ఫిజో చేసిన ప్రయోగమే
ఫోకాల్ట్ కూడా చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే పళ్లు ఉన్న చక్రానికి బదులుగా రెండవ
అద్దాన్ని వాడాడు ఫోకాల్ట్. మొదటి అద్దం నుండి ప్రతిబింబించబడ్డ కిరణం, రెండో అద్దం
మీద పడి అక్కడి నుండి ఓ తెర మీదకి విక్షేపించబడుతుంది.
ఇప్పుడు రెండో
అద్దాన్ని వేగంగా తిప్పుతున్నాం అనుకుందాం. కాంతి మొదటి అద్దం నుండి తిరిగొచ్చి రెండవ
అద్దం మీద పడేసరికి ఆ అద్దం కాస్త పక్కకి తిరిగిపోతుంది. కనుక అక్కడి నుండి బయల్దేరే
కిరణం తెర మీద కాస్త పక్కగా పడుతుంది.
Image courtesy: http://www.pas.rochester.edu/~pavone/particle-www/teachers/demonstrations/FoucaultDemonstration.htm
రెండవ అద్ధం
ఎంత వేగంతో తిరిరుగుతోందో తెలుసు కనుక, దాని నుండి ప్రతిబింబితమైన కిరణం ఎంత పక్కకి
తిరుగుతుందో తెలిస్తే, ఈ సమాచారం బట్ట్ కాంతి వేగాన్ని లెక్కించొచ్చు.
ఫోకాల్ట్ తన
ప్రయోగాన్ని పదే పదే చేసి చూశాడు. తన ప్రయోగ పరికరాలకి కూడా సముచితమైన మార్పులు చేర్పులు
చేస్తూ వచ్చాడు. తన కృషి ఫలితంగా 1862 లో తను
లెక్కించిన కాంతి వేగం 185,000 మైళ్లు/సెకను అని వచ్చింది. అంతవరకు జరిగిన కాంతి వేగపు అంచనాలు
అన్నిట్లోకి ఇది అత్యంత నిర్దుష్టమైనది. అసలు విలువ కన్నీ ఇది సుమారు 1000 మైళ్లు/సెకను మాత్రమే తక్కువ.
కచ్చితంగా ఉండడం
మత్రమే కాక ఫిజో పద్ధతితో పోల్చితే ఫోకాల్ట్ పద్ధతిలో మరో లాభం కూడా వుంది. ఇందులో పెద్ద దూరాలతో పని లేదు. గెలీలియో, ఫిజో మొదలైన
వాళ్లు అవలంబించిన పద్ధతిలో లాగా కొండలు, మిట్టలు ఎక్కనక్కర్లేదు. ఫోకాల్ట్ వాడిన ప్రయోగ
సామగ్రి చాలా సంక్షిప్తంగా ఉంటుంది. అందులో కాంతికిరణం సుమారు 66 అడుగుల
దూరం మాత్రమే ప్రయాణించింది.
కనుక ఫోలాక్ట్
వాడిన పద్ధతిని ఆరుబయట కాకుండా, గదిలో అంటే ప్రయోగశాలలోనే అమలు చెయ్యొచ్చు. ఈ పద్ధతిలో
మరో లాభం ఏంటంటే ఈ పధ్ధతిలో గాలిలోనే కాక ఇతర మాధ్యమాలలో కూడా కాంతి వేగాన్ని కొలవవచ్చు.
గాలిలో కాంతివేగాన్ని
కొలుస్తున్నప్పుడు కిరణం కొన్ని మైళ్లు ప్రయాణించినా ఫరవాలేదు. కాని అదే పద్ధతి వాడి,
నీట్లో కాంతి వేగాన్ని కొలవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఎందుకంటే
ఐదు మైళ్లు పొడవున్న నీటి తొట్టెలో కాంతి కిరణాన్ని ప్రసరిస్తే అది అవతలి కొస దాకా
ప్రయాణించి తిరిగి మొదటి వచ్చేసరికి అందులోని శక్తి ఇంచుమించు పూర్తిగా హరించుకుపోతుంది.
ఆ శక్తిని నీరు హరిస్తుంది. నీరు కాంతికి పారదర్శకం అనుకుంటాం గాని ఆ సూత్రం తక్కువ దూరాల మధ్యనే వర్తిస్తుంది. మైళ్ల దూరాల వద్ద
నీరు కాంతికి పారదర్శకం కాదు.
చిన్న చిన్న
దూరాల వద్ద కూడా కాంతి వేగాన్ని కొలవగలిగిన ఫోకాల్ట్ నీట్లో కూడా కాంతి వేగాన్ని కొలవగలిగాడు.
ఆ కొలత యొక్క ఫలితం, కాంతి యొక్క తత్వాన్ని గురించి ఎంతో కాలంగా వస్తున్న ఓ తగవుని
తీర్చింది.
ఫోకాల్ట్ కాలం
నాటికి కాంతి యొక్క తత్వం గురించి రెండు సిద్ధాంతాలు ఉండేవి. కొందరు కాంతిలో వుండేవి
కణాలు అనుకునేవారు. మరి కొందరు కాంతిలో ఉండేవి తరంగాలని భావించేవారు. క్రమంగా తరంగ
సిద్ధాంతానిదే పై చేయి అవుతున్నా, కణ సిద్ధాంతాన్ని నమ్మిన వర్గం తమ నమ్మకాన్ని పూర్తిగా
వదులుకోలేని స్థితిలో వున్నారు.
కాంతి కణ సిద్ధాంతం
ప్రకారం కాంతి గాలిలో కన్నా నీటిలో మరింత వేగంగా ప్రయాణించాలి. కాని తరంగ సిద్ధాంతం
ప్రకారం కాంతి గాలిలో కన్నా నీటిలో మరింత నెమ్మదిగా ప్రయాణించాలి.
(ఇంకా వుంది)
this article also very nice Red Lead Alloys Manufacturer