శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

లోహపు యుగం మొదలయ్యింది

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 14, 2010



మొట్టమొదటి లోహాలు చిన్న చిన్న కణికల రూపంలో లభించి ఉంటాయి. రాగి, బంగారపు ముక్కలు అక్కడక్కడ దొరికి ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు లోహాలు ప్రకృతిలో సహజ రూపంలో దొరికే బహుకొద్ది పదార్థాలకి తార్కాణాలు. కాస్త ఎర్రని ఛాయ గల రాగి, పచ్చని పసిమి గల బంగారం కళ్లని సులభంగా ఆకట్టుకుని ఉంటాయి. కళావిహీనంగా కనిపించే రాళ్లతో పోలిస్తే, ఈ లోహాల తళుకు, జిలుగు చూసి మనిషి మురిసిపోయి ఉంటాడు. తొలి దశల్లో లోహాలని ఎక్కువగా ఆభరణాలలోనే వాడుకుని ఉంటాడు. రంగులేసిన గులకరాళ్లు, నగషీలు చెక్కిన గవ్వలు మొదలైన వస్తువులని ఆభరణాలుగా వాడినట్టే, వీటిని కూడా వాడి ఉండేవాడు.

అయితే ఆ అందమైన రాళ్లలో లేనిది, లోహాలలో ఉన్నది అయిన ఓ ముఖ్య లక్షణం ఒకటుంది. రాగి, బంగారాలకి “నమ్యత” (malleability) అనే గుణం ఒకటి ఉంది. లోహాలని వేడి చేసి, ఒత్తిడి చేసి వాటిని చదునుగా పలకల లాగా సాగదీయొచ్చు. (రాళ్లతో అలా వ్యవహరిస్తే పొడి అవుతాయి. చెక్కనిగాని, ఎముకని గాని అలా చేస్తే చిట్లి పోతాయి. మొదట్లో ఈ ఆవిష్కరణ కేవలం యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. కాని త్వరలోనే ఈ లోహాన్ని అందమైన ఆకృతులుగా ఎలా మలిచి తనకి అలంకారంగా ఎలా వాడుకోవాలో నేర్చుకుని ఉంటాడు.

రాగితో పని చేసే వాళ్లకి త్వరలోకే రాగికి ఓ అద్భుతమైన లక్షణం ఉందని అర్థమయ్యింది. రాగిని కూసుగా మలచి దాన్నో ఆయుధంగా వాడుకోవచ్చు. రాతి పనిముట్లు మొద్దుబారే పరిస్థితుల్లో కూడా ఈ రాగిపనిముట్లు తమ పదునును కోల్పోవు. అంతే కాక రాగి అంచు ఒకసారి మొద్దుబడ్డా, రాతి పనిముట్ల కన్నా రాగిని మరింత సులభంగా పదును చెయ్యొచ్చు. అయితే రాగి కొంచెం అరుదుగా దొరుకుతుంది కనుక తొలిదశలలో దాన్ని అలంకారానికి తప్ప పనిముట్లుగా వాడడం జరగలేదు.

రాగి శూద్ధ రూపంలోనే కాక మిశ్రమ రూపాల్లో కూడా దొరుకుతుందని తెలిశాక దాని ఉత్పత్తి మరింత పెరిగింది. రాతిని నుండి కూడా దాన్ని వెలికి తియ్యొచ్చునని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మొట్టమొదట ఎవరు కనుక్కున్నారో మనకి తెలీదు.

బహుశ ఆ ఆవిష్కరణ ఇలా జరిగి ఉండొచ్చని మనం ఊహించవచ్చు. ఏ అడవిలోనో అకస్మాత్తుగా ఎండు కట్టె నిప్పు అంటుకుని ఉంటుంది. ఆ నిప్పు పుట్టిన నేలలో కొన్ని నీలి రంగు రాళ్లు ఉండి ఉండొచ్చు. నిప్పు చల్లారాక ఆ బూడిద అడుగున మెరిసే రాగి కణికలు కనిపించి ఉండొచ్చు. బహుశ ఇలా ఎన్నో సార్లు జరిగి ఉండొచ్చు. ఇలా పదే పదే జరగడం చుశాక ఒక రకమైన నీలి రాళ్లని కాల్చి రాగి తయారు చెయ్యొచ్చని మనుషులు గ్రహించి ఉంటారు. ఈ ఆవిష్కరణ ప్రధానంగా క్రీ.పూ. 4000 దరిదాపుల్లో జరిగి ఉండొచ్చు. ఈజిప్టు కి తూర్పున సీనాయ్ ద్వీపకల్పంలోనో, లేదా ఆధునిక ఇరాన్ లోని సుమేరియాలో తూర్పు భాగంలోన పర్వత ప్రాంతంలోనో జరిగి ఉండొచ్చు. బహుశ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా రెండు చోట్లా వేరు వేరుగా ఆ ఆవిష్కరణ జరిగి ఉండొచ్చు.

ఎలా జరిగినా, ఎప్పుడు జరిగినా ఒక దశలో పనిముట్లు చేసుకోగలిగే టంత విరివిగా రాగిని నగరిక ప్రాంతాల్లో ఉత్పత్తి చెయ్యడం మొదలెట్టారు. క్రీ.పూ. 3200 నాటి ఈజిప్షియన్ సమాధులలో రాగి మూకుడు దొరికింది. క్రీ.పూ. 3000 ప్రాంతాల్లో ప్రత్యేకంగా కఠినంగా ఉండే ఒక రకమైన రాతిని కనుక్కున్నారు. ముడి రాగిని (copper ore), ముడి తగరాన్ని (tin ore) కలిపి ఒకేసారి వేడి చేస్తే ఈ కొత్తరకమైన రాగి తయారవుతుంది అని కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణ యాదృచ్ఛికంగా జరిగినదే అయ్యుండొచ్చు. ఈ రాగి, తగరం కలిసిన మిశ్ర లోహాన్నే మనం కాంస్యం లేదా కంచు అంటాం. క్రీ.పూ. 2000 నాటికే ఆయుధాలలోను, కవచాలలోను కంచు యొక్క వినియోగం బాగా పెరిగింది. క్రీ.పూ. 3000 నాటికి ఈజిప్ట్ ని ఏలిన ఫారో ఇటెటీ కి చెందిన సమాధిలో కంచు పనిముట్లు దొరికాయి.

(సశేషం...)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts