నాలో స్మృతి పని చేసే తీరు చాలా
ఆసక్తి కరంగా ఉంటుంది. కంప్యూటర్ మెమరీకి ఈ స్మృతికి ఎంతో తేడా వుంది. కంప్యూటర్ మెమరీలోని
అంశాలన్నీ ఓ వరుస క్రమంలో భద్రపరచబడి వుంటాయి, లైబ్రరీలో పుస్తకాలలా. ప్రతీ అంశానికి
ఓ అడ్రస్ ఉంటుంది. లైబ్రరీ పుస్తకానికి కాల్ నంబర్ తెలిస్తే దాన్ని బట్టి పుస్తకాన్ని
కనుక్కోగలిగినట్టు, కంప్యూటర్లో ఒక అంశం యొక్క అడ్రస్ తెలిస్తే ఆ అడ్రస్ వద్ద ఉన్న అంశాన్ని బయటికి
తీయొచ్చు. కాని నాలోని స్మృతి కి ప్రత్యేకించి అడ్రస్ అనేది వుండదు. కావాలంటే మీరు
ఎప్పుడో విన్న “కొండగాలి తిరిగిందీ….” పాట నాలో ఏ అడ్రస్ వద్ద ఉందో చెప్పుకోండి చూద్దాం!
నా స్మృతిలోని అంశాలకి ఫలానా
అడ్రస్ అని వుండదు. పరస్పర సంబంధం వున్న అంశాలన్నిటినీ ఓ జాలం లాగా ఏర్పాటు చేసుకుంటాను.
ఉదాహరణకి మీరు సెలవల్లో కోన సీమని చూడడానికి వెళ్తారు. అక్కడ మావిడి తోటలు చూస్తారు.
పడవలో ప్రయాణం చేస్తారు. బుద్ధి పుట్టినప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగుతారు. సెల్ ఫోన్
ని పక్కన బెట్టి సెలయేటి గలగలలు వింటారు. ఈ దృశ్యాలు, శబ్దాలు, వాసనలు అన్నీ ‘కోనసీమ’
అన్న పేరుతో మూటగట్టి నాలో దాచుకుంటాను. ఈ
సారి ఎప్పుడైనా మీరు రోడ్డు పక్కన కొబ్బరి నీళ్ళు తాగుతున్నప్పుడు మీ కోనసీమ యాత్ర
గుర్తొస్తుంది. లేదా మావిడి కాయలు తింటున్నప్పుడో, నీళ్ల గలగలలు వింటున్నప్పుడో, పడవ
ఎక్కినప్పుడో – ఇలా ఎన్నో అనుభూతులు మీ కోన సీమ యాత్రని గుర్తుకు తెస్తాయి. ఈ చిన్న
చిన్న అనుభూతుల స్మృతులన్నీ ఓ జాలంలో కలిసి వుంటాయి. ఈ చిన్న స్మృతులన్నీ ‘కోన సీమ
యాత్ర’ అనే పెద్ద స్మృతిలో భాగాలు అవుతాయి. ఇలా స్మృతులని (మొదటి అడ్రస్, మొదటి అంశం),
(రెండవ అడ్రస్, రెండవ అంశం)… ఇలా ఓ పెద్ద పట్టికలాగా కాకుండా జాలాల రూపంలో భద్రపరచడం వల్ల నాలో ని స్మృతులు
సులభంగా చెరిగిపోవు. కోన సీమలో కొబ్బరి నీళ్లు తాగినట్టు గుర్తులేకపోయినా, మావిడి తోటల్లో
నడవడం గుర్తు ఉండొచ్చు కదండీ!
సొంత డబ్బా అనుకోకపోతే నాలో
మరో సుగుణం కూడా వుందనుకోండి. నాలో ఒక చోట ఏదో కారణం చేత కణాలు చచ్చిపోయాయనుకోండి.
నెమ్మదిగా ఆ ప్రాంతానికి ఇరుగు పొరుగున ఉన్న న్యూరాన్లు చచ్చిపోయిన న్యూరాన్ల బాధ్యతలని
నెత్తిన వేసుకుంటాయి. ఉదాహరణకి నాలో బ్రోకా ప్రాంతం (Broca’s area) అనే ఓ ప్రాంతం మీ
భాషని శాసిస్తుంది. ఉదాహరణకి దాని దగ్గర్లో కణాలు చచ్చిపోతే మాట పడిపోయే ప్రమాదం వుంది.
