అబ్బ! ఈ చర్మం
గురించి కూడా ఓ అధ్యాయం అవసరమా? అనుకుంటున్నారు కదూ? గోనె సంచీలో కొబ్బరికాయలు మోసుకుపోయినట్టు, మీ దేహాంగాలని
మోసే సంచీ చర్మం. పైగా దీనికి బోలెడు సేవలు చెయ్యాలి – సబ్బేసి రుద్దాలి, బ్లేడెట్టి
గీయాలి, పామాలి, పిసకాలి, మర్దనా చెయ్యాలి… వట్టి బట్ట అని ఇట్టే కొట్టిపారేయకండేం! నాలో చాలా ఇసయం వుంది.
ముందే చెప్తున్నా.
గోనె గుడ్డ, గోచీ గుడ్డ అని మరీ తీసిపారేయకండి. మీకు విన్నారో లేదో. నేను రసాయనాలని ఉత్పత్తి చేస్తా!
ఉదాహరణకి అతి ముఖ్యమైన విటమిన్ – విటమిన్ D – ఎవరు చేస్తారని అనుకున్నారు? (ఇచ్చట కాలరు
ఎగురవేయబడినది.) రక్తపీడనాన్ని నియంత్రించడంలో మరి నా హస్తం ఎంతైనా వుంది. శరీరంలో ఎంత
నీరు నిలువ ఉండాలో, ఎంత మేరకు చెమట ద్వార బయటీకి పోవాలో నిర్ణయించేది నేనే. అసలు మిమ్మల్ని
ప్రపంచాన్ని వేరు చేసే గోడని – పోనీ తలుపుని, ఇంకా పోనీ కిటికీని – నేనే. వేడిమి, చలి,
చక్కలిగిలి, స్పర్శ, దురద ఇలాంటి అనుభూతులన్నీ
నావల్లనే కలుగుతాయి. నా వల్లనే అంటే… మరీ నావల్ల కాదనుకోండి, నా వెనుక పని చేసే నాడీ
మండలం వల్ల. ఒక రకంగా చూస్తే నేను వట్టి గోడని కానండోయ్. నేనో కోట బురుజుని. నానా రకాల
శత్రు జీవాలు మీ లోపలికి ప్రవేశించి పాగా వెయ్యకుండా నేనో కాపు కాస్తానన్నమాట.
చర్మం అంటే చుట్టూ
ఇలా మెత్తగా, నునుపుగా ఉండే పొర మాత్రమే అనుకుంటున్నారేమో. మీ గోళ్లు, జుట్టు, మీ పాదాలలో గట్టిగా గిట్టలా ఉండే పొర – ఇవన్నీ నా
రూపాంతరాలే. నాలో మూడు పొరలు ఉంటాయి – పై పొరేమోనొచ్చి ఎపీడెర్మిస్ (epidermis), మధ్య
పొర డెర్మిస్ (dermis), ఇక అడుగున వున్నది సబ్ క్యుటేనియస్ పొర (subcutaneous
tissue).
మీ శరీరం మీద
ఎన్నో చోట్ల పైపొర అతి సన్నగా కాగితంలా ఉంటుంది. ఈ సారెప్పుడైనా మీ వేలు కాలినప్పుడు
కావాలంటే మీరే చూసుకోండి. (అంటే కేవలం పరిశోధనా స్ఫూర్తి కోసం వేళ్లు కాల్చుకోమనడం
లేదు సుమండీ!) బొబ్బ లెక్కాయని బొబ్బలెట్టడం ఆపి ఓ సారి వేలి కేసి చూసుకుంటే తెలుస్తుంది
– బొబ్బ పైన ఉన్న వున్న సన్నని పొరే ఎపీడెర్మిస్సని! మీ మడమలో ఉండే దళసరి చర్మపు పొరని
ఓ బ్లేడు పెట్టి సన్నగా గొరిగేసినా కూడా రక్తస్రావం జరగదు. ఎందుకంటే ఆ పొరలో రక్త ప్రసారం
ఉండదు. గుర్రానికి నాడా వెయ్యడానికి మేకులేసి కోట్టినా రక్తం కారనిది మరి ఇందుకే. ఇక్కడ
ఉండే కణాలకి కావలాసిన పోషణ రక్తం నుండి రాదు. పోషక పదార్థాలు లోపలి నుండి నేరుగా పైకి
తన్నుకొస్తూ వ్యాప్తి (diffusion) అనే ప్రక్రియ ద్వారా ఈ దళసరి పొరని చేరుతాయి.
పాము తన పై చర్మాన్ని
– దాన్నే పొలుసు అంటారు – హటాత్తుగా విదిలించి వొదిలించుకుంటుంది. మీరు కూడా మీ చర్మంతో
ఇంచుమించు అలాంటిదే చేస్తుంటారు. అయితే పాములాగా
అంత నాటకీయంగా, దుడుకుగా కాకాపోయినా నెమ్మదిగా, క్రమంగా, అంచెలంచెలుగా చేస్తుంటారు.
అనుదినం కొన్ని కోట్ల ఎపిడెర్మల్ కణాలు ఆ పొర యొక్క లోపలి భాగాల్లో పుట్టి, నెమ్మదిగా
పైకి తన్నుకొస్తుంటాయి. ఈ పసి కణాలు మొదట్లో మెత్తమెత్తగా, ముద్దముద్దగా జెల్లీలాగా
వున్నా, వయసు పైబడుతున్న కొద్ది గట్టిపడతాయి. అలాంటి గట్టి పొరనే కెరటిన్ (keratin)
అంటారు. ఈ కెరటిన్ పొరలో ఉండే కణాలన్నీ చప్టాగా, చదునుగా, పెంకుల్లాగా, పర్రలాగా ఉంటాయి.
వీటిలో ఇక ప్రాణం ఉండదు. (కరకైన బాహ్యప్రపంచపు తాకిళ్ళకి పాపం జీవ కణాలు ఎలా తట్టుకుంటాయేం?)
ధోనీ సిక్సర్ కొట్టాడు కదాని సంబరం పట్టలేక చప్పట్లు కొట్టేసినప్పుడు, బౌండరీ దగ్గర
కాచ్ ఇస్తే దుఃఖం ఆపుకోలేక గుండెలు బాదేసుకున్నప్పుడు, ఈ సారి ఎలాగైనా సెంచురీ కొడతాడని
నేస్తాలతో సవాలు చేసి తొడలు చరిచేసుకున్నప్పుడు – మీ ఎపీడెర్మిస్ లోని కోటానుకోట్ల
కణాలు జలజలా రాలిపోతుంటాయని మర్చిపోకండి. మైండిట్!
(పోతే పోయ్యాయి
వెధవ కణాలు! 27 రోజులు తిరిగేలోపు మళ్లీ దాపురిస్తాయిగా? అని అడ్డుగా
వాదిస్తే ఇక నేను చేసేదేం లేదు.)
(ఇంకా వుంది)
చాలా చాలా బాగుందండీ వ్యాసం!
Thank you Sujatha garu!