పిదమగు పనిని తలపబోకు |
యమునిచెంతజేరి యాచింపఫలమేమి?
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | మానువుడు తన జీవిత కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు తెలివిలేని తనానికి చిహ్నం. అటువంటి బుద్ధితో తప్పు చేయకూడదు. అది, మనిషి చెడు మార్గంలో పయనించి కాలం చెల్లి యముని దగ్గర శిక్షలు పడేటప్పుడు తెలియక చేశాను మన్నించండి అని అడిగితే ప్రయోజనముంటుందా? అని భావం.
నీతి: “చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము ఉండదు” అని గ్రహించు.
ఈ పరిష్కర్త హృదయాన్ని, విద్యార్థుల సృజనను ఆదర్శంగా తీసుకొని నేటి కాలంలో ఉపాధ్యాయ వృత్తిని కోరుకుంటున్నవారు భవిష్యత్తులో ఇలాంటి రచనా కార్యక్రమాలను చేపట్టాలని, చేపడుతారని ఆశిస్తున్నాను. తెలుగు గడ్డపై పుట్టినందుకు, తెలుగువాడిగా జీవిస్తున్నందుకు, తెలుగు భాషకు తిరిగి పూర్వ వైభవం రావాలని నాతో పాటు మీరు కూడా ఆలోచిస్తారని, అటువంటి వాళ్ళు మీ జీవితంలో తారసపడితే ముఖ్యంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
ఎడమ నుంచి: పరిష్కర్త బ్రహ్మానందయ్య, ఉపకులపతి రాజ్ కుమార్ గారు.
చాలా సంతోషకరమైన వార్త చెప్పారండి! పుస్తకం.నెట్ లాంటి సైటులో దీని పరిచయం చేస్తే దీనికి మరింత ప్రాచుర్యం కలిగే అవకాశం ఉంది.
పిల్లలకు తెలుగు భాష పట్ల మక్కువనెక్కువచేస్తున్న బ్రహ్మానందయ్యగారు, తగు విధముగా ప్రోత్సహిస్తున్న రాజ్ కుమార్ గారు అభిన౦దనీయులు.మ౦చి (నీతి) పద్యాలు వ్రాసిన విద్యార్థులు భావికాలమున మరిన్ని ఉత్తమ రచనలు సేయునటుల చదువులతల్లి కృపజూపుగాక. సా౦కేతిక విద్యాలయమున తెలుగు భాషా బోధన అనునట్టి మహత్కార్యమును స్ఫూర్తిగా తీసుకొని ఇతర విశ్వవిద్యాలయాల పాలక మ౦డళ్ళు తమ పరిధిలోని కళాశాలల్లో మన భారతీయ భాషలకు సముచిత స్థానము కల్పి౦తురని ఆశిస్తున్నాము.09444536163 vikram2036.iitm@gmail.com
ఆటవెలదిలో పద్యములు హాయి గొలుపు
తేటగీతి పద్య౦బులు తేనెలూరు
క౦దమ౦దు పద్యముల౦దముచి౦దు
తెలుగుభాష నేర్చుకొనుము తెనుగు బాల / (బిడ్డ)
బాగుంది నాగ ప్రసాద్
ఎంతో మంచి విషయం విన్నానీవేళ. భాష ప్రాముఖ్యతను టెక్నో జనాలు గుర్తిస్తున్నందుకు సంతోషం.
తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.
నిజంగా ఇది చాలా ఆనందకరమైన వార్త.
చాలా సంతోషకరమైన వార్త చెప్పారండీ.
ఈ యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
ఎడారిలో ఒయాసిస్సులా చల్లనైన వార్త చెప్పారు. ఇదివరకెప్పుడో బ్లాగుల్లో చంద్రమోహన్ గారనుకుంటాను, కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ ను పద్యరూపంలో అనువదించారు. ఇప్పుడు భౌతిక శాస్త్ర సూత్రాలన్నిటినీ పద్యరూపంలో అనువదించే ప్రయత్నం బ్లాగర్లే చేపట్టవచ్చు.
నిజంగా బ్రహ్మానందయ్యగారికి పాదాభివందనం చేస్తున్నాను .అటువంటి గురువు దొరికినందుకు ఆపిల్లలు అదృష్టవంతులు
ప్రసాదూ ! నూజివీడు లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగితే మన పవనుగాడుకూడా పాల్గొంటాడు .
జై భారత్. మనః స్పూరిగా వందనములు బ్రహ్మానందం గారికి, మీరు అలోచించి బావితరాలకు మన తెలుగు యొక్క కమ్మ ధనాన్ని తెలియచేయాలని దాని విలువ విద్యార్థులకు తెలియచేసి వారి ద్వారా రచనలు చేయించి ఈ భారతదేశం గర్వించదగ్గ ఆశయం తీసుకొని గురుస్థానం వున్న వారందరికీ, విద్యార్థులకు ఇది ఆదర్శం కావాలి. జై హిందు, జై భారత్