కాని నెమ్మదిగా దాని చుట్టు పక్కల ఉండే న్యూరాన్లు ఆ ప్రాంతం యొక్క క్రియలని చేపట్టడం
వల్ల పోయిన మాట తిరిగి వచ్చే అవకాశం వుంది.
స్ట్రోక్ (stroke) వచ్చినప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది.
మెదడు లోని రక్తనాళాలలో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి, దాని వల్ల ఓ నాళం పూడుకు పోయింది
అనుకోండి. లేదా రక్తనాళంలో పోటు పెరిగి అది పెటేలు మని పేలిపోయిందనుకోండి. అప్పుడు
ఆ నాళం మీద ఆధారపడి బతుకు నెట్టుకొస్తున్న న్యూరాన్లు ఆకలితో చచ్చిపోతాయన్నమాట. అలాంటి
అత్యవసర పరిస్థితిలో దాని పొరుగు న్యూరాన్లు కొంతవరకు చచ్చిపోయిన న్యూరాన్ల పనిని తీసుకుంటాయి.
అలాంటి పరిస్థితిలో రోగికి పోగొట్టుకుపోయిన క్రియలు తిరిగి వచ్చేలా తగిన శిక్షణ నివ్వడానికి
వీలవుతుంది. కాని మెదడులో మరీ పెద్ద భాగం దెబ్బతింటే ఇక ఇరుగు పొరుగు న్యూరాన్లు పెద్దగా
చేసేదేం వుండదు. అలాంటప్పుడు రోగికి ఇచ్చే శిక్షణ పెద్దగా ఫలించకపోవచ్చు.
స్ట్రోక్ లాగే మరో ముఖ్యమైన
మెదడు సమస్య ట్యూమర్. కాని ఎన్నో సందర్బాలలో శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించవచ్చు.
పరిస్థితులు అనుకూలిస్తే ఆపరేషన్ తరువాత రోగి పూర్తిగా కోలుగుకునే అవకాశం ఉంది.
తలకి దెబ్బ తగిలినప్పుడు కొన్ని
సార్లు మెదడుకి అయ్యే గాయం విషమించవచ్చు. మెదడు చిక్కని ద్రవంలో తేలుతూ ఉంటుందని, తలకి
గాయం తగిలినా లోపల మెదడు భద్రంగా ఉంటుందన్నది కొంత వరకు నిజమే. కాని తలకి దెబ్బ మరీ
గట్టిగా తగిలితే లోపల మెదడు కూడా గాయపడవచ్చు. ఏ సెల్ఫోన్ లోనో మాట్లాడుతూ పరధ్యానంగా
వేలిని తలుపు సందులో వేసి చితగ్గొట్టుకున్నారనుకోండి.
మరి వేలు వాయదండీ! అలాగే గాయపడ్డ మెదడు కూడా వాస్తుంది. దాంతో మెదడు చుట్టూ ఉండే ద్రవంలో
ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల స్పృహ కోల్పోవడం, ఇక మరీ కీలక పరిస్థితుల్లో ప్రాణం
పోవడం కూడా జరుగుతుంటుంది.
ఈ మెదడుతో ఇన్ని తలనొప్పులా అని బెంబేలు పడకండేం? దురదృష్టం
కొద్దీ జబ్బు పడితే సమస్య గాని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు నా సత్తా చూళ్ళేదు మీరు.
నన్నెలా వాడుకోవాలో అసలు తెలీదు మీకు. క్రమబద్ధమైన శిక్షణ చేత నా శక్తి సామర్థ్యాలని
విపరీతంగా పెంచుకోవచ్చు. నా సామర్థ్యం అపరిమితం. దాన్ని పెంచుకునే ఒడుపు తెలిస్తే ఆ
సామర్థ్యం మీ సొంతం.
నా సామర్థ్యం అపరిమితం. దాన్ని పెంచుకునే ఒడుపు తెలిస్తే ఆ సామర్థ్యం మీ సొంతం.
"నూరు పైసల నిజం"చెప్పారు గురూజీ!,అదీ తమదైన శైలిలో.
Thank you, Anonymous garu!
your writing style is excellent srinivas garu.
Thank you Rao garu!