చదవడానికి సంసిద్ధత
పిల్లలకి చదవడం ఎలా నేర్పాలి అన్న విషయం మీద మహా మేధావులైన
మన విద్యావేత్తలు ఎన్నో వింత వింత సూచనలిస్తూ వచ్చారు. చదవడానికి పిల్లలని సిద్ధం చెయ్యాలంట.
కేవలం బొమ్మలున్న పుస్తకాలు చాలా చూపించాలంట. ఆ బొమ్మల గురించి పిల్లలని గుచ్చి, గుచ్చి
ప్రశ్నించాలంట. ఇంతకన్నా మతిలేని ఆలోచన నేనెక్కడా విన్లేదు!
ఓ మంచి సారూప్యాన్ని తీసుకుందాం. పిల్లలు అసలు మాట్లాడడం ఎలా
నేర్చుకుంటారు అన్న విషయం గురించి ఓ సారి ఆలోచిస్తే అది నిజంగా గొప్ప అద్భుతంలా తోస్తుంది.
తాము ‘బోధిస్తే’ తప్ప పిల్లలకి ఏమీ అర్థం కాదు అని అహంకరించే పెద్దలకి ఈ అద్భుతం ఓ
పెద్ద గుణపాఠం. తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు విని నేర్చుకుంటారు. ముఖ్యంగా
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పెద్దలు మాట్లాడే దాంట్లో పిల్లలకి నేర్పాలి అన్న ఉద్దేశంతో
మాట్లాడేది చాలా తక్కువ. వాళ్లకి పరస్పరం మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కనుక మాట్లాడుకుంటారు.
కనుక పెద్దల మాటల బట్టి పిల్లలకి అంతర్లీనంగా అర్థమయ్యేది ఏంటంటే భాష చాలా ముఖ్యమైనది.
మాటలతో చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి. అవి విలువైనవి. మాటలు వాడి పెద్దలు పనులు జరిపించుకుంటారు.
మాటల ప్రాబల్యం, విలువ పిల్లలు చెప్పకుండా గ్రహిస్తారు. మాటలు అత్యంత అవసరమైనవి అన్న
విశ్వాసం వారిలో స్థిరపడుతుంది.
ఎంతో మంది పిల్లల లాగానే నేను కూడా చిన్నప్పుడు నాకు నేనే
చదవడం నేర్చుకున్నాను. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు నాకు పెద్దగా ఎవరూ నేర్పలేదు. పైకి
చదవడం, చదివించడం వంటివి పెద్దగా ఎవరూ నేర్పలేదు. నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాక మా బామ్మ
ఒకావిడ నాకు, మా చెల్లాయికి పుస్తకాలు చదివి వినిపించేది. కాని అప్పటికే నాకు చదవడం
బాగా వచ్చేసింది. హ్యూగో లాప్లింగ్ వ్రాసిన “డాక్టర్ డూ లిటిల్” పుస్తకాలు చదివేది
ఆవిడ. ఇద్దరం ఆవిడకి ఇరుపక్కలా సోఫాలో వెచ్చగా ఒదిగి కూర్చునే వాళ్ళం. పిల్లలకి నచ్చుతుందని
భ్రమ పడి ‘ముద్దు ముద్దు మాటలతో’ చదవడం వంటివి చెయ్యకుండా, ఎలాంటి ఆధిక్యతా భావం లేకుండా,
చాలా మామూలుగా, స్పష్టంగా, గంభీరంగా చదువుతూ పోయేది. అసలు అందుకే ఆ కథలు మాకు నచ్చేవేమో
ననిపిస్తుంది.
చదవడానికి నాకు స్ఫూర్తినిచ్చిన మరో విషయం ఏంటంటే ఆ రోజుల్లో
(అది చాలా చాలా క్రితం) పిల్లల పుస్తకాల్లో చాలా తక్కువ బొమ్మలు ఉండేవి. N.C.
Wyeth అని ఓ గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. చాలా
బొమ్మలు అతను వేసేవాడు. రాజులు, రాణులు, సింహాలు, సముద్రపు దొంగలు - ఒక్కటేమిటి వందల కొద్దీ అద్భుతమైన బొమ్మలు. కాని
ఒక పుస్తకంలో కొద్దిపాటి బొమ్మలే ఉండేవి. కనుక ఆ బొమ్మల అర్థం తెలియాలంటే ఆ పుస్తకం
చదవడం తప్పనిసరి అని అర్థమయ్యింది. అందుకని చదవడం ఎలాగోలా నేర్చుకున్నాను.
చదవడానికి పిల్లలు సిద్ధం కావాలంటే అచ్చక్షరంతో గాఢమైన పరిచయం
ఏర్పడాలి. బొమ్మలతో కాదు, అచ్చక్షరంతో. ఎలాగైతే తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకునే భాషా
ధ్వనులతో పిల్లల చెవులు నిండిపోతాయో కాస్త పెద్దయ్యాక వాళ్ల కళ్లకి ఇంపైన రంగురంగుల,
పెద్ద పెద్ద అక్షరాలతో విస్తృత సాన్నిహిత్యం ఏర్పడాలి. ఆ విధంగా ఆ అక్షరాలతో పరిచయం
పెరుగుతున్న కొలది ఆదిలో అర్థం లేని ఆకారాలుగా, వక్రాలుగా, వంకరలుగా కనిపించే అక్షరాలు,
క్రమంగా స్థిరరూపాలు సంతరించుకుని, అర్థవంతమైన భాషా ప్రతీకలుగా తమ మనసుల్లో రూపుదిద్దుకుంటాయి.
