భారీ ఎత్తున ఇనుప శస్త్రాలని సాధించిన మొట్టమొదటి సైన్యం అసీరియన్ సైన్యం. క్రీ.పూ. 900 నాటికే మరింత ఉన్నతమైన అస్త్రశస్త్రజాలం గల అసీరియన్లు ఓ మహాసమ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు.
గ్రీకు నాగరికత మహర్దశ చేరుకున్న నాటికే వాళ్లు రసాయనిక విద్యలలో ఆరితేరిపోయారు. ఈజిప్షియన్ నాగరికతలో కూడా రసాయనిక విద్యలలో అలాంటి సామర్థ్యమే కనిపిస్తుంది. ప్రాచీన ఈజిప్ట్ లో మరణానంతరం మృతదేహాలకి తగు లేపనాలు పూసి వాటిని దీర్ఘకాలం భద్రపరిచే ఆచారం ఒకటి ఉండేది. ఆ ప్రక్రియలో అధునాతనమైన రసాయనిక విజ్ఞానం అవసరమయ్యేది. లోహవిజ్ఞానంలో కూడా వారికి మంచి పాండిత్యం ఉండేది. ఆకుపసరుల నుండి, మొక్కల నుండి తీసే వివిధ రసాల నుండి, ఖనిజాల నుండి నానా రకాల అద్దకాలని తయారుచేయడంలో నైపుణ్యం ఉండేది.
ఖెమియా (khemeia) అన్న పదం ఈజిప్షియన్ ప్రాంతం అయిన ’ఖమ్’ (kham) నుండి వచ్చింది అని ఒక సిద్ధాంతం ఉంది. ఖెమియా అంటే “ఈజిప్షియన్ కళ” అని అర్థం కావచ్చు.
ఖెమియా అన్న పదం యొక్క వ్యుత్పత్తి విషయంలో మరో సిద్ధాంతం కూడా చలామణిలో ఉంది. మొదటి సిద్ధాంతం కన్నా దీనికి మరింత ఆదరణ ఉంది. ఖుమోస్ అన్న గ్రీకు పదానికి ఆకుపసరు అన్న అర్థం ఉంది. కనుక ఖెమియా అంటే “పసరు తీసే కళ” అని అనుకోవచ్చు. లేదా ఇక్కడ పసరు అంటే కరిగించిన లోహం కూడా కావచ్చు. అలా అనుకుంటే ఖెమియా అంటే “లోహవిజ్ఞానం” అన్న అర్థం వస్తుంది.
ఏదేమైనా ఈ ఖెమియా అన్న పదమే మన ఆధునిక chemistry అన్న పదానికి మూల శబ్దం అయ్యింది.
గ్రీకుల “మూల తత్వాలు”
క్రీ.పూ. 600 నాటికే సహజంగా ప్రతిభావంతులైన గ్రీకులు విశ్వం యొక్క తత్వం గురించి, పదార్థ లక్షణాల గురించి ఆలోచించసాగారు. గ్రీకు పండితుల, తాత్వికుల దృష్టి ఎక్కువగా విజ్ఞానం యొక్క లౌకిక ఫలితాల మీద ఉండేది కాదు. ప్రకృతి తీరు ఎందుకిలా ఉంది? విశ్వగతులు ఎందుకిలా ఉన్నాయి? ఈ “ఎందుకు?” అన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలన్నదే వారి నిరంతర తపన. ఆధునిక పరిభాషలో “రసాయనిక సిద్ధాంతం”గా చెప్పుకుంటున్న దానికి తొలిరూపాన్ని ఇచ్చినవారు వీళ్లే.
అలాంటి సిద్ధాంతానికి మూలకర్త థేల్స్ (క్రీ.పూ. 640-546) అనే తాత్వికుడు. థేల్స్ కి ముందు పదార్థ లక్షణాల గురించి ఆలోచించిన గ్రీకులు ఉండి ఉండొచ్చు. అంతేకాదు. గ్రీకులకి ముందు ఇతర నాగరకతలకి చెందిన వారు కొందరు రసాయనిక విషయాలతో వ్యవహరించి ఉండొచ్చు. కాని వారి వివరాలు ప్రస్తుతం మనకి పెద్దగా తెలీదు. (ఉదాహరణకి ఇండియా, చైనా లకి చెందిన ప్రాచీన నాగరికతలలో కూడా రసాయన శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. కాని ఆధునిక రసాయన శాస్త్రానికి మొదటి బీజాలు ఈజిప్ట్ కి చెందినవి. ఈ పుస్తకంలో చర్చ ఆ సాంప్రదాయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది.)
(సశేషం...)
0 comments