ఈ కాంస్య యుగంలో సంభవించిన అతి ముఖ్యమైన సంఘటన ట్రోజన్ యుద్ధం (Trojan war). ఈ యుద్ధంలో కంచు కవచాలు ధరించిన సిపాయిలు కంచు మొనలు గల శూలాలని ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. లోహపు ఆయుధాలు లేని సేనలు ఈ కాంస్య యోధులని ఎదుర్కుని నిలవలేకపోయాయి. కనుక ఈ రోజుల్లో ఓ అణుశాస్త్రవేత్తకి ఉండే గౌరవ మర్యాదలు ఆ రోజుల్లో లోహకారులకి ఉండేవని ఊహించుకోవచ్చు. లోహకారుణ్ణి ఓ దేవుడిలా కొలిచేవారేమో. గ్రీకు పురాణాల్లో హెఫాయెస్టర్ అనేవాడు దేవతల లోహకారుడు. అందుకే నేటికీ యూరప్ లో ’స్మిత్’ (Smith) అనేది ఓ ప్రముఖమైన ఇంటిపేరు కావడంలో ఆశ్చర్యం లేదు.
కంచు యుగంలోనే మనుషులు కంచు కన్నా కఠినమైన మరో లోహం గురించి తెలుసుకున్నారు. అదే ఇనుము. అయితే భారీ ఎత్తున కవచాల్లో వాడేటంత విరివిగా అది లభ్యం అయ్యేది కాదు. తొలి దశల్లో అది నిజంగానే అరుదుగా దొరికేది. ఎక్కడైనా ఉల్కాపాతం జరిగినప్పుడు ఆ విరిగి పడ్డ ఉల్కముక్కల్లో కాస్తంత ఇనుము దొరికేది. రాతి నుండి రాగిని వెలికి తీసినట్టు ఇనుముని కూడా సహజ వస్తువుల నుండి వెలికి తీయడం ఎలాగో ఆరోజుల్లో ఎవరికీ తెలీదు.
ఇక్కడ సమస్య ఏంటంటే రాగి కన్నా ఇనుము ముడిఇనుములో బలంగా నాటుకుని ఉంటుంది. ముడి ఇనుము నుండీ ఇనుము వెలికి తియ్యడానికి, రాగిని వెలికి తియ్యడానికి అవసరమైన వేడిమి కన్నా మరింత తీక్షణమైన వేడిమి కావాలి. అందుకు కేవలం కట్టె నుండి పుట్టే వేడి సరిపోదు. బొగ్గు నుండి పుట్టే నిప్పు అంతకన్నా వేడిగా ఉంటుందని తరువాత కనుక్కున్నారు. అయితే బొగ్గు నుండి అంత వేడిని పుట్టించడానికి సరైన వాయు సంచారం (ventilation) కావాలని కనుక్కున్నారు.
ముడి ఇనుముని కరిగించి ఇనుమును తయారుచేసే రహస్యాన్ని బహుశ తూర్పు ఆసియా మైనర్ లో క్రీ.పూ. 1500 ప్రాంతాల్లో కనుక్కుని ఉంటారు. ఆశియా మైనర్ లో ఓ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన ఓ తెగ వారు హిటైట్లు (Hittites). ఇనుముని పనిముట్లుగా పరిపాటిగా వాడిని వారిలో వీళ్లు ప్రథములు. క్రీ.పూ. 1280 లో ఓ హిటైట్ రాజు ముడిఇనుము విరివిగా దొరికే ఓ పర్వత ప్రాంతానికి చెందిన తన సామంత రాజుకి రాసిన ఉత్తరంలో ఇనుము ఉత్పత్తికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
శుద్ధ రూపంలో ఉండే ఇనుము (wrought iron) అంత బలంగా ఉండదు. అయితే ఇనుముని కాల్చుతున్నప్పుడు ఆ కాలుస్తున్న బొగ్గులోంచి కొంత కార్బన్ ఇనుము యొక్క ఉపరితలంలోకి ప్రవేశించి అక్కడ ఇనుము-కార్బన్ ల మిశ్రలోహం ఏర్పడవచ్చు. ఇనుము-కార్బన్ ల మిశ్రలోహాన్నే ప్రస్తుతం మనం స్టీల్ అంటాము. అలా కర్బన్, ఇనుము కలిసిన ఇనుప వస్తువు యొక్క పైపొర కంచు కన్నా చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి పైపూత కలిగిన కత్తి వాదర కూడా సామాన్యంగా కన్నా మరింత ఎక్కువ కాలం పదునుగా ఉంటుంది.
ఆ విధంగా హిటైట్ల కాలంలో కనుగొనబడ్డ స్టీల్ ఉత్పత్తి రహస్యం ఇనుము యొక్క చరిత్రలో ఓ ముఖ్యమైన మైలురాయి అనుకోవచ్చు. ఇనుప కవచాలు ధరించి, ఇనుప ఈటెలు చేతబట్టిన వీరుల చేతిలో కేవలం కంచు కవచాలు, కత్తులు కలిగిన సేనలకి ఓటమి తప్పదు. ఆ విధంగా ఇనుప యుగం ఆరంభం అయ్యింది.
క్రీ.పూ. 1100 ప్రాంతాల్లో గ్రీక్ డోరియన్లు అనబడే ఓ కిరాతక గ్రీకు తెగ ఉత్తర భాగం నుండి ద్వీపకల్పాన్ని ముట్టడించింది. ఆ కాలంలో గ్రీకు ప్రాంతంలో మరింత నాగరికులైన మైసినేయియన్ గ్రీకులు జీవించేవారు. అయితే వీరికి కేవలం కంచు ఆయుధాలు మాత్రమే ఉండేవి. వీరికి ఇనుము గురించి తెలీదు. అలా వారిని చుట్టుముట్టిన గ్రీకు తెగలలో కొందరు కనాన్ వరకు చొచ్చుకుపోయారు. వారితో తమ ఇనుప పరిముట్లని కూడా తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఆ పనిముట్లని పరిచయం చేశారు. అలా వచ్చిన వాళ్లే ఫిలిస్టయిన్లు. బైబిల్ కథలలో ఈ ఫిలిస్టయిన్లకి ముఖ్యమైన స్థానం ఉంటుంది. వీరి ధాటి ముందు ఇనుము వినియోగం తెలియని యూదులు నిలబడలేకపోయారు. తదనంతరం సాల్ మహారాజు నేతృత్వంలో యూదుల చేతికి ఇనుప శస్త్రాలు చిక్కాకనే వారి రాతలు మారాయి.
(సశేషం...)
0 comments