నా చిన్నప్పుడు ఓ సారి అలాగే ఓ సారి ఓ పుస్తకాన్ని తిరగేయగా, తిరగేయగా మెల్లగా ఇక్కడున్న
అక్షరాన్ని అక్కడ, అక్కడున్న పదాన్ని మరో చోట ఇలా పదాలని గుర్తుపట్టగలిగాను. ఇలా అక్షరాలని
పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత క్రమంగా పదాల అర్థమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది.
అంతకు ముందు కలగదు. ఉదాహరణకి మనం ఓ కొత్త భాష నేర్చుకుంటున్నాం అనుకుందాం. ముందు ఆ
భాషలోని సంభాషణల్లోని పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత పదాలకి అర్థం ఇదీ అని ఎవరైనా
చెప్పగలిగితే బావుంటుంది. ముందే చెప్తే అసందర్భంగా ఉంటుంది.
పిల్లలు అచ్చక్షరానికి అలవాటు పడేలా చెయ్యాలంటే నాదో సలహా.
పెద్ద పెద్ద అక్షరాలు ఉండే దినపత్రిక ఏదైనా తీసుకోవాలి. పిల్లలు అక్షరాలని గుర్తుపట్టేటంత
పెద్దవిగా ఉండాలి అక్షరాలు. పైగా దినపత్రిక అంటే పెద్దవాళ్లు చదువుకునేది. అందులో విలువైన
సమాచారం వుంటుంది. ఏదో పిల్లలు ఆడుకునే సరదా పుస్తకం కాదు. కనుక పిల్లలకి నచ్చుతుంది.
దాంట్లోని కాగితాలు చించి గోడల మీద అంటించుకోవచ్చు. దినపత్రికే కనుక పిల్లలు పాడుచేసినా
ఫరవాలేదు.
ఈ ప్రాథమిక ఏర్పాట్ల కన్నా పిల్లలు మరో అడుగు ముందుకు వెళ్లాలి.
బళ్లోను, ఇంట్లోను కూడా పిల్లల దృశ్య ప్రపంచాన్ని అందమైన అచ్చక్షరంతో నింపాలి. పెద్దల
ప్రపంచానికి చెందిన నానా రకాల ముద్రిత సమాచారాలతో గోడలని అలంకరించాలి. టైం టేబిళ్లు,
మ్యాపులు, సినిమా టికెట్లు, వ్యాపార ప్రకటనలు, బ్యాంకు ఫారమ్ లు, రైల్వే రిజర్వేషను
పత్రాలు – ఇలా పెద్దల వ్యావహారిక ప్రపంచంలో ముఖ్య పాత్ర గల రకరకాల పత్రాలని గోడలకి
ఎక్కించాలి. పెద్దల లోకంలో చలామణి అవుతూ, ఎన్నో అద్భుత కార్యాలకి అనివార్యంగా ఉండే
సమాచారం ఇలా ఉంటుంది అని వాళ్ల కళ్లకి కట్టినట్టు
ఉండాలి. మనుషులు ఏం చేస్తుంటారు, ఏం చెయ్యగలరు అనేది తెలుసుకోవాలంటే సాంఘికశాస్త్రం
పుస్తకం కన్నా టెలిఫోన్ డైరెక్టరీలోని ఎల్లో పేజీలు మనకి ఎన్నో విషయాలు చెప్తాయి!
(Image: http://www.pressingletters.com/tag/the-arm-nyc/)
(ఇంకా వుంది)
మా పాప ఇంగ్లీష్ పుస్తకాలు సునాయాసంగా ఊది పారేసి టార్గెట్ కంటే ఎక్కువే చదివేస్తుంది. తెలుగు కి కొంత బద్ధకించినా.. చదువుతుంది, కాదనదు. బయట మాకు ఇక్కడ తెలుగు బోర్డులు కనిపించవు కాబట్టి , టీవీలో స్క్రోలింగ్ (ప్రమాదకరం కాని న్యూసు) చదమంటాను.
చిన్నప్పుడు నాలుగేళ్ల వయసులో కథలు ఊరికే చెప్పడం కాకుండా, చదివి వినిపిస్తూ కథ వివరించేదాన్ని! ఈ మధ్య ఇంకో ఉపాయం కనిపెట్టాను. ఒక మంచి ఆసక్తి కరమైన కథ సగం చెప్పి, మిగతాది తెలియాలంటే ఫలానా పుస్తకంలో ఉంది చదువుకో పొమ్మంటాను. కథ మీద ఉత్కంఠ తో మొత్తం చదివేస్తుంది.
మీరు చెప్పింది నిజం. తల్లిదండ్రులు పిల్లలలో బాగా చిన్న వయసులోనే పఠనాసక్తి కలుగజేయగలిగితే దీర్ఘకాలికంగా ఎంతో మేలు చేసిన వాళ్లు అవుతారు.