గ్రీకు, ఈజిప్ట్ సంస్కృతుల సంగమంలో ఏర్పడ్డ ఖెమియా సాంప్రదాయంలో మనకి తెలిసిన మొట్టమొదటి గొప్ప పండితుడి పేరు బోలోస్. నైలు నది లంక (delta) ప్రాంతంలో ఉన్న మెండెస్ నగరానికి చెందిన ఈ వ్యక్తి రమారమి క్రీ.పూ. 200 ప్రాంతాల్లో జీవించాడు. తన రచనల్లో తరచు డెమోక్రిటస్ పేరు ప్రస్తావిస్తూ ఉంటాడు కనుక ఇతడిని బోలోస్-డెమోక్రిటస్ అని కూడా పిలిస్తుంటారు. కొన్ని సార్లు కుహనా డెమోక్రిటస్ అని కూడా అంటుంటారు.
ఖెమియా కళలో కెల్లా అతి ముఖ్యమైన ఓ సమస్య మీద బోలోస్ శ్రద్ధ వహించాడు. ఒక లోహాన్ని మరో లోహంగా మార్చడం ఎలా? ముఖ్యంగా వెల తక్కువైన సీసం, ఇనుము మొదలైన లోహాలని బంగారంగా మార్చడం ఎలా?
నాలుగు మూలతత్వాల సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని వివిధ పదార్థాలన్నీ ఆ మూలతత్వాలతో కూడుకున్న వివిధ మిశ్రమాలే. ఈ భావనకి పరమాణు వాదనతో ప్రమేయం లేదు. పదార్థంలో ఉన్నది పరమాణువులు అనుకున్నా, అవిచ్ఛిన్న పదార్థమైన మూలతత్వాలు అనుకున్నా ఈ భావనలోని సత్యం మాత్రం మారదు. పరమాణువుల రూపంలోనైనా, మూల పదార్థాల రూపంలోనైనా వాస్తవ వస్తువులన్నీ కొన్ని మౌలిక అంశాల మిశ్రమాలే నని ఈ భావన చెప్తుంది. అక్కడితో ఆగక అసలు ఆ మూలతత్వాలు కూడా ఒకటి మరొకదానిగా మారే అవకాశం ఉందని కూడా కొంత ఆలోచన ఉండేది. ఎందుకంటే నీరు ఆవిరై తేమగా అంటే గాలిగా మారుతుంది. ఆ గాలి తిరిగి నీరై వర్షించగలదు. పృథ్వీ తత్వం గల కట్టెని కాల్చితే అందులోంచి అగ్ని, గాలి రెండూ పుడతాయి.
ఇలాంటి వాస్తవ పరిణామాల బట్టి చూస్తే అసలు ఏ మార్పయినా ఎందుకు అసంభవం కావాలి అన్న ప్రశ్న పుడుతుంది. సరైన పద్ధతి తెలిస్తే ఏ పదార్థాన్నయినా మరే పదార్థంగానైనా మార్చొచ్చు. ఒక రకమైన ఎర్ర రాయిని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా ఇనుముగా మార్చవచ్చు. గ్రీకు యోధుడు అచిలీస్ కాలంలో ఆ పద్ధతి తెలిసేది కాదు. ఇనుప కవచాలకి నోచుకోని అచిలీస్ విధిలేక కంచుకవచాలు వేసుకునేవాడు. ఆ విధంగా ఎర్రరాయిని ఇనుముగా మార్చగలిగి నప్పుడు, దాన్ని బంగారంగా కూడా మార్చలేమా? దానికీ ఏదో పద్ధతి ఉంటుందేమోగా?
నిమ్న జాతి పదార్థాల నుండి బంగారాన్ని పుట్టించే ప్రయత్నం కొన్ని శతాబ్దాల పాటు జరిగింది. అయితే బంగారాన్ని తయారుచేసే పద్ధతిని తెలుసుకునే ప్రయత్నం కన్నా, ఆ పద్ధతి తెలుసని బుకాయించి తమ అధికార బలంతో అమాయకులని మోసం చేసే ప్రయత్నమే సులభమని చాలా మందికి అర్థమయ్యింది. ఆ విధంగా ఖెమియా ఉపాసకులలో మోసగాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఖెమియా యొక్క ఈ అంశాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించబోవడం లేదు.
బోలోస్ తన రచనలలో బంగారాన్ని తయారు చేసే పద్ధతులని వర్ణించాడని చెప్తారు. అయితే అది నిజంగా బుకాయింపు కాకపోవచ్చు. రాగిని, జింక్ తో తగు పాళ్లలో కలిపితే ఇత్తడి పుడుతుంది. ఇది పచ్చగా కాస్త బంగారం లాగానే ఉంటుంది. బంగారపు ఛాయ గల ఈ లోహాన్ని తయారు చెయ్యడము, బంగారాన్ని తయారుచెయ్యడము రెండూ ఒక్కటే నని ఆ రోజుల్లో జనం అపోహ పడేవారంటే ఆశ్చర్యం లేదు.
(ఇత్తడి ’డై’, పక్కన రాగి, జింక్ నమూనాలు – వికిపీడియా చిత్రం)
(సశేషం...)
0 